Search This Blog

Thursday, October 26, 2017

కాదేది దొంగతనానికి అనర్హం

ఏంటో ఈ రోజు పొద్దుటే నాకు మా ఊరిలో "పాపి ' గుర్తుకొచ్చింది. పాపి ఎవరూ? ఆ వృతాంతం ఎట్టిది? అనగా... పాప మా ఊరిలో పొలం పనులు చేసుకొనే అమ్మాయి.. యువతి.. అన్న మాట. అసలు పేరు ఏంటో తెలియదు. కానీ ఆమె చేసే దొంగతనాలకు ఆ ఊరి ప్రజలందరూ ఆమెని 'పాపి " అని కసిగా పిలుచుకొనేవారు. పొద్దుట ఎవరింటి ముందు నుంచేనా వెళ్తే చాలు... సాయంత్రానికి వారింట్లో  వస్తువులు కనపడేవి కావు. కాదేది దొంగతనానికి అనర్హం అనే రీతిలో దొంగతనం చేసేది 'పాపి '.




అందరి ఇళ్ళల్లో దొంగతనం చేసే పాపి మనసు ఆదే ఊర్లో ఉంటొన్న 'ఇటికెడు ' దొంగలించేశాడు.  😍ఇటికెడు పాపి ని మించిన దొంగ కావడంతో వారి సంసారం 'మూడు దొంగతనాలు ఆరు దోపిడీలుగా ' సాగింది. వారి దోపీడీలకు చిహ్నాలుగా ఒక కొడుకు, ఇద్దరు కుతుర్లు... ఇలా ముగ్గురు పిల్లలూ పుట్టారు. 😍😍😍🤩 వాళ్ళ సుపుత్రుడు పుడుతూనే నర్స్ చేతి ఉంగరం దొంగలించేశాడని చెప్పుకుంటారు. 😎



ఒకసారి మా ఇంట్లో పప్పు గిన్నె పోయింది. మా మామ్మ పరవాన్నముతో ఆ గిన్నె పాపికి ఇచ్చింది. ఇంక అంతే... గిన్నె ఇవ్వలేదు సరిగదా... " గిన్నె ఎప్పుడిచ్చారు " అని ఎదురు ప్రశ్న వేసింది పాపి. ఇక తప్పేది లేదని ఒకసారి వీధిలోకి వచ్చిన 'పేరూరు ' ఇత్తెడి గిన్నెల అతను వస్తే కొనడానికి అనుకుంది మా మామ్మ. ఆ ఇత్తెడి గిన్నెల అతను కొన్ని గిన్నెలు చూపించాడు, ఒక గిన్నే అచ్చు మా ఇంట్లో పోయిన పప్పు గిన్నెలా ఉందని అదే గిన్నె తీసింది మా మామ్మ. దాని మీద పేరు చూసి అవాక్కయ్యింది. " కొ|| సు|| శాస్త్రి " అని ఉంది. అది మా తాతగారి పేరు. నా పోస్ట్లు తిరిగి మళ్ళీ నాకే వాట్స్ ఆప్ మేసేజ్ వచ్చినట్టు మా పప్పు గిన్నె మళ్ళీ మాకే వచ్చింది.😉 ఆ గిన్నె వివరాలు ఆ 'పేరూరి ఇత్తడి సామాన్ల " అతన్ని అడగగా, అది 'పాపి ' అమ్మినట్టు తెలిసింది. 'పాపి ' ని అడిగితే అంత నోరేసుకొని మరీ పోట్లాడేది. దానితో గొడవ ఎందుకులే అని ఇలానే చాలా మంది వదిలేసేవారు.


ఒకసారి దొంగతనానికి వెళ్ళిన ఇటికెడు, వాడి కొడుకు ఆ పొలంలో కరంటు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఊరి జనాల శాపానికే వాళ్ళు పోయారని 'పాపి ' ఇంకా కసిగా దొంగతనాలు చేయడం మొదలెట్టింది. పాపి దొంగతనాల్కి ఎక్కడా అదుపు ఆపు లేకుండా పోయింది ఆ ఊర్లో!! ఒకసారి నరాయణ మూర్తి అనే రైతు అంత వరకు అతని అరటి తోట కి సేవ చేసుకొని అన్నం తినడానికి వెళ్ళాడు, అన్నం తిని వచ్చి చూస్తే అరటి గెలలు మాయం. సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి 'పాపి ' ని వెతుకుంటూ వెళ్తే అప్పటికే ఆ అరటి తోటలో గెలలు తీసేసి మార్కెట్టు లో అమ్మేసి ఆ డబ్బుతో 'కల్లు ' తాగేసి ఇంట్లో దొర్లుతూ ఉంది 'పాపి '. అసలే 'పాపి ' పైగా 'కల్లు ' తాగింది... ఇంక తన జోలికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని ఆ రైతు ఇంటి ముఖం పట్టాడు. 🤬🤬



ఇంక ఊరు జనం తట్టుకులేక పంచాయతిలో వారి గోడు వెళ్లగక్కుకుంటే 'పాపి ' కి ఊరి నుంచి బహీష్కరింపు వేశారు పంచాయతి వారు. కొన్ని రోజులకి తాగి తాగి మతి స్థిమితం తప్పింది పాపికి. పాపం ఆమె కూతుర్లు ఆమెని బానే చూసుకోసాగారు. రోజూ ఇంట్లో కనీసం పది రూపాయిలైనా ఆమెకు కనిపించెలా పెట్టేవారు. ఆ డబ్బు ఎవరూ చూడకుండా దొంగలించేసేది 'పాపి ' ఆ డబ్బు తిరిగి కూతురికి ఇచ్చి దానితోటే కూరలు కొనమనేది. ఏ వస్తువూ దొంగతనం చేయలేని రోజున ఏవీ తినేది కాదు పాపి. మంచం మీద పడ్డాక కూడా చేతిలో ఎంతో కొంత డబ్బు పెడితే కానీ మందు వేసుకొనేది కాదు పాపి. పోయే ముందు కూడా చేతిలో పది రూపాయిలు పెడితే కానీ ప్రాణం పోలేదు పాపికి!!  😥



ఇంతకీ పాపి ఎందుకు గుర్తొచ్చింది అనేగా మీ ప్రశ్న. పొద్దుట వీధి గుమ్మం తలుపు తీయగానే ఒక తాడు వేళాడింది. అది భగత్ సింగ్ సినిమాలో అజయ్ దేవగన్ కి మొహం మీద వేసినట్టు నా మొహం మీదకి ఉంది. కెవ్వు మని అరవలేదు కాని భయపడ్డా.... ఆ తాడు చూసి పాము అనుకొని... తీరా తేరుకొని చూస్తే అది గుమ్మానికి కట్టిన గుమ్మెడి కాయకి కట్టిన తాడు. ఎవరో దిష్టి గుమ్మెడి కాయ దొబ్బేశారు. ఈ పాటికి అది ఏ పులుస్లోనో ముక్కయ్యి ఉంటుంది. కాదేది దొంగతనానికి అనర్హం....!!!😁😁

 

 

 














😁

Monday, October 9, 2017

గరికిపాటి నరసింహారావు గారు

" కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి " అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చే వారు ఇన్నాళ్ళకు దొరికారు.  ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువత లో ఒక వివకానందుకు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం.  ప్రస్తుతం సమాజం లో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది.  ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీక.  నిద్రాణమైన యువత శక్తిని మేల్కొలిపే నవరసగూళికలు... వారి మాటలు. 



వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. వారి గురించి చెప్పడం ముంజేతి కంకణానికి అద్దం చూపడం లాంటిదే! కానీ వారి గురించి చెప్పడం లో చాలా ఆనందం ఉంది. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మిత్రులు పెద్దమనసుతో ఆశ్వాదిస్తారనే ఆశిస్తున్నాను.


 ఈ  సాహితీ రంగంలో అపార కృషి చేస్తున్న గరికిపాటి గారు కవి, పండితులు, అవధాని, గ్రంధ రచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రవచనకర్తగా రాణిస్తున్నారు. సమ్రుదఘోష నెపంతో  సాహితీ సముద్రాన్నే  అవపోసన పట్టేసిన అపర
అగస్త్యుడు, ఆ మహాత్ముడు దగ్గరకు   ఒక చిన్న లోటాతో వెళ్ళి అంతే నీరు తెచ్చుకోగలిగాను. 


బాల్యము :


గరికిపాటి నరసింహారావు గారు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వేంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎం. ఏ. , ఎం. ఫిల్, పి. హెచ్. డి.  చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. 


అవధానాలు :


తెలుగు, సంస్కృత  భాషలకే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసిన బహు కొద్ది మందిలో గరికపాటి వారు చెప్పుకోతగినవారు.  వీరు 275 అవధానాలు, ఎనిమిది అర్ధ శత అవధానాలు, ఎనిమిది శతావధానాలు, ఎనిమిది ద్వి శతావధానాలు చేశారు. ఒక మహాసహస్రావధానము చేసి వారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. మొదటి అవధానం 1994 సంవత్సరం విజయదశమి రోజు చేశారు. 


2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు.  2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ( NIIMS ) ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. ఆ విధంగా మేధా పరీక్షావధానం కూడా తొలిసారి నిర్వహించింది శ్రీ గరికపాటి వారే!  యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.


రచనలు :



 సాగరఘోష - పద్యకావ్యం

 మనభారతం- పద్యకావ్యం

 బాష్పగుఛ్ఛం- పద్య కవితా సంపుటి

 పల్లవి - పాటలు

  సహస్రభారతి

  ద్విశతావధానం

  ధార ధారణ

  కవితా ఖండికా శతావధానం

  మౌఖిక సాహిత్యం- పరిశోధనా కావ్యం

  పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు

  మా అమ్మ- లఘుకావ్యం

  అవధాన శతకం

  శతావధాన భాగ్యం- సంపూర్ణ శతావధానం

  శతావధాన విజయం- 101 పద్యాలు


పురస్కారాలు :


ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)

* కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)

* సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)

* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)

* 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం

* 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి

* 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)

* 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి

* భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం

* 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం

* 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం

* సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)

* తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012

* 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.


బిరుదులు :


కాకీనాడలో 1994 అక్టోబర్ 9 -10 (విజయదశమి) మొదటి శతావధానము  చేసినప్పుడు ధారణగా 75 పద్యాలు నలభై నిమిషాలలో చెప్పేశారు. అది చూసి ఆశ్చర్యపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మమ గారు వారికి "శతావధాన గీష్పతి "  అన్న బిరుదు ఇచ్చారు.  


ఆ తరవాత రెండో శతావధానం చేసినప్పుడు అంత కంటే తక్కువ వ్యవధిలో ధారణ పద్యాలు చెప్పారు.


కాకినాడలో జరిగిన "ఖండికా శతావధానం " చేసి, ప్రతీ పధ్యం లోనూ కవిత్వం వచ్చేలా చేసి, ఆ తరవాత ఆ 100 పద్యాలు ధారణ చేసినందుకు అబ్బురపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు గరికపాటివారికి " ధారణ లో నిన్ను మించినవారు లేరు  " అని మెచ్చుకున్నారుట.   


ఆ తరవాత సహస్రావధానంలో 750 పద్యాలు ధారణగా చెప్పినందుకు " ఈ విధంగా 750 పద్యాలు సహస్రావధానంలో అప్పజెప్పడం ఇదే ప్రధమం, ఏ బిరుదివ్వాలో తెలియడం లేదు.. ఈ ధారణకి సాటైన బిరుదేవీ లేదు..... అందుకే "ధారణ బ్రహ్మ రాక్షసుడు " అన్న బిరుదు ఇస్తున్నాను " అని అన్నారుట.


భక్తి టి.వి. లో మహాభారతం ప్రవచనం చెప్పినప్పుడు , శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు అభినందన సభలో శ్రీ గరికపాటి వారిని ప్రశంసించి " ప్రవచన కిరీటి " అన్న బిరుదు ఇచ్చారు.


వారికి "అవధాన శారద, అమెరికా అవధాన భారతి " అన్న బిరుదులు కూడా కలవు. ఈ బిరుదులన్నీ ఆయన్ను వరించి తరించాయి.


అష్టావ శతావధానలలో   ఘనాపాటి

నవీన భారత కురుక్షేత్రం లో చెమక్కులతో చురకలేసే ప్రవచన  కిరీటి...

ప్రవచనాలతో సమాజాన్ని జాగృతం చేయడం లో ఆయనకు ఆయనే సాటి

ఆయనే శ్రీ గరికపాటి...


ఆ గరికపాటి వారికి నా ఈ చిన్ని అక్షర గరిక నివేదన!!


కరిముఖునకు హితకారిణి

పరమోతృష్టకణజాల పాపరహితమౌ

'గరిక ' గృహనామధేయులు

సరస సహస్రావధాన శతవందనముల్ !!

 

 

 

 

 వారితో మాట్లాడినప్పుడు తెలుసుకొన్న విషయాలు...

 

 

 

Saturday, October 7, 2017

విధి బలీయమైనది

ఇంట్లో ఎవరూ లేరు, బయట చల్లని గాలి, చిన్న తుంపర.. ఆహా ఇలాంటి టైమ్ లో మంచి కాఫీ కప్పు తో అందమైన సినిమా చూస్తే ఎలా ఉంటుంది.. అలాంటి ఆలోచన రాగానే వంటింట్లోకి వెళ్ళి ఒక కప్పు కాఫీ తో హాల్ లోకి వచ్చి టి.వి ఆన్ చేశాను.


పడవలో మాధవి ( అదేనండి 70-80 దశకంలో సినిమాని ఏలేసిన అమ్మాయి), పక్కన ఒక బుడ్డోడు ఇంకా సినిమా పేర్లు పడుతున్నాయి... ఏదో 70 - 80 లో వచ్చిన సినిమా చూద్దాము అనుకున్నాను ....


భక్తప్రహ్లాద సినిమాలో కశ్యపుడు " విధి బలీయమైనది " అని అన్నప్పుడు ఏంటో అనుకున్నా.  విధి బలీయమైనది.. మనము బలహీనులమే అని గ్రహించడానికి ఒక్కొక్కరికి ఒక్కో సంధర్భం లో జ్ఞానోదయం అవుతుంది.


సూక్షంగా సినిమా :


మాధవికి కి పెళ్ళి అవుతూ ఉండగా పెళ్ళి కొడుకు కరంటు షాకు తో చనిపోతాడు, అందరూ మాధవిని తిడుతోంటే పక్కన ఉన్న ఒక బుడ్డోడు ఆవిడ మెళ్లో ఆ తాళి కట్టేస్తాడు. ఇద్దరూ వేరే ఊరికి వెళ్లి అక్కడే ఒక ఇంట్లో ఉంటారు. ఆవిడ ఒక రాధగా , ఆ బుడ్డోడు ఒక కృష్ణుడిగా ఊహించేసుకొని ఆరాదించేస్తూ ( ఆక్రోషించేస్తూ ) పాటలు కూడా పాడేసుకుంటుంది. ఆ బుడ్డోడు పెద్దైయ్యాక రాజేంద్ర ప్రసాద్. కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఈ మాధవి ఒక డాక్టర్ దగ్గర నర్స్ గా చేస్తుంది . ఆ డాక్టర్( శరత్ బాబు ) ఈవిడని ఇష్టపడతాడు. కానీ ఈవిడ తనకి పెళ్లైపోయిందని ఆ త్యాగరాజు ని రిజక్ట్ చేస్తుంది. అదేంటో శరత్ బాబు ప్రతీ సినిమాలోనూ త్యాగరాజే అవుతాడు (త్యాగాలు చేస్తూ).


అలా అలా సాగీ కథ చివర్లో నిజం చెప్పి మాధవి చచ్చి పోతుంది (అదేదో మొదట్లో చస్తే ఆరభం కాదిది అంతం అని సినిమా టైటిలు పెట్టేయచ్చు కదా).


ఒక కంటి తుడుపు చర్యా ఏమిటంటే, ఒక పాట... ఈ పాట నేను చిన్నప్పుడు రేడియో లో విన్నాను.. ఆ టైం లో నాకు చాలా నచ్చిన పాట అది " రాధా కృష్ణయ్య ఇటు రా రా కృష్ణయ్య " పాట సాహితీ పరం గా బాగుంది కానీ చూడటానికే చాలా ఛండాలంగా ఉంది.

ఆ పిల్లాడిని చూసి మాధవికీ కలిగే ఆరాధన చాలా వికారం గా ఉంటుంది.

ఈ సినిమా అయ్యేటప్పటికి పిల్లలు బయటనుండి తిరిగి వచ్చారు, రాగానే " ఏంటీ ఒంట్లో బాలేదా జ్వరం వచ్చిందా ? అలా ఉన్నావేంటి " అని అడిగారు.



కాబట్టి ఎవరూ ఈ సినిమా ఎప్పుడైన ఎక్కడైనా పొరపాటున ఫ్రీ గా వస్తోంది కదా అని మాత్రం చూడకండి. చేతిలో రిమోట్ ఉండగా మార్చలేకపోయావా? అనేగా మీ ప్రశ్న... మారిస్తే విధి బలీయమెందుకౌతుంది..


దేవుడా రక్షించు నా సినీ అభిమానులని

పగబట్టిన దర్శకుల నుండి...

పొగరెక్కిన ప్రోడ్యూసర్ల నుండి...

పైత్యమెక్కిన హీరోయిన్ల నుండి...

పిచ్చెక్కిన రచయితలనుండి...

ముదిరిపోయిన బాలనటుల నుండి...


ఇంతకీ సినిమా పేరు చెప్పలేదు కదా... మూడు ముళ్ల బంధం....


ఇంతటి తో శెలవు తీసుకుంటున్నాను, మళ్ళీ విధివక్రించి ఏవైనా చెత్త సినిమాలు చూస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను...

(ఇది కొన్ని రోజుల క్రితం చూసిన సినిమా.. జాగ్రత్త మళ్ళీ ఈ సినిమా వస్తోందని అడ్వటైజ్ మెంట్ వచ్చింది).

Friday, October 6, 2017

సినిమా

" హ్ష్.. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో " ఈ మాటా మాత్రం ఇప్పుడు స్పష్టంగా వినిపించింది. ఆ తరవాత ఇంకొన్ని మాటలు కొంచం గుణుకున్నట్లుగా వినపడ్డాయి. మధ్యాహ్నం 2 - 2:30 అవుతూ ఉంటుంది. జనవరీ నెల, మంచు ధ్యాన్యాలు కొలుస్తూ ఇంకా పుష్యమాసం వెళ్లలేదు. ఎండగా ఉందని పెరట్లో అరుగు మీద కూర్చొని నోట్స్ రాసుకుంటున్నాను. ఇంక ఆగలేక మెల్లగా నడుచుకుంటూ పశువుల పాక దాటాను, మాటలు అస్పష్టంగా గడ్డి మోపు వెనక నుంచి వస్తున్నాయి...


"పెళ్ళి చేసేసుకుంటే ఈ కష్టాలు తీరిపోతాయి బాబూ " అంది కనక

కనక మా ఇంటి పక్కన ఉంటుంది.


"అవును నాకూ అదే అనిపిస్తోంది " అని జవాబు... ఇచ్చింది వెంకట లక్ష్మి. వెంకట లక్ష్మి చాకలి మహాలక్ష్మి మనవరాలు.


" చక్కగా పెళ్లైతే మనకి కొత్త కొత్త చీరలు వస్తాయి, ఎవరివీ వెసుకోక్కలేదు, మనకో బీరువా ఉంటుంది, హాయిగా సాయంత్రం స్కూటర్ మీద సినిమాకి వెళ్ళొచ్చు, ఇప్పుడు నా బట్టలు మా చెల్లెల్లు వేసేసుకుంటున్నారు " అని వాపోయింది కనక.


"నావీ అంతే " అని వంత పాడింది వెంకట లక్ష్మి.. ఇది ఎప్పుడూ ఊర్లో వాళ్ళ బట్టలే వేసుకుంటుంది, దీనికి సెపరేటుగా బట్టలు ఎక్కడవి అని అనుకొని " అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ " అని నవ్వాను.  నన్ను చూసి ఇద్దరూ పరార్... 😘


ఈ విషయం మా తమ్ముడికీ, మా బాబాయ్ గారి అబ్బాయికి చెప్పి తెగ నవ్వుకున్నాము. వాళ్ళిద్దరూ సంక్రాంతి సెలవలకి వచ్చారు. ఇద్దరూ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేసుకొన్నారు. నాకు ఒకసారి మా ఊరి వీరభద్ర థియేటర్ లో సినిమా చూడాలని ముచ్చటేసింది. ఇంట్లో ఒప్పించడం చాలా అంటే చాలా కష్టం. ఒక వేళ మా అమ్మ ఒప్పుకున్నా, వీళ్ళిద్దరూ ఒప్పుకోరు.. ఎందుకంటే వాళ్ళ అల్లరికి నేను అడ్డు. అందరూ ఏ కళనున్నారో కాస్త బతిమాలగానే చివరాఖరిలో ఒప్పేసుకున్నారు. 😍


సినిమా మొదలయ్యింది... థియేటర్లో చుట్ట కంపు, ఎలకల కోసం హడావిడిగా కుక్కలు తిరిగేస్తున్నాయి. రెండున్నర గంటల సినిమా, మేము నాలుగంటలు చేడచ్చు. మొత్తానికి ఇంటర్వెల్ అయ్యింది.. బాదాం గీర్ తాగడానికి బయటకి వచ్చాము.


బాదాం గీర్ తాగుతూ మా బాబాయ్ గారి అబ్బాయ్ మా తమ్ముడితో " ఒరేయ్ నీ టెంత్ పోయింది కదా, ఏం చేద్దామనుకుంటున్నావు? " అని అడిగాడు

మా తమ్ముడు " అమితాబ్ బచ్చన్ సినిమాలలోంచి వెళ్ళిపోతాడుట ( వీడికి చెప్పాడు మరి), నా సైకిల్ అమ్మేసి బొంబాయ్ వెళ్ళిపోద్దామనుకుంటున్నా ఈ సారి పాస్ అవ్వకపోతే అని అన్నాడు.


" మరి నీ సెవెంత్ ఏడో సారి తప్పావుగా నువ్వేం చేద్దామనుకుంటున్నావు? " అని మా తమ్ముడి ప్రశ్న.

" రజనీ కాంత్ తమిళ్ సినిమా నుంచి రిటైర్ అయ్యిపోతాడుట, నేను ఈ ఉంగరం అమ్మేసి మదరాస్ పోద్దామనుకుంటున్నాను " అని జవాబిచ్చాడి బాబాయ్ గారి అబ్బాయి.


" ఏమేయ్... నువ్వు ఎన్ని సార్లు టెంథ్ కడతావు? నువ్వేం చేద్దామనుకుంటున్నావు? " అని నా వైపు బాణం వేశాడు మా తమ్ముడు.


నేను నీళ్ళు కాదు బాదం గీర్ లో బాదం నమిలాను. " నీ గొలుసు అమ్మేసుకొని నువ్వూ మదరాస్ వెళ్ళిపో " అని మా తమ్ముడు సలహా.


"అవును.. టెంథ్ పాస్ అయితే పెళ్ళి చేస్తారనుకొంటున్నాను, ఎంచక్క పెళ్లైతే బీరువా నిండా బట్టలు, స్కూటరూ, సాయంకాలం రోజు ఆ స్కూటర్ ఎక్కి సినిమాకి వెళ్ళొచ్చు " అని ముందు రోజు విన్న డైలాగు అక్కడ అప్ప చెప్పేశాను.


మా తమ్ముడు ఒకసారి సైగ చేసి వెనకాల చూడమని చెప్పాడు. నేను వెనకాల చూస్తిని కదా ఒక పెద్దాయన మా వైపే చూస్తున్నాడు. ఇప్పుడర్ధమయ్యింది, ఈ పత్యపు మాటలకి కారణం ఏంటో. నేను ఇంక మాట్లాడ దలచుకోలేదు. మా ఊరు సంగతి నాకు తెలుసు... గాలి కన్నా వార్తలు ముందుగా ప్రయాణం చేస్తాయి.


ఆ పెద్దాయన నా వైపు ఆ సినిమా పొస్టర్ వైపు అలా చుస్తూనే ఉన్నాడు. బహుశా ఆ సినిమా హీరోయిన్ నాలా ఉంటుందని చూస్తున్నాడనుకొని మురిసిపోయా......


సినిమా మొత్తానికి చూసి, సెంటర్ లో " దొమ్మేటి " వాళ్ళ కొట్టు లో ద్రాక్ష రసం బాగుంటుందని అక్కడ ఆగి అది తాగేసి, ఎదురుగా చెప్పులు కొనుకొని హాయిగా ఇల్లు చేరాము. సావిట్లో ఒక పెద్దాయన.. సినిమా హాల్ దగ్గర కనిపించిన అతనే.


"వీళ్ళేనా మీరు చెప్పిన వాళ్ళు " అని నాన్న మమల్ని చూపించి అడిగారు. ఆయన కోపంగా " అవును వీళ్ళే " అని జావాబు ఇచ్చారు "


అంతా చెప్పేశాడన్న మాట, ఇలాంటి వాళ్ళు బి. బి. సి , పి.టి. ఐ. లో పని చెయ్యాలి అని తిట్టుకొంటూ రాబోయే తుఫాన్ తలచుకొని కాస్త భయపడి త్వరగా తినాల్సింది తినేశాము ( తరవాత తింటి తినడానికి టైం ఉండదు .. చివాట్లకే కడుపు నిండిపోతుంది).😥😥


ఆయన వెళ్తూ వెళ్తూ " మీ అమ్మాయికి త్వరగా పెళ్ళి చేసేయండి " అని ఓ చెత్త సలహా ఇచ్చి మళ్ళీ   నా వైపు అదే లుక్ వేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంట్లో 'వన్ డే మాచ్ '  . ఆ తరవాత మళ్ళీ మా ఊరిలో సినిమాకి వెళ్ళలేదు నేను..😢😢


ఇంతకీ మేము చూసిన సినిమా పేరు చెప్పలేదు కదా " దొంగ కోళ్ళు ". 😜


Wednesday, October 4, 2017

అపరిచిత

మిత్రులకు నమస్కారములు!!! ఈ నెల విపుల లో నా కథ ' అపరిచిత '  ప్రచురించబడింది. . కుదిరితే చదవగలరు..

 

 



 

Tuesday, October 3, 2017

తుమ్ ఆగయే హో

  (మళ్ళీ మళ్ళీ ఇది వచ్చే రోజు)

 

పెనం మీద వేడి వేడి పెసరట్టు నోరూరిస్తోంది! తినాలని ఉంది కానీ... తనతో పాటు తింద్దామని ఒక ప్లేట్ లో తనకి రెండు, నాకు ఒకటి ఉంచాను. నిన్న కూడా అంతే... తనకి నా చేతి ఇడ్లీలంటే ఇష్టమని, నేను తినకుండా తన కోసం వైట్ చేసి చివరకి రాత్రి ఆ చల్లారిన ఇడ్లీనే తిని ఉన్నాను. నేనే తన గురించి ఇంత ఆత్రము పడాలి కానీ, అసలు తనకి నేను గుర్తొస్తానా? వెళ్ళి పదిహేను రోజులయ్యింది, ఒక్క సారైనా ఫోన్ చేస్తే కదా! నేను చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేం మనిషో! కాసంత అభిమానం కూడా లేదు! రోజు తనతోటే టీ తాగే అలవాటు, టీ తాగుతొన్నంత సేపు ఎన్ని కబుర్లో! ఏంటో ఇప్పుడు ఒక్కదాన్నే తాగుతోంటే చాలా వెలితిగా ఉంది. తను వచ్చాక కొన్ని రోజులు మాట్లాడకూడదు. ముభావంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అలుసు అయ్యిపోతాను! తనకిప్పుడు వాళ్ళ వాళ్ళతో టైం పాస్ అవుతుండవచ్చు, నాకే అంతా శూన్యం గా ఉంది లైఫ్!  😞

 

" తెరే మేరే హోటో పే మీటే మీటే గీత్ మిత్వా " అని కాలింగ్ బెల్! ఒకప్పుడు కాలింగ్ బెల్ "డింగ్ డాంగ్ " అని మ్రోగేవి. అదేంటో ఇప్పుడు పూర్తి పాటలు. ఏం "మీటే మీటే గీత్" వినిపిస్తుందో వచ్చి! ఈ పాట హిందిలో "చాందిని " సినిమాలోది. ఇదే డబ్బింగ్ కూడ అచేస్తే మా క్లాస్ లో ఒక తుంటరి "నీకీ నాకి పెదవులలో తియ్య తియ్యని పాటలే ప్రియా " అని మక్కికి మక్కి అనువాదం చేసింది. ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఆ తెలుగు ప్యారెడి గుర్తొస్తుంది! 😋


తనేమో అని ఆత్రంగా వెళ్ళి చూస్తే పక్కింటావిడ! ఆవిడ ఎందుకొచ్చిందో అర్ధమయ్యింది. కాస్త కాఫీ చేసి ఆవిడకో గ్లాస్, నాకో గ్లాస్ తెచ్చుకొన్నా! ఏవేవో కబుర్లు చెబుతోంది. "ఇంకా తను రాలేదా? " అని అసలు ప్రశ్న వేసేసింది. కళ్ళలో నుంచి ఉబుకి వస్తోన్న నీటిని ఆపుకొని.. "లేదండి " అని ఏదో పనునట్టు వంటింట్లోకి వచ్చేశా! 😢😢ఆవిడ తన గురించి కనుకోడానికే వచ్చింది. కాఫీ తాగి కాసన్ని ఊసుబోని కబుర్లు చెప్పి వెళ్ళింది.


టైమ్ పదయ్యింది... ఇంక ఈ రోజు తను వచ్చే అవకాశాలు తక్కువే! ఇంక తప్పద్దు.. తినాలి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా... వంటింట్లోకి తప్పనిసరై వెళ్ళాను. "ఏం వండాలి? ఏదో సింగిల్ ఐటమ్ చేసేసుకుంటా! ఆకలి తీరాలి అంతే! " రుచుల మీద మనసు వెళ్ళడం లేదు! గత పదిహేనురోజూల నుండి తినాలి కాబట్టి తింటున్నాను! కాళ్ళు ఒళ్ళు ఒకటే నొప్పి... తను రాగానే ఈ విషయం కూడా చెప్పాలి... ఈ నొప్పులకు కారణం తనేనని!!! 😞😔


మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది... " తుమ్ ఆగయే హో నూర్ ఆగయా హై " . మనసులో ఏదో మూల చిన్న ఆశ, అదే ఆశతో తలుపు తీశా!


"తనే "... నిజమే తను రావడమే నా ఇంటికి నూర్ వచ్చింది. మరే నా ఇంటికి దీపం తనేగా... అబ్బా.. వసంతం వచ్చినంత ఆనందంగా ఉంది! 😍😍😍😍


"రా లక్ష్మి " అంటూ సాదరంగా ఆహ్వానించాను.. మా ఇంటి పనిమనిషిని! (బెట్టు చేసి మాట్లాడకపోతే... మళ్ళీ మానేస్తుందన్న భయంతో)!!