Search This Blog

Thursday, October 26, 2017

కాదేది దొంగతనానికి అనర్హం

ఏంటో ఈ రోజు పొద్దుటే నాకు మా ఊరిలో "పాపి ' గుర్తుకొచ్చింది. పాపి ఎవరూ? ఆ వృతాంతం ఎట్టిది? అనగా... పాప మా ఊరిలో పొలం పనులు చేసుకొనే అమ్మాయి.. యువతి.. అన్న మాట. అసలు పేరు ఏంటో తెలియదు. కానీ ఆమె చేసే దొంగతనాలకు ఆ ఊరి ప్రజలందరూ ఆమెని 'పాపి " అని కసిగా పిలుచుకొనేవారు. పొద్దుట ఎవరింటి ముందు నుంచేనా వెళ్తే చాలు... సాయంత్రానికి వారింట్లో  వస్తువులు కనపడేవి కావు. కాదేది దొంగతనానికి అనర్హం అనే రీతిలో దొంగతనం చేసేది 'పాపి '.




అందరి ఇళ్ళల్లో దొంగతనం చేసే పాపి మనసు ఆదే ఊర్లో ఉంటొన్న 'ఇటికెడు ' దొంగలించేశాడు.  😍ఇటికెడు పాపి ని మించిన దొంగ కావడంతో వారి సంసారం 'మూడు దొంగతనాలు ఆరు దోపిడీలుగా ' సాగింది. వారి దోపీడీలకు చిహ్నాలుగా ఒక కొడుకు, ఇద్దరు కుతుర్లు... ఇలా ముగ్గురు పిల్లలూ పుట్టారు. 😍😍😍🤩 వాళ్ళ సుపుత్రుడు పుడుతూనే నర్స్ చేతి ఉంగరం దొంగలించేశాడని చెప్పుకుంటారు. 😎



ఒకసారి మా ఇంట్లో పప్పు గిన్నె పోయింది. మా మామ్మ పరవాన్నముతో ఆ గిన్నె పాపికి ఇచ్చింది. ఇంక అంతే... గిన్నె ఇవ్వలేదు సరిగదా... " గిన్నె ఎప్పుడిచ్చారు " అని ఎదురు ప్రశ్న వేసింది పాపి. ఇక తప్పేది లేదని ఒకసారి వీధిలోకి వచ్చిన 'పేరూరు ' ఇత్తెడి గిన్నెల అతను వస్తే కొనడానికి అనుకుంది మా మామ్మ. ఆ ఇత్తెడి గిన్నెల అతను కొన్ని గిన్నెలు చూపించాడు, ఒక గిన్నే అచ్చు మా ఇంట్లో పోయిన పప్పు గిన్నెలా ఉందని అదే గిన్నె తీసింది మా మామ్మ. దాని మీద పేరు చూసి అవాక్కయ్యింది. " కొ|| సు|| శాస్త్రి " అని ఉంది. అది మా తాతగారి పేరు. నా పోస్ట్లు తిరిగి మళ్ళీ నాకే వాట్స్ ఆప్ మేసేజ్ వచ్చినట్టు మా పప్పు గిన్నె మళ్ళీ మాకే వచ్చింది.😉 ఆ గిన్నె వివరాలు ఆ 'పేరూరి ఇత్తడి సామాన్ల " అతన్ని అడగగా, అది 'పాపి ' అమ్మినట్టు తెలిసింది. 'పాపి ' ని అడిగితే అంత నోరేసుకొని మరీ పోట్లాడేది. దానితో గొడవ ఎందుకులే అని ఇలానే చాలా మంది వదిలేసేవారు.


ఒకసారి దొంగతనానికి వెళ్ళిన ఇటికెడు, వాడి కొడుకు ఆ పొలంలో కరంటు షాక్ తగిలి అక్కడికక్కడే మరణించారు. ఊరి జనాల శాపానికే వాళ్ళు పోయారని 'పాపి ' ఇంకా కసిగా దొంగతనాలు చేయడం మొదలెట్టింది. పాపి దొంగతనాల్కి ఎక్కడా అదుపు ఆపు లేకుండా పోయింది ఆ ఊర్లో!! ఒకసారి నరాయణ మూర్తి అనే రైతు అంత వరకు అతని అరటి తోట కి సేవ చేసుకొని అన్నం తినడానికి వెళ్ళాడు, అన్నం తిని వచ్చి చూస్తే అరటి గెలలు మాయం. సైకిల్ వేసుకొని ఊరంతా తిరిగి 'పాపి ' ని వెతుకుంటూ వెళ్తే అప్పటికే ఆ అరటి తోటలో గెలలు తీసేసి మార్కెట్టు లో అమ్మేసి ఆ డబ్బుతో 'కల్లు ' తాగేసి ఇంట్లో దొర్లుతూ ఉంది 'పాపి '. అసలే 'పాపి ' పైగా 'కల్లు ' తాగింది... ఇంక తన జోలికి వెళ్ళడం అంత శ్రేయస్కరం కాదని ఆ రైతు ఇంటి ముఖం పట్టాడు. 🤬🤬



ఇంక ఊరు జనం తట్టుకులేక పంచాయతిలో వారి గోడు వెళ్లగక్కుకుంటే 'పాపి ' కి ఊరి నుంచి బహీష్కరింపు వేశారు పంచాయతి వారు. కొన్ని రోజులకి తాగి తాగి మతి స్థిమితం తప్పింది పాపికి. పాపం ఆమె కూతుర్లు ఆమెని బానే చూసుకోసాగారు. రోజూ ఇంట్లో కనీసం పది రూపాయిలైనా ఆమెకు కనిపించెలా పెట్టేవారు. ఆ డబ్బు ఎవరూ చూడకుండా దొంగలించేసేది 'పాపి ' ఆ డబ్బు తిరిగి కూతురికి ఇచ్చి దానితోటే కూరలు కొనమనేది. ఏ వస్తువూ దొంగతనం చేయలేని రోజున ఏవీ తినేది కాదు పాపి. మంచం మీద పడ్డాక కూడా చేతిలో ఎంతో కొంత డబ్బు పెడితే కానీ మందు వేసుకొనేది కాదు పాపి. పోయే ముందు కూడా చేతిలో పది రూపాయిలు పెడితే కానీ ప్రాణం పోలేదు పాపికి!!  😥



ఇంతకీ పాపి ఎందుకు గుర్తొచ్చింది అనేగా మీ ప్రశ్న. పొద్దుట వీధి గుమ్మం తలుపు తీయగానే ఒక తాడు వేళాడింది. అది భగత్ సింగ్ సినిమాలో అజయ్ దేవగన్ కి మొహం మీద వేసినట్టు నా మొహం మీదకి ఉంది. కెవ్వు మని అరవలేదు కాని భయపడ్డా.... ఆ తాడు చూసి పాము అనుకొని... తీరా తేరుకొని చూస్తే అది గుమ్మానికి కట్టిన గుమ్మెడి కాయకి కట్టిన తాడు. ఎవరో దిష్టి గుమ్మెడి కాయ దొబ్బేశారు. ఈ పాటికి అది ఏ పులుస్లోనో ముక్కయ్యి ఉంటుంది. కాదేది దొంగతనానికి అనర్హం....!!!😁😁

 

 

 














😁

7 comments:

  1. పాపి కథ బావుంది.

    ReplyDelete
  2. బీజేపీ రామభక్తుల భక్తినే దొంగతనం చేసింఫి - ఇతరుల నుంచి భక్తిని కూడా దొంగిలించవచ్చునని నిరూపించింది.దాంతో పోలిస్తే పాపి చాలా అమాయకురాలు:-)

    ReplyDelete
  3. బావుంది. మనిషి బలహీనత ఎలా ఉంటుందో ఈ కథని బట్టి చెప్పచ్చు

    ReplyDelete
  4. టపా బాగుంది విశాలి గారు

    ReplyDelete