Search This Blog

Thursday, August 25, 2016

విందు భోజనం

మా చిన్నప్పుడు నేను మా తమ్ముడు అహోబిళ మఠం లో ఒక పెళ్ళికి వెళ్ళాము . అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ పెళ్ళి గురించి. మాకు అర్ధమయ్యింది ఏమిటంటే అది మనకు మనమే వడ్డించుకొనే పెళ్ళిట! దాని పేరు ' బర్ఫి ' ( మాకు అప్పుడు ఆ పేరు పలకడం రాలేదు మరి) యో అలాంటిదేదో అని చెప్పారు.


నేను మా తమ్ముడు అది ఎలా ఉంటుందో పైకి వెళ్ళి చూద్దామని అనుకొన్నాము! మెట్లు ఎక్కుతూ " నువ్వేం తింటావు " అని అడిగాడు నన్ను. నేను "పూరి, ఐస్ క్రీం, పులావ్ " అని చెప్పాను. వాడిని అడిగితే వాడు "అన్నం తప్ప అక్కడ ఉన్నవన్నీ  తింటాను.. " అని అన్నాడు. తినబోయే రుచులని ఊహించేసుకుంటూ మేడ మీదకి వెళ్ళాము. అక్కడ బోలెడు గిన్నెలు మూతలు పెట్టేసి ఉన్నాయి. ఆ గిన్నెల్లో తినాల్సినవి ఉన్నాయన్న మాటా! చుట్టు పక్కల మా పెద్ద వాళ్ళు ఎవరూ లేరు... ఇంత కన్నా భళే ఛన్స్ ఎప్పుడు దొరుకుతుంది? ఇద్దరం ప్లేట్లు తీసుకొన్నాము. నేను "పూరి " కోసం వెతుకుతున్నాను... ఈ లోపల మాకు తెలిసిన ఒక పే... ద్ద ఆయన మా తమ్ముడి దగ్గరకు వచ్చి " బాబూ ! వచ్చావా? దా దా "అని భుజం మీద చెయ్యి వేసి వాడిని పక్కకు తీసుకెళ్ళాడు. అప్పటికే ఆయన ప్లేట్ లో సిమెంట్ కలిపినట్టు అన్నం మధ్యలో సాంబార్ వేసుకొని ఉన్నాడు. మా తమ్ముడికి ఎంగిలి చెత్తో వాడి ప్లేట్ లో టమాటా పప్పు, అన్నము, వంకాయ కూర, గోంగూర పచ్చడి, కంది పొడి... ఇంకా ఏవేవో వేసేశారు. నేను నా ప్లేట్ పట్టుకొని వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను. మా తమ్ముడు నా దగ్గరకు ఏడుపు మొహం పెట్టుకొని ఆ ప్లేట్ పట్టుకొని వచ్చాడు. నాకు నవ్వు ఆపుకోవడం కష్టమయ్యింది. నా నవ్వు వాడికి ఇంకొంచం ఉక్రోషం కలిగించింది. " ఇంటికెళ్తే మంచి నీళ్ళు కూడా అడగరు, కానీ వేరే వాళ్ళ పెళ్ళికి దాన కర్ణుడిలా వడ్డించేస్తాడు " అని ఏకవచనం లో తిట్టేశాడు. "ఇప్పుడు అవన్నీ తినేస్తావా? " అని ఆ వీరభద్ర పళ్ళాన్ని చూస్తూ అడిగాను.


"అమ్మో ఇవన్నీ ఎలా తింటాను? " అని ఇటు అటూ చూశాడు. వాడి ప్లేట్ తీసుకెళ్ళి ఒక టేబుల్ కింద పెట్టేసి మళ్ళీ ఫ్రష్ గా వేరే ప్లేట్ లో కావాల్సినవి తెచ్చుకొని తిన్నాడు. బోలెడు తింద్దామనుకున్నాము కానీ, ఆ ప్లేట్ మోయలేక, ఆ వాసనలకి ఒక పూరీకే కడుపు నిండిపోయింది.


అప్పట్లో ఈ బఫ్ఫే చాలా నచ్చేది. కావల్సినవే వడ్డించుకొని తినొచ్చు. బలవంతగా వడ్డించే వారు ఉండరు (ఎప్పుడో దురదృష్టం ఆ పెద్దయన రూపం లో వస్తే తప్పా), ఇష్టం లేనివాటి వైపు కన్నెత్తి కూడా చూడక్కర్లేదు. కబుర్లు చెప్పుకుంటూ నిల్చొని స్టైల్ గా తినొచ్చు.


ఆ తరావత కొన్ని రోజులకి ఈ ప్లేట్ బరువు మోయలేక కూర్చొని తినేవాళ్ళము. ఇప్పుడు ఈ బఫ్ఫే లో కూడా తింటొన్న ఎంగిలి చేత్తోటే కావల్సినవి, అక్కలేనివి అన్నీ వడ్డించేసుకొని, ప్లేట్ ఖాళీ చేయడం అదేదో ప్రేస్టేజీ ఇషూ గా భావించి ప్లేట్ నిండుగా చెత్తబుట్టలో పారేస్తున్నారు. ఆ ప్లేట్ల బరువు మొయ్యడం కూడా చాలా కష్టమౌతోంది. ఇప్పుడు మగపెళ్ళివారు అడిగే పెద్ద కోరికల్లో ఒకటి "బంతి భోజనం " . తిండి పదార్ధాలు వేస్ట్ అయ్యిపోతాయన్న భయం బఫ్ఫే లోనూ, బంతి భోజనాలలోనూ ఉంటుంది. భయం కాదూ.. తిండి రెండిటిలోనూ వేస్ట్ అవుతోంది.


బఫ్ఫే లో అయితే ఇక చిన్నపిల్లలకి "ఆశ లావు.. పీక సన్నము " అన్నీ వడ్డించేసుకుంటారు. తినలేరు.. పారేస్తారు. అలాంటప్పుడు కాస్త పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు కూడా వడ్డించుకునే ముందు ఒకటికి రెండు సారు తినగలమో లేదో అని ఆలోచించి వడ్డించుకుంటే బాగుంటుంది. రుచి కోసం ఒక చెంచా వడ్డించుకొని బాగుంటేనే మరి కొంచం వేసుకుంటే మంచిది. ముఖ్యంగా మన ఇంట్లో తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతే జాగ్రత్తగా ఇలాంటి భోజనాలలో ఉండాలి. వడ్డించే వాళ్ళూ కొద్ది కొద్దిగా వడ్డిస్తే మంచిది.


మా చిన్నప్పుడు సంతర్పణలో " నా పేరు చెప్పి వాడికి నాలుగు బూరెలు వెయ్యరా " అని వడ్డించే వాడికి పురమాయించేవారు. వాడి పేరు చెప్పి, వీడి పేరు చెప్పి వడ్డిస్తే వాళ్ళ పొట్టలు, వీళ్ల పొట్టలు అరువు తెచ్చుకోలేరుగా తినేవాళ్ళు?


తినే వాళ్ళు ఒక్కసారి వంటకాలని పారేసే ముందు "సొమాలియా " పిల్లల్ని దృష్టిలో పెట్టుకొంటే చాలు... ఆ 'ఒక్క ముద్ద ' విలువ తెలుస్తుంది.