Search This Blog

Friday, September 29, 2017

లలిత భావ నిలయ

   1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప మేళవింపు 'రహస్యం ' . ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజా దేవి నటించారు. సంగీతము అందించినది ఘంటసాల గారు. సాహిత్యం మల్లది రామకృష్ణ శాస్త్రి.   నాగేశ్వరరావు  అంత వరకు ఒక లవ్ బాయ్ గా నటించారు. ఈ సినిమాలో కత్తి యుద్ధాలతో కాస్త వెరైటిగా కనిపిస్తారు. సంగీతపరంగానూ, సాహితీపరంగా చాలా అత్యుత్తమ నాణ్యత కలిగిన సినిమా అయినా అనుకున్నంత హిట్ కాలేకపొయింది. కానీ ఈ సినిమాలోని ప్రతి పాట ఒక ఆణిముత్యము.  ఇప్పుడు ఒక పాట గురించి తెలుసుకుంద్దాము...



రహస్యం సినిమా కోసం ముగురమ్మలను వర్ణిస్తూ ఒక పాట వ్రాసి మల్లాది గారు... ఘంటసాలకి ఇచ్చి "సరస్వతీ దేవి వర్ణన సరస్వతీ రాగములో, లక్ష్మీదేవిని వర్ణన శ్రీరాగములో, లలితాదేవి (పార్వతిదేవి) వర్ణన లలితరాగములో " స్వర పరచమన్నారుట. ఆ సాహిత్యానికి ఘంటసాల మాస్టారుగారు ఈ విధముగా స్వరపరిచారు. అలా స్వరపరచిన పాట అర్ధమిదిగో ...


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చార వింద నయనా.. సదయా జగదీశ్వరీ



నవ రసానంద హృదయ = ఎల్లప్పుడూనూతన ఆనందన్ని హృదయం కలది.

లలితా సహస్రంలో అమవారిని "చైతన్యకుసుమ ప్రియా " అని అంటారు. అంటే ఎప్పుడూ చైతన్యంతో ఉండే మనసుని కోరుకుంటుంది. 


వికచ + అరవింద = వికసించిన తామరలవంటి కన్నులులు కలది.

మధువుచిలుకు = తేనె కురిపించు

గమకమొలుకు = సంగీతశాస్త్రమునందు స్వరవిన్యాస భేదము గమకము పలికించేది.


వరవీణాపాణీ - వీణాపాణి - సరస్వతి


సంగీత సాహిత్యాలను సమానంగా అలకరించుకొన్నది


సంగీతమపి సాహిత్యం సరస్వత్తాంతనద్వయం

ఏకమాపాత మధురం అన్యదాలొచనామృతం


సంగీతము, సాహిత్యము సరస్వతిదేవి యొక్క స్థనద్వయాలు , ఒకటి గ్రోలినప్పుడు మధురాతి మధురము, మరొకటి ఆలోచనలను రేకెతించేది. ఒక కంటితో సంగీతాన్ని అందిస్తూ, మరొక కంటితో సాహిత్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి.


సుమరదన విధువదన.. = మల్లె మొగ్గలవంటి దంతములు కలది / చంద్రముఖి (శుద్ధవిద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వలా) 


అంబరాంతరంగ శారదా స్వరూపిణి = ఆకాశము వలె విశాలమైన , గంభీరమైన మనస్సు కలది


చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే = చిత్ అనే అంబరం.. మనస్సు అనే ఆకాశములో ఉండే శారదాంబిక


శ్రీదేవి కైవల్య చింతామణి = కైవల్యము ఇవ్వడములో ఆవిడే చింతామణి


శ్రీరాగ మోదిని = శ్రీరాగము అంటే ఇష్టపడేది


చిద్రూపిణి = ఆత్మ స్వరూపిణి


బింబాధరా.. = దొండపండు వంటి అధరములు కలది, 


రవిబింబాంతరా = సూర్యబింబములో నున్నది 


రాజీవరాజీ విలోలా = పద్మసమూహము వలె చలించునది. లేదా విశాల నేత్ర మీనము వలె చలించునది.

రాజి అంటే సమూహము అనే అర్థం. అమ్మ నడుస్తూ ఉంటే తామర పూలు ఊగుతున్నట్టే ఉంటుంది.


శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని = ఉత్కృష్టమైన కోరికకు (మోక్షకాంక్ష) సంజీవని వంటిది.


ఇహలోక వాంఛలవైపు కాకుండా పరలోక కాంక్షను సజీవముగా ఉంచునది 


నిటలలోచన నయనతారా తారా భువనేశ్వరీ = శివుని మూడవ కంటిపాప(శివుని మూడవకంటిలోని శక్తి అమ్మవారే)


తారా భువనేశ్వరీ = నక్షత్రలోకానికి ఈశ్వరి (ప్రభ్వి, రాణి)


లలితా సహస్రనామములో ఆ తల్లిని ' మహాకామేశనయనా కుముదాహ్లాదకౌముది... మహేశుని కళ్ళు అనే కలువలకు ఆమే చల్లని మూర్తీభవించిన వెన్నెల


ఆ ఈశ్వరుడి శక్తి ఆవిడే, కంటిలో దీప్తీ ఆవిడే... అందుకే ఆవిడని 'శివశక్తైక రూపిణి ' గా అభివర్ణించారు.


ప్రణవధామ = ఓంకారమే నివాసముగా కలది


ప్రణయదామా =  ప్రేమభావ హారమువంటిది.


సుందరీ = సుందరి, లాలిత్యముకి మారు పేరు ఆ లలితా దేవే.


కామేశ్వరీ = ఈశ్వరుడికి కామాన్ని పుట్టించినది, కోరికలు తీర్చే ఈశ్వరి.


అందుకే కాళిదాసు ' అశ్వధాటి స్త్రోత్రము " లో  " రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ '"


ఆవిడని మించిన సౌందర్యము మరొకటి లేదు, అందుకే 'రుపాధికా శిఖరి  (అధికమైన అందానికి శిఖరం ఆవిడ)


అరుణవసన..  = ఎఱ్ఱని వస్త్రములు ధరించునది /


అమలహసనా = అమలినమైన నవ్వు కలది(మాలీన్యము లేని నవ్వు ఆవిడ సొంతము) 


మాలిని= పార్వతి, శివుని ఇష్టురాలు




భ్రామరి = భ్రామరాంబ..


శివుడు మల్లికార్జునుడిగా అవతారమెత్తి శ్రీశైలంలో ఒక మల్లె పువ్వుగా మారిపోయారుట, అప్పుడు ఆవిడ భ్రామరి అంటే నల్ల తుమ్మెదగా మారి ఆయన చుట్టూ తిరిగిందిట. ఈ రోజుకీ శ్రీశైలములో భ్రమరాంబ గుడి వెనుక తుమ్మెదల రొద వినపడుతుంది.


ఇక్కడ ఆవిడని భ్రమరముగా పోలిస్తే శివతాండవ స్త్రోత్రములో మాత్రం " రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం "  రసప్రవాహముగా ఉన్న ఆవిడ ముఖము దగ్గరకు విజృంభించిన మధువ్రతము అంటే తుమ్మదగా ఆ పరమేశ్వరుడు వచ్చాడుట.






పూర్తిపాట ఇదిగో :


సరస్వతి రాగం:


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ


లలిత భావ నిలయ నవ రసానంద హృదయ

విక చారవింద నయనా.. సదయా జగదీశ్వరీ

మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ

మధువుచిలుకు గమకమొలుకు వరవీణాపాణీ

సుమరదన విధువదన.. దేవి

సుమరదన విధువదన.. దేవి


అంబరాంతరంగ శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే

అంబరాంతరంగ శారదా స్వరూపిని

చిదంబరేశ్వరీ.. శ్రీ శారదాంబికే


శ్రీ రాగం:


చరణం 1:


శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని

శ్రీదేవి కైవల్య చింతామణి... శ్రీరాగ మోదిని చిద్రూపిని

బింబాధరా.. రవిబింబాంతరా..

బింబాధరా.. రవిబింబాంతరా..

రాజీవ రాజీవిలోలా... రాజీవ రాజీవిలోలా


శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని....

శ్రీరాజరాజేశ్వరీ పరమాకామ సంజీవని..

శ్రీరాజరాజేశ్వరీ...


లలిత రాగం:


చరణం 2:


నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ

నిటలలోచన నయనతారా.. తారా భువనేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ

ప్రణవధామ ప్రణయదామా..సుందరీ కామేశ్వరీ

అరుణవసన.. అమలహసనా

అరుణవసన.. అమలహసనా

మాలిని...  మనోన్మనీ

నాదబిందు కళాధరీ భ్రామరీ...

నాదబిందు కళాధరీ భ్రామరీ... పరమేశ్వరీ 

నాదబిందు కళాధరీ భ్రామరీ... పరమేశ్వరీ 



సినిమా లో  ఈ పాటని 'అంజలీదేవి ' ని పరమేశ్వరిగా,  నారదుడిగా 'హరనాథ్ ' నటించారు. లలితా పరమేశ్వరి ఇలాగే ఉంటుందా అనిపించి పూర్ణ చంద్రబింబం లాంటి వదనం అంజలీదేవిది. ఆ ముఖములో చిరునవ్వు కూడా వెన్నెల కురిపిస్తోందా అనిపిస్తుంది. '  సామగానప్రియ ' అని అమ్మవారిని కీర్తిస్తాము, అలా ఆ పాటకి ఆనందిస్తున్నట్టుగా ఆవిడ సంతోషాన్ని ప్రకటించే తీరు అద్భుతము. 

 

 

 పాట ఇదిగో ఇక్కడ వినండి...  :   

 

 

 http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs.php?plist=1735

2 comments:

  1. మీరు ధన్యులు. ఇంతకన్నా ఏమీ వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. 🙏

    ReplyDelete