Search This Blog

Wednesday, January 9, 2019

మంచు తెరలు

                                                                

గత వారం రోజులుగా ఒకటే పొగమంచు. సూర్యుడిని చూసి వారమౌతోంది. వాతావరణం అంతా మసకమసకగా ఉంది... కీర్తన మనసులా..


స్టవ్ మీద పాలల్లో బియ్యం  కుతకుతలాడుతూ ఉడుకుతోంది....  కీర్తన ఆలోచనలూ అలానే ఉన్నాయి. ఎంత సంభాలించుకుంద్దామన్నా ఆలోచనలు "ఆమె "  వైపే వెళ్తున్నాయి. మనసులో ఎంత మధనపడుతున్నా అడగడానికి ఎందుకో ధైర్యం చాలడం లేదు. అతను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు? తను చేసిన తప్పు ఏవయ్యి ఉంటుంది? లంచ్ అంతా రెడీ చేసి, పాయసం చేస్తూ  అతని కోసం ఎదురుచూస్తోంది  కీర్తన. గన్ట క్రితం 'ఆమె ' నుంచి ఫోన్ వచ్చింది.. వస్తుంటే కారు ఆగిపోయిందిట వచ్చి పిక్ అప్ చెసుకోమని. వెంటనే తన భర్త "ఆమె " ని తీసుకొని రావడానికి బయలుదేరాడు.


 

***************


మూడు నెలల క్రితం కీర్తన భర్త మురళి "ఆమె " గురించి చెప్పాడు. ఆమె పేరు " సంజన" ట.  గుజరాతి అమ్మాయి. మురళి ఆఫీస్ లో ఆరు నెలల క్రితం జాయిన్ అయ్యిందిట. ఇద్దరూ ఒకే ప్రాజెక్ట్ లో ఉండటంతో కలిసి లంచ్ లు, కార్ పూల్ లు సహజంగా జరుగుతూనే ఉన్నాయిట. ఇవేవీ అంతగా పట్టించుకోలేదు కీర్తన. కానీ ఒకరోజు మురళి  "నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను " అని పక్కన కూర్చొని తనతో అన్నాడు.


"సంజన నన్ను ఇష్టపడుతోంది... తను డైవర్సీ, నాతో కలిసి ఉంటానంటోంది. ఒకరోజు లంచ్ కి పిలుద్దామనుకుంటున్నాను, ఎల్లుండి ఆదివారం తనని పిలుస్తున్నాను " అని తన అభిప్రాయం కనుకోకుండా ఆఫీస్ కి టైం అవుతోందని లేచి వెళ్ళిపోయాడు.


***********


పాలు పొంగి చేతి మీద పడటంతో వాస్తవంలోకి వచ్చింది కీర్తన. ఇప్పుడు ఆ అమ్మయిని ఎందుకు తీసుకొస్తోనందుకు? మురళి అతని  ఇల్లు, వాకిలి చూపించి... ఇంకొన్ని రోజుల తరవాత " అవి నీవే " అని చెప్పడానికా? పదేళ్ళ కాపురంలో ఏ రోజూ అతని అభీష్టానికి వెతిరేకంగా తను ప్రవర్తించలేదు. అతని అమ్మని అతని కంటే ఎక్కువగా చూసుకుంది. అతని వైపు చుట్టాలు కూడా తనని చాలా ఇష్టపడతారు. మరి ఎందుకు ఇప్పుడీ కొత్త మోజు? పాయసం లో గరిటకు దాని రుచి తెలీదు, అలాగే ఈ మగాళ్ళకు భార్య విలువ తెలీదు.  పిల్లల పెంపకంలో కానీ, వాళ్ళ చదువులో కానీ ఏ రోజూ మురళి సాయాం లేకుండానే అన్నీ సమర్ధించింది తను. మరి ఏ తక్కువ చేశానని మురళి ఈ దారి వైపు వెళ్ళాడో... అన్ని ఆలోచనల మధ్యలో పాయసం అయితే పూర్తి చేసింది కానీ మనసు మనసులో లేదు.  కార్ హారన్ తో ఒక్కసారి ఉలికిపడింది. రావల్సిన టైం వచ్చేసింది.. "ఆమె " అదే సంజన వచ్చేసింది. తను ఇప్పుడు వెళ్ళి ఇద్దరికీ హారతి ఇచ్చి స్వాగతం చెప్పాలా? " భగవంతుడా ఇలాంటి పరీస్థితి ఏ భార్యకూ రాకూడదు. మురళి కారు దిగి , పక్కకు వచ్చి కార్ వెనక డోర్ తీసి సంజనను ఇంట్లోకి రమ్మన్నట్టు సైగతో ఆహ్వానించాడు. సంజనతో పాటు ఐదేళ్ళ బాబు కూడా వచ్చాడు. ఆ బాబు సంజన కొడుకని కిటికీలోనుంచి చూస్తొన్న కీర్తన అర్ధం చేసుకుంది.


"కీర్తి... కీర్తీ.. " అరచుకుంటూ  ఇంట్లోకి హడావిడిగా వచ్చాడు మురళి...


మురళి వెనకాలే సంజనా, కొడుకు.


" నేను చెప్పాను కదా ... మా ఆఫీస్ లో పని చేసే ఆమె .. సంజన అని " అని పరిచయం చేశాడు.


కీర్తన చేతులు జోడించి నమస్తే చెప్పింది.. సంజన మొదట "హాయ్ " చెప్పింది కానీ కీర్తన నమస్తే చెప్పడం తో ఆమె కూడా నమస్తేనే చెప్పింది.


ఇంట్లోకి రాగానే సంజన కొడుకు " ఈ ఇల్లు చాలా బాగుంది.. మనం ఇక్కడే ఉండిపోద్దామా " అని అడిగాడు


మురళి... " ఈ ఇల్లు ఆంటీది.. ఆంటీ ఒప్పుకుంటే ఉండిపోవచ్చు " అని అన్నాడు...


హ్మ్మ్.. పిల్లాడి దగ్గర నుంచి ప్రిపేర్ అయ్యిపోయి వచ్చేసినట్టున్నారని మనసులోనే అనుకుంది కీర్తన.


చిరునవ్వు నవ్వుతూ " మంచి నీళ్ళు కావాలా? " అని అడిగింది. వాళ్ళ సంభాషణ మొత్తం హింది, ఇంగ్లీష్ లోనే జరుగుతోంది.


"పర్లేదు.. వద్దు " అని సంజన అంది.


" కీర్తన మాత్రం లేచి వంటింట్లోకి వెళ్ళి మూడు గ్లాసులతో మంచి నీళ్ళు తీసుకొని వచ్చింది.


"పిల్లలు ఎక్కడకి వెళ్ళారు? " అని అడిగింది సంజన


"వాళ్ళ నాన్నమ్మతో ఊరు వెళ్ళారు రేపు వచ్చేస్తారు " అని సమాధానం చెప్పింది కీర్తన.


ఇంటికి వచ్చినప్పటి నుంచి కీర్తనని చూస్తూనే ఉంది సంజన. ఈ విషయం కీర్తన కూడా గ్రహించింది. కానీ పట్టించుకోనట్టుగానే ఉంది. సంజన  పాతిక నుంచి ముప్పై ఏళ్ళ మధ్యలో ఉంటుంది . కానీ నిత్యం బ్యూటీ పార్లర్ కి వెళ్ళే రకం అని మొహం చూస్తేనే అర్ధమవ్వుతుంది. అందువల్లనేనేమో వయస్సు ఇరవై ఒకటి ఇరవై రెండు అంటే నమ్మేయవచ్చు. నార్త్ ఇండియన్ ఏమో మంచి రంగు, సన్నగా నాజూకుగా ఉంది.   సంజనని చూశాక కీర్తన మనసు ఇంకొంచం కలత చెందింది. "చిదిమితే పాలుగారే మొహం సంజనది, తానేమో చామన ఛాయ , సంజన స్టైల్ గా ఉంటుంది, తానేమో పాత చింతకాయ పచ్చడిలా మొహానికి పౌడర్ కూడా రసుకోదు , సంజన జట చక్కగా కట్టింగ్ చేయించుకొని అలా వదిలేసుకొని ఉంది, తానేమో పెద్ద జడ వేసుకొని జిడ్డుమొహంతో ఉంది... బహుశా ఇందుకేనేమో భర్తకు ఆమె నచ్చింది " అని అనుకొంది.


మనసులోని భావాలు ఏవీ బయటపడనివ్వకుండా చాలా సంతోషంగా ఉన్నట్టు నటిస్తూ ఉంది కీర్తన. భోజనాల దగ్గర " ఇన్ని రకాల వంటకాలు ఎందుకు చేశారు? " అని అడిగింది సంజన...


"మామూలుగా హాలీడే రోజు మేము రెండు కూరలు, పప్పు, రసం, పచ్చడి తో తింటాము, ఆయనకి అలానే ఇష్టం " అని అంది కీర్తన...


"నేను రోజు ఒక దాల్, లేకపోతే ఒకసబ్జీ చేస్తాను  అంతే... ఇన్ని రకాలు ఇంట్లో ఏదైనా పండగ అప్పుడే లేకపోతే ఇంటికి ఎవరేనా వస్తేనే చేస్తాము " అని అంది సంజన.


" మీ వంట నేను మురళి టిఫిన్ బాక్స్ లో నుంచి చాలా సార్లు తిన్నా , ఇన్ని ఐటంస్ మీరు ఒక్కరే ఎలా చేశారు? పొద్దుటే లేచి చేసారా? " అని అడిగింది సంజన...


"లేదు తను ఒక్క గంటలో ఇరవై మందికి వండగలదు , అదీ రుచి చూడకుండా పెర్ఫెక్ట్ గా " అని అన్నాడు మురళి.


"వంటలు ఎంత బాగా చేసినా మిమల్ని మెప్పించలేకపోయాను కదా " అని మనసులోనే అనుకుంది కీర్తన.


భోజాలు కడుపు నిండా తిన్నాక మురళి సంజనకి ఇల్లు చూపిస్తూ మేడపైకి తీసుకొని వెళ్ళాడు.. వాళ్ళ వెనకాల కీర్తన , సంజన కొడుకూ వెళ్లారు, మేడ పైన వీణలు చూసి " ఇవి ఎవరు వాయిస్తారు " అని అడిగింది సంజన


" ఇవి కీర్తనే వాయిస్తుంది, తను వీణ కూడా నేర్పిస్తుంది... ఇదిగో గోడ మీద పైంటింగ్ కూడా కీర్తన వేసినదే, ఈ పాట్ పైంటింగ్ కూడా తనదే, కర్టేన్స్ మీద పైంటింగ్స్ తనవే... " అని ఒక్కొక్కదాన్నే చూపించాడు మురళి...


బాల్కనిలో మొక్కలు, వాటికి వచ్చిన పూలు కాయలు, పళ్ళూ చూసి ఆశ్చర్యపోయింది సంజన. ఇంత తక్కూ స్థలంలో ఇన్ని మొక్కలు, వాటికి ఇన్ని పూలూ కాయలా? అని అంది...


"గార్డనింగ్ అంతా కీర్తిదే... నేను ఏ రోజు మొక్కకి నీరు పోసింది లేదు "


"  కష్టపడితేనే మొక్కలు పెరుగుతాయి, కానీ కలుపు మొక్కలు వద్దంటేనే వస్తాయి " అని అనాలనుకుంది...కానీ అనలేకపోయింది కీర్తన....


వాటిని కీర్తనని మార్చి మార్చి చూడసాగింది సంజన. కబుర్లతో సాయంత్రం అయ్యిపోయింది. "ఇక బయలుదేరుతా " అని బ్యాగ్ తీసుకుంది సంజన...కానీ సంజన కొడుక్కి వెళ్లడ ఇష్టం లేదు... "మనం ఇక్కడే ఉండిపోద్దాం.." అని మారాము చేశాడు.


"హాలీడేస్ వచ్చినప్పుడు మళ్ళీ రా " అని చేతిలో చాక్లెట్లు ఇచ్చింది కీర్తన...


"పద మనం వెళ్ళి సంజనని డ్రాప్ చేసి వద్దాము " అని అన్నాడు మురళి.


సంజన కి రాత్రికి తినుబండారాలు ప్యాక్ చేసి ఇచ్చింది కీర్తన.


కార్ దిగి సంజన మురళి పక్కకు వచ్చి " కీర్తనని చూస్తుంటే చాలా జెలసీ గా ఉంది " అని అనేసి పిల్లాడిని తీసుకొని వెళ్ళింది. ఆ సమయంలో కీర్తన సంజన కొడుకుతో మాట్లాడుతోంది.. కానీ ఆ మాట కీర్తన చెవిలో పడినట్టు మురళి, సంజన గ్రహించలేదు.


సంజనని దింపి కారులో ఇంటికి వస్తునప్పుడు ఇద్దరి మధ్యలో మౌనమే రాజ్యం చేసింది. సాయంత్రం ఆరు దాటిందేమో దారి ని కప్పేస్తూ పొగమంచు. మంచుపొరల కన్నా మనసులో పొరలే దిట్టంగా ఉన్నాయి...


రాత్రి కీర్తనకు నిద్దర పట్టలేదు. ఇప్పుడు ఇంట్లో తన స్థానం ఏంటో అర్ధం కావడం లేదు. ఇంట్లో ఉండాలా? ఒకవేళ మురళి ఇంత్లో నుంచి వెళ్ళిపొమ్మంటే... బ్రతిమాలాలా? లేక వెళ్ళిపోవాలా? వెళ్తే ఎక్కడకు వెళ్ళాలి? ... పొద్దుట ఐదు అయ్యేటప్పటికి లేచి ఈ అలోచనలతో సోఫాలో కూలబడింది.


ఎప్పుడు లేచాడో కానీ మురళి రెండు కాఫీ కప్పులతో కీర్తన దగ్గరకు వచ్చి ఒక కపు కీర్తనకిచ్చి " నీ అంత బాగా కాఫీ కలపలేను కానీ... ప్రస్తుతానికి ఇది తీస్కో... " అని ఇచ్చాడు.


మురళి వైపు కాస్త ఆశ్చర్యంగా చూసింది కీర్తన.


కాఫీ సిప్ చేస్తూ మురళి  "   సంజన చాలా తెలివైన పిల్ల , కానీ అంత కన్నా మొండిది, మంకుపట్టుది. తను చాలా డిప్రషన్ లో ఉంది, భర్త డ్రగ్ ఎడిక్ట్, చాలా టార్చర్ పెట్టాడుట, తను చిన్న పిల్ల చెప్పినా వినిపించుకోదు "


"తను ఎర్రగా బుర్రగా ఉంటుంది, నేనే రంగు తక్కువా, ఊరి దానిలా ఉంటాను " అని ఎన్నో అనాలనుకున్నా.. కీర్తన నోటంపట ఈ మాటొక్కటే వచ్చింది... బహుశా అడగడానికి సంస్కారం అడ్డొచ్చింది కాబోలు..


 "  తనని ఇంటికి పిలిచి నీ మనసు బాధ పెట్టానా?నిన్నూ, నీ పద్దతినీ, నా జీవితంలో నీ స్థానాన్ని ఒక్కసారి సంజనకి చూపించాలని తీసుకొని వచ్చాను. ఆ అమ్మాయికి ఏ విధంగా చెప్పాలో అలా చెప్పాలనుకున్నా, నిన్ను చూశాక అర్ధమయ్యింది,   ఆ అమ్మాయికి నేను ఎంత అద్రుష్టవంతుడినో అని... " తన చెవుల్ని తానే నమ్మలేకపోయింది కీర్తన...


" నువ్వు పాత చింతకాయ పచ్చడి అని అనుకుంటున్నావు... నాకు మాత్రం నువ్వు బాపూ బొమ్మవి, పెళ్ళి చేసుకున్నప్పు డు నిన్ను ఎంత ఇష్టపడ్డానో ఇప్పటికీ అదే ఇష్టంతో ఉన్నాను. పైపై మెరుగులకి ఎట్రాక్ట్ అయ్యేవాడిని కాదు, ఎవెరెస్ట్ శిఖరం ఎక్కినవాడు ఇసుక తిన్నెలు ఎక్కాలనుకోడు, పెసిఫిక్ ఓషన్ ఈదినవాడు పిల్లకాలువలు ఇదాలనుకోడు " అని తనదైన స్టైల్ లో చెప్పాడు మురళి...


తూరుపున లేలేత సూర్య కిరణాలు మంచుతెరలను తొలగించుకుంటూ మరో శుభోదయానికి నాందిపలుకుతూ వస్తున్నాయి...

No comments:

Post a Comment