Search This Blog

Wednesday, December 26, 2018

అరుణ కిరణం...

నిన్న మా ఫ్రండ్ మానస కూతురి పుట్టినరోజుకి వెళ్ళాను. అక్కడ కి వెళ్ళి కూర్చూగానే మా ఫ్రండ్ వాళ్ళ చుట్టం ఒకావిడ నా చేతిలో ఒక జూస్ గ్లాస్ పెట్టింది. ఇంకా ఆ పుట్టినరోజు పిల్లని తయ్యారు చేస్తున్నారు. నేను వెళ్ళి మా ఫ్రండ్ అత్తగారిని పలకరించి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఆవిడ కాస్త పొట్టిగా పాత సినిమాలో ' రాజసులోచన ' లా ఉంటుంది.

ఆవిడ నన్ను పలకరించిందే కానీ చూపులు మాత్రం నిలకడగా లేవు.. ఏదో వెతుకుతోంది... ఇంత లో వెనకకు చూసింది.. అక్కడ ఆవిడ మనవడు (కూతురి కొడుకు) కొత్త పెళ్ళం చెయ్యి పట్టుకొని నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. అంతే "ఒరేయ్ కిరణు.. కాస్త జానాలలోకి రారా " అని కాస్త సీర్యస్ గానే అంది. ఇంతలో నా ఫ్రండ్ వచ్చి " వాడు జనాలలోనే కదా ఉన్నాడు " అని నవ్వుతూ అంది. నన్ను పలకరించి మళ్ళీ లోపలకి వెళ్ళిపోయింది మానస.  

 ఇంతలో ఆ కిరణ్ వెనకాల వంటిట్లో రెండు కుర్చీలు వేసుకొని,  అతను అతని భార్య అరుణ మళ్లీ  కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతలో ఈ రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణు.. ఇలా వచ్చి మావయ్య పక్కన కూర్చోరా " అంది. అబ్బే మన కిరణుడికి తాత్కాలిక చెవుడు వచ్చేసింది...  వినిపించుకునట్టుగా నటించేశాడు. ఈ రాజసులోచనగారు ఆగలేదు మళ్ళీ గొంతులో స్థాయి పెంచి పిలించింది. ఇంక ఆ అబ్బాయి తప్పదన్నట్టు లేచి వచ్చి హాల్ లో మానసా వాళ్ళ ఆయన పక్కన కూర్చున్నాడు. ఇక్కడ కిరణ్.. ఎదురుకుండా వంటిట్లో అరుణ.. హ్మ్మ్మ్.. కాసేపు కళ్ళతో కబుర్లు చెప్పేసుకోవడం, చూపులతో  సైగలు చేసేసుకోవడం మొదలెట్టారు. అటు చూసి ఇటు చూసి కిరణు మళ్లీ  వెళ్ళి అరుణ పక్కన చేరాడు. మళ్ళీ మన రాజసులోచన గారు వెతుకోవడం మొదలెట్టింది... ఇంతలో కేక్ కట్టింగులు అయ్యాయి. ఈ రాజసులోచన గారి దృష్టి అంతా కిరణ్ వైపు, నా దృష్టి  అంతా ఈవిడవైపే ఉండిపోయాయి.

ఒక ప్లేట్ లో పెద్ద కేక్ ముక్క పట్టుకొని కిరణ్ , అరుణ పక్కకెళ్లీ సగం సగం తింటున్నారు. ఇంతలో మన రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణూ.. ఇక్కడ కేకు ఉందిరా.. రా " అని అరిచింది. పాపం కిరణ్ అరుణని వదలలేక వదలలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు.

ఇంక భోజనాల తంతు మొదలయ్యింది.  రాజసులోచన గారి హడావిడి చూసి ఆవిడకి ఒక ప్లేట్ లో భోజనం పెట్టి   పైకి వెళ్ళి కూర్చోమని ఆవిడ కొడుకు(మానస భర్త)  చెప్పాడు... ఆవిడ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ .. "ఒరేయ్ కిరణు.. నువ్వు ఇలా రా " అని పిలిచింది. ఆవిడ కొడుకు.. "నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళు , వాడిని ఎందుకు పిలుస్తావు... ఏదైనా వడ్దన పని ఉంటే వాడు చేయాలి కదా  " అని చెప్పి రాజసులోచన గారిని మేడ ఎక్కించేశారు. ఇక అరుణ, కిరణులు సరదాగ నవ్వుకుంటూ వడ్దన చేస్తుంటే అందరికీ చూడ ముచ్చటగా అనిపించింది. అరుణతోటే కదా కిరణం ఉండేది!!

ఒక చిన్న మొక్కని పాతి నీరు పోసి పెంచి పెద్ద చేశాక, తీరా అది ఫలాలు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి ఆ చెట్టుని తనది అనేస్తే.. ఆ పెంచిన వ్యక్తికి ఒకరకమైన బాధ, దుగ్ధ వేస్తుంది. ఈ రాజసులోచన గారి బాధ అదే. చిన్నప్పుడు తల్లీతండ్రీ పోతే ఈ రాజసులోచన గారు(అసలు పేరు ఇప్పటికీ తెలీదు) ఆ కిరణ్ ని పెంచింది. ఎక్కడ ఆ కొత్త పిల్ల ఆవిడ మనవడిని ఆవిడకి దూరం చేసేస్తుందో అన్న భయం. ఆ మనవడు అమాయకుడని, ఆ కొత్తగా వచ్చిన పిల్ల వాడిని ఆడించేస్తుందన్న భయము... ఈ భయంతోటే కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటారు వాళ్ళ జీవితాలలో... ఆ చెట్టు నాదే, ఆ కొత్త పిల్ల నాదే అన్న భావం వస్తే ఈ బాధ ఉండదు. ఎక్కువ చొరవ తీసుకుంటే వాళ్ళు మొదట నవ్వుకున్నా తరవాత తరవాత విసుకుంటారు కూడా. చెప్పడం తేలికే ఈ విషయం కానీ ఆచరించడం కష్టం... అయినా తప్పదు మన గౌరవం మనం నిలుపుకోవాలంటే!!

No comments:

Post a Comment