Search This Blog

Monday, May 13, 2019

కె. రాణి

అమ్మకొంగు పట్టుకొని తాయిళాల కోసం తిరిగే లేత వయసు, స్నేహితులతో కలిసి లొల్లాయి పాటలు పాడుతూ గంతులు వేసే చిరుత ప్రాయం.. అంత చిన్న వయసులో గాన గంధర్వుడు ఘంటసాల పక్కన నిలబడి ఆయనతో కలిసి " చెలియ లేదు చెలిమి లేదు " అన్న విషాద గీతాన్ని ఆయనతో గళం కలిపిందంటే  ఆ చిన్నారి ఎంత అదృష్టవంతురాలో కదా!!  11 ఏళ్ళ వయసులో గొంతులో విషాదాన్ని ఒలొకిస్తూ ఆవిడ పాడిన "అంతా బ్రాంతి యేనా " సినీ విషాద గీతాలలో ఆణిముత్యము. ఆ పాట పాడినది  అలనాటి చిన్నారి శ్రీమతి కె. రాణి గారు.  కె. రాణీ గారి అసలు పేరు ఉష రాణి. ఆవిడ 1942 లో కర్ణాటక రాష్ట్రం లో "తుముకూరు " జిల్లాలో పుట్టారు. ఆవిడ తల్లీతండ్రులు కిషన్ గారు, లలిత గారు. కిషన్ గారు రైల్వే లో పని చేయడం వలన భారత దేశంలో చాలా ప్రాంతాలు తిరిగారు. బహుశా ఈ కారణం వలనేనేమో రాణీ గారికి పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించేలా చేసింది. రాణి గారికి నలుగురు అక్కలు, ఒక అన్నయ.


పాటల ప్రస్థానం :



అప్పుడు రాణి గారికి 8 ఏళ్ళ వయసు, మద్రాసులోని అన్నామలై మన్రాంలో  నటి వైజయంతి మాల గారు  చేసిన నృత్యప్రదర్శన కార్యక్రమంలో రాణి గారు " హృదయ్ సే పూజా కరో " అనే మీరా భజన పాడారు. అది నచ్చి సుబ్బిరామన్ గారు మరునాడు ఆవిడ ఇంటికి తబలా, హర్మోనియం తో వెళ్ళి శృతిలయలతో ఒక పాట పాడమన్నారు. ఆవిడ పాడిన విషాద గీతం నచ్చి మరునాడు కార్ పంపించి స్టూడియోకి పిలిపించారుట. అప్పుడు పాడిన పాట తమిళం లో "పారిజాతం ". రాణి గారికి అప్పటికి తమిళ్ రాదు. కానీ జిక్కి గారి సహాయంతో ఆ పాట పాడి సుబ్బిరామన్ గారి ప్రశంశలు పొందారుట.


ఆ తరవాత "ధర్మదేవత " (1952) లో "ఇదిగిదిగో ఇదిగిదిగో " అన్న పాట అప్పటి ప్రముఖ గాయణీమణి చేత పాడించారుట. కానీ ఆ గాత్రంలో చురుకుదనం లేని కారణం గా ఆ పాటలు మొత్తం రాణి గారి చేత పాడించారుట సుబ్బిరామన్ గారు. ఆ సినిమాలో "పాటకు పల్లవి కావాలోయ్ " పాట (రాగిణి మీద చిత్రీకరించారు) అప్పట్లో  విదేశీ బాణిలో ఉన్న హుషారు గీతాలలో ఒకటి. అది విన్నాక సుబ్బిరామన్ గారు ఆవిడ చేతే "పెళ్ళి చేసి చూడు " సినిమాలో "బ్రహ్మయ్య " "అమ్మా నొప్పులే " పాట పాడించాలని ఆర్డర్ వేసారుట. ఆవిడ గాత్రంలో హుషారు, చిన్న పిల్లల మాద్రవం తొణికిసలాడుతూ ఉండటంలో అప్పట్లో చిన్నపిల్లల పాటలకు ఆవిడనే ఎంపిక చేసేవారుట.


ఆ తరవాత ఎందరో జీవితాలను మార్చెసిన "దేవదాస్ " సినిమాకి సుబ్బిరామన్ గారు రాణి గారి చేత పాడించాలనుకున్నారు. ఆ సినిమా అన్నీ ప్రయోగాలతో మొదలయ్యిందే! అందరూ రాణి గారిని వద్దని వాదించారు వేదాంతం రాఘవయ్య గారు ససేమిరా అన్నారు. అంత ఆద్రతతో కూడిన గాత్రం ఎవరేనా ప్రముఖుల చేత పాడిద్దామని వేదాంతం గారు అంటే, అందుకు సుబ్బిరామన్ గారు ఒప్పుకోలేదు. పార్వతిగా సావిత్రినీ, ఆ పార్వతి గాత్రానికి రాణీని అప్పటి పెద్దలకు రుచించని విషయం. కానీ ఆ సినిమాయే ఇద్దరికీ బాగా పేరు తెచ్చిపెట్టింది. తీరా పాడేటప్పుడు "బాగా ఏడుపు కనిపించే పాట " అని చెప్పారుట రాణి గారితో సుబ్బిరామన్ గారు. అప్పుడు రాణీ గారు నిజంగా ఏడుస్తూ పాడారుట పాటని.  సుబ్బిరామన్ గారు " పాటలో ఏడుపు ఉండాలి, కానీ నువ్వు ఏడవకూడదు, ఏడుపంతా కంఠలో ఉంచుకొని పాడాలి " అని చెప్పారుట. పదకొండేళ్ళ పిల్లకి ఆయన  చెప్పింది ఎమర్ధమయ్యిందో కానీ " అంతా బ్రాంతి యేనా " పాట మాత్రం వారి నుండి వచ్చి జనాలకు ఏడిపించింది.


అదే సినిమాలో "చెలియ లేదు చెలిమి లేదు " అనే పాట గాన గంధర్వుడు ఘంటసాల గారితో పాడాల్సి వచ్చింది. పక్కన ఘంటసాల గారిని చూసి ఏమయ్యిందో పాపం రాణి గారి గొంతు పెగల్లేదు. ఘంటసాల గారు ఓర్పుతో పిల్ల పాడేవరకు చూసారుట. అక్కడ ఉన్న సిబ్బంది " వేరే ఇంకెవరి చేతేనా పాడిద్దాము.విషాదంతో గుండె బరువెక్కి పాడే ఈ పాట ఈ చిన్న పిల్ల పాడలేదు " అని అన్నారు. పాపం ఈ మాటలకి సుబ్బిరామన్ గారు చాలా కలత చెందారు. "ఏం ఘంటసాల అంటే ఏదైనా పులా? నువ్వు పాడకపోతే పైన ఉన్న ఫాన్ నీ ఊడదీసి నీ నెత్తిమీద పడేస్తాను " అని అరిచారుట. అంతే రాణి గారు పాట అందుకున్నారు.  ఆ తరవాత ఘంటసాల గారి స్వీయ దర్శకత్వంలో వచ్చిన "మాయబజార్ " , "లవకుశ " మొదలైన సినిమాలలో రాణి గారు పాడే అవకాశాలు ఇచ్చారు. పాట విని సావిత్రి గారు కూడా "  ఏంటీ పార్వతికి ఈ పిల పాడిందా? " అని ఆశ్చర్యపోయారుట. సుబ్బిరామన్ గారు తనకి తండ్రిలాంటి వారని ఆయనే అందరికన్నా తన మీద నమ్మకం పెట్టుకొని ప్రోత్సహించారని రాణి గారు చెప్పారు. ఆయన అకాల మరణం తనని కలచివేసిందని చెప్పారు.


ఈ సినిమాకు సంబంధించిన కొన్ని జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ రాణి గారు.. దేవదాస్ సినిమా ప్రివ్యూ వేసినప్పుడు అందరూ సినిమా అయ్యక లేచి వెళ్ళిపోయారు, నేను మాత్రం సీట్ లో కూర్చొని ఏడుస్తూ ఉన్నాను. ఇంతలో ఏ.ఎన్.ఆర్ వచ్చి "ఏవయ్యింది? ఎందుకేడుస్తున్నావు? " అని అడిగారు.


"పాపం దేవదాసు చనిపొయాడు "


"నేనే దేవదాస్ ని.. ఏడవకు " అని ఏ.ఎన్. ఆర్ అన్నారు


"అరే ఎలా బ్రతికిపొయారు " అని ఏడుస్తూనే అన్నాను...


అప్పుడు ఏ.ఎన్.ఆర్ గారు నెత్తి మీద కొట్టి "ఇంటికి వెళ్లు" అని అన్నారు.


ఏ.ఎన్. ఆర్, సావిత్రి ఆటోగ్రాఫ్ అడిగారుట రాణి గారు. "కాయితం ఏది? " అని అడిగారు సావిత్రి గారు. తన దగ్గర ఉన్న రూపాయి నోటు ఇచ్చి దాని మీద సంతకం చేయమన్నారుట రాణి గారు. సావిత్రి గారు అలానే చేశారు. ఏ.ఎన్.ఆర్ సంతకానికి కాయితం లేదు, ఏ.ఎన్.ఆర్  రాణి గారి చేయి తీసుకొని "ఐ లవ్ ... " అని రాసి ఒకసారి రాణి గారి వైపు చూశారుట. ఆవిడ కంగారు పడిపోయారు,  "ఆర్ట్ " అని రాసి "ఏం పిల్లా కంగారు పడ్డావా " అని నవ్వారుట.


ఇలా పాటలకే అంకితం అయ్యిపోయినందు వలన రాణి గారికి ఇంటికే టీచర్లని పిలిపించి పాఠాలు, తమిళం, కన్నడ, మళయాళం నేర్పించేవారుట. ఆవిడకు ఏదైనా ఒక్కసారి చెబితే గుర్తుండిపోతుంది. ఎనిమిది  భాషలలో ఆవిడ అనర్గళంగా  మాట్లాడగలరు. రాణిగారు పాట విని బాగా పాడుతున్నావు .. సంగీతం నేర్చుకోకూడదు " అని పి. లీల గారు అన్నారుట. అలా అన్నందుకే ఆవిడ  వద్దే రాణి గారు సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ ద్వారా "గురువాయూరప్ప " ని కొలవడం నేర్చుకున్నారు. " ఆ గురువాయూరప్ప భక్తి లభించిందంటే అక్కే కారణం " అని అన్నారు రాణి గారు.(లిల గారిని అక్క అని పిలిచేవారు).


కాని ఈ శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాకే తనకు పాటలు పాడటమంటే భయం మొదలయిందట. అంతకుముందు ఎటువంటి సంకోచంలేకుండా పాడమనటం ఆలశ్యం హాయిగా పాడేసేదాన్ని…కానీ కాలక్రమేణా లీలగారి ప్రోత్సాహంతో, సహకారంతో కచేరీలు కూడా చేసే స్థాయికి ఎదిగాను. కచేరీలు కూడా చేశాను” అన్నారు రాణీ.  ఎవరైనా గాయనీ, గాయకులు తమలోని ప్రావీణ్యానికి ఈ శాస్త్రీయ సంగీతంతో సాన పెట్టటం వల్ల చాలా ఉపయోగం వుంటుంది”  అని అన్నారు రాణీ.


కె. రాణి గారు ఆరాధించే గాయణీ గాయకులు ఘంటసాల, లతా మంగేష్కర్ లు. ఒకసారి మద్రాస్ వుడ్లాస్ హోటల్ లో లతాజీ ఉన్నప్పుడు రాణి గారు కలిసి " మా ఇంటికి వస్తారా? " అని అడిగారుట. ఆవిడ "నువ్వు ఒక పాట పాడితే తప్పకుండా వస్తా  " అని అన్నారుట. అప్పుడు రాణీగారు "బచ్పన్ కే దిన్ భులానా దేనా.. ఆజ హసే కల్ రులానా దేనా " అని పాడారుట. అప్పట్లో రాణి గారు ఆవిడకు తెలీకుండానే లతగారి గొంతుని అనుకరించారుట. మరునాడు ఇంట్లో రాణి గారి సందడి.. "లతా జీ  వస్తారు " అంటూ అందరికీ మరీ మరి చెప్పసాగారుట. ఇంట్లో వారు "ఏదో చిన్నపిల్లవని నిన్ను సముదాయించడానికి అని ఉంటారు.. నిజంగా ఆవిడేమీ రారూ " అని ఆటపట్టించారుట. పాపం సాయంత్రం 7 అయినా రాకపోయేసరికి రాణీ  మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉన్నారుట. ఇంతలో తలుపు చప్పుడయ్యిందిట. "ఎవరూ " అని రాణిగారు అరవగా "మై హూ లతా " అని జవాబు వచ్చిందిట. లతా మంగేష్కర్, మదన్ మోహన్ గారితో కలిసి రాణి గారి ఇంటికి వచ్చారు. అంతే ఒక్క ఉదుకున పరిగెడుతూ వెళ్ళి ఆవిడ కాళ్లని చుట్టేసుకున్నారుట. "చల్ ఉఠ్ పగ్లీ " అని ఆవిడను లేవదీసి పక్కన కూర్చోబెట్టుకొని పాటలు పాడించుకున్నారుట లతా మంగేష్కర్.


ఆవిడతో పాటు వచ్చేస్తానని రాణి గారు మారాము చేస్తే " సరే " అని లత గారు వారి ఇంటికి తీసుకొని వెళ్ళి ఆవిడే స్వయంగా "పూరణ్ పోళీ (బొబ్బట్లు) " చేసి తినిపించారుట. వెళ్లే ముందు రాణీ గారి చేతిలో ఒక కృష్ణుడి బొమ్మ ఉంచి "మంచి గాయణి అవుతావు " అని దీవించారుట లత. లత గారు ఆంధ్ర వచ్చినప్పుడు రాణి గారి వద్దే ఆవకాయలు తీసుకొనేవారుట.


అలాగే ఘంటసాల గారి ఇంట్లొ వారి పిల్లలతో సమానంగా ఘంటసాల గారి అమ్మగారు రాణిగారికి నోట్లో  అన్నం పెట్టేవారుట. అలాగే వైజయంతి మాల గారు రాణి గారిని సొంత చెల్లెలుగా చూసుకునేవారుట. ఇద్దరు ఒకే కంచం లో తిని,  ఒకే మంచం మీద పడుకొని పాటలు పాడుకునేవారుట. వైజయంతి మాల గారి డాన్స్ కి రాణి గారు పాటలు పాడెవారుట(లతా మంగేష్కర్వి).


వివాహం :


రాణి గారి బావగారి (అక్క భర్త) స్నేహితులు శ్రీ సీతారామరెడ్డిగారు. సీతారామరెడ్డి గారి తండ్రి బొబ్బిలి రావు బహదూరు సుబ్బారెడ్డి , తల్లి ఓబులమ్మ. సుబ్బారెడ్డిగారు కలెక్టరుగా పని చేశారు. సీతారామరెడ్డిగారికి హైదరాబాద్ లో సదరన్ మూవీటోన్ స్టూడియో వుంది. నిర్మాతగా”సతీ అరుంధతి”-“నిజం చెబితే నమ్మరు” చిత్రాలను నిర్మించారు. రాణి గారిని చూసే వంకతో వారి బావగారి ఇంటికి  వస్తూ ఉండేవారుట. ఒకరోజు పెళ్ళి ప్రస్తావన తీసుకొని రాగా, రాణి గారు ససేమిరా అన్నారుట. కానీ రాణి గారి బావగారు మధ్యవర్తిత్వం వహించి వారిరువురుకీ 1966 వివాహం జరిపించారుట.  ఆ తరవాత ఆవిడకు కొన్ని సినీ అవకాశాలు వచ్చినా భర్తకి ఇష్టం లేని కారణం గా వదులుకోవాల్సి వచ్చింది. ఆ తరవాత సీతారామరెడ్డి గారు తీసిన "సతీ అనసూయ " సినిమాకు గానూ ఆవిడకు పాడే అవకాశం ఇచ్చారుట సీతారామరెడ్డి గారు. "సినిమా  పాటలు పాడవద్దన్నారుగా, ఇప్పుడు ఇది కూడా సినిమా పాటే.. నేను పాడను " అని అన్నారుట. కానీ తరవాత సీతారమరెడ్డి గారు బ్రతిమాలగా పాడారుట. 


ఆ తరవాత ఘంటసాల గారి సంగీత దర్శకత్వం లో  వచ్చిన " వస్తాడే మా బావ " అనే సినిమాకు పాడారు. ఆవిడ మొట్టమొదట పాడింది విషాద గీతం అవ్వడం వలన ఆవిడ  జీవితం  కూడా విషాదమయం అయ్యిందేమో అని బాధపడ్డారు రాణి గారు. పెళ్ళైన పదేళ్లకే భర్త పోయారు. ఆవిడ కూతుర్లు విజయ, కవిత అప్పటికి చాలా చిన్నపిల్లలు. వారిని చుసుకోవాల్సిన బాధ్యత ఆవిడకు ఉంది. కాబట్టి పాటలకు, సినిమాలకు దూరం అయ్యి.. తల్లిగా పూర్తి జీవితం గడిపారు.



రాణి గారు గాయణి గా ఉన్నది కొద్ది కాలమైనా ఎన్నో అద్భుతాలను చేశారు. శ్రీలంక జాతీయ గీతం ఆలపించిన తెలుగు మహిళ ఆవిడే (సంగీతం సుసర్ల దక్షిణా మూర్తి గారు)! తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, సింహళి, ఉజ్బెక్ భాషల్లో పలు పాటలు ఆలపించారు.  మదరాసులో షిప్పింగ్ వ్యాపారంలో వున్న తమిళ ముస్లీములు హనీఫా వారి కోసం 150 కి పైగా భక్తి గీతాలను పాడారుట రాణి గారు. ఆ సమయంలోనే రాజ్ కపూర్, నర్గీస్, ముకేష్, దిళిప్ కుమార్, తలత్ మెహమూద్ గార్లతో పరిచయం ఏర్పడింది. ఆవిడ రాజ్ కపూర్ "జిస్ దేష్ మే గంగా బెహతీ హై " లో "ఓ మైనే ప్యార్ కియా " పాడరుట. ఆ తరవాత స్టేజ్ మీద రాజ్ కపూర్ మాట్లాడుతూ " వో చోటి లడ్కీ కహా హై " అని అడిగారుట. ఎవరో  రాణి గారిని స్టేజ్ మీదకు తీసుకొని వస్తే " ఈ సత్కారం నాకు కాదూ.. నీకు చెయ్యాలి " అని తన మెడలో ఉన్న పుల మాల రాణి గారి మెడలో వేశారుట. చిన్నతనం , అమాయకత్వం "అయ్యో రాజ్ కపూర్ నన్ను పెళ్ళి చేసేసుకున్నారా" అని తల్లి దగ్గర ఏడ్చారుట రాణి గారు. ఆవిడ తల్లి "నోరు మూయ్.. పిచ్చి మాటలు " అని తిట్టారుట.


అప్పటి గాయకులలో రాణి గారు చిన్నవారు కావడంతో స్టూడియోకి రాగానే పాలు, ఫలహారాలు పెట్టి ముద్దుగా చూసుకునేవారుట అందరూ . పాట పాడటం అయ్యాక ఆవిడకు చాకులెట్లు ఇచ్చేవారుట. భారత రాష్ట్రపతి డా: సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందు రాష్ట్రపతి భవన్ లో పాడి ఆయన ప్రశంసలతోపాటూ ఆయన ఆశీసులు పొందిన భాగ్యశాలి. 1955 లో ఆనాటి మదరాసు రాష్ట్ర(తమిళనాడు)ముఖ్యమంత్రి కామరాజ్ నాడార్ రాణీకి బంగారు కృష్ణుడు వున్న బంగారు గొలుసును బహూకరించటమే కాక”మెల్లిసై రాణి”అనే బిరుదు ప్రదానం చేశారు. రాజగోపాలాచారి సమక్షంలో పాడి ఆయన మెప్పు పొందారు. ఆయన రాణీని “నీకు చాలా ఉజ్జ్వలమైన భవిష్యత్తు వుంది” అని ఆశీర్వదించారట. ప్రముఖ హిందుస్తానీ విద్వాంసులు ఉస్తాద్ బడే గులాం ఆలీ ఖాన్ ఘంటసాల ఇంట్లో బస చేసినప్పుడు రాణీ పాటను విని “నువ్వు మంచిగాయకురాలివి అవుతావు. నీకు మంచి భవిష్యత్తు వుంది” అని  ఆశీర్వదించారుట. లతతో పాటు రాణీ గారి ఇంటికి వచ్చిన మదన్ మోహన్(హిందీ సంగీత దర్శకులు) " బాగా సాధన చెయ్యి..మంచి గాయణివి అవుతావు " అని ఆశీర్వదించారుట. ఇవే ఆవిడకు లభించిన అవార్డ్లు.


నేను ఆవిడని కలవడానికి వెళ్ళినప్పుడు "నేను ఇంకా బ్రతికున్నానని ఈ ప్రపంచానికి తెలుసా? " అని అడిగారు. వీడియో తీస్తునప్పుడు ఆవిడకు పాటలు గుర్తొచ్చెవి కావు, వీడియో ఆపేశాక పాడటం మొదలెట్టెవారు. అప్పుడప్పుడు ఫోన్ చేసి ఆవిడకు ఏదైనా పాట గుర్తుకొస్తే పాడేవారు. ఎన్నో  జ్ఞాపకాలో పంచుకున్నారు ఆవిడ. ఆవిడ పెద్ద కుమార్తే విజయ గారి వద్ద ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యతో జూలై 13 వ తారీఖున 2017 న హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు రాణి గారు. ఆవిడ భౌతికంగా దూరమైనా పాటలతో ఎప్పటికీ  చిరంజీవే! 


ఆవిడ పాడిన కొన్ని తెలుగు పాటలు :


1. అంతా బ్రాంతియేనా(దేవదాసు)

2. చెలియ లేదు చెలిమి లేదు(దేవదాసు)

3. దయచేయండి దయచెయండి (ఒకటే మా వయసు.. మాయాబజార్)

4. రామన్న రాముడు కోదండ రాముడు (లవ కుశ)

5. బ్రహ్మయ్య ఓ బ్రహ్మయ్య,  అమ్మ నొప్పులే అమ్మమ్మ నొప్పులే(పెళ్ళి చేసి చూడు)

6. చందమామ ఇటు చూడరా (శభాష్ రాముడు)

7. ఎవడే ఎవడే చల్లని జల్లులు (చంద్రహారం)

8. రావోయి వరా నా ఏలిక (చండీ రాణి)

9. చిన్నరి చేతులా (అన్నా తమ్ముడు)

10. తినబోతూ రుచి అడగకు-తీయని కోర్కెలు దాచకు ((చివరి పాట)వస్తాడే మా బావ)

11. ఇదిగిదిగో  ఇదిగిదిగో (లంబాడి లంబాడి లంబ లంబ.. )(ధర్మ దేవత)

12. పాటకు పల్లవి కావాలోయ్ ( ధర్మ దేవత)

13. ఏ ఊరే చిన్నదానా (ధర్మ దేవత)

14. కొండ మీది కొక్కిరాయి (జయసింహ)

15. విరిసే చల్లని వెన్నెల(లవకుశ)

16. అశ్వమేధ యాగానికి జయము జయము జయము(లవకుశ)

17. ఓ పంతులు గారు (పిచ్చి పుల్లయ్య) 

 

 

 



 

Monday, May 6, 2019

కె. రాణి

సన్మిత్రులకు నమస్కారములు!! తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హింది, బెంగాలి, ఉజ్బెక్ భాషల్లో పాడిన తెలుగు గాయనీమణి... కె. రాణి గారు. మొదట పాటే గుండెలని పిండేసే విషాద గీతం.. అదే "అంతా భ్రాంతి యేనా(దేవదాసు సినిమాలోది). " . ఆ పాట పాడేటప్పటికి ఆవిడ వయస్సు 11 సంవత్సరాలు మాత్రమే!

ఆవిడజీవిత విశేషాలు ఆవిడ ద్వారా తెలుసుకుంద్దాము...