Search This Blog

Wednesday, April 25, 2018

నీవెంత నెరజాణవౌరా

  నీవెంత నెరజాణవౌరా...

ఈ రోజు మన "జావళి " జయభేరి సినిమాలోని "నీవెంత నెరజాణవౌరా " . ఈ పాట రాసినవారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. మొట్టమొదట చెప్పుకోవాల్సినది ఒక మగవాడిని పట్టుకొని "నెరజాణ " అని సంభోదించడం. మల్లాదివారి  గురించి ఎంత చెప్పినా తక్కువే! తెలుగు పాటలని "చిరంజీవులు " చేసిన కలం ఆయనది. 

 

ఆయన బహుభాషావేత్త. బహుముఖప్రజ్ఞాశాలి. ఈపాటకి సంగీత దర్శకులు పెండ్యాలగారు. నృత్య దర్శకులు "వెంపటి పెద సత్యం " గారు. ఈ పాట విని పెదసత్యం గారు మల్లది వారితో "పాట కాస్త సరి చెస్తే నాట్యానికి బాగుంటుందండి. ఇక్కడ కాస్త అడుగులకి ఇబ్బంది అవుతోంది " అని అన్నారుట. అందుకు మల్లాది వారు " మిగిలిన పాటంతా బానే ఉంది కదా? ఈ చిన్న చోటే కదా? ఆ ఒక్క చోట అంజమ్మ (అంజలీ దేవి) ని కాస్త తల గోక్కోమని చెప్పండి, అందంగా ఉంటుంది " అనేసి కండువా దులిపి భుజాన వెసుకొని వెళ్ళిపోయారుట. ఈ జావళి మాత్రం అంజలీదేవి మీద కాకుండా ఆ నాటి నాట్యతార "రాజసులోచన " పై చిత్రీకరించారు. 

 

 

చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లాది
నేపధ్య గానం : ఎం. ఎల్. వసంత కుమారి 



పల్లవి :


నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 


అనుపల్లవి :

తెనెలు చిలికించు గానము వినగానే...
తెనెలు చిలికించు గానము వినగానే... ఈ మేను పులకించురా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  



చరణం 1 :



చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...


సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ...
సిరిగన కనులాన.. సిగలో విరులానా
మౌనమే వినోదమా... ఇదే సరాగమా నవమదన


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...  




చరణం 2 :



బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. స్వామీ
బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా..


మీరిన మోదాన వేమరు నిను వేడు
భామను వరించరా.. తరించరా...
శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా
సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా


వన్నె చిన్నె గమనించవేలరా... వన్నెకాడ కరుణించవేలరా
వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... నీ కొమ్మని.. నీ సొమ్మని
దరా పురంధరా.. యిదే మనవీ మన్నన సేయరా నాదమయా
మనవి వినర... మనసు పడర పరమ రసిక శిఖామణి...




నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...


నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ... 

 

 

 

Tuesday, April 24, 2018

జావళి

కృష్ణుడి పేరు వినగానే ఎవరికైనా గుర్తువచ్చేది అతని రాసక్రీడలు . బృందావన విహారాలు, గోపికలతో సరససల్లాపాలు. గోపికల విరహవేదనలు. భక్తజయదేవుడు తన గీతగోవిందం లో ఆ క్రీడలని, ఆ విరహాలని  చక్కగా వర్ణించారు . ఆ తరువాత వచ్చిన క్షేత్రయ్య పదాలు ఇంచుమించు అదే తరహాలో ఉన్నవే! ఈ జయదేవుడి అష్టపదులు, క్షేత్రయ్య పదాల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకటే అదే కృష్ణుడి మీద ప్రేమ! అవే "జావళి " కి మూలాధారాలు అని అనుకోవచ్చు

 

అవి కృష్ణుడి ఊహించుకొని పాడినవి అయితే, ఈ జావళీలు మాత్రం కథానాయుకుడిని ఊహించు కొని / ఉద్దేశింస్తూ పాడేవే. పదానికి జావళికీ అదే తేడా . పదంలో సంగీతం ఎక్కువ గా నూ చిక్కగాను ఉంటుంది , జావళీలలో మాత్రం సాహిత్యము ఎక్కువగాను ఉంటుంది .  శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రక్రియే ఈ జావళి. ఈ జావళీలలో ఎక్కువ శృంగారానికే ప్రాధాన్యము ఇచ్చేవిగా ఉంటాయి. కొన్ని సంధర్భాలలో భక్తి కూడా మెండుగా ఉంటుంది. జావళీలు ఒక పల్లవి, అనుపల్లవి, రెండు లేక మూడు చరణాలతో ఉంటాయి.    


తెలుగు సినిమా పాటలో ఈ జావళీలు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. కథానాయకుడికి నిగూఢంగా సందేశాలు తెలియచేయడమే సినిమాలలో జావళీ యొక్క ప్రధాన ఉద్దేశం.  కొన్ని సంధర్భాలలో కాస్త నాటుగా ఎల్లలు దాటిన శృంగారంతో కనిపించినా జావళీలకు మాత్రం ఒక నిశ్చితమైన స్థానము కలదు సినిమాలలో.  శృంగార సాహిత్యాన్ని గంభీరంగా వ్యక్త పరచే జావళీలు ఎప్పుడూ హుందాగానే ఉంటాయి.    


రాజు దగ్గర నాట్యం చేసే నర్తకీమణులకు ఈ జావళీలు ఎక్కువ పెట్టేవారు సినిమాలలో. ఆ తరవాత నాయకుడి ప్రేరేపించడానికి నాయికామణులు, లేక ప్రతినాయికలు నాట్యం చేస్తూ ఆలపించే జావళీలు కొన్ని.  కొన్ని జావళీల గురించి చర్చించుకుంద్దాము. 

Monday, April 23, 2018

ఎస్.జానకి

 

 

 

చక్కని గాత్రము కోసము ఏ రాగాలాపన తో ఆ శారదా దేవిని ఆవాహనము చేసారో, ఏ నాద సాధనాలతో ఆరాధించారో , ఏ గాన నీరాజణము చేశారో ,ఏ నివేదనలు , ఏ సంప్రోక్షణాలు చేసారో కానీ ఆ గీర్వాణి తన వాణినిని ఆ జానకమ్మ కి ప్రసన్నంగా ప్రసాదించింది . ఆమె గళమునే తన రత్న సింహాసనము గా సుస్థిర స్థానముగా చేసుకుంది. 


“పగలు రేయిగా పండు వెన్నెల గా “ మార్చగలిగిన స్వరము “ కదలే ఊహలకు కన్నులు ఉంటే “ ఎలా ఉంటుందో చిత్రించే మాధుర్యము , అదుపు లేని గాలిని సైతము తన గానామృతము తో గంగ వెల్లువగా ప్రవహింపచేయగలిగే సుమధుర గళం... జానకమ్మ సొంతం!!


1938 ఏప్రైల్ 23 న రేపల్లే లో పుట్టిన ఈ స్వర బాల మూడవ ఏటనే పాటల కచేరీలు ఇవ్వడము ప్రారంభించింది .నాదస్వర విధ్వాసులైన శ్రీ గాడవల్లి పైడిస్వామి వారి వద్ద సంగీత శిక్షణ పొందారు.

మొట్టమొదటి సారి సినిమాలో పాడింది ( తెలుగు పాట) పెండ్యాల గారి దర్సకత్వములోని “ నీ ఆశ అడియాశ చేజారే మణిపూస “(1957 ) ( ఈ పాట ఆధారముగానే లంబాడోళ్ల రామదాసు సినిమా తీసారు – 1978).



మొదట పాడిన పాట ఏదైననూ ఆవిడకు బాగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినది మాత్రము “ నీ లీల పాడెద దేవ “ ఈ పాట కోసము ఎస్.ఎం.సుబ్బయ్య నాయుడు గారు ఒక సన్నాయి లాంటి గళానికి కోసము వెతుకుతుండగా , జానకి గారి మావగారైన డా!చంద్రశేఖర్ గారి ద్వారా ఆవిడ గురించి వినడము , ఆ తరవాత కరైకూచి అరుణాచలం గారి నాదస్వరానికి పోటీ పడుతూ ఆవిడ పాడిన ఆ పాట ఆ నాటి నుండి ఈ నాటి వరకు సంగీతభిమానులను డోళలాడిస్తూనే ఉంది . అటు వంటి పాట అంతవరకు ఎవరూ పాడలేదు...... పాడలేరు. శ్రీ గాడవల్లి పైడిస్వామి గారు సన్నాయి విద్వాంసులు, ఇలా ఆవిడ పాడిన ఈ గానం గురుదక్షిణగా అయ్యింది.


ఆ పాట విని సి.నారాయణ రెడ్డి గారు “ అమ్మాయి.. నీ గొంతు సన్నాయి “ అని అభివర్ణించారుట. ఈ పాట పాటలప్రపంచములో ఒక సుస్థిరస్థాన్నాన్ని ఏరపరచుకొని అభేరీ రాగానికే ‘ ఆభరణం ‘ అయ్యింది.


1970 – 80 ప్రాంతములో సినీ గీతాభిమానులు , సంగీత దర్శకులు పాటలలో కొత్త దనాన్ని ఆస్వాధించనారంభించారు . ఎక్కువ గా గాత్రము తో ,వాయిద్యాలతో ప్రయోగాలు చేసి జనాలను మెప్పించడానికి కొత్తదనాన్ని సృష్టించడానికి ఇష్టపడే వారు సంగీత దర్శకులు. ,ఆ సమయములో వచ్చిన పాటలు చాలా మటుకు జానకమ్మ గాత్రానికి సరిపోయేవి కావడం , ఎటువంటి ప్రయోగాలకైనా ఆవిడ గళము సరిపోవడముతో ఎక్కువ పాటలు ఆవిడనే వరించాయి.

ఎస్.జానకి అంటే.. 'సంగీత జానకి'గా సంగీతాన్ని తన ఇంటిపేరుగా మార్చుకున్న అద్భుత గాయనీమణి జానకమ్మ. గాయనిగా, సంగీత దర్శకురాలిగా దాదాపు 15 భాషల్లో 30 వేలకు పైగా పాటలు పాడి నవరసాలు ఒలికించారు. సరికొత్త రికార్డు సృష్టించారు. 

ఆవిడ తెలుగు , తమిళ్ ,కన్నడా, మళయాళం , హింది , సింహళి ,జపనీస్ లో పదిహేను వేలకు పైగా పాటలు పాడారు. ఒకప్పుడు ఉత్తి శృంగార గీతాలకే పరిమితం అనుకునే ఆవిడ గాత్రము అన్నీ రకాల రసాలు పలికించగలదని నిరూపించుకున్నారు.


ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడారు.


“వినరా సూరమ్మ కూతురి మొగుడా విషయము చెపుతాను “ , "పాప పేరు మల్లీ నా ఊరు కొత్త ఢిల్లి " అంటూ హాస్య గీతాలు. ఎన్నో పాడారు.


“ఎందుకో చేరువై దూరమౌతావు ( నీలి మేఘాలలో)….. ” ,

“నాలో ఉన్న మనసు నాకు గాక ఇంకెవరికి తెలుసు (కళ్ళలో ఉన్నదేదో కన్నుల కే తెలుసు )” …,


“పువ్వు రాలిన వేళ కళ్యాణము అందాక ఆరాటం ( మేఘమా దేహమా మెరవకే ఈ క్షణం ) ” ఈ పాట కి ముందు ఆలాపన చెప్పనలవి కానిది. ,


“నాకు లేదు మమకారం మనసుపైన అధికారం …ఆశలు బాసిన వేసవిలో (వెన్నెల్లో గోదారి అందం )….


“మము గన్న మా యమ్మ అలివెలు మంగా (నడి రేయి ఏ జాములో ) …అంటూ అద్రతగా అనగలగడం … ..


మచ్చుక్కి ఇటువంటి పాటలు చాలవా గుండే భారమెక్కడానికి?


“అర్జున ఫల్గున పార్ధ కిరీటి బిరుగొన్న విజయ “( నరవరా ఓ కురువరా ) అనే మాటా ఒకే ఫేస్ లో పాడటం…. ,


వల్లభా ప్రియ వల్లభ లో “బుగ్గలకావిరి తగిలేలా సిగ్గులు సెగలై చెలగేనా ” అంటూ అలలా పైకెగిరే స్థాయి…,


నను నీవు నిను నేను తనివితీరగ తలచుకొని (“కుశలమా ఎచనుంటివో ప్రియతమా ),


విహార వీణలు విందులు కాగా ..తనువు మనసు ఊలీ సోలి….అన్న తీరు (వసంత గాలికి వలపులు రేగ వరించు బాలిక మయూరి కాగా ) , ( డా!! బాల మురళీ కృష్ణ తో హాయి గా సాగిన యుగల గీతము….)


“ఒకసారి కలలోకి రావయ్యా…”అంటూ వేడుకుంటోనట్లు పలికిన తీరు ,


తల్లి మళ్ళి తరుణైయింది... గుడిని విడిచి వేరొక గుడిలో ప్రమిదనైతే తప్పేముంది (గాలికదుపులేదు )అంటూ గాలిలా అన్ని వైపులకూ సాగేపోతునట్లు ,


సన్నజాజీ పడకా…మాటవినకుందే ఎందుకే…..అంటూ సాగతీయడం


మదిలోని వాడు గదిలోకి వస్తే ….(మావయ్య వాస్తాడంట ) తుళ్ళుతూ సాగే పాట..


” ఓ వనె కాడ నిన్ను చూడ “(శ్రీ కృష్ణ పాడవీయం )( ఈ పాటలో ఒక్కొక్క చరణం ఒక్కొక్క బాణిలో ఉంటుంది ) అంత వైవిధ్యమైన పాటలు పాడటము లో ఆమేకు ఆమే సాటి……. .


ఊలుకు పలుకు లేకుండా మనిషి ఏ మాత్రము కదలకుండా పాటకు ఏ భావము ఎంత వరకు కావాలో అందించగల నేర్పరి . మాటలతోటే కాకుండా నవ్వు ల తో కూడా ఎన్నెన్నో భావాలు ప్రకటించగల రాగమంజరి .


పాటలలోనే కాదు చిన్న నవ్వులో ఎన్నేన్నో భావాలు తెలపగల జాణతనం కలదు ఆ గళానికి.


“నవ్వు తో ముసి నవ్వు తో ” అన్నప్పుడు విసిరిన ఆ ‘ముసీ నవ్వు , వింతగా కవ్వింత గా అంటూ గిలిగింతలు పెట్టించేది గా …


“పక్కన నువ్వుంటే ప్రతి రాత్రి పున్నమిరా ” అంటూ సిగ్గు పడె నవ్వు వెన్నెల గొప్పించిన రేయి లా ….


“సిరి మల్లే పువ్వల్లే నవ్వు ” లోని నవ్వు సెలయేటి తరగలలాగా కదిలేది గా…


“ నవ్వింది మల్లె చెండు “ లోని నవ్వు పరవళ్ళు తొక్కుతున్న గోదారిలా ..


“రాగమో అనురాగమో “ లోని నవ్వు ఎగిరే కెరటం కొండను ఢీ కొట్టుకునట్లు గా..


“శివ శివ అనలేలరా “ లోని నవ్వు కోరెకలను నిద్రలేపేదిగా …


“ పరువమా చిలిపి పరుగు తీయకు “ లో నవ్వు తొలకరి ఝల్లులాగా…


“ఈ పగలు రేయి గా పండు వెన్నెల గా “ లోని నవ్వు చలి లో విరిసిన అరవిందము గా ..


“పంట చేల్లో పాలకంకి నవ్వింది “ లో నవ్వు కోనసీమ లోని పచ్చని చేలు లా..


“పూవులు పూయును పదివేలు “ లో నవ్వు కుప్పించిన జాణతనములా ….


“సిగ్గు పూబంతి “ లో నవ్వు సాగరము లో కలిసే కన్నే గోదారిలా గంభీరము గా ఉంటుంది.


ఆవిడ పాడిన ఎన్నో యుగల గీతాలు ప్రజాధరణ పొందాయి.ఆనాటి నుండి ఈ నాటి వరకు యువతరానికి వేద మంత్రమయ్యాయి .


“ఊపిరి తగిలిన వేళ ….”అంటూ వెచ్చగా పలికిన తీరు (“వీణ వేణు వైన )..

అబ్బో నేరేడు పళ్లు లో “అబ్బో ” అన్న తీరు ,

వెచ్చ వెచ్చని నీ ఒడిలో ..లో “ నాకు నువ్వు నీకు నేనూ రోజు రోజు…” అన్న తీరు రేపంటి రూపం కంటి లో “ నేనోడి నీవే గెలిచి “ స్పురిస్తుంది .


శ్రీవారికి ప్రేమ లేఖ లో “ తొలిసారి మిమల్ని …లో ఎన్నో కలలు కన్న “కన్నె బంగారు “ ఆ మాట వింటే చాలు దేవులపల్లి వారి “ జాబిలి కూన “ గుర్తు రాక మానదు.


టిక్ టిక్ టిక్ గడియారం లో గోముగా పలికిన తీరు , ..

“ఎర్రాన్ని కుర్ర దాన్ని గోపాలా ” , “వద్దంటే వినడే పోకిరి ” , “ఆడదాని ఓరచూపుకే జగాన ఓడిపోని ధీరుడెవ్వడు “,


“సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిట “( మౌనమేలనోయి ఈ మరపురాని రేయి)


“పట్టి తెచ్చనులే పండు వెన్నెలను నేనే “..అంటూ వెన్నెలలలు కురిపించే పాటలు… ఇలా ఎన్నో రకాల పాటలలో సరిలేరు ఆమెకెవ్వరూ…



ఇళయరాజా ఓ తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జానకి గురించి మాట్లాడుతూ..''జానకమ్మకి తేనె ఖర్చు ఎక్కువ. ఆమె ప్రతిరోజూ కొన్ని లీటర్ల తేనె తాగుంటాది. లేకపోతే ఆమె గాత్రంలో అంత మాధుర్యం ఎట్టా వచ్చునప్పా'' అని జానకి గాత్రంలోని మాధుర్యం గురించి చమత్కరించారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ఆమె గానంలో మాధుర్యం ఎంతో.


తెలుగు, తమిళం, మలయాళం, కన్నడతో పాటు హిందీ, సినాÛలే, బెంగాలి, ఒరియా, ఇంగ్లీష్, సంస్కృతం, తుళు, సౌరాష్ట్ర, జపనీస్, జర్మన్, సింహళీ భాషల్లో తెలిసిన జానకి, ఘంటసాల, డాక్టర్ రాజ్కుమార్, వాణి జయరాం, కె.జె.జేసుదాస్, ఎల్.ఆర్.ఈశ్వరి, పి. జయచంద్రన్, పి.లీలా, కె.ఎస్.చిత్ర, సుజాత, జెన్సీ, పి.బి.శ్రీనివాస్, ఇళయరాజా, ఎస్.బి.బాలసుబ్రహ్మణ్యం వంటి పలువురు ప్రముఖ గాయకులతో పాటు మనో, వందే మాతరం శ్రీనివాస్ వంటి వర్థమాన గాయకులెందరితోనో కలిసి పాడారు.


బిస్మిల్లాఖాన్, ఎం.ఎస్.గోపాలకృష్ణన్, పండిట్ హరిప్రసాద్ చౌరాసియా వంటి ప్రముఖ సంగీత విద్వాంసులతోనూ కలిసి పనిచేశారు. ఎస్.రాజేశ్వరరావు, దక్షిణమూర్తి, సుబ్బయ్య నాయుడు, పెండ్యాల, కె.వి.మహదేవన్, ఎమ్.ఎస్.విశ్వనాథం, రాజన్ నాగేంద్ర, సత్యం, చక్రవర్తి, ఇళయరాజా, రమేష్ నాయుడు, జాన్సన్, శ్యామ్, వందేమాతరం శ్రీనివాస్, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి ఎందరో సంగీత దర్శకులకు గాత్రం అందించారు.


ఆరుసార్లు జాతీయ స్థాయిలో గాయనిగా అవార్డు అందుకున్నారు. వాటిల్లో తెలుగులో వంశీ దర్శకత్వంలో ఆమె పాడిన 'సితార' చిత్రంలోని 'వెన్నెల్లో గోదారి అందం' పాటకుగాను ఉత్తమ జాతీయ గాయనిగా అవార్డు అందుకున్నారు.


మహమ్మద్ రఫీ, లతామంగేష్కర్, ఆశాభోంస్లేలు జానకికి ఇష్టమైన సింగర్స్. ఐదు తరాల నటీమణులకు జానకి తన గళాన్ని అందించడం మరో విశేషం. రామోజీరావు నిర్మించిన 'మౌనపోరాటం' చిత్రానికి జానకి సంగీత దర్శకత్వం వహించారు. ఆ తరం వారిలో భానుమతి, పి.లీల తర్వాత జానకి మాత్రమే మహిళా సంగీత దర్శకురాలు. ప్రస్తుతం ఉన్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు, గాయకురాలు ఎంఎం శ్రీలేఖ మాత్రమే.


ఏ భాషలో పాడినా... పాటలో ఆ నేటివిటీ ధ్వనించేలా పాడగలగడమే ఆమె అందరి అభిమానం చూరగొనేలా చేసింది. ఇలా గాయనిగా పేరుగాంచిన జానకి వి.రామ ప్రసాద్ ను వివాహమాడి చెన్నైలో స్థిరపడ్డారు. ఈమెకు మురళీకృష్ణ అనే కుమారుడు ఉన్నారు.


ఆవిడ నాదస్వరముతోటే కాదు బిస్మిల్లాహ్ ఖన్ గారి తో షెహనాయి లో , ఎం.ఎస్. గోపాల కృష్ణన్ తో వయూలీనము లో , హరి ప్రసాద్ చౌరాసియా తో వేణు వు లో ను పోటీ పడుతూ ఎన్నో గీతాలు పాడారు.


ఆవిడ పాటలలోనే కాదు మంచి మిమిక్రి ఆర్టిస్ట్ కూడా. గోవ్వుల్లు తెల్లనా గోపయ్య నల్లనా ( సప్తపది ) ,అలకపానుపు ఎక్కనేల చిలిపి గోరింకా (శ్రీవారి శొభనం ), చిన్నారి పొన్నారి కిట్టయ్య నిన్నెవరు కొట్టారయ్య ( స్వాతి ముత్యం ) , పంటచేల్లో పాలకంకి నవ్వింది ( పదహారేళ్ల వయ్య్సూ ) ,గున్నమామిడి కొమ్మ మీద (బాలమిత్రుల కథ ) లో ఐదేళ్ల చిన్న పాపలాగా, అరవై ఏళ్ల ముసలామే లాగా పాడారు. అన్నిటి కనా ఆవిడే పాడారు అని చెబితే నమ్మలేని పాట... "పాప పేరి మల్లి (మౌన గీతం) " లో పాట. ఇలా ఆవిడ గళానికి ప్రతి పాట ఒక ఛాలెంజ్! 


ఆవిడ పాటలు పాడడం లోనే కాదు పాటలకు సంగీతన్ని కూడా అందించగల విదుషీమణి. మౌనపోరాటం సినిమా ద్వారా ఆవిడ సినీ సంగీత దర్శకురాలిగా ప్రఖ్యాతి పొందారు. అటువంటి గాయనీ మణి, సంగీత దర్సకురాలు నాభూతో న భవిష్యతి !


చాలా కొద్దిమందికే తెలిసిన మరో విద్య కూడా కలదు ఆవిడలో … అవిడ మంచి చిత్రకారిణి కూడా. అన్నిటి కన్నా చాలా మృదుభాషిణి, ఏమాత్రం గర్వం లేని వ్యక్తిత్వం ఆవిడది.  

 ఆరు జాతీయ అవార్డులు, వివిధ రాష్ట్రాలకు చెందిన 25కి మించిన అవార్డులను జానకి సొంతం చేసుకున్నారు. 1980-90 దశకంలో విడుదలైన చిత్రాలన్నింటిలో జానకి గాత్రం వినబడేది. బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాతో కలిసి ఎన్నో అద్భుతమైన పాటలకు గాత్రం అందించారు. జానకి అద్భుతమైన పాటలనెన్నింటినో వీనుల విందుగా ఆలపించి శ్రోతలను పరవశింప చేశారు.

ఆ తల్లి గురించి ఎంత చెప్పిన తక్కువే కానీ కొండత దేవుడి కి కొండంత పత్రిని సమర్పించలేము కదా?


ఓక జాలరి సముద్రములోకి వెళ్లి తన అదృష్టము కొద్ది ఆణిముత్యాలు , రత్నాలు, వజ్రాలు తీసుకొని వస్తాడు ….ఎస్.జానకి అనే సంగీత సాగరములో నాకు దొరికినవి మాత్రము ఈ కొన్ని ఆణిముత్యలే మరి...




Tuesday, April 10, 2018

జ్ఞాపకాలు

"పాతా...బాతా... సీతామ్మా " అంటూ రోజూ మధ్యాహ్నం ఒకతను వీధుల్లో అరచుకుంటూ వెళ్ళేవాడు. సీతకి  ఈ " పాత.. బాత "ఎంటో చాలా రోజులు అర్ధం కాలేదు.  రోజు మిడసరి లగ్నంలో వచ్చేవాడు. నెత్తిమీద ఒక గంప పెట్టుకొని అందులో ఏవో కొన్ని గిన్నెలు పెట్టుకొని అరుస్తూ వీధి వీధి తిరిగేవాడు. అతను అరుస్తుంటే చిన్నపిల్లలమేమో (అప్పుడు) మేమూ అదే స్టైల్ లో అరవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఓసారి మా చిన్నమావయ్య మేము అన్నది విని నవ్వి, ఆ వీధిలో అతను "పాతా బాతా సీతామ్మా " అని అరవడం లేదు.. "పాతా బట్టలకి స్టీల్ బాసాన్లమ్మా " అని అరుస్తున్నాడని గీతాబోధ చేశాడు.  😄

రోజూ పొద్దు పొద్దుటే ఆరు, ఆరున్నర మధ్యలో, మళ్ళీ సాయంత్రం ఐదూ ఐదున్నర మధ్యలో సైకిల్ మీద ఒకతను వచ్చేవాడు.. అతను ప్రతీ వీధి తిరుగుతూ "బుల్లమ్మా " అని అరచుకుంటూ వెళ్ళేవాడు. పాపం ఎవరో బుల్లమ్మ ని వెతుకుంటున్నాడేమో అని అనుకునేదాన్ని నేను. మధ్య మధ్యలో కొందరి ఇంటి లోపలకి వెళ్ళీ ఒక పొట్లం ఇచ్చి బుల్లమ్మని వెతుకునేవాడు..పాపం. తరవాత కాలం లో అర్ధమయ్యింది ఏమిటంటే అతను "బుల్లమ్మ " ని వెతుకోవడం లేదని అతను "పూలమ్మా " అని అరుస్తూ అమ్ముకునేవాడని.    😜 


అలాగే వీధిలో "మౌజ్ " అని అరిచేవాడు.. ఎదో ఎలక అమ్మేవాడు అనుకునేవాళ్ళం.. తీరా చూస్తే అది "చీటీ వాలా మౌజ్ (అదేనండి చుక్కల అరటి పళ్ళు). 

మా ఊరులో ఇలాగే "ప్పో... " అంటూ మిట్ట మధ్యాహ్నం పూట ఒకడు వచ్చేవాడు. అతను అమ్మేది "ఉప్పు " . ఎప్పుడూ ఉప్పో అని అమ్మేవాడు కాదు, ఆ ఊరిలో ఎవరిదేనా పెళ్ళి కుదిరితే  " పెళ్ళివారుప్పో " అనీ, పెళ్ళి అయితే "కొత్త కాపురం ఉప్పో " అని, లేకపోతే "అత్తాకోడలుప్పో " అనో , ఎండా కాలం లో "ఆవకాయుప్పో " అని అరుస్తూ ఉండేవాడు. ఒకసారి మా పక్కూరిలో ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు కొట్టుకొని వేరింటి కాపురం పెట్టుకొన్నారు, ఆ ఊరు వెళ్ళి ఈ ఉప్పు అతను " వేరింటి కాపురం ఉప్పో " అని అరిచాడు. పాపం అతన్ని ఎముకళ్ళొకి ఉప్పులేకుండా కొట్టేశారు ఆ అత్తాకోడళ్ళు. 😢😢😢😢😢

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మా వీధిలోకి "ప్పో " అని అరుస్తూ ఒకావిడ వచ్చింది. వెళ్ళి చూస్తే అది "ఉప్పు " కాదు.. "సొప్పు (ఆకుకూరలు). ఇదిగో పైన చెప్పిన వారందరూ  గుర్తుకొచ్చేశారు. 😎