Search This Blog

Tuesday, February 20, 2018

ఋష్యేంద్రమణి

ఈ మధ్య "మాయాబజార్ " సినిమా చూశా.. (మొదటి సారి కాదు.. ఎన్నో సారో గుర్తు లేదు). సుభద్ర,అభిమన్యులును కృష్ణుడు దారకుడికి అప్పగించి "ఘటోత్కజుడి ఆశ్రమం" కి తీసుకెళ్ళమని చెబుతాడు. తీరా వెళ్ళేటప్పుడు మాధవపెద్ది సత్యం పాట.. అదేనండి భళి భళి భళీ దేవా వస్తుంది. ఆ దారకుడు కూడా మాధవ పెద్ది సత్యమే ( ఇది మాకు తెలుసు అనకండి). పాట అయ్యేటప్పటికి రాక్షసులు అభిమన్యుడిని అడ్డగిస్తారు. వారందరినీ చంపేస్తాడు అభిమన్యుడు. ఇంక ఘటోత్కచుడు ఎంటర్ అవుతాడు. కాసేపు ఫైటింగ్ అయ్యాక.. "పేరు చెప్పి శరణు వేడు, వదిలేస్తా " అని వార్నింగ్ ఇస్తాడు ఘటోత్కచుడు. "పిరికివాడిలా పేరు చెప్పడం ఎందుకు " అని భీష్మించుకుంటాడు అభిమన్యుడు. ఇంతలో ఘటోత్కచుడి గద తగిలి అభిమన్యుడు మూర్చపోతాడు.

 

మన సుభద్ర గారు విల్లు ధరించి....

"అఖిల రాక్షస మంత్రతంత్ర అతిశయమణచు శ్రీకృష్ణుని సోదరినగుదునేమీ

దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనకు అర్జును పత్నినే అగుదునేని "

 

అంటూ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల 'ప్రవర ' చెప్పేస్తుంది. ఉత్తి పేరు చెప్పమంటే ఇంత సీన్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఇంత గొప్ప పరిచయమా? అదేదో ముందుగా చెప్పి ఉంటే అభిమన్యుడు మూర్చ పోయేవాడు కాదు కదా!

 

అదీ కాక " ఈ శరంబు అసురు గూల్చి సిద్ధించు గాక.. పాండవకులైక భూషణ ప్రాణ రక్షా " అని అంటుంది. ఈ పద్యము "ఋషేద్ర మణి గారు " బహు బాగా పాడారు కానీ.. "పాండవ కులైక భూషణుడు " అభిమన్యుడొక్కడే కాదు కదా? ఎదురుగ ఇంకో భూషణుడు అదే ఘటోత్కచుడు ఉన్నాడు. అదీ కాక ఉపపాండవులూ ఇంకా ఉన్నారు ( సినిమాలో పాండవులే లేరు ఈ ఉపపాండవులెక్కడా అని అడగకండి). ఇంత మంది భూషణులు ఉండగా పాపం ఆవిడ ఎకైక భూషణుడని అభిమన్యుడికి కీర్తించేస్తే ఎలా? ఇది అప్పుడు ఎవరూ అడగలేదా? అడిగినా చక్రపాణి గారు , పింగళి గారు "ఎవరూ కల్పించకపోతే కట్టు కథలు ఎలా పుడతాయి ? " అని అనేశారా?

 

అప్పుడు వాళ్ళు అడగకపోయినా ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఏడిచినట్టే ఉంది.. ఎవర్ని అడుగుతావు అని అడగొద్దు. నా ప్రశ్న ఏడ్చినట్టున్నా, ఏడ్చి మొహం కడుకున్నట్టున్నా.. అడిగేస్తాను.. అంతే!

 

 

ఈ రోజు ఋష్యేంద్రమణి గారి పుట్టినరోజు... ఆ పద్యం... ఆ ఠీవి చూసేయండి.. ఈ ప్రశ్నలన్నీ మరచిపోవచ్చు.

 

 

 

 

Thursday, February 1, 2018

రాజన్- నాగేంద్ర

సప్తస్వర.. ఆయన నివాసం

సరిగమలు.. వారి నేస్తం

సరస్వతీదేవికి వారి ఇల్లే ఆవాసం

రెండు దశాబ్ధాలు దక్షిణ సినిమా సంగీతాన్ని ఏలినది ఆ యుగళం...



వారే... రాజన్- నాగేంద్ర.. సంగీత ద్వయం...

ఖైదీ కన్నయ్య చేత ' పూజ ' లెన్నో చేయించి, వారికి  "నవగ్రహ పూజా మహిమా " 'కనకదుర్గ పూజా మహిమ ' తెలియచేసి,' సొమ్మొకడిది సోకొకడిదిగా ' జల్సా చేస్తూ,  'అప్పుల అప్పారావు' గా ఉన్న' అల్లరి బావ '  'నాగమల్లి 'ని చూసిన వెంటనే 'ప్రేమఖైది '  ని చేసి,  ఆ 'అమ్మాయి మనసు ' ని అర్ధం చేసుకుని, వారి 'చూపులు కలిసిన శుభవేళ ' వారి చేత 'పణయ గీతం ' పాడించి, వారి ప్రేమని 'మంచు పల్లకి ' ఎక్కించి, వారిని "మూడు ముళ్ళ బంధం' తో కలిపి  వారిని "వయ్యరి భామలు - వగలమారి భర్తలు " చేసి, వారి "ఇంటింటి రామాయణాన్ని " ' పంతులమ్మ ' గా మనందరికీ తెలియచేసి ' కోటికొక్కడు ' గా మిగిలిన  'అగ్గి పిడుగు " లు రాజన్ నాగేంద్ర గార్లు.  


ఎనుబది పదులలో కూడా సంగీత సేద్యం చేస్తున్న వారు రాజన్ గారు. ఆ మహానుభావుడు నిత్య సంగీత కృషివలుడు . వారు ప్రస్తుతం బెంగుళూరు నగరంలో ఉంటున్నారు. 



ఐరావతం రాజప్ప గారు చాలా గొప్ప సంగీతాభిమాని మరియూ గొప్ప సంగీత నిపుణులు. వారు తబలా, హార్మోనియం, వీణా, ఫ్లూట్ వాయించగలిగేవారు. వారి కొడుకులు రాజన్- నాగేంద్ర గార్లు కూడా తండ్రికి తగిన తనయులే! 


రాజన్ గారు 1932 లో మైసూర్ లోని శివరామ్ పేట లో జన్మించారు.  వీరు తెలుగు వారే కానీ కొన్ని తరాల క్రితమే మైసూర్ లో స్థిరపడిపొవడం వలన ఎక్కువ కన్నడ కలిసిన తెలుగు మాట్లాడుతారు! రాజన్ - నాగేంద్ర కు హార్మోనియం, వేణువులు నేర్పిన మొదటి గురువు వారి తండ్రి అయిన రాజప్ప గారే! ఆ తరవాత బిడారం కిష్టప్ప గారి దగ్గర, దేవేంద్రప్ప గారి దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించారు.  ఆ తరవాత బిడారం కిష్టప్ప తో కొన్ని కచేరీలు బెంగుళూరులోనూ, మైసూర్ లోనూ ఇచ్చారు ఈ అన్నదమ్ములు.  రాజన్ నాగేంద్ర లో నాగేంద్ర గాయకుడు కూడా! ఒకసారి మైసూర్ ప్యాలస్ లో జరిగిన వీరి కచేరి విని వారికి సంగీత దర్శకులు గా అవకాశం దొరికింది. అలా వారు 'సౌభాగ్య లక్ష్మి " అనే కన్నడ సినిమాకు తొలిసారి సంగీత దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి విఠలాచార్య దర్శకులు.


ఆ తరవాత విఠలాచార్య తెలుగులో తీసిన " కనకదుర్గ పూజా మహిమ " సినిమాకి కూడా ఈ జంటనే సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు. ఆ తరవాత వారు తీసిన "నవగ్రహపూజా మహిమ " సినిమాలో  చాలా పాటలతో బాటు జానకితో ఘంటసాల ఆలపించిన "ఎవరో.. ఏల పగబూని సాధింతురు " అన్న పాట ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో వీరి మొదటి సినిమా " వద్దంటే పెళ్ళి ". "ఖైదీ కన్నయ్య " లో " తియతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా " పాట కూడా ఆ రోజుల్లో చాలా పేరుపొందింది. 


ఆ తరవాత "అగ్గిపిడుగు " సినిమాలో "ఏమో ఏమో ఇది " అన్న పాట కూడా ప్రఖ్యాతిగాంచింది. 1976 లో వచ్చిన "పూజ " సినిమా లో వారు సమకూర్చిన అన్ని పాటలు  తెలుగునాట  ఈ రోజుకి మారుమ్రోగుతున్నాయి. 



1978 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డ్లు సంగీత దర్శకులకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తొలి అవార్డు "పంతులమ్మ " సినిమాకు గానూ రాజన్ నాగేంద్రలకు దక్కింది. ఆ సినిమా తరవాత 'నవతా కృష్ణం రాజు " తీసిన ప్రతి సినిమాకు వీరే సంగీత దర్శకులయ్యారు. 



సంగీత దర్శకత్వం వహించినకొన్ని తెలుగు సినిమలు :



పంతులమ్మ, ఇంటింటి రామాయణం, పూజ, సొమ్మొకడిది సోకొకడిది, నవగ్రహపూజా మహిమ, నాగమల్లి, తాతయ్య ప్రేమలేఖలు, అల్లరిబావ, అద్దాల మేడ, ప్రణయ గీతం, మంచుపల్లకి, వయ్యారిభామలు వగలమారి భర్తలు, నాలుగు స్థంబాలాట, అమ్మాయి మనసు, మూడు ముళ్ళు, పులి-బెబ్బులి, లంకె బిందెలు, రాజు-రాణి-జాకి, రెండు రెళ్లు ఆరు, ఆడపడుచు, చూపులు కలిసిన శుభ వేళ, ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, రాగ లీల, కోటికొక్కడు, దేవుని గెలిచిన మానవుడు, నాగార్జున, ఖైదీ కన్నయ్య, వరలక్ష్మీ వ్రతం, అన్నా చెల్లెలు, శ్రీ కృష్ణ గారడి, సర్దార్ ధర్మన్న, రౌడీ పోలీస్, వియజసింహ, అనురాగ బంధం, సీత పుట్టిన దేశం, అ ఆ ఇ ఈ.... 


నాగేంద్ర గారు కన్నడాలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎక్కువగా హాస్య నటులకు వీరు గాత్రం సరిపోతుంది. వారు నవంబర్ 3 2000 సంవత్సరంలో కన్నుమూశారు. 



ఎనిమిది పదుల వయసులో కూడా రాజన్ గారు సంగీత సేవ ఇంకా చేస్తూనే ఉన్నారు. వారు సమకూర్చిన కొన్ని పాటలు ఎస్.పి. బాలు గారి చేతా మరి కొందరు గాయకుల చేత పాడించి కొన్ని ఆల్బంస్ గా విడుదల చేశారు. ఇప్పుడు పురంధర దాసు కీర్తనలు స్వరపరుస్తున్నారు. కొంత మంచి యువ గళాలకు "వాయస్ కల్చర్ " మీద టుటోరియల్స్ ఇస్తున్నారు. వారి చేత పురంధర దాసు కీర్తనలు పాడించి ఆల్బంస్ గా విడుదల చేస్తున్నారు. వారి సేవ అద్వితీయం... ఆ సరస్వతీదేవి కటాక్షం వారి మీదా మెండుగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను.