Search This Blog

Friday, August 3, 2018

నాన్న

మన తెలుగు సినిమా పాటల్లో "నాన్న " మీద వ్రాసిన పాటలు (నాన్న నెత్తి మీదా, వీపు మీదా కాదు.. నాన్న ని ఉద్దేశించి వ్రాసిన పాటలు) చాలా తక్కువనే అనాలి. ఈ రోజు శృతిలయలు సినిమా చూశాను(ఎన్నోసారో గుర్తులేదు, లెక్కపెట్టనూ లేదు). కె. విశ్వనాథ్ గారు వారి సినిమాలో క్లైమాక్స్ పాటకి ఎప్పుడూ పెద్దపీఠే వేస్తారు.  అలాగే శృతిలయలు సినిమాలో షణ్ముఖ శ్రీనివాస్  డాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ( శివతాండవం), తల్లి(సుమలత)వచ్చి తండ్రికి కొడుకుని పరిచయం చేస్తూ " తనదు వరసత్వము వారసత్వముగనిడి తనువిచ్చు తండ్రికిదే తొలివందనం ... తండ్రికిదే తొలివందనం " అని పాడుతుంది. పదప్రయోగం ఎంత బాగుందో కదా!

సినిమా పాటలలో "అమ్మ/తల్లి " కే అగ్రతాంబూలం ఇచ్చారు. పాపం "నాన్న " ఎప్పుడూ అమ్మ వెనకాలే..(పాటలలో కూడా). ఇంకో నాన్న పాట అనగానే గుర్తొచ్చేది " నాన్నా నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా  (ధర్మదాత) " .  అది కూడా తల్లి లేనందుకు ఆ నాన్న ని పొగిడారు తప్పా... తల్లి ఉంటే అంత పొగడ్తలు లభించేవి కాదు "నాన్న " కి.


ఇక తండ్రి గొప్పతనం చెప్పే అసలైన సిసలైన పాట "పాండురంగ మహత్యం " లో " దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి. ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని " అని తండ్రి యొగ్గ గొప్పతనము సముద్రాల(రాఘవాచార్య) గారు అద్భుతంగా చెప్పారు. బ్రహ్మోపదేశముతో ఇటు ఈ లోకానికి, అటు పరలోకానికి కావల్సిన పుణ్యం ఇచ్చేది తండ్రే కదా!

కొన్ని పాటలలో అయితే " తల్లితండ్రీ " అని ద్వంద సమాసంలో వారిని ఒకటిగా కలిపి పొగిడేస్తూ ఉంటారు, అందుకంటే అది అద్వితీయ బంధము. అంతెందుకు చిదంబరంలో ఉన్న "నటరాజస్వామి " భంగిమను గుర్తు తెచ్చుకోండి. ఆయన కుడి చేత్తో అభయహస్తం చూపిస్తూ ఎడం చెయ్యి ఎడం కాలు వైపు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎడం భాగం "అమ్మది". అంటే " అమ్మ కాలు పట్టుకుంటే నేను మోక్షం ఇస్తాను అని అంటూ అగ్నిని ఒక చేత్తో పట్టుకొని మరీ అభయమిస్తున్నాడు ఆ జగత్ పిత. ఇవన్ని తెలుసుకున్నారు కాబట్టే రామదాసు కూడా "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి " అని ఆ రామయ్య తండ్రి సిఫార్స్ చేశాడు.

ఏది ఎవైనా

" యే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము
యే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
యే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరము
యే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము

అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమై
తపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన లేరే  
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా..." 

 

 

 

 

4 comments:

  1. అమ్మలగురించి "నాన్న"లే వ్రాసారండీ ! నాన్న గురించి వ్రాయడానికి "అమ్మ"లకుతీరిక లేదు.
    అమ్మ చాలా బిజీ శిష్యా !

    ReplyDelete
    Replies
    1. అమ్మలైతే "పద్దులు " రాసుకోవడం లో, మోడరన్ అమ్మలైతే "బ్లాగులు " రాసుకోవడంలో బిజీ!!

      Delete
  2. అమ్మల గొప్పతనం గురించి నాన్నలకు ప్రత్యేకంగా రాయాల్సి వస్తుంది.కానీ నాన్నల గురించి అమ్మలు ప్రత్యేకంగా రాయాల్సిన పని లేదు .ఎలాగూ వాళ్లు నాన్నల్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తారు.చెప్పనవసరం లేదేమో..

    ReplyDelete
  3. maavidaakulu chitram lo.. ammante telusuko ane paata lo naanna gurinchina charanam adbhutham gaa vuntundi.. Seetaaramasastri gaari lyrics

    ReplyDelete