Search This Blog

Thursday, December 27, 2018

రోషిని శర్మ

రోషిని శర్మ... కన్యాకుమారి నుండి కాష్మీర్ (లేహ్ ) వరకు బైక్ మీద ఒంటరిగా ప్రయాణం చేసిన మొట్టమొదటి వనిత. ఆడపిల్ల  రాత్రి పూట పక్కనే ఉన్న వీధిలోకి ఒంటరిగా  వెళ్ళడనికే భయపడే ఈ రోజుల్లో ఆమె ఇంత దూరం ఒంటరిగా ఎలా ప్రయాణించింది? అందుకు ఆమె కి స్ఫూర్తి ఎవరు? ఎంత మంది వెనకకు లాగారో తెలుసుకుంటే చాలా అబ్బురంగా అనిపిస్తుంది. ఈ అమ్మాయి ఎంతో మంది ఈ నాటి ఆడపిల్లలకు స్ఫూర్తి. 



సామాన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన రోషిని నలుగు అక్క చెల్లెల్లో ఒకతి. ఆమె తండ్రి ఆటో మొబైల్ వ్యాపారం చేస్తుంటారు. చిన్నప్పుడు వాళ్ల నాన్నగారు తనకు బైక్ నడపడం నేర్పించారుట. ఆ తరవాత పదేళ్ళ పాటు మళ్ళీ బైక్ నడిపే అవకాశం తనకి రాలేదు. ఒకసారి బెంగుళూరు లో బైక్ రేస్ జరుగుతోంటే ఆమె చాలా ఉత్సాహంతో ఆ రేస్ లో పాల్గొన్నారు. ఒక స్నేహితుడి ద్వారా కన్యాకుమారి నుండి కాష్మీర్ వరకు బైక్ మీద ప్రయాణం గురించి తెలుసుకొని ఇంట్లో చెప్తే.. ఇంట్లో మొదట ససేమిరా అన్నారుట. ఆ తరవాత ఒక గ్రూప్ గా వెళ్తే ఒప్పుకుంటాము కానీ ఓంటరిగా వద్దు అని చెప్పారు. ఆమె దృఢ సంకల్పము ముందు అందరూ తల ఒగ్గక తప్పలేదు. ఇంట్లో వాళ్లని ఒప్పించడానికి తనని తాను సిద్ధం చేసుకోడానికి, తాను వెళ్ళాల్సిన మార్గం గురించి తెలుసుకోడానికి  ఏడు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టిందిట. రోషిని జూన్ 24 న బయలుదేరి జూన్ 28 కి కన్యాకుమారి చేరింది. అక్కడి నుండి తను అనుకొన్న ప్రయాణం మొదలైయ్యింది. జులై పదో తారుఖు కల్లా తను లడక్ చేరుకొంది.

పదిహేను రోజుల్లో (140 గంటల్లో) ఆమె తన గమ్యాన్ని సురక్షితంగా చేరింది. ప్రయాణం హైవే రోడ్ అంత సాఫీగా మాత్రం లేదు. అంత కష్టపడింది కాబట్టే 'లిమ్‌కా బుక్ ఆఫ్ ఇండియా 'లో తన స్థాన్నాన్ని ఏర్పరచుకుంది.  

 చేరిన వెంటనే ఆమె వాళ్ళ అమ్మ నాన్నకి ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలుపుకుందిట. వాళ్ళ అమ్మ నాన్నగారు ఆ సమయములో పొందిన ఆనందము, గర్వము కన్నా తనకి  ఏ అవార్డ్ ఆనందాన్ని ఇవ్వలేకపోయాయిట. ఈ ప్రయాణం పూర్తి అయ్యక తను నేర్చుకొన్నది :

"దేశాన్ని ఇంకా ప్రేమించాలి , ఆర్మీ లో ఉన్న వారిని చాలా గౌరవించాలి, ప్రాంతాన్ని బట్టి మనుషులను లెక్క కట్టకూడదు " . 



ఒక సారి దారి అంతా ప్రయాణించాక అక్కడ జనాల ద్వారా తెలిసిందిట ఆ దారిలో రాత్రి పూట ఒక స్త్రీ లిఫ్ట్ అడుగుతూ ఉంటుందనీ, ఆమె ఒక దెయ్యం అని. ఇంకోసారి రోడ్ల మీద ఖాళీ లేకుండా ట్రక్కులు ఉన్నప్పుడు తనకు కొన్ని గంటల పాటు అలా వరుసలో నిలబడాల్సి వచ్చినప్పుడు అనిపించిందిట.." ఎందుకీ ప్రయాశ సుఖంగా ఏ.సి. లో కూర్చొని నెల తిరిగేసరికి మంచి జీతం తీసుకొంటూ, అప్పుడప్పుడు తల్లితండ్రీ, అక్క చెల్లెలతో ఏదైనా మంచి చోటు చూసి సరదాగా గడపక ఈ ఎండలో ఈ ట్రాఫిక్ లో దుమ్ముధూళిలో ఈ కష్టాలు కొని తెచ్చుకున్నానని... " కానీ తన గమ్యము గుర్తుకు రాగానే ఈ కష్టాలన్నీ పెద్దగా కలవరపెట్టలేదు.


రోషినికి బైకే కాదు, మౌటేన్ ట్రెక్కింగ్, సైకిల్ రైడింగ్ అంటే కూడా ఇష్టము. వారాంతరాలలో తాను ఎప్పుడూ పర్వతారోహణము చేయడానికే ఇష్టపడుతుందిట. ఇప్పటికీ దక్షిణ భారత దేశములో ఉన్న అన్నీ ముఖ్యమైన పర్వతాలు ఎక్కేసింది.

ప్రస్తుతం బెంగళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తొంది రోషిని. " ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, అవి నెరవేర్చుకోడానికి ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఏ కల రాత్రికి రాత్రే ఫలించదు. దాని కోసం కష్టపడాలి. అప్పుడే కల సాకారమౌతుంది, సమాజములో పేరూ వస్తుంది. ఎంతో మంది మాట అనకుండా ఉండరు, అవి పాజిటివ్ గా తీసుకొని ముందుకే నడవాలి " అని రోషిని,   ఈ  ' కె. టూ కె. '(K-K )  బైక్ రైడ్ అయ్యక యువతకు సందేశం ఇచ్చింది. 




((నాలుగేళ్ల క్రితం ఈ అమ్మాయిని కలిసే అవకాశం లభించింది, అప్పుడు ఆమె నాతో చెప్పిన విషయాలు) 

No comments:

Post a Comment