Search This Blog

Friday, October 6, 2017

సినిమా

" హ్ష్.. ఈ కష్టాలు ఎప్పటికి తీరుతాయో " ఈ మాటా మాత్రం ఇప్పుడు స్పష్టంగా వినిపించింది. ఆ తరవాత ఇంకొన్ని మాటలు కొంచం గుణుకున్నట్లుగా వినపడ్డాయి. మధ్యాహ్నం 2 - 2:30 అవుతూ ఉంటుంది. జనవరీ నెల, మంచు ధ్యాన్యాలు కొలుస్తూ ఇంకా పుష్యమాసం వెళ్లలేదు. ఎండగా ఉందని పెరట్లో అరుగు మీద కూర్చొని నోట్స్ రాసుకుంటున్నాను. ఇంక ఆగలేక మెల్లగా నడుచుకుంటూ పశువుల పాక దాటాను, మాటలు అస్పష్టంగా గడ్డి మోపు వెనక నుంచి వస్తున్నాయి...


"పెళ్ళి చేసేసుకుంటే ఈ కష్టాలు తీరిపోతాయి బాబూ " అంది కనక

కనక మా ఇంటి పక్కన ఉంటుంది.


"అవును నాకూ అదే అనిపిస్తోంది " అని జవాబు... ఇచ్చింది వెంకట లక్ష్మి. వెంకట లక్ష్మి చాకలి మహాలక్ష్మి మనవరాలు.


" చక్కగా పెళ్లైతే మనకి కొత్త కొత్త చీరలు వస్తాయి, ఎవరివీ వెసుకోక్కలేదు, మనకో బీరువా ఉంటుంది, హాయిగా సాయంత్రం స్కూటర్ మీద సినిమాకి వెళ్ళొచ్చు, ఇప్పుడు నా బట్టలు మా చెల్లెల్లు వేసేసుకుంటున్నారు " అని వాపోయింది కనక.


"నావీ అంతే " అని వంత పాడింది వెంకట లక్ష్మి.. ఇది ఎప్పుడూ ఊర్లో వాళ్ళ బట్టలే వేసుకుంటుంది, దీనికి సెపరేటుగా బట్టలు ఎక్కడవి అని అనుకొని " అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ " అని నవ్వాను.  నన్ను చూసి ఇద్దరూ పరార్... 😘


ఈ విషయం మా తమ్ముడికీ, మా బాబాయ్ గారి అబ్బాయికి చెప్పి తెగ నవ్వుకున్నాము. వాళ్ళిద్దరూ సంక్రాంతి సెలవలకి వచ్చారు. ఇద్దరూ సినిమాకి వెళ్ళాలని ప్లాన్ వేసుకొన్నారు. నాకు ఒకసారి మా ఊరి వీరభద్ర థియేటర్ లో సినిమా చూడాలని ముచ్చటేసింది. ఇంట్లో ఒప్పించడం చాలా అంటే చాలా కష్టం. ఒక వేళ మా అమ్మ ఒప్పుకున్నా, వీళ్ళిద్దరూ ఒప్పుకోరు.. ఎందుకంటే వాళ్ళ అల్లరికి నేను అడ్డు. అందరూ ఏ కళనున్నారో కాస్త బతిమాలగానే చివరాఖరిలో ఒప్పేసుకున్నారు. 😍


సినిమా మొదలయ్యింది... థియేటర్లో చుట్ట కంపు, ఎలకల కోసం హడావిడిగా కుక్కలు తిరిగేస్తున్నాయి. రెండున్నర గంటల సినిమా, మేము నాలుగంటలు చేడచ్చు. మొత్తానికి ఇంటర్వెల్ అయ్యింది.. బాదాం గీర్ తాగడానికి బయటకి వచ్చాము.


బాదాం గీర్ తాగుతూ మా బాబాయ్ గారి అబ్బాయ్ మా తమ్ముడితో " ఒరేయ్ నీ టెంత్ పోయింది కదా, ఏం చేద్దామనుకుంటున్నావు? " అని అడిగాడు

మా తమ్ముడు " అమితాబ్ బచ్చన్ సినిమాలలోంచి వెళ్ళిపోతాడుట ( వీడికి చెప్పాడు మరి), నా సైకిల్ అమ్మేసి బొంబాయ్ వెళ్ళిపోద్దామనుకుంటున్నా ఈ సారి పాస్ అవ్వకపోతే అని అన్నాడు.


" మరి నీ సెవెంత్ ఏడో సారి తప్పావుగా నువ్వేం చేద్దామనుకుంటున్నావు? " అని మా తమ్ముడి ప్రశ్న.

" రజనీ కాంత్ తమిళ్ సినిమా నుంచి రిటైర్ అయ్యిపోతాడుట, నేను ఈ ఉంగరం అమ్మేసి మదరాస్ పోద్దామనుకుంటున్నాను " అని జవాబిచ్చాడి బాబాయ్ గారి అబ్బాయి.


" ఏమేయ్... నువ్వు ఎన్ని సార్లు టెంథ్ కడతావు? నువ్వేం చేద్దామనుకుంటున్నావు? " అని నా వైపు బాణం వేశాడు మా తమ్ముడు.


నేను నీళ్ళు కాదు బాదం గీర్ లో బాదం నమిలాను. " నీ గొలుసు అమ్మేసుకొని నువ్వూ మదరాస్ వెళ్ళిపో " అని మా తమ్ముడు సలహా.


"అవును.. టెంథ్ పాస్ అయితే పెళ్ళి చేస్తారనుకొంటున్నాను, ఎంచక్క పెళ్లైతే బీరువా నిండా బట్టలు, స్కూటరూ, సాయంకాలం రోజు ఆ స్కూటర్ ఎక్కి సినిమాకి వెళ్ళొచ్చు " అని ముందు రోజు విన్న డైలాగు అక్కడ అప్ప చెప్పేశాను.


మా తమ్ముడు ఒకసారి సైగ చేసి వెనకాల చూడమని చెప్పాడు. నేను వెనకాల చూస్తిని కదా ఒక పెద్దాయన మా వైపే చూస్తున్నాడు. ఇప్పుడర్ధమయ్యింది, ఈ పత్యపు మాటలకి కారణం ఏంటో. నేను ఇంక మాట్లాడ దలచుకోలేదు. మా ఊరు సంగతి నాకు తెలుసు... గాలి కన్నా వార్తలు ముందుగా ప్రయాణం చేస్తాయి.


ఆ పెద్దాయన నా వైపు ఆ సినిమా పొస్టర్ వైపు అలా చుస్తూనే ఉన్నాడు. బహుశా ఆ సినిమా హీరోయిన్ నాలా ఉంటుందని చూస్తున్నాడనుకొని మురిసిపోయా......


సినిమా మొత్తానికి చూసి, సెంటర్ లో " దొమ్మేటి " వాళ్ళ కొట్టు లో ద్రాక్ష రసం బాగుంటుందని అక్కడ ఆగి అది తాగేసి, ఎదురుగా చెప్పులు కొనుకొని హాయిగా ఇల్లు చేరాము. సావిట్లో ఒక పెద్దాయన.. సినిమా హాల్ దగ్గర కనిపించిన అతనే.


"వీళ్ళేనా మీరు చెప్పిన వాళ్ళు " అని నాన్న మమల్ని చూపించి అడిగారు. ఆయన కోపంగా " అవును వీళ్ళే " అని జావాబు ఇచ్చారు "


అంతా చెప్పేశాడన్న మాట, ఇలాంటి వాళ్ళు బి. బి. సి , పి.టి. ఐ. లో పని చెయ్యాలి అని తిట్టుకొంటూ రాబోయే తుఫాన్ తలచుకొని కాస్త భయపడి త్వరగా తినాల్సింది తినేశాము ( తరవాత తింటి తినడానికి టైం ఉండదు .. చివాట్లకే కడుపు నిండిపోతుంది).😥😥


ఆయన వెళ్తూ వెళ్తూ " మీ అమ్మాయికి త్వరగా పెళ్ళి చేసేయండి " అని ఓ చెత్త సలహా ఇచ్చి మళ్ళీ   నా వైపు అదే లుక్ వేసి వెళ్ళిపోయాడు. ఆ రోజు ఇంట్లో 'వన్ డే మాచ్ '  . ఆ తరవాత మళ్ళీ మా ఊరిలో సినిమాకి వెళ్ళలేదు నేను..😢😢


ఇంతకీ మేము చూసిన సినిమా పేరు చెప్పలేదు కదా " దొంగ కోళ్ళు ". 😜


4 comments:

  1. కథనం‌చాలా బాగుంది.
    తెలుగు కూడా బాగుంది. కొద్దిగా అక్షరేదోషా లున్నాయి. వీలు చూసుకొని వాటిని దిద్దండి.
    తరచుగా వ్రాస్తూ ఉండండి.

    ReplyDelete
  2. చక్కగా సహజంగా వుందీ పోస్ట్. నా చిన్నప్పటి టవున్ జ్ఞాపకానికి వచ్చేసింది. హ్మ్, మిస్ అవుతున్నా, ప్చ్!

    ReplyDelete
  3. భలే భలేగా ఉందీ పోస్టు... సీనంతా కళ్ళకి కట్టినట్టుగా ఉంది చదువుతూంటే... మీరు హ్యూమర్ బాగా పండించగలరు.

    ReplyDelete