Search This Blog

Wednesday, September 20, 2017

పున్నాగ

టైం 8:15... అప్పుడే భక్తి రంజని అయ్యింది. మా భోజనం కూడా అయ్యేది ఆ టైం కే!  ఇప్పటిలాగా పొద్దుటే గాజు ప్లేట్ లో ఇడ్లీలో, దోశలతో పక్కన ఒక గ్లాస్ పళ్ళ రసంతో బ్రేక్ ఫాస్ట్ తినే రోజులు కావు. పొద్దుటే కలగలుపు పప్పూ అన్నము, పెరుగూ అన్నము... పొద్దుట బ్రేక్ ఫాస్ట్ అనబడు భోజనం, మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ నుంచి లంచ్ కి ఇంటికి వచ్చి అదే పప్పు, ఒక కూరా, మళ్ళీ పెరుగన్నం. సాయంత్రం 4 ఇంటికి స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ అదే పప్పూ... అదే కూరా... అదే పెరుగూ అన్నము. అప్పుడప్పుడు "అదే కూరా, అదే పప్పూ, అదే అన్నము  " అని "అదే నీవు అదే నేను " కి ప్యారెడిగా  పాడుకునేవాళ్ళము.  రాత్రి డిన్నర్ కి వేరే కూర, రసం, (పచ్చడి ఆప్షనల్) పెరుగు అన్నము. ఇన్ని సార్లు అన్నం తిన్నా కాలెరీలు ఎక్కువయ్యిపోతాయన్న బాధ .. కాదూ ఆలోచనే లేని రోజులు.


స్కూల్ కి తయ్యారవుతుండగా జనరంజని మొదలయ్యేది.   "ఇదే ఇదే నేను కోరుకుంది.. ఇలా ఇలా చూడాలని ఉంది " పాట వస్తోంది. ఈ పాట పక్కింటి వెంకట్ అన్నయ్య, స్వరాజ్యలక్ష్మి అక్క లంగా ఓణీ వేసుకొని వచ్చినప్పుడు పాడాడు. "ఆ జడపొడుగూ మెడ నునుపూ చూస్తుంటే " అని కూడా పాడాడు. ఆ అక్క కూడా " ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది " అని పాటకు పాట రిప్లై ఇచ్చింది. అప్పుడు ఈ పాటలు, ఆ సీన్లు  సేవ్ చేసేసుకొని ఉన్నాను. కాస్త పెద్దయ్యాక డీ కోడ్ చేసుకొంటే అర్ధమయ్యాయి ఆ పాటల రాయబారాలు.



జనరంజని లో రెండు పాటలు అయ్యాక స్కూల్ కి బయలుదేరేవాళ్ళము నేనూ మా తమ్ముడు. పోస్ట్ ఆఫీస్ దగ్గరకు రాగానే శిరీష, అర్పిత కలిసేవారు. ముగ్గురం ముందు రోజు టి.వి. లో వచ్చిన చిత్రహార్ లో పాటల గురించో, చిత్రలహరిలో "హే కృష్ణా ముకుందా మురారీ " అనే ఒక్క పాటతో చిత్రలహరి అవ్వగొట్టెసినందుకో బాధపడిపోయేసేవాళ్ళము. పాలబూత్ సందు చివర్లో సంపెంగి చెట్టు కి ఏవైనా పూలు ఉన్నాయేమో అని ఒకసారి వెతికేసి... ఉంటే కోసేసుకొని... మళ్ళీ స్కూల్ కి ప్రయాణం కొనసాగించేవాళ్ళం. పాల బూత్ సందుకి ఎడం వైపు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఇంటి ఎదురుగా "డాంబర్ ఇంటికి " పక్కన ఒక "పున్నాగ చెట్టు " ఉండేది. ఆ చెట్టు కింద బోలెడు పూలు పడి ఉండేవి. ఆ పూలు ఏరుకొని ఏ టీచర్ కి ఇవ్వాలో అని ఆలోచించుకుంటూ రామ్ నగర్ గుండు దాటే వాళ్ళం. 


స్కూల్ కి ఎదురుగా ఒక ఇంటి దగ్గర "గౌరీ మనోహరి " పూలు ఉండేవి. ఇంక ఆ పూల మీద వాలేవాళ్ళము. ఆ పూలు కూడా కోసుకొని అప్పుడు స్కూల్ కి వెళ్ళేవాళ్ళము.  లలితా నగర్   నుంచి వచ్చే జ్యోతి ఎక్కువగా "కౌరవ పాండవుల " పూలు  తెచ్చేది. మేము పోగేసి తెచ్చిన ఈ పూలన్నీ ఎక్కువగా "రమా కుమారి " టీచర్ కి ఇచ్చేవాళ్ళము. పాపం ఆవిడ " ఇవన్నీ షో పూలు తలలో పెట్టుకోరు " అని అనకుండా అన్నీ పూలు తలలో పెట్టుకునే వారు. మాకు ఆవిడ అలా పూలు పెట్టుకుంటే చాలా ఆనందం వేసేది. పూలు గుచ్చుకోడానికి దారం లేకపోయినా ఒక తొడిమలో ఇంకో పూవు పేర్చి మాలగా అల్లుకునేవారు రమా కుమారీ టీచర్. ఆ మాలే తలలో తురుముకొనేవారు ఆవిడ.


ఇలా పూలు పోగేస్తూ పోగేస్తూ ఉన్నరోజుల్లో ఒకరోజు "గౌరీ మనోహరి " పూలు కోస్తూ అర్పిత పుచ్చకాయిలా దొర్లిపోయింది. అలా దొర్లి ఒక స్కూటర్ ముందు పడింది... ఆ స్కూటర్ అతను సడన్ గా బ్రేక్ వేశాడు. కీచ్ మని సౌండ్ తో ఆగింది ఆయన స్కూటర్... అర్పితకి ఏవీ కాలేదు. కానీ మా అందరికీ ఒకటే ఒణుకు, భయం. ఆ అంకుల్ కూడా భయపడి కాస్త ధైర్యం  తెచ్చుకొని " ఏమీ జరగలేదు కదా బిడ్డా " అని మొదట పరామర్శించి, ఆ తరవాత మందలించారు.  ఇంక ఆ రోజు లగాయెత్తు పూలు కోసే ప్రక్రియ మానుకున్నాము.


ఈ రోజు పొద్దుట మా పెరటి తలుపు తీస్తుంటే దూరంగా ఉన్న పున్నాగ పూల వాసన ఈ జ్ఞాపకాలన్నింటినీ  ఒకసారి కళ్ళముందు కదిలించింది.  

 

 

 





 

4 comments:

  1. బాగుంది విశాలిగారూ మీ భావకుటీరం.

    ReplyDelete
    Replies
    1. ధన్యోస్మి మాష్టారు. ____/\__

      Delete
  2. పున్నాగపూలే సన్నాయి పాడే.... మీ ఙ్ఞాపకం చదవడానికి బావుంది

    ReplyDelete