Search This Blog

Friday, September 18, 2015

శ్రావణ మాసం

చిన్నప్పుడు శ్రావణ మాసం అనగానే పేరంటాలు, చామంతులతో పూల జడలు, మొగలి పువ్వు వాసనలు, వాయినం శనగలు మరునాడు వేయించుకొని తినడము.. ఇంతే! మా ఊరిలో పేరంటము అంటే మా మామ్మ, చినమామ్మ మధ్యాహ్నం మూడున్నరకే ఇంట్లో వాళ్ళకి ' టి ' ఇచ్చి బయలుదేరేవారు. ఈ మామ్మలది ఒక బాచ్ , ఆ తరవాత అమ్మలది ఇంకో బాచ్ బయలుదేరేది. శ్రావణ భాద్రపదాలంటే వర్షకాలాలే! అందులోనూ మా ఊరు ఎర్ర మట్టి, రోడ్లు కూడా సరిగ్గా ఉండవు గతుకుల రోడ్లు. ఇలా వర్షం పడితే ప్రతీ ఇంటి ముందు ఒక నీళ్ళ బాల్చి పెట్టేవారు కాళ్ళు కడుక్కోడానికి. ఆడవాళ్ళ కాళ్ళకి చక్కగా పసుపు రాసి, మెడకి గంధము పూసి, పన్నీరు (తినేది కాదు) చల్లి, కాటుక ఇచ్చేవారు. పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళు ఇలా ప్రతీ ఇంట్లో కాటుకా చక్కగా పెట్టుకొని ఇంటికొచ్చేసరికి కళ్ళకాటుక మొహం అంతా పాకేసేలా చేసుకునేవారు. . "పూట పేరంటానికి మొహం అంతా కాటుక " అంటే ఇదేనేమో! కాళ్ళకి పసుపు రాయించుకొని ఇంటికి ఇంటికి వెళ్తూ ఉన్న పేరంటాల్ల కాళ్ళకి ముందు రోజు పడిన వర్షంతో తడిసిన ఎర్రమట్టితో పారాణి దిద్దేది భూదేవి.

 

పిల్లలకి చామంతి పూలజడ వేసేవారు.. అదీ గట్టిగా దురద పుట్టినా గోక్కోడానికి లేకుండా. మొగలి రేకు (సీరియల్ కాదు) జడ మీద పెట్టి ఆ పైన ఈ చామంతులతో కుట్టిన జడ, ఆ రెండు పూల వాసనలు, పసుపు పన్నీరు వాసనతో కలిసి, ఆ పైన శనగల వాయినం కలుపుకొని అదో రకమైన సువాసనలొస్తుండేది శ్రావణ మాసం. కొత్త పెళ్ళికూతుర్ల కొత్త కొత్త పట్టుచీరలు, బంగారు నగలు... కొత్త అందాన్ని తెచ్చేవి. ఇంట్లో మండువాలో వర్షం ధార పెద్ద శబ్ధం చేస్తూ పడుతుంటే, పేరంటానికి వచ్చిన ఆడ లేడిసు అంత కన్నా గట్టిగా కబుర్లు చెప్పేసుకునేవారు. ఈ మామ్మ ల వెనకాల ఒక చిన్న బకెట్టు పట్టుకొని నేనూ బయలుదేరేదాన్ని, శనగలు అందులో వేసుకోడానికి. కొందరు ఇల్లు పాడైపోతుందని వచ్చిన ఈ పేరంటాళ్ళలని అరుగు మీదే కూర్చోబెట్టేవారు గోను సంచీ వేసి... కొందరు మొహం చిట్లించుకుంటే, కొందరు గడుసుగా 'చురక ' వేసేవారు.

ఒకసారి మా మామ్మ చుట్టాలావిడ ఆవిడ కోడలికి కొత్త నోమని మా మామ్మ ని పూజకి, తాంబూలానికి, సపరివార సమేతంగా భోజనానికి రమ్మని పిలిచింది. నన్ను తోడు తీసుకొని మా మామ్మ ఆ పూజకు వెళ్ళింది. మా అమ్మ నన్ను పంపిస్తూ " తినడానికి తప్ప నోరు తెరవకు " అని చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఆ అత్తగారు పాత సినిమాలలో 'హేమలత ' లా ఉంది. కోడలు కొత్త సినిమాలోని సన్నగా ఉంటుంది 'అల్లుడుగారు వచ్చారు " లో 'కౌసల్య ' లా ఉంది. ఇంతలో పక్కన ఎవరో వాయనానికి రమ్మంటే నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామ్మ.

ఆ అత్తగారు కోడలి చేత పూజ చేయిస్తున్నారు. " శ్రావణ మాసే శుక్ల పక్షే... 'ధర్మపత్నీ సమేత ' " అని చదవగానే ఆ కోడలు తల పైకెత్తి " అత్తయ్యగారు! ధర్మపత్ని అని అనకూడదండీ.. "
" ఇక్కడ అలానే ఉంది " అని పుస్తకం వైపు చూసింది అత్తగారు
" అక్కడ అలానే ఉంటుంది కానీ మనము చదవకూడదండి " కోడలు
" చదవకూడదన్నప్పుడు ఎందుకు రాస్తాడు? " బ్రుకుటి ముడి వేసి అత్తగారు
లాజిక్కే...
" అది మగవారిని ఉద్దేశించి రాసిందండి , మనకి కాదు " కోడలు
మనమైతే 'ధర్మపతీ సమేత అనుకోవాలేమో " అని అంద్దామనుకున్నా.. ఇంతలో ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి నాలో నుండి సినిమాల్లో చూపించినట్టు వచ్చి "విచ్చి నీకు డైలాగులు లేవు, నోరు మూసుకో " అని చెప్పింది.

 
" ఇవ్వాళ కాదు నిన్న కాదు నేను కాపురానికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతోంది.. ఇలాగే చదువుతున్నాను " అత్తగారు కాస్త రొప్పుతూ

 
" నా దేవుడు నేను ఎలా చదివినా నా మాట వింటాడు " అని ఇంక మాట్లాడే చాన్స్ కోడలికి ఇవ్వకుండా పుస్తకం వైపు చూస్తూ చదవటం ప్రారంభించింది.

 
వాదించడం దండగ అనుకుందేమో కోడలు నా వైపు చూసింది, అదే టైం కి అత్తగారు కూడా చూసింది " నాకేమీ తెలియదు.. నాకు తెలుగు రాదు నేను సిటి లో చదువుతున్నానుగా (మా టైమ్ నుండి తెలుగు రాదు అని చెప్పుకోవడం ఫాషనే) " అని ఒక అమాయకపు మొహం పెట్టేశాను. ఏం మాట్లాడినా సపరివార సమేతంగా పిలిచిన ఆవిడ 'మేత ' పెట్టకుండా పంపేస్తుందేమో అని భయం. పులిహోర, కొబ్బరికాయ రోటి పచ్చడి, గారెలు, ఆవళ్ళు ఎదురుగా కనిపించాయి.. నోరూరింది.. నోరు మూసేశా...

 
పూజ అంతా అయ్యింది. మా మామ్మ సినిమాలో పోలీస్ లాగ చివర్లో వచ్చింది. అక్కడ జరిగింది ఏవీ తెలియదు ఆవిడకి పాపం.

 
" చూడు కావుడప్పా! ఈ అగ్రహారం లో నేను ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాను, ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా.. " అని కోడలికి చెప్పాల్సినవన్నీ మా మామ్మని అడ్డుపెట్టుకొని చెప్పేసింది.

 
ఇవేవి తెలియని మా మామ్మ వాయనము తీసుకొని నన్ను తీసుకొని ఇంటికి చక్కావచ్చింది. ఇంటి కొచ్చాక కొంచం అర్ధయ్యి అర్ధమవ్వనట్టు మా మామ్మకి, అమ్మకి చెప్పాను. మా మామ్మ " ఎవరికీ చెప్పకు బాగోదు " అని ,
మా అమ్మ " ఇంక పేరంటాలు పెత్తనాలు అంటూ అందరిళ్లకి వెళ్ళకు " అని వార్నింగు ఇవ్వబడ్డాయి.

 
మా మామ్మ చెప్పినట్టే నేను ఎవరికీ చెప్పలేదు... ఇంతవరకు.. !!!



Saturday, August 15, 2015

భారత మాతకు జేజేలు

భారతగణతంత్రదినోత్సవం.. ఈ పేరు చిన్నప్పుడు ఒకరోజంతా వల్లెవెయ్యగా వెయ్యగా తప్పులు లేకుండా 'ణ ' ని ' న ' గా కాకుండా 'ణ " గా పలకడం వచ్చింది. స్కూల్లో ప్రతి సంవత్సరం జండా వందనం, పిల్లల చేత మాచ్ ఫాస్ట్ చేయించేవారు. అదో సంబడంగా ఉండేది. ఒకసారి మా క్లాస్ పిల్లల చేత పాట పాడించాలని టిచర్ అనుకొన్నారు. వెంటనే మా క్లాస్లో ఒక అబ్బాయి " నేను పాడతా " అని తన పేరు ఇచ్చాడు. " ఏం పాట పాడతావు " అని టిచర్ అడగగా, "భారత మాతకు జేజేలు " అని చెప్పాడు.


సాయంత్రం టీచర్ మళ్ళీ మా క్లాస్ కి వచ్చి, ఆ అబ్బాయి పాడితే వెనకాల మేమందరం ( ఓ పదిహేను మంది) అతని పాడిందే మళ్ళీ రిపీట్ చెయ్యాలని(కోరస్ అని అంటారని తరవాత తెలిసింది) చెప్పారు. రోజు చివరి పిరీడ్ మాకు రిహార్సిల్స్ ఉండేది. అలా ఒక నాలుగు రోజులు ప్రాక్టీస్ చేశాము. ప్రాక్టీసు చెయ్యడానికి ఏముంది? ఆ అబ్బాయి పాడిందే పడెయ్యాలి అంతేగా...

 

 

గణతంత్రదినోత్సవం రానే వచ్చింది. కొందరు తెల్లటి చుడీదార్లు, కొందరు కాషాయం, కొందరు పచ్చవి వేసుకొని వచ్చాము. అందరికి సొంత ఇంట్లో పండగలా ఉంది ఆ వాతావర్ణము. మాకు పాడే అవకాశం వచ్చింది. స్టేజి ఎక్కి అందరం పేరంటానికి వచిన ముత్తైదువులా బుద్ధిగా పాడేయ్యడం మొదలెట్టాము. పాట మొదలెట్టగానే జనాలు నవ్వులు.. అబ్బే ఇవన్నీ పట్టించుకుంటే కాన్సెంట్రేషన్ దెబ్బ తినేస్తుంది అని కళ్ళు మూసుకొని మరీ నిష్టగా పాడేశాము. ఇంక స్టేజ్ దిగి కిందకి రాగానే టీచర్ మమ్మలందరినీ క్లాస్ రూం లోకి రమ్మన్నారు. "ఇప్పుడా పొగడ్తలెందుకు లెండి " అని మనసులో మొహమాటంగా అనేసుకొని.. ఆ పొగడ్తలని ఊహించుకొంటూ క్లాస్ రూం కి వెళ్ళాము. అంతే... అందర్ని వరసగా నిల్చోబెట్టి తిట్టడం మొదలెట్టారు. ముందు పాడిన అబ్బాయినైతే చెవి మెలేసి మరీ తిట్టారు. "మీ అందరూ గొర్రెలా పాడెయ్యడమే? ఏం పాడుతున్నారో కాస్త ఆలోచన లేదా? " అని మళ్ళీ మా గొర్రెల బ్యాచ్ ని అన్నారు ( ఆ పేరు ఆవిడే పెట్టారు). మాకేం తెలుసు? మీరేగా చెప్పింది " ఈ అబ్బాయి పాడింది మీరూ పాడండి " అని, ఇది అందరం మనసులోనే అనుకొన్నాము.. బయటకు మాట పెగల్లేదు.

 

 

ఇంతకీ తప్పేంటి పాడినదాంట్లో? "భారత మాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు ' బదులుగా "బంజరు భూమికి జేజేలు " అన్నాము అంతే!

Thursday, February 26, 2015

మండా సుధా రాణి


శ్రీమతి మండా సుధా రాణి గారు..  ఇప్పటి సంగీత విదుషీమణులలో అగ్రగణ్యురాలు. పల్లవి పాడటంలో ప్రవీణురాలు.  ప్రస్తుతం విశాఖలో ఎందరో సంగీత అభ్యాసకులకు మార్గదర్శిగా ఉంటున్నారు.  

 


ఈవిడ 1964 లో విజయనగరం లో శ్రీమతి కల్యాణి, రమణ మూర్తి గార్ల దంపతులకు ఆ వీణాపాణి సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్పబడుతొన్న వసంత పంచమి నాడు జన్మించారు. విజయనగరం మహరాజా కాలేజి నుండి బి.ఎస్.సి. పట్టభద్రులైనారు. ఆ తరువాత  ఆంధ్ర యూనివర్సిటిలో సంగీత డిప్లమా చేసి డీస్టిన్షన్ లో పాస్ అయ్యారు. 1993 లో  ఎం.ఏ మ్యూజిక్ లో ఆంధ్ర యూనివర్సిటి ఫస్ట్ వచ్చారు.  వీరు ప్రాధమిక స్థాయిలో శ్రీమాన్ కె.రంగాచార్యులు, శ్రీమతి శేషుమణిగార్ల వద్ద సంగీత అభ్యాసము చేశారు. అటు పిమ్మట శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు గారి వద్ద శిష్యరికము చేశారు. 1989 లో డాక్టర్. రామ్ ప్రసాద్ గారితో వివాహమైనది. వారికి ఒక అమ్మాయి పేరు ప్రత్యూష శృతి రవళి.   వారి అమ్మాయి తల్లికి తగిన తనయ. సంగీతములోనూ ఆవిడనే అనుసరిస్తోంది. 

 

ఒకే సమయములో ఖండగతిలో ఘాతలు వేస్తూ చతురస్ర క్రియలతో తాన వర్ణాన్ని రెండు కాలాలలో పాడటములో ఆవిడ నిపుణురాలు. ఇలాంటి ప్రక్రియలు చేయాలంటే మనసుకు, మెదడుకు మద్య చాలా వతిరేకత ఉంటుంది. దాన్ని అధికమించి ఇటు మనసును, మెదడును ఆధీనములో ఉంచి ఇలాంటి ప్రయోగము చేసిన సవ్యసాచి సుధారాణి గారు.  


గతి, తాళాలమీద వీరికి ఈ మహాధికారం ఉండడంవల్లే, పద్దెనిమిదేళ్ళ పినవయసులోనే   మద్రాసు సంగీత అకాడమీ నుంచి పల్లవి పాడడంలో అవార్డు పొందారు. పందొమ్మిదేళ్ళ వయసులో చెన్నైలోని శ్రీ కృష్ణ గాన సభవారు  వీరి పల్లవి గానానికి అవార్డుని ప్రదానం చేశారు. 1987, 1992లలో కనె్సర్ట్ అవార్డులను మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి పొందారు.  

అందరికీ తెలిసిన ప్రఖ్యాతి గాంచిన రాగాలలోనే కాకుండా చాలా తక్కువ మందికి తెలిసిన అపురూపమైన రాగాలలో ఎన్నో కృతులు పాడి వీరికి వీరే సాటి అని నిరూపించుకున్నారు. ఇటువంటి ప్రయోగాలతో ఆవిడ కచేరీలకు  ఒక ప్రత్యేకత ఏర్పడింది.


కర్ణాటక సంగీతంలో రెండు ముఖ్యభాగాలు. మొదటిది సాహిత్యంతో కూడిన రచనలను గానం చేయడం (అప్లైడ్ మ్యూజిక్), రెండవది సాహిత్యం లేకుండానే చేసే రాగాలస్వరాలు ప్రస్తారం (ప్యూర్ మ్యూజిక్). ఈ రెండింటిలోనూ కళాకారుని మనోధర్మం, వ్యక్తిత్వం ప్రకటిత మౌతుంటాయి. చిన్న చిన్న గమకాలతో, ఆలాపనలతో మేళకర్త రాగాల నుండి మరెన్నో రాగాలు పుట్టించవచ్చు అని వారి అభిప్రాయము. ఇలా కొత్త రాగాలు కనిపెట్టాలంటే మాత్రం ఎల్లప్పుడు సంగీత సాధన చేస్తూ ఉండాలని ఆవిడ స్వయం గా చిన్నారులతో చెప్పారు. 

 

‘మనోధర్మ సంగీతానికి కల్పిత సంగీతం ఆధారం’ అన్న విషయంపై సమగ్రమైన రచన చేసి దాన్ని భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ మరియు సాంస్కృతిక శాఖలకు సమర్పించి దానికి గాను ఫెలోషిప్ని సంపాదించారు.


1980 లో వీరు ఆకాశ వాణి కళాకారిణిగా ఎంపికైనారు. 2009 లో టాప్ ఏ గ్రేడ్ గాయని గా గుర్తించబడ్డారు. ఆల్ ఇండియా రేడియో లో ఎన్నో సార్లు " సంగీత శిక్షణ " కార్యక్రమాలు నిర్వర్తించారు. మరెన్నో సార్లు "భక్తి రంజని" లో పాడారు. టి.టి.డి వారి నాద నీరాజనము లో కూడా శిష్యులతో కలిసి ఆ దేవదేవుడికి స్వరాభిషేకము చేశారు.  సుధా రాణి మన దేశములోనే కాక  కాక అమెరికాలోని క్లీవ్ల్యాండ్, క్యాలిఫోర్నియా (సిలికాన్ ఆంధ్ర), సియాటిల్, షికాగో, డెట్రాయిట్, ర్యాలీ, కాన్సాస్ సిటీ, కొలంబస్ లలో  కచ్చేరీలు చేశారు. 


కచేరీలు ఇవ్వడమే కాదు సుధరాణి గారు  ఎన్నో సెమినార్ లు కూడా ఇచ్చారు. తెలుగు యూనివర్సిటి వారిచే నిర్వహింప బడిన సెమినార్ లో " షట్ కళా పల్లవి" అనే అంశము పై సెమినార్ ఇచ్చారు. 


' శ్యామ శాస్త్రి గారి స్వరజతుల '  మీద ఒక సెమినార్  ఆంధ్రా యూనివర్సిటిలో  నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మూజిక్ లో ఇచ్చారు. త్యాగరాజ ఆరాధనోత్సవాలలో "ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి సంగీతం ' గురించి గోష్ఠి  ఇచ్చారు. 


అవార్డులు బిరుదులు :


' గాన కళా భారతి ' --- శ్రీ భారతి గాన సభ ( అమాపురం 2000)

' సునంద సుధా నిధి '---  గాయక సార్వభౌమ సంగీతం పరిషత్ (విజయవాడ 2008)

' సంగీత సుధా నిధి ' --- విజయ త్యాగరాజ సభ (విశాఖ పట్టణం 2009) 

' విజయ సంగీత రత్న '---  విజయ నగర్ ఫైన్ ఆర్ట్స్ (హైదరాబాద్ 2006)


సంగీత కల్పవల్లిగా ఉంటూ ఎందరికో సంగీత శిక్షణ ఇస్తూ గొప్ప విద్వాంసులు గా తీర్చి దిద్దుతున్నారు. "మీ అమ్మాయి మీ సంగీత వారసురాలా? " అని అడిగితే " సంగీతం నేర్చుకొంటున్న వారంతా సంగీతానికి వారసులే, నా కూతురే కాదు ఇక్కడ ఉన్న పిల్లలంతా (శిష్యులంతా) నా వారసులే " అని జావాబిచ్చిన గొప్ప వ్యక్తిత్వము గల మహోన్నత   వ్యక్తి ఆవిడ. 


ఆవిడ చేస్తోన్న కృషి ఎంతో శ్లాఘనీయమైనది. అందుకు భగవంతుడు ఆవిడకు శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాము.  


మండా సుధారాణి మహిత సంగీతజ్ఞ

షట్కాల పల్లవీ విద్యలో సర్వజ్ఞ

తన వంటి శిష్యులను  సంగీత లోకాన

కందించు ఆమె కిదె నిత్యాభివందనము. 







Monday, February 16, 2015

ఎందరో మహానుభావులు

నాకు తెలిసిన ఈ చిన్ని ప్రపంచం లో నేను చూసిన మహానుభావులు ఎందరో! వారితో నా అనుభవాలు జ్ఞాపకాలు ఇలా బద్రంగా పొందుపరచుకున్నాను.