Search This Blog

Friday, January 4, 2019

అ ' పరిచిత '




ట్రైన్ బెంగుళూరు లో మొదలయ్యింది. అప్పుడప్పుడే ఎండలు మొదలవుతున్నాయేమో చాలా వేడిగా ఉంది. ఒక్కసారి రైలు బయలుదేరాక చల్లగా అనిపించింది.  పొద్దుట నుంచి ప్రయాణ హాడావిడిలో ఉన్నారేమో జనాలు రైలు ఎక్కగానే కాస్త  స్థిమిత పడ్డాక కారేజీలు తీసి భోజనాలు మొదలెట్టారు. నేను భోజనం చేసి  బయలుదేరాను కాబట్టి ఏమీ తినలేదు. అందరూ తినగానే ఎవరి బెర్తుల వైపు వాళ్ళు వెళ్ళి కాసేపు నడుము వాల్చారు. నేను ఏదో పుస్తకం పట్టుకొని చదువుతున్నాను.

నా ఎదురుగా ఒక జంట వాళ్లకి ఇద్దరు పిల్లలు పాపకి ఏడూ ఎనిమిదేళ్ళ   మధ్య ఉంటుంది వయసు.  బాబుకి మూడేళ్లు ఉంటాయి. పదేళ్ళ నుండి బెంగుళూరులోనే ఉంటున్నారుట ... అతని పేరు ముకుంద్, అతని భార్య పేరు శిరీషట.   ఇంకో పెద్ద జంట యాభై పైనే ఉంటుంది వారి వయసు. అతని పేరు సూర్యనారాయణ  భార్య పేరు శైలజ , కొడుకు ఇంటికి వెళ్ళి వస్తున్నారుట. ఇవన్నీ రైలు ఎక్కిన అరగంటలో అయిన పరిచయాలు.


రైలు కుప్పం దగ్గర ఆగింది.. కొందరు పుస్తకాలు అమ్మే వాళ్ళు వచ్చారు. వాళ్ళు అమ్మే పుస్తకాలలో 'చందమామ ' కూడా ఉంది. నేను కొనుకున్నాను.. ఇంకా వేరే ఏ పుస్తకాలు ఉన్నాయో అని చూస్తుండగా... ఒక 'ఆవిడ ' పెద్ద సూట్ కేస్తో హడావిడిగా రైలు ఎక్కింది . సన్నగా, పొడుగ్గా ఉంది.  నల్ల నువ్వులు తెల్ల నువ్వులు కలిపేసినట్టుగా తెల్లవెంట్రుకల  మధ్యలో నల్ల వెట్రుకలతో జుత్తు చిన్న ముడి, ఒంటి మీద ఏ రకమైన నగ నట్ర లేదు.. చేతికి వాచి తప్పా. నీలి అంచుతో తెల్లటి ధర్మవరపు చీర, డబ్భైలో జయసుధ వేసుకొనే కాలర్ బ్లౌజ్ తో ఉంది.  అలంకరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకపోయినా ఏదో తెలియని అందం ఉంది ఆవిడలో. మా వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వింది. బహుశా అదే 'పెద్ద ' ఆభరణమేమో ఆవిడకి. మా పక్కనే కూర్చుంది. కాస్త ఆయస పడుతోంది.    డబ్బులు ఇచ్చి ఆ పుస్తకాల అతనిని పంపేశాను.

మా వైపు చూసి " హడావిడిగా ఎక్కేశానండి.. నెక్స్ట్  స్టాప్ లో దిగి వేరే బోగి లోకి వెళ్తాను " అని మెల్లగా చెప్పింది. 

"పరవాలేదండి, మంచి నీళ్ళు కావాలా   " అని అడిగాను.

"థాంక్స్ తల్లి, కాసేపాగి తాగుతాను " అని తన హాండ్ బాగ్ నుంచి నీళ్ళ బాటిల్ బయటకు తీసుకొంది. 

రెండు నిమిషాలు ఆయసం తీర్చుకున్నాక నా చేతిలో 'చందమామ ' చూసి...

"ఒకప్పుడు ఉన్న కథలు ఇప్పుడు లేవమ్మా... ఒకప్పుడు కథలు బాగుండేవి.. ఇప్పుడు ఏదో అభిమానం కొద్ది కొంటున్నాము కానీ ఆ సారం లేదమ్మ " అంది ఆవిడ.

"అవునండి " అన్నాను నేను.

"  'చందమామ 'లో వచ్చే ప్రతీ కథ ఒక అపురూపమైన జ్ఞాపకం అమ్మా, ముఖ్యంగా 'తోక చుక్క ' ,  ' కంచుకోట ' ,'  రాకాసిలోయ' మొ!!  కథలు కల్పితాలైన ఎంత బాగుండేవో ? రాసిన ఆయిన దాసరి సుబ్రహ్మణ్యం గారు శైలి కూడా బాగుందేది,  ఆ కథలు పిల్లలతో పాటు పెద్దలు కూడా ఆశక్తిగా చదివేవాళ్ళం. మళ్ళీ వచ్చే నెల పుస్తకం కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళం,   అసలు పిల్లలు తెలుగు నేర్చుకున్నారంటే కారణం ఆ అపురూపమైన పుస్తకాలే కదండి, ఈ రోజుల్లో అటువంటి పుస్తాకాలేవీ?  " అని వాపోయింది. 

మా మాటలన్నీ ఆశక్తిగా వింటున్నాను. నాకు నిజంగా 'చందమామ ' లో కథలు "దాసరి సుబ్రహ్మణ్యం గారు ' రాశారన్న సంగతి తెలియదు.

" మా నాన్న గారు చిన్నప్పటి నుంచి ఈ 'చందమామ ' కొనేవారండి. అంతకు ముందు వచ్చినవి కూడా బైండింగ్ చేసి ఉంచారండి. ఇప్పటి పాత 'చందమామ ' లు మా ఇంట్లో ఉన్నాయి  " అని అన్నాను.

" నీ పేరు ఏంటమ్మా? " అని అడిగింది ఆవిడ.

"సుగాత్రి అండి " అని చెప్పాను.

" భలే మంచి పేరు,  నీ పేరుకి అర్ధమేంటో తెలుసా? " అని అడిగింది

" ఆ తెలుసండి...  మంచి గాత్రము కలది..., కళాపుర్ణోదయం లో  నాయిక పేరు సుగాత్రి, అలాగే సరస్వతిదేవి సహస్రనామాలలో ఒకటి సుగాత్రి. "

" ఈ పేరు పెట్టుకున్నారంటే మీ తల్లితండ్రులకి మంచి టేస్ట్ ఉందని తెలుస్తోంది. " అంది ఆవిడ

" అవునండి మా నాన్న గారికి తెలుగు సాహిత్యం అంటే చాలా ఇష్టము ... మా అమ్మగారికి శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టము " అని చెప్పాను.

" సంగీతము మనము మనతో మాట్లాడుకోడానికి ఉన్న ఏకకైక భాష, సాహిత్యము మనమేమిటో మనకి చెప్పేది.. "ఏకమాపాత మధురం..... అన్యదాలోచనామృతం ' ఇవి లేని జీవితాలు నిస్సారాలే తల్లీ " అని అంది. 

ఇంతలో ముకుంద్ పిల్లాడు బాగా అల్లరి చేస్తుంటే " నో బేటా, కం అండ్ సిట్ హియర్.. ఐ విల్ గివ్ యూ చాక్ లెట్ ఇఫ్ యూ లిసిన్ టు మి " అంటూ ఇంకా ఏదో అంటున్నాడు.

వాళ్ల వైపు అలాగే చూస్తూ ఉంది ' ఆవిడ ' ...

" వేర్ ఆర్ యూ ఫ్రమ్ " అని అడిగింది

" కాకినాడ " అని చెప్పాడు ముకుంద్

" తెలుగు వాళ్ళు కాదా? " అని అడిగింది

" అబ్బే! తెలుగు వాళ్ళమేనండి... " అన్నాడు ముకుంద్ కొంచం ఇబ్బందిగా.

" మరి.... ఇందాకటి నుంచి చూస్తున్నాను మీరు తెలుగులో మాట్లాడటం లేదు... "

" ఓ.. అదా.. మా పిల్లలు బెంగుళూరిలో పుట్టారు,   వాళ్ళ కోసం మేము ఇంట్లో ఇంగ్లీష్, హింది మాట్లాడుతాము, బయట ఇబ్బంది పడకూడదు కదండి  " అని నవ్వుతూ జవాబిచ్చాడు ముకుంద్.

" అదేంటయ్యా! ఇంత పసి పిల్లలకి ఏ భాషా  సరిగ్గా మాట్లాడటం రాదు....ఏ భాషైనా అర్ధం చేసుకోగల నైపుణ్యం మాత్రం ఉంటుంది... అదీ తల్లి లాలనతో చెపితే ఇంకా చక్కగా అర్ధం చేసుకుంటారు.  మీరు ఇలా మీ మాతృభాషని పిల్లలకి తెలియకుండా పెంచుతూ ఎంత తప్పు చేస్తున్నారో తెలుసా? వాళ్లకి నాన్నమ్మ, అమ్మమ్మ  తాతగార్లతో మాట్లాడే అవకాశం మీరు ఈ విధంగా కట్ చేసేస్తున్నారు. పిల్లలకి ఇంకో భాష తెలిస్తే తప్పేంటీ?

మన ముత్తాతలు గ్రాంధికంలో మాట్లాడుకునే వారుట, అప్పట్లో ఆడవాళ్ళు కూడా 'అమరకోశం '  చదువుకొని చాలా పదాలకి అర్ధలు తెలుసుకునే వారుట. మన తాతల దగ్గరకు వచ్చే సరికి గ్రాంధికం తగ్గింది... కొంచం వాడుక భాష వచ్చింది. పోనీ అదీ ఒకందుకు మంచిదే అనుకున్నాము.. మంచి మంచి పుస్తకాలు అందరూ చదివే అవకాశం వచ్చిందని ఆనందించాము.  మన దగ్గరకి వచ్చేసరికి వాడుక కూడా పోయీ.. 'తెలుగు ' కి 'తెగులు ' పట్టేసింది. ఇంక మన తరవాతి తరానికి వచ్చే సరికి 'సమాధులు ' కట్టేసే సమయం వచ్చేసింది. పిల్లలకి ఇంగ్లీష్, హింది మాట్లాడటం ప్రత్యేకంగా నేర్పాల్సిన అవసరం లేదు.. ఈ రోజుల్లో స్కూల్లో అవి వాళ్లంతట వాళ్ళే నేర్చుకుంటున్నారు. కానీ మాతృభాష మాత్రం నేర్పవలసింది మాత్రం 'తల్లిదండ్రులే ' ఇంగ్లీష్, హింది నేర్చుకోవల్సిన అవసరం చాలా ఉంది కానీ మాతృభాష ని నేర్చుకోకుండా అవే నేర్చుకోవడం సబబు కాదు..
'ఆవు పాపు శ్రేష్టమైనవే... అలా అని గేదె దూడ ఆవు పాలు తాగదు కదా? .. పశువుల్లో ఉన్న ఇంగితం మనకు లేదా?'  " అంటూ కాస్త కోపంగా, బాధగా చెప్పుకుపోతోంది.

ఆవిడ మాట్లాడుతున్నంత సేపు అందరూ ఆవిడ వైపే చూస్తూ ఉండిపోయాము. మంచి వాక్పటిమ ఉన్నావిడే!! 'ముకుంద్ ' మొహం లో చిరాకు, విసుగు ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి 'ఆవిడ ' మాటలకి.

పక్కన కూర్చొని వింటున్న సూర్యనారాయణ గారు " అవునండి.. ఇప్పుడు మేము మా కొడుకింటి నుంచి వస్తున్నాము... మా మనవలకి ఇంగ్లీష్, హింది తప్ప వేరే భాష రాదు. మాకు ఇంగ్లీష్ హింది అర్ధమౌతాయి కానీ మాట్లడలేము. వాళ్ళని దగ్గరకు పిలిచి కథలు చెపుద్దామంటే భాషే పెద్ద ఆటంకం అయ్యింది. హాయిగా మాట్లడలేని పరీస్థితి మాది. వాళ్ళు మాకు ఇన్నాళ్లైనా 'దగ్గర ' కాలేకపోయారు.. కారణం ...'భాష ' " అని ఆయన బాధ చెప్పుకొన్నారు.

వీళ్లందరూ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ముకుంద్ కి, అతని భార్యకి కొంచం ఇబ్బందిగా అనిపించింది. వాళ్ల పిల్లలకి వీడియో గేంస్ ఇచ్చి పక్కకు తీసుకెళ్ళెపోయారు మమల్ని ఎవాయిడ్ చేస్తూ. అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు.

ఇంతలో 'చాయ్ ' వాడు వస్తే అందరూ 'చాయ్ ' తీసుకున్నారు.. నేను  రెండు 'టీ ' లు  తిసుకొని ఆవిడకు ఇచ్చాను. 

"పర్లేదండి.. నేను ఇస్తా ' అని చాలా బలవంతం పెట్టినా సరే ఆవిడే 'టీ ' వాడికి డబ్బులు ఇచ్చింది.

టీ తాగుతున్నప్పుడు అందరూ ఏదీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. 

" ఇంతకీ మీరేమి చేస్తూంటారు? " అని అడిగాను మౌనాన్ని ఛేదిస్తూ.. 

" నేను ఒక రైటర్ ని అమ్మా!, సాహిత్యము నా ఊపిరి " అని చెప్పింది ఆవిడ.

ఆవిడ రైటర్ అనగానే ఒక్కసారి అంతా ఆవిడ వైపు చూశారు.. 'ముకుంద్ ' తో సహా...

"ఏవేవి రాసారండి? "  అడిగాను

" చాలానే రాసానండి, రాసిన చాలా వాటికి వాజ్ పయ్ , పి.వి. నరసింహా రావు గారు, వేటూరి గారు మొ! వాళ్ళ నుండి ప్రశంసలు కూడా వచ్చాయి. " అని చెప్పింది

మేమంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాము. ప్రముఖులతో ఆవిడ పరిచయాలు, సాహిత్యములో ఆవిడకు తెలిసిన విషయాలు చెప్తుంటే అంతా మంత్రముగ్ధులై వింటున్నాము. 

"ఢిల్లీ  లో మా ఇల్లు ఒక ' భువన విజయం ' లాగానే ఉండేది.  ఎంతో మంది కవులు పండితులు మా ఇంటికి వస్తూ ఉండేవారు.  మీరు ఎప్పుడేనా ఢిల్లీ వస్తే మా ఇంటికి రండి. " అని చెప్పింది.    

"మరి మీరు ఇక్కడకు ఎందుకొచ్చారు? అని అడిగాను....

ట్రైన్  ఆగడంతో ఆవిడ "సరేనమ్మ.. నేను వేరే బోగికి వెళ్తాను.. మీతో కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది.. " అని అంత పెద్ద సూట్ కేస్ మోసుకుంటూ దిగింది. సాయం చేస్తానని ఆ సూట్ కేస్ తీసుకుంటుంటే వారించింది  "నా పని నేనే చేసుకోవాలన్న స్వార్ధం ఉంది నాకు " అని నవ్వేసింది.

నా ప్రశ్నకు జవాబు ఆవిడ నుండి దొరకలేదు.

ట్రైన్ కదిలింది.. టి.సి.. అటువైపు గా వెళ్తోంటే టి.సి ని అడిగాను..

" ఒక పెద్దావిడ  అరవై డభై ఏళ్ళ మధ్యలో ఉంటుంది.. వేరే బోగిలోకి వెళ్తానని చెప్పింది.. ఆవిడ వేరే భోగి ఎక్కిందా సార్? " అని

"ఒక పెద్ద సూట్ కేస్ ఆవిడేనా? సన్నగా పొడుగ్గా ఉంటుంది ఆవిడేనా? " అని అడిగాడు

" అవునండి " అని అన్నాను

" ఆవిడ దిగి వెళ్ళిపోయింది... " అన్నడు

"అదేంటీ? " నేను ఆశ్చర్యంగా అన్నాను..

"ఆవిడకి మతి స్థిమితం లేదండి.. ఇలాగే వారానికో పది రోజులకోసారి ఒక గంట రెండు గంటల ప్రయాణం చేస్తుంది. మళ్ళీ స్టేషన్ లో దిగి వచ్చిన దారినే వెనక్కు వేరే ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోతుంది.  ట్రైన్ లో కనపడిన వాళ్ళతో కాసేపు ఏవేవో కబుర్లు చెప్పుకుపోతూ ఉంటుంది. ఆవిడకు ఒక్కడే కొడుకట, అతను వేరే దేశం అమ్మాయి పెళ్ళి చేసుకొని అక్కడే పరాయి దేశం లో స్థిరపడిపోయాడుట. ఇక్కడకు రాడు, ఈవిడను అక్కడకు తీసుకెళ్ళడు.  తెలుగు లెక్చరెర్ గా చేసి రిటైర్ అయ్యింది.    మంచి రచయిత కూడా.  భాషాభిమానం ఎక్కువయ్యి ఇలా అయ్యిపోయింది. అప్పుడప్పుడు కొన్ని స్కూల్స్ కి వెళ్ళి 'తెలుగు ' లో మాట్లాడమని పిల్లలకు చెపుతూ ఉంటుంది. ఇవన్నీ నాకు ఆవిడ స్టూడెంట్స్  చెప్పారు ఇలాగే ప్రయాణం లో కలిసినప్పుడు.  బాగా బ్రతికినావిడే... ఎప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు ఆవిడ.. కబుర్లే బోలేడు చెప్తుంది.. అదో రకం.. అంతే " అని వెళ్ళిపోయాడు.  

నమ్మలేకపోయాను నేను టి.సి. మాటలని.

" నాకు ఎందుకో ఆవిడ పిచ్చిదనే అనిపించింది ఆ వాగుడికి. ఇలా తిక్క తిక్కగా వాగుతోంది కాబట్టే పిల్లలు భరించలేక వదిలేశారు, పిచ్చి మొహంది. భాష , సేవ ఇలాంటి తలతిక్క కబుర్లు చెప్తోంది కాబట్టే ఎవరూ పట్టించుకోరు.... పిచ్చిది నోరు మూసుకొని ఎక్కడో మూల కూర్చోకా ఊరు మీద పడి ఇలా ఈ పైత్యపు వాగుడెందుకో.. షిట్.. కబుర్లలో పెట్టి  ఎవరి దగ్గరేనా  దొంగ తనము కూడా చేస్తుందేమో !! బ్లెడీ... ఇలా తిరుగుతూ తిరుగుతూ ఎప్పుడూ ఏ రైలు కింద పడో...."

"జుస్ట్ షట్ అప్ " అని గట్టిగా అరిచాను....

అంతా నావైపే చూస్తున్నారు....

"ఎవరికి పిచ్చి? భాష ని కాపాడాలని సాయశక్తులా ప్రయత్నిస్తోన్న ఆవిడకు కాదు 'పిచ్చి ' .  తల్లీతండ్రులని సరిగ్గా చూసుకోలేక వదిలేసిన ఆ కొడుక్కి  'పిచ్చి ',  పర భాష వ్యామోహం లో పడి మాతృభాష కి నీళ్ళొదిలేసిన మీలాంటి వాళ్ళకి 'పిచ్చి ', ఆవిడ కనీసం మన దగ్గర 'టి ' కూడా తీసుకోడానికి ఇష్టపడలేదు.  అలాంటావిడ దొంగతనం చేస్తుందనా మీకు భయం. ఎవరో ఆవిడకు మతిస్థిమితం లేదన్నారని మిగిలినవి మనం ఊహించేసుకోవడమే? మీకు పిల్లలతో మాట్లాడటానికి 'తెలుగు ' పనికి రాలేదు , కానీ ఆవిడని అసభ్యంగా తిట్టేటప్పుడు  'తెలుగు ' గుర్తుకొచ్చిందా? " ఒక్క నిముషం ఆగాను... 

" మీకు ఆవిడ మొసగత్తెగా, పిచ్చిదనిలా కనిపించిందేమో... నాకు మాత్రం చిక్కి శైల్యమై పోతున్న ఆదరణకు కరువైన,  అనాధ అయిన  'తెలుగు తల్లి ' గా కనిపిస్తోంది ఇప్పుడు. తనని కాపాడమని,  బ్రతికించమని ఇలా ప్రతీవారినీ దీనంగా వేడుకుంటోంది.  మీకు కుదిరితే చేతనైతే మాతృభాషలో మాట్లాడండి... 'తెలుగు ' బ్రతికించండి. లేకపోతే మీ  ఏడుపేదో మీరు ఏడవండి.. అంతే కానీ ఇలాంటివాళ్లని 'పిచ్చి వాళ్ళు ' అని ముద్ర వేసి మీ సంస్కారాన్ని బయట పెట్టుకోకండి " అని రాగల పర్యంతంగా వస్తున్న కన్నీళ్లని ఆపుకుంటూ అన్నాను. 

" అవునమ్మా.. ఆవిడ పిచ్చిది కాదు " అని సముదాయిస్తూ అన్నారు సూర్యనారాయణ గారు, ఆయన భార్య.

కూర్చొని వెనకకు వాలగా.. ఏదో గట్టిగా తగిలింది. అది ఒక పుస్తకం లాంటి డైరీ! అందులో ఫొటోలు, కొన్ని కవితలు ఉన్నాయి. కొన్ని వ్యాసాలు కూడా ఉన్నాయి. చాలా పెద్ద పుస్తకం. చదువుతుంటే ఎక్కడో చదివనట్టు ఉంది.. అవును.. అది అది.. ' సుగాత్రి ' గారివి. ఆవిడ మీద అభిమానంతోటే మా నాన్నగారు నాకా పేరు పెట్టారు. అవును ఆవిడ గొప్ప సాహిత్యాభిమాని "సుగాత్రి " !! 

No comments:

Post a Comment