Search This Blog

Friday, July 28, 2017

తుం ఆగయే హో....

పెనం మీద వేడి వేడి పెసరట్టు నోరూరిస్తోంది! తినాలని ఉంది కానీ... తనతో పాటు తింద్దామని ఒక ప్లేట్ లో తనకి రెండు, నాకు ఒకటి ఉంచాను. నిన్న కూడా అంతే... తనకి నా చేతి ఇడ్లీలంటే ఇష్టమని, నేను తినకుండా తన కోసం వైట్ చేసి చివరకి రాత్రి ఆ చల్లారిన ఇడ్లీనే తిని ఉన్నాను. నేనే తన గురించి ఇంత ఆత్రము పడాలి కానీ, అసలు తనకి నేను గుర్తొస్తానా? వెళ్ళి పదిహేను రోజులయ్యింది, ఒక్క సారైనా ఫోన్ చేస్తే కదా! నేను చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేం మనిషో! కాసంత అభిమానం కూడా లేదు! రోజు తనతోటే టీ తాగే అలవాటు, టీ తాగుతొన్నంత సేపు ఎన్ని కబుర్లో! ఏంటో ఇప్పుడు ఒక్కదాన్నే తాగుతోంటే చాలా వెలితిగా ఉంది. తను వచ్చాక కొన్ని రోజులు మాట్లాడకూడదు. ముభావంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అలుసు అయ్యిపోతాను! తనకిప్పుడు వాళ్ళ వాళ్ళతో టైం పాస్ అవుతుండవచ్చు, నాకే అంతా శూన్యం గా ఉంది లైఫ్!  😞

 

" తెరే మేరే హోటో పే మీటే మీటే గీత్ మిత్వా " అని కాలింగ్ బెల్! ఒకప్పుడు కాలింగ్ బెల్ "డింగ్ డాంగ్ " అని మ్రోగేవి. అదేంటో ఇప్పుడు పూర్తి పాటలు. ఏం "మీటే మీటే గీత్" వినిపిస్తుందో వచ్చి! ఈ పాట హిందిలో "చాందిని " సినిమాలోది. ఇదే డబ్బింగ్ కూడ అచేస్తే మా క్లాస్ లో ఒక తుంటరి "నీకీ నాకి పెదవులలో తియ్య తియ్యని పాటలే ప్రియా " అని మక్కికి మక్కి అనువాదం చేసింది. ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఆ తెలుగు పారెడి గుర్తొస్తుంది! 😋


తనేమో అని ఆత్రంగా వెళ్ళి చూస్తే పక్కింటావిడ! ఆవిడ ఎందుకొచ్చిందో అర్ధమయ్యింది. కాస్త కాఫీ చేసి ఆవిడకో గ్లాస్, నాకో గ్లాస్ తెచ్చుకొన్నా! ఏవేవో కబుర్లు చెబుతోంది. "ఇంకా తను రాలేదా? " అని అసలు ప్రశ్న వేసేసింది. కళ్ళలో నుంచి ఉబుకి వస్తోన్న నీటిని ఆపుకొని.. "లేదండి " అని ఏదో పనునట్టు వంటింట్లోకి వచ్చేశా! 😢😢ఆవిడ తన గురించి కనుకోడానికే వచ్చింది. కాఫీ తాగి కాసన్ని ఊసుబోని కబుర్లు చెప్పి వెళ్ళింది.


టైమ్ పదయ్యింది... ఇంక ఈ రోజు తను వచ్చే అవకాశాలు తక్కువే! ఇంక తప్పద్దు.. తినాలి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా... వంటింట్లోకి తప్పనిసరై వెళ్ళాను. "ఏం వండాలి? ఏదో సింగిల్ ఐటమ్ చేసేసుకుంటా! ఆకలి తీరాలి అంతే! " రుచుల మీద మనసు వెళ్ళడం లేదు! గత పదిహేనురోజూల నుండి తినాలి కాబట్టి తింటున్నాను! కాళ్ళు ఒళ్ళు ఒకటే నొప్పి... తను రాగానే ఈ విషయం కూడా చెప్పాలి... ఈ నొప్పులకు కారణం తనేనని!!! 😞😔


మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది... " తుం ఆగయే హో నూర్ ఆగయా హై " . మనసులో ఏదో మూల చిన్న ఆశ, అదే ఆశతో తలుపు తీశా!


"తనే "... నిజమే తను రావడమే నా ఇంటికి నూర్ వచ్చింది. మరే నా ఇంటికి దీపం తనేగా... అబ్బా.. వసంతం వచ్చినంత ఆనందంగా ఉంది! 😍😍😍😍


"రా లక్ష్మి " అంటూ సాదరంగా ఆహ్వానించాను.. మా ఇంటి పనిమనిషిని! (బెట్టు చేసి మాట్లాడకపోతే... మళ్ళీ మానేస్తుందన్న భయంతో)!!  😀