Search This Blog

Monday, September 18, 2017

రాచ్చిప్ప

" రాచ్చిప్ప మొహం నువ్వూనూ " అని కొందరు,

"ఎన్ని సార్లు చెప్పినా ఆ బుర్రకి ఏదీ ఎక్కదు.. సుద్ద మొద్దురాచిప్ప " అని పాపం ఆ రాచిప్పని బోలెడు అవమానించేస్తారు.

పూర్వం ఆ రాచిప్పలో పులుసు చేసుకొని రెండు రోజుల పాటు తినేవారుట. ఆ రోజు వండిన పదార్ధాల వేడి మరునాటికి కూడా ఉండేదిట. మా చిన్నప్పుడు చద్దికుండ వసారా లో మాగాయితో , ఉప్పుతో ఉండేవి ఈ రాచ్చిప్పలు.



ఒకసారి ఈ మధ్యనే మాధవపెద్ది సురేశ్ గారింటికి వెళ్లాను. ఆయనతో కబుర్లు చెబుతుంటే వారి సతీమణి (చిట్టి పిన్ని), వంటింట్లో ఇంగువ పోపు వేస్తున్నారు. తీరా ఆ పోపు దేనిలోకో అని చూడగా కొరివికారం (పండు మెరపకాయల పచ్చడి) ఓ రాచ్చిప్పలో వేసి దానికి ఇంగువ పోపు! అసలే కొరివికారం,ఆ పై ఇంగువ, అదీ రాచ్చిప్పలో... రుచి అద్భుతం. ఇంక అప్పటి నుంచి ఎలాగైనా ఇంట్లోకి రాచ్చిప్పని తీసుకొని రావాలని దృఢనిశ్చయానికి వచ్చేశా.

 

ఆ తరవాత వైజాగ్ వెళ్ళాను, అక్కడ అందరినీ "రాచ్చిప్ప ఉందా మీ ఇంట్లో " అని అడిగా. కొందరికి కోపం కూడా వచ్చేసింది. వాళ్ళనే అన్నననుకొని. :( కాఫీ నీళ్ళు కూడా ఇవ్వకుండా పంపేశారు.  

😔

ఇంకొకరి ఇంటికి వెళ్ళి " మీ ఇంట్లో రాచ్చిప్ప ఉందా? " అని అడిగితే ఆ కోడలు మూసిముసిగా నవ్వింది. ఆ అత్తగారు కారాలు మిరియాలు నూరారు. ఇంక వైజాగ్ లో ఎవరిని అడగకూడదని అనుకొన్న.

 

ఆ తరవాత అమలాపురం లో "వేట ' మొదలెట్టా. రోడ్డు మీద 'రుబ్బు రోళ్ళు " కనిపిస్తే, వాటిని అమ్మే వాళ్ళ దగ్గరకు వెళ్ళి "రాచ్చిప్ప ఉందా? " అని అడిగేద్దాన్ని. వాళ్ళు నా మొహాన్ని అదోలా చూసేవారు  

:(

ఇలా అందరినీ అడిగి అడిగి అలసిపొయాను. " ఇన్నేళ్ళు నన్ను "రాచ్చిప్ప రాచ్చిప్ప " అని తిట్టేవారు మీరంతా, ఇప్పుడు నీకు అంత తొందరగా దొరుకుతానా? " అని రాచ్చిప్ప అన్నట్టనిపించేది.

 

ఒక శుభ దినాన్న అందరం కలిసి ఐనవెల్లి విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్ళాము. గుడి బయట బొమ్మలు అమ్ముకొనే వాళ్ళ దగ్గర పొరపాటునా ఈ రాచ్చిప్ప కనిపిస్తుందేమో అన్న ఆశ. అటు నుంచి మా వారి మేనత్తని చూడటానికి వెళ్ళాము. ఆవిడ ఇంట్లోని వెళ్లగానే నా కళ్ళు నా ప్రమేయం లేకుండా ఇంటిని వెతికేశాయి. అంతే... టక్కు మని ఒక చోట ఆగాయి. ఆ గూట్లో పెద్ద "రాచ్చిప్ప " . అంతే మనసంతా ఆ రాచ్చిప్ప మీదే! 

😍

"ఏం తల్లి రాచ్చిప్ప కావాలా? " అని మనసు అడిగినట్టనిపించింది. పాపం ఆ పెద్దావిడ ఏం మాట్లాడిందో, నేనేమి సమాధానం ఇచ్చానో గుర్తు లేదు.

 

ఇంక ఆగలేక అడిగేశా " మీరు ఆ రాచ్చిప్పతో ఏం చేస్తారు? "అని

 

"ముగ్గు పోసుకుంటా " అని ఆవిడ సమాధానం

 

ఇంక లాభం లేదు... చల్లకొచ్చి ముంత దాచడమెందుకు?

 

"నాకు ఇస్తారా ఆ రాచ్చిప్పని " అని అడిగా

 

ఆవిడ నావైపు చెత్త ఏరుకోడానికి వచ్చిన మునిసిపాలిటి వాన్ లో వ్యక్తి ని చూసినట్టు చూసి "దాన్నేం చేసుకుంటావే? " అని అడిగింది.

 

"కొరివికారం లో పోపు వేసుకుంటా " అని చెప్పా

 

"సరే ఇస్తాలే " అని అన్నారు.

 

" నా దగ్గర ఇంకా రెండు చిన్న రాచ్చిప్పలు కూడా ఉన్నాయి " అని ఆవిడ మాటల సందర్భంలో అన్నారు ,

 

(" ఏం తల్లీ ఇంకో రెండు రాచ్చిప్పలు కావాలా? " 

😍

నా కళ్లల్లో మెరుపు... " అవి కూడా ఇచ్చేయండి " అని అడిగేశా

 

మొత్తానికి ఆవిడకి వీడుకోలు చెప్పి ఆ రాచ్చిప్పలు తెచ్చేసుకున్నానోచ్ !

 

ఇదిగో ఈ రోజు ఆ రాచ్చిప్పలలో కొరివికారం వేసి అందులో పోపు వేసుకొని, వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తినేశా!   😍 

 

 

 

 

 

 


 😌



3 comments:

  1. నేను కూడా రాచ్చిప్పల గురించి చాలా వెతికాను - కానీ దొరికినవాటిని బరువని తెచ్చుకోలేక మా అత్త దగ్గరే వదిలేసి వచ్చాను. మీ ఈ పోస్ట్ తో అవన్నీ గుర్తొచ్చాయి .

    ReplyDelete
  2. నాకిప్పుడే రాచ్చిప్పలు కావాలి... :-(

    ReplyDelete