Search This Blog

Friday, September 18, 2015

శ్రావణ మాసం

చిన్నప్పుడు శ్రావణ మాసం అనగానే పేరంటాలు, చామంతులతో పూల జడలు, మొగలి పువ్వు వాసనలు, వాయినం శనగలు మరునాడు వేయించుకొని తినడము.. ఇంతే! మా ఊరిలో పేరంటము అంటే మా మామ్మ, చినమామ్మ మధ్యాహ్నం మూడున్నరకే ఇంట్లో వాళ్ళకి ' టి ' ఇచ్చి బయలుదేరేవారు. ఈ మామ్మలది ఒక బాచ్ , ఆ తరవాత అమ్మలది ఇంకో బాచ్ బయలుదేరేది. శ్రావణ భాద్రపదాలంటే వర్షకాలాలే! అందులోనూ మా ఊరు ఎర్ర మట్టి, రోడ్లు కూడా సరిగ్గా ఉండవు గతుకుల రోడ్లు. ఇలా వర్షం పడితే ప్రతీ ఇంటి ముందు ఒక నీళ్ళ బాల్చి పెట్టేవారు కాళ్ళు కడుక్కోడానికి. ఆడవాళ్ళ కాళ్ళకి చక్కగా పసుపు రాసి, మెడకి గంధము పూసి, పన్నీరు (తినేది కాదు) చల్లి, కాటుక ఇచ్చేవారు. పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళు ఇలా ప్రతీ ఇంట్లో కాటుకా చక్కగా పెట్టుకొని ఇంటికొచ్చేసరికి కళ్ళకాటుక మొహం అంతా పాకేసేలా చేసుకునేవారు. . "పూట పేరంటానికి మొహం అంతా కాటుక " అంటే ఇదేనేమో! కాళ్ళకి పసుపు రాయించుకొని ఇంటికి ఇంటికి వెళ్తూ ఉన్న పేరంటాల్ల కాళ్ళకి ముందు రోజు పడిన వర్షంతో తడిసిన ఎర్రమట్టితో పారాణి దిద్దేది భూదేవి.

 

పిల్లలకి చామంతి పూలజడ వేసేవారు.. అదీ గట్టిగా దురద పుట్టినా గోక్కోడానికి లేకుండా. మొగలి రేకు (సీరియల్ కాదు) జడ మీద పెట్టి ఆ పైన ఈ చామంతులతో కుట్టిన జడ, ఆ రెండు పూల వాసనలు, పసుపు పన్నీరు వాసనతో కలిసి, ఆ పైన శనగల వాయినం కలుపుకొని అదో రకమైన సువాసనలొస్తుండేది శ్రావణ మాసం. కొత్త పెళ్ళికూతుర్ల కొత్త కొత్త పట్టుచీరలు, బంగారు నగలు... కొత్త అందాన్ని తెచ్చేవి. ఇంట్లో మండువాలో వర్షం ధార పెద్ద శబ్ధం చేస్తూ పడుతుంటే, పేరంటానికి వచ్చిన ఆడ లేడిసు అంత కన్నా గట్టిగా కబుర్లు చెప్పేసుకునేవారు. ఈ మామ్మ ల వెనకాల ఒక చిన్న బకెట్టు పట్టుకొని నేనూ బయలుదేరేదాన్ని, శనగలు అందులో వేసుకోడానికి. కొందరు ఇల్లు పాడైపోతుందని వచ్చిన ఈ పేరంటాళ్ళలని అరుగు మీదే కూర్చోబెట్టేవారు గోను సంచీ వేసి... కొందరు మొహం చిట్లించుకుంటే, కొందరు గడుసుగా 'చురక ' వేసేవారు.

ఒకసారి మా మామ్మ చుట్టాలావిడ ఆవిడ కోడలికి కొత్త నోమని మా మామ్మ ని పూజకి, తాంబూలానికి, సపరివార సమేతంగా భోజనానికి రమ్మని పిలిచింది. నన్ను తోడు తీసుకొని మా మామ్మ ఆ పూజకు వెళ్ళింది. మా అమ్మ నన్ను పంపిస్తూ " తినడానికి తప్ప నోరు తెరవకు " అని చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఆ అత్తగారు పాత సినిమాలలో 'హేమలత ' లా ఉంది. కోడలు కొత్త సినిమాలోని సన్నగా ఉంటుంది 'అల్లుడుగారు వచ్చారు " లో 'కౌసల్య ' లా ఉంది. ఇంతలో పక్కన ఎవరో వాయనానికి రమ్మంటే నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామ్మ.

ఆ అత్తగారు కోడలి చేత పూజ చేయిస్తున్నారు. " శ్రావణ మాసే శుక్ల పక్షే... 'ధర్మపత్నీ సమేత ' " అని చదవగానే ఆ కోడలు తల పైకెత్తి " అత్తయ్యగారు! ధర్మపత్ని అని అనకూడదండీ.. "
" ఇక్కడ అలానే ఉంది " అని పుస్తకం వైపు చూసింది అత్తగారు
" అక్కడ అలానే ఉంటుంది కానీ మనము చదవకూడదండి " కోడలు
" చదవకూడదన్నప్పుడు ఎందుకు రాస్తాడు? " బ్రుకుటి ముడి వేసి అత్తగారు
లాజిక్కే...
" అది మగవారిని ఉద్దేశించి రాసిందండి , మనకి కాదు " కోడలు
మనమైతే 'ధర్మపతీ సమేత అనుకోవాలేమో " అని అంద్దామనుకున్నా.. ఇంతలో ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి నాలో నుండి సినిమాల్లో చూపించినట్టు వచ్చి "విచ్చి నీకు డైలాగులు లేవు, నోరు మూసుకో " అని చెప్పింది.

 
" ఇవ్వాళ కాదు నిన్న కాదు నేను కాపురానికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతోంది.. ఇలాగే చదువుతున్నాను " అత్తగారు కాస్త రొప్పుతూ

 
" నా దేవుడు నేను ఎలా చదివినా నా మాట వింటాడు " అని ఇంక మాట్లాడే చాన్స్ కోడలికి ఇవ్వకుండా పుస్తకం వైపు చూస్తూ చదవటం ప్రారంభించింది.

 
వాదించడం దండగ అనుకుందేమో కోడలు నా వైపు చూసింది, అదే టైం కి అత్తగారు కూడా చూసింది " నాకేమీ తెలియదు.. నాకు తెలుగు రాదు నేను సిటి లో చదువుతున్నానుగా (మా టైమ్ నుండి తెలుగు రాదు అని చెప్పుకోవడం ఫాషనే) " అని ఒక అమాయకపు మొహం పెట్టేశాను. ఏం మాట్లాడినా సపరివార సమేతంగా పిలిచిన ఆవిడ 'మేత ' పెట్టకుండా పంపేస్తుందేమో అని భయం. పులిహోర, కొబ్బరికాయ రోటి పచ్చడి, గారెలు, ఆవళ్ళు ఎదురుగా కనిపించాయి.. నోరూరింది.. నోరు మూసేశా...

 
పూజ అంతా అయ్యింది. మా మామ్మ సినిమాలో పోలీస్ లాగ చివర్లో వచ్చింది. అక్కడ జరిగింది ఏవీ తెలియదు ఆవిడకి పాపం.

 
" చూడు కావుడప్పా! ఈ అగ్రహారం లో నేను ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాను, ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా.. " అని కోడలికి చెప్పాల్సినవన్నీ మా మామ్మని అడ్డుపెట్టుకొని చెప్పేసింది.

 
ఇవేవి తెలియని మా మామ్మ వాయనము తీసుకొని నన్ను తీసుకొని ఇంటికి చక్కావచ్చింది. ఇంటి కొచ్చాక కొంచం అర్ధయ్యి అర్ధమవ్వనట్టు మా మామ్మకి, అమ్మకి చెప్పాను. మా మామ్మ " ఎవరికీ చెప్పకు బాగోదు " అని ,
మా అమ్మ " ఇంక పేరంటాలు పెత్తనాలు అంటూ అందరిళ్లకి వెళ్ళకు " అని వార్నింగు ఇవ్వబడ్డాయి.

 
మా మామ్మ చెప్పినట్టే నేను ఎవరికీ చెప్పలేదు... ఇంతవరకు.. !!!