Search This Blog

Friday, April 8, 2016

రాగాలు - సరాగాలు

శివుని ఢమరకము నుండి  అకార, ఉకార, మకారం యొక్క కలయిక అయిన 'ఓం ' కారము పుట్టినది. ఈ ఓంకారాన్నిఅనుష్ఠించడంలో, అనుసంధానించడంలోనూ నాదము వస్తుంది. ఆ నాదమే సంగీతానికి మూలము. అందుకే శివున్ని 'నాదా తనుమనిశం " అని కొడియాడాడు త్యాగరాజ స్వామి. ప్రకృతిలోని జంతువుల పక్షుల అరుపుల నుండి సప్త స్వరాలు పుట్టించాడు మానవుడు. ఈ సప్త స్వరాలతో సామవేద సారమైన సంగీతము పుట్టింది.


స : షఢ్జం అంటారు అంటే సముద్రము.  ఈ షడ్జం నెమలి క్రేంకారం నుండి ఉద్భవించింది. దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ.

రి : ఋషభం అంటే ఎద్దు. ఋషబం ఎద్దు రెంకె నుండి ఉద్భవించిన ధ్వని. అధిష్టాన దేవత అగ్ని.


గ : గాంధర్వం అంటే గగనము. మేక అరుపు నుండి ఉద్భవించిన ధ్వని , అధిష్టాన దేవత రుద్రుడు.


మ : మధ్యమం అంటే సమ దూరములో ఉండేది. క్రౌంచపక్షి కూత నుండి వచ్చిన ధ్వని , అధిష్టాన దేవత విష్ణువు.



ప: పంచమం అంటే ఐదవది, కోయిల కూత నుండి ఉద్భవించింది. అధిష్టాన దేవత నారదుడు.


ధ :  ధైవతం  అంటే భూమి. గుర్రం సకిలింత నుండి పుట్టిన ధ్వని, అధిష్టాన దేవత వినాయకుడు.


ని : నిషాదం అంటే బోయవాడు. ఏనుగు ఘీంకారం నుండి పుట్టిన ధ్వని. అధిష్టాన దేవత సూర్యుడు.


ఆరోహణ : తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.

 ఉదా:  స  రి  గ  మ  ప  ధ  ని  స.


అవరోహణ :  ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.


 ఉదా:  స ని ధ ప మ గ రి స.

ఈ ఆరోహణ , అవరోహణలనే మూర్ఛన అంటారు.



యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః |
రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః||



స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల మనస్సును  ఆనందింపచేయునట్టి శబ్ధమును 'రాగము ' అంటారు.
ఈ స్వరాలని చక్కగా అలంకరించినట్టుగా ఒక వరుసలో నిలిపి వీనుల విందు  చేసేదే  'రాగము '. రాగాలలో ముఖ్యమైనవి 72 జనక రాగాలు .ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమఖి, పురందర దాసు గారు.
జనక రాగాలనే ‘మేళకర్త '  రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక, ఆధార , మూల , ప్రాతిపదిక  రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణ రాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట. 



ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.



ఎన్నో రాగాలకు మూలము ఈ జనక రాగాలే. ఇలా పుట్టిన కొత్త రాగాలని జన్య రాగాలు (చైల్డ్ రాగాస్) అంటారు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు. జనక రాగాల నుండి అనంత మైన జన్య రాగాలు పుట్టాయి. ఇలా ఎన్నో జన్య రాగాలను సృష్టించినది త్యాగ రాజ స్వామి వారు. చిన్న చిన్న మార్పులతో ఎంతో చక్కనైనా రాగాలు పుట్టించారు. కొన్ని సార్లు జనక రాగాల కన్న జన్య రాగాలే చాలా ఆహ్లాదంగా ఉంటాయి. తల్లితండ్రుల కన్న పిల్లలు ఎక్కువ అందంగా ఉన్నట్లు.  ఒక జనక రాగము నుండి ఎన్నైనా జన్య రాగాలు ఉద్భవించవచ్చు. అటువంటి జన్య రాగాలు అనంతాలు. కనీసం నాలుగు స్వరాలతో ఒక రాగం ఏర్పడుతుందంటారు. కానీ డా. బాలమురళీకృష్ణ " స మ1 ప (మూడే మూడు) " స్వరాలతో ' సర్వశ్రీ ' అనే స్వంత రాగాన్ని సృష్టించి అద్భుతంగా కీర్తన (స్వరకల్పన చేసి మరీ) పాడారు.


కర్ణాటక సంగీతములో 22 వ మేళకర్త రాగము ఖరహర ప్రియ. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, శ్రీ, ఉదయరవిచంద్రిక, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ,   బృందావన సారంగ,శివరంజని, కాఫీ, మరియు శ్రీరంజని.