Search This Blog

Friday, September 22, 2017

సహభాష్ కోకనాడి

“సహభాష్ కోకనాడి " అనే కవి పేరు విన్నారా ఎప్పుడేనా? అది ఆయన అసలు పేరు కాదు.. కలం పేరు.  ఆ కవికి  ఆ కలం పేరు ఉందని తెలిసిన వారు బహు కొద్దిమందేనేమో! ఎనిమిది భాషలలో  ఆ కవి రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, గద్య, పద్య, కవితా రచనలు చేశారు. పన్నెండు భాషలలో అనర్గళంగా మాట్లాడగల సమర్ధుడు  ఆయన. అందునా ఒక తెలుగు వాడు. ఆయన సొంత ఊరైన కాకినాడని తన కలంపేరుగా పెట్టుకొన్న మహా మనిషి,  అమరగాయకుడు " ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు" .... అందరికి సుపరిచయం.. "పి.బి. శ్రీనివాస్ " అనే!  


ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి,  కన్నడ, సంస్కృతం ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు. ఉర్దూ కవితలు రాసినప్పుడు “సహభాష్ కోకనాడి ” అనే పేరుతో రాసేవారు.  ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి,  కన్నడలో 3000 లకు పైగా పాటలు పాడారు. ఆకలి రాజ్యం సినిమాలో "తూ హై రాజా మై హూ రాణి " అనే హింది పాట వ్రాసింది పి.బి. శ్రీనివాస్ గారే! 


ఒకసారి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పి.బి. శ్రీనివాస్ గారి పాట విని ఆయన కుమారుడైన పావన శాస్త్రి గారితో " ఈ పాట పాడిందెవరూ? " అని అడిగారుట.


"పి.బి. శ్రీనివాస్ అదే ప్రతివాద భయంకర శ్రీనివాస్ అని... " అని ఆయన కుమారుడు జావాబివ్వగా


"మగటిమి ఉన్న గాత్రం .. భలే ఉంది " అని అన్నారుట ఆ గంభీర గాత్రాన్ని విని. 

 

"  డైమాండ్ టి " ... అనే ప్రక్రియతో ఒక మేలకర్త రాగానికి ఆరోహణ, అవరోహణలు చెబుతూ ఆ రాగాన్ని సులువుగా గుర్తుపెట్టుకోగల నైపుణ్యాన్ని ఎందరో విద్యార్ధులకు భోధించారు పి.బి. శ్రీనివాస్ గారు. అలా 72 మేలకర్త రాగాలను సులువుగా గుర్తించ గల ప్రక్రియ కనిపెట్టింది వారే! ఆయన కొన్ని రాగాలను  సృష్టించారు కూడా! ఆ రాగాలకు సాహిత్యం కూడా వారే రాసుకునేవారు. ఆయన మన సమకాలికులైన వాగ్గేయకారుడు. 


వారు ఎక్కడకు వెళ్ళినా ఆయన కారు నిండా పుస్తకాలతో నిండి ఉంటుంది. వారు ఏ సభలకు వెళ్ళినా ఒక చంటి పిల్లాడిని చేతిలో ఎత్తుకున్నట్టు ఆయన చేతిలో ఎప్పుడూ కనీసంలో కనీసం నాలుగైదు పుస్తకాలు ఉండేవి. ఆయన జీవితం లో పుస్తకాలకి అంతటి స్థానం ఉందన్న మాటా! వారి దగ్గర ఎక్కువ పుస్తకాలే కాదు... ఎక్కువ పెన్నులు కూడా ఎప్పుడూ ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న "ఫౌంటేన్ పెన్నులు " మరే రచయిత దగ్గరా లేవేమో!  ఆయన ఎక్కువగా రాసుకునే చోటు "వుడ్ లాండ్స్ " (డ్రైవ్ ఇన్) . అక్కడ వారికోసం ఒక బెంచి, కుర్చి ఆ "వుడ్ లాండ్స్ " వారు ప్రత్యేకంగా ఉంచేవారుట. 


ఒకసారి  భువనచంద్రగారు "ఇంత వరకు మీరు కన్నడా లో రాజ్ కుమార్ గారికి ఎక్కువ పాటలు పాడారు కదా... ఇప్పుడు ఆయన పాటలు ఆయనే పాడుకుంటున్నారు.. దాని మీద మీ స్పందన ఏంటీ? " అని అడుగగా...


"అంత గొప్ప గాయకుడు ఏమాత్రమూ అతిశయోక్తి లేకుండా నాచేత పాడించుకోవడం నా అదృష్టం " అని చేతులు పైకెత్తి నమస్కరిస్తూ అన్నారు. ఈ ఉదాహరణ చాలదూ వారి సంస్కారానికి, వినయానికి?



సినిమా పాటలే కాదు, అటు శాస్త్రీయ సంగీతంలోనూ  ఇటు ఘజల్స్ లోనూ ప్రావీణ్యులు పి.బి. శ్రీనివాస్ గారు! మన తెలుగు రాష్ట్రంలో కన్నా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గొప్ప గొప్ప సత్కారాలు పొందారు వీరు. అత్యుత్తమ అవార్డ్ అయిన "కన్నడ రాజ్యోత్సవ " అవార్డు ఇచ్చి సన్మానించింది కర్ణాటక ప్రభుత్వం.  


తమిళ్ నాడు ప్రభుత్వం "కళై మామణి , విద్వత్ శిరోమణి " తో పురస్కరించింది.  మన తెలుగు ప్రభుత్వం ఎప్పటిలాగానే ఒక విద్వాంసుడికి ఏ అవార్డ్ ఇవ్వక తన గొప్ప చాటుకుంది. ఈ రోజు వారి జయంతి... ఆయనకు నివాళులు. 

 

 

(వారి గురించి ఎంతో రాద్దామని ఉన్నా.. నాకు వచ్చిన భాష ఇంతే సహకరించింది. వారి గురించి ఎన్నో విషయాలు తెలియ చేసిన భువనచంద్ర గారికి మనస్ఫూర్తిగా వందనాలు).  

      

7 comments:

  1. < " మన తెలుగు ప్రభుత్వం ఎప్పటిలాగానే ఒక విద్వాంసుడికి ఏ అవార్డ్ ఇవ్వక తన గొప్ప చాటుకుంది " .
    బాగా చెప్పారు. అటువంటి పనులలో తెలుగు ప్రభుత్వం అందె వేసిన చెయ్యి కదా. మంగళంపల్లి లాంటి మహానుభావుడు మద్రాసులో స్థిరపడ్డారంటే ఆశ్చర్యమేమీ లేదు.

    ReplyDelete
    Replies
    1. వారు తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం... వారి దురదృష్టం.

      Delete
  2. ఎందరెండరో మహానుభావులు తెలుగునాట జనియించారు.
    వారు తెలుగునాట పుట్టటమే తెలుగువారి అదృష్టం.
    వారిలో అనేకానేక మందికి తెలుగునాట పుట్టటమే ఒక దురదృష్టం
    సంతోషించాలా విచారించాలా?

    ReplyDelete
    Replies
    1. వారు తెలుగువారిగా పుట్టడం మన అదృష్టం... వారి దురదృష్టం.

      Delete
  3. for Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in

    ReplyDelete
  4. విశాలిగారు! చాలా బాగా రాశారుతెలియని చిలా విషయాలు తౄలిపారు. ధన్యవాదాలు!

    ReplyDelete