Search This Blog

Monday, April 15, 2019

బ్యాగోపాఖ్యానం

పాత బండారులంక దగ్గర హ్యాండ్ బ్యాగ్ మామ్మ గారు ఎక్కేవారు, ఆవిడ చేతిలో ఒక హ్యాండు బ్యాగు ఉండేది. అప్పుడప్పుడు ఆ బాగులో నుండి బిస్కెట్టు పాకెట్టు తీసి రెండు బిస్కెట్లు నోట్లో వేసుకొని, ఒక చిన్న బాటిల్ తో నీరు తాగేవారు. మరి కొన్ని సార్లు చిప్స్ తినేవారు (మాకూ ఇచ్ఛేవారు లెండి). ఆ హాండ్ బ్యాగ్ లో నుంచి అప్పుడప్పుడు మాకు సంపెంగి పూలు(మరి కొన్నిసార్లు మల్లెదండలు) తీసి ఇచ్చేవారు. ఆవిడ పేరు చాలా మందికి తెలీదు కానీ బస్సు డ్రైవర్ నుంచి ఎక్కే జనాల వరకు అందరూ "హ్యాండ్ బ్యాగ్ మామ్మగారు " అని అనేవారు ఆవిడని. నా దృష్టిలో ఆ హ్యాండ్ బ్యాగు లో నుంచి క్షేరసాగర మధనం లో వచ్చే వస్తువులన్నీ వస్తాయేమో అని అనిపించేది. ఆవిడ ఆ హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని ఒక్కసారిగా బస్సు నుండి గంతుతూ దిగినప్పుడు కుప్పించి ఎగసిన పద్యములో " ఉరికిన యోర్వగ ఉదరంబులో నున్నజగముల వ్రేటున జగతి కదల " అన్నట్టు ఆవిడ బ్యాగులో ఉన్న వస్తువులన్నీ అల్లకల్లోలం అయ్యిపోయి ఉంటాయనిపించేది.

చిన్నప్పుడు ఇలా మాయల ఫకీరుల సంచీలాంటి హ్యాండ్ బ్యాంగ్ ని చూస్తే అందులో ఏముందో అన్న కుతూహులం చాలా ఉండేది. కాలక్రమంలో ఆ జోలీ నా భుజస్కందాల మీదకు కూడా వచ్చేసింది.

ఎప్పుడైన బయటకు వెళ్తే ఇంటి తాళాలు పక్కవారికొకటిచ్చి, ఇంకోటి బ్యాగులో వేసుకుంటాము. ఆ తరవాత ఎండలో వెళ్ళాలి కాబట్టి చిన్న గొడుకు, ఒక నీళ్ల బాటిలు తప్పనిసరి. ఏమో ఎక్కడేనా ఆకలి వేస్తే... ఒక చిన్న బిస్కెట్టు పాకేట్టో లేక ఒక నూట్రిషన్ బారో ఉంచుకోవాలి. అసలే ఆడవారు రెండు రకాలు.. ఒకటి ముడిపదార్ధాలు, ఇంకొకరు జడపదార్ధాలు... మరి బ్యాగులో దువ్వెన, రబ్బర్ బాండ్లు, ముడి పిన్నులు ఉండాలి కదా! చీరలకి పెట్టుకునే పిన్నులు, పిన్నీసుల కట్టా, బొట్టుబిల్లలు మొదలైనవి. (సుమంగళీ కి చిహ్నాలైన ఈ ఐదోతనాన్ని బ్యాగ్గులలో భద్రంగా దాచుకుంటూ). పాస్ పోట్ల నుంచి పాల కూపన్ల వరకు, బంగారు ఆభరణాల నుండి బండి తాళాల వరకు అన్నీ దాచుకొనే ఏకైక స్థలం.. ఈ హ్యాండ్ బ్యాగులు. ఇవి చాలవన్నట్టు ప్రయాణాలలో భర్తగారి పర్సులు, కళ్ళజోళ్లు, పెన్నులు. పిల్లల విడియో గేంస్ కూడా ఈ బ్యాగులో చేరతాయి. అప్పుడెప్పుడో చూసిన బాహుబలి సినిమా టికెట్లు, ఆ తరవాత తిన్న హోటల్ బిల్లు కూడా ఉంటాయి ఈ బ్యాగులో!

ఎవరింటికేనా వెళ్తే వారిచ్చే తాంబూలము, జాకెట్టు ముక్క, అందులో ఉంచిన అరటి పండో, బత్తాయి పండో ఈ బ్యాగులో పాడేసుకుంటాము. (ఎప్పుడో కంపువాసన వచ్చినప్పుడు కానీ ఈ పళ్ల విషయం గుర్తుకురాదు) . ఏ సమయానికి ఏ అవసరమొస్తుందో అని తలనొప్పి టాబెలెట్లు (ఎవరికి అని అడగొద్దు), జ్వరానికి పారాసిటిమాల్ , బ్యాగులో తప్పనిసరిగా ఉండాల్సిందే! ఇన్ని దాచుకున్న బ్యాగు 'ఉరుకోదరుడి " లా ఎలా ఉంటుంది? కప్పని తిన్న పాములా, తొమిదోనెల గర్భిణిలా నిండుగా ఉంటుంది. చుట్టుపక్కల అమ్మలక్కల విషయాలన్నీ పొట్టలో దాచుకున్న పనిమనిషి కడుపులా ఎప్పుడెప్పుడు నోరు తెరిచేదామా అనట్టుంటుంది ఈ హ్యాండ్ బ్యాగు.

ఒకసారి మెమంతా పాపికొండలు చూడటానికి వెళ్ళాము. గోదావరి మధ్యలో ఒక చిన్న గుడి దగ్గర ఆపాడు. అక్కడ గోదావరికి నమస్కరించి పసుపు, కుంకుమ వెయ్యాలని చెప్పారు ఎవరో పెద్దవారు. బ్యాగులో చెయ్యి పెట్టి కాసేపు (పావుగంటే) వెతకగానే పసుపు కుంకుమ దొరికేశాయి. చక్కగా గోదావరికి నమస్కరించుకున్నాము.

మొన్న ఈ మధ్యనే తెలిసినవారి ఇంటిలో ఫంక్షన్ కి వెళ్ళాను, వారు ఇచ్చిన గిఫ్ట్, ప్రసాదం బ్యాగులో వేసుకున్నా, నా ఫ్రండ్ " నా కాలి చుట్లు కొత్తవి కొన్నాను ఇవి నీ బ్యాగులో వేసుకోవా? " అని అడిగింది. తీరా ఇంటికి చేరాకా నా చుట్లు ఇవ్వవా అని అడిగితే, నా బ్యాగ్ బోర్లించీ "నీ చుట్లు నువ్వు తీసుకో.. ఈ లోపల టీ తెస్తాను " అని చెప్పి లోపలకి వెళ్ళా, పాపం పద్మవ్యూహంలోకి వెళ్ళిన అభిమన్యుడి వెతికినట్టు వెతుకుంది. దాని పిల్లలు " 5 సెకన్స్ లో ఈ చెత్తలో ఉన్న టొమాటో సాస్ ఎక్కడుందో చెప్పుకోవాలి " అంటూ హిడెన్ ఎక్స్ప్రెస్ ఆడుకున్నారు. (అప్పుడెప్పుడో సండ్ విచ్ కొన్నప్పుడు ఇచ్చిన టొమాటో సాస్ పాకెట్.. బ్యాగులో వేసుకున్నా), అయినా ఈ హ్యాండ్ బ్యాగ్ ఏవైనా కృష్ణ బిలమా? వెళ్ళిన వస్తువు మళ్ళీ కనిపించాపోడనికి? కాస్త ఓర్పుగా వెతికితే అదే దొరుకుతుంది.

పిల్లలు టి.వి. లో డోరేమాన్ చూస్తూ ఆ డోరేమాన్ ఎవరికి ఏమి కావాలన్నా బ్యాగ్ లో చెయ్యిపెట్టి ఇస్తూ ఉంటాడు, ఆ డోరేమాన్ దగ్గర ఉన్న బ్యాగు లాంటి బ్యాగు ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకుంటారు. ఈ ఆడవారి హాండ్ బ్యాగులు అలాంటివే అని పాపం వారికి తెలీదు. పిల్లలంటే గుర్తొచ్చింది.. చంటి పిల్లల తల్లులకైతే సెపరేటుగా ఇంకో చేతిలో డైపర్ బ్యాగులు కూడా ఉంటాయి. ఈ మధ్య బ్యాగులలో పెప్పర్ స్ప్రె లు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎంతైనా ఈ ఆడవారి హాండ్ బ్యాగులు ఎన్ని దాచుకున్న ఇంకా చోటు ఉండే పుష్పక విమానాలు.

భూభారం మోసే ఆదిశేషుడు కంటే గొప్పవారెవరూ? అష్టదిక్కులని తమ భుజాల మీద మోసే గజాల కన్నా ఓర్పు గల వారెవరూ? ఏంటీ... యక్ష ప్రశ్నలలా ఉన్నాయా? జావాబు ఏంటో తెలుసా? ఆడవరి హాండ్ బ్యాగులు. ఏంటీ నమ్మరా? సరే మీ ఇళ్లల్లో ఇంతులు వాడే హాండ్ బ్యాగ్ ని ఎప్పుడేనా ధైర్యం తీసి చూశారా? చూసినవారికే తెలుస్తుంది అందులో ఉన్న నిధి నిక్షేపాల గురించి. ఈ హ్యాండ్ బ్యాగ్ కి గనక మాటలొస్తే ఎన్ని తిట్లు తిడుతుందో? ప్రాణం వస్తే మాత్రం "డొమెస్టిక్ వాయిలెన్స్ " కి సంబంధించిన అన్నీ కేస్ లు పెట్టెస్తుంది.

ఆడవారి ఓర్పుకు, ఈ హండ్ బ్యాగులకు అవినాభావ సంబంధం ఉంది. కడుపులో ఎంతో దాచుకుంటారు!  నోరు ఉంది కదా అని బయటకు చెప్పరు ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడతాయి(బ్యాగులో వస్తువులు). ఇంటి బాధ్యతలని తన భుజస్కంధాల మీద మోస్తున్న స్త్రీ మూర్తుల సన్నిహిత నెచ్చెలి.. ఈ హ్యాండ్ బ్యాగు.