Search This Blog

Wednesday, August 15, 2018

స్వతంత్ర దినోత్సవం



ఈ రోజు స్వతంత్ర దినోత్సవం.. ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటూ ఫ్రిడ్జ్ తలుపులు తీశాను, దూట కనిపించింది.. దూట కొబ్బరికోరు వేసి పులిహార కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా! పక్కనే ఒక ఆనపకాయ కనిపించింది.. పెరట్లో బచ్చలి ఆకులు బాగా పెరిగాయి, కసిన్ని బచ్చలి ఆకులు వేసి ఆనపకాయ ఆవపెట్టి పులుసు చేస్తే! ముద్దపప్పులోకి ఈ పులుసు చాలా బాగుంటుంది. మా మామ్మ అయితే పప్పు బాగా దోరగా వేయించి వండేది ఇత్తడిగిన్నెకి. మా చినమామ్మ గారు ఈ కందిపప్పుని 'మంగలం ' లో వేయించేవారు. మంగలం అంటే కుండకి ఒక వైపు కన్న ఉండేది, అందులో వేయించే వారు. ' ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ' అనే జాతీయం కూడా ఉంది. నా పెళ్ళికి పేలాలు కూడా ఈ మంగళం లోనే వేయించింది మా చినమామ్మ. చేతిలో పేలాలు వేస్తే రాత్రి కాలక్షేపానికి తినడానికి ఇచ్చారనుకొన్నా పెళ్ళిలో, నా ఆలోచన పసిగట్టి గురువుగారు "అమ్మాయి అవి తినడానికి కాదు ఆగు " అని వార్నింగు ఇచ్చారు.. ఇదే కోతి కొమ్మచ్చి అంటే ఒక విషయం లో నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపొవడం. ఈ ఆలోచనలు కోతులే!


ఆ... ఏం చెప్తున్నాను.. ఫ్రిడ్జ్ లో కూరగాయలు వండాల్సిన వంట గురించి కదా! కొన్ని వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పచ్చని వంకాయలైతే కొత్తిమీరి కారానికి బాగుంటాయి, అదే నీలం వంకాయలైతే కారం పెట్టి కూరకి బాగుంటాయి.. అదే సంతర్పణ కూర, కోనసీమ వాలైతే ధనియాలు వేస్తారు, అదే విశాఖపట్టణం వాలైతే మెంతి కారం అని మెంతులు వేస్తారు. చిన్న చిన్న వంకాయలతో సివంగిపులుసు కూడా చేస్తారు. పక్కనే దోసకాయ కూడా ఉంది, దోసకాయ పచ్చడిముక్కలు తిని చాలా రోజులయ్యింది. రెండు ఆవపెట్టినవి అయితే బాగోదు వేడిచేసేస్తుంది, దోసకాయ టమాట ఇంగువ వేసి పచ్చడి బాగుంటుంది.. సింపుల్ గా!! 

 


అయినా స్వాత్రంత్ర దినోత్సవం నాడు కూడా ఈ వంటేమిటో? నాకూ స్వాత్రంత్రం కావాలి!! మా చిన్నప్పుడూ టి.వి. లో నవంబర్ 14 శనివారం న "మాకూ స్వాత్రంత్రం కావాలి " అనే సినిమా వచ్చింది. సినిమా అంతా కోతుల మయం, అప్పుడు దూరదర్శన్ తప్ప సినిమాలు చూడటానికి మరి వేరే దిక్కు లేదు.. మళ్ళీ మరునాడు ఆదివారం అదే సినిమా హిందిలో వచ్చింది. చాలా బాధ కోపం వచ్చేశాయి. (మళ్ళీ కోతి కొమ్మచ్చి).


అమ్మో ఇలా ఆలోచిస్తే పన్నెండు అయ్యిపోతుంది.. వండాల్సిన వాటికి కావల్సినవి తీసుకొని ఫ్రిడ్జ్ తలుపేసేశాను. అరగంటలో వంట రెడీ! టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి అందరినీ పిలిచాను. ముద్ద పప్పు, ఉసిరి పచ్చడి అన్నము వడ్దించా.. ఇంకా అన్నట్టు చూపులు! " ఇంకేంటి? ఇంతే ! " అని నేనూ శివగామిలా చూశాను.


మా చిన్నది " ముద్దపప్పు అన్నమా? నేను తినను! " అని అరిచింది. టి.వి. ఆన్ చేశాను "అభిరుచి ' లో రాజు గారు సొయా రైస్ చేయడం ఎలాగో చెప్తున్నాడు. అది చూస్తూ ఈ పప్పు అన్నము తినేసింది.


పొద్దుట నుంచి ఇదేనా వండావు? అని ప్రశ్న.. పొద్దుటే మా ఫ్రండ్ మాలతి పుట్టిన రోజు విష్ చేయ్యాలి కదా? ఆ తరవాత అర్పిత, శ్రీదేవి  వాట్స్ ఆప్ లో పెట్టిన చీరలు చూడాలి కదా!(కొన్నాకొనకపోయినా) ఆ తరవాత టి. వి. లో వచ్చిన అల్లూరి సీతా రామ రాజు, ఇంకో చానల్ లో హింది లో వస్తున్న సుభాష్ చంద్ర బోస్ చూడద్దు, అసలే దేశభక్తి సినిమాలు! పొద్దుటే సందీప్ పెళ్ళికి వినాయకుడిని మీదికడితే వెళ్ళొచ్చాను కదా పేరంటానికి! ఒక్కమనిషి ఇన్ని పనులు అసలు ఎలా చేసుకొగలుగుతోందన్న సానుభూతే లేదు జనాలకి! అయినా మొన్న శుక్రవారం తొమ్మిది రకాల పిండి వంటలు వండానా? ఇలా ఒకరోజు పొట్టకి పని తగ్గించాలి కదా!


" రెండు వారాల క్రితం కూరలు లేవని పప్పు అన్నము పెట్టావు, ఈ రోజు అన్ని కూరలు ఉన్నా పప్పు అన్నమే! " అన్న కామెంటు..


" ఏదీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉండటం... స్థితప్రజ్ఞత్వం అంటారు " అని అన్నాను.


ఇంకేదైనా అనేస్తారేమో అని వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన 'నారదబ్బ కాయ " ఊరగాయ తెచ్చా. అబ్బా! ఆ నారదబ్బ కాయ వేడి వేడి అన్నములో కలుపుకొని నెయ్యేసుకొని తింటే!! ఆ ముక్క కమ్మటి పెరుగన్నములో తింటే!! ఇంక మాటలు లేవు.


ఈ ఆవకాయలు, ఈ నారదబ్బకాయలు.. జీవనదులు. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వచ్చే నదులు కావు... నిత్య పుష్కరిణీలు ఇవి నాలాంటి వారికి!!





17 comments:

  1. ఇన్ని రోజులకు నాకు కోతికొమ్మచ్చి అంటే ఏమిటో తెలిసింది. ధన్యవాదాలు ! ఈ రోజు మాఇంట్లో కేరట్ కూర, తోటకూర, టమాటా పప్పు, మిరియాల చారు. అభిరుచి లో లాగా పైన కాషాయం రంగు కేరట్ కూర, మధ్యలో తెల్ల అన్నం, క్రింద తోటకూర పెట్టి అన్నం వడ్డిద్దాం అని చూస్తున్నా ! ఇంకా అన్నం వండలేదు. పొద్దుట నుంచి ఇదేనా వండావు? అనే ప్రశ్న వస్తుంది. సేం పించ్ ....
    పోస్ట్ చదువుతున్నంతసేపూ నవ్వుకున్నాను. బాగావ్రాసారు.

    ReplyDelete
  2. " ఏదీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉండటం... స్థితప్రజ్ఞత్వం అంటారు " అని అన్నాను.
    ఈ డైలాగ్ సూపరసలు ....నవ్వాగడం లేదు.

    ReplyDelete
    Replies
    1. Thanks నీహారిక gaaru...

      Delete
    2. నీహారిక గారు))విశాలి గారు))
      స్థితప్రజ్ఞత కూరల విషయం లో బానే ఉందండి.
      కానీ ఎటొచ్చీ శ్రావణ మాసంలో పేరంటానికి కట్టుకోడానికి ప్రతిసారి కొత్త చీర లేనపుడు ఈ డైలాగ్ పని చేయదేమోనండి.ఏమంటారు.😊😊

      Delete
    3. భలేవారే సంవత్సరానికి సరిపడా ఓ నాలుగు పచ్చళ్ళు పట్టి పెట్టుకునే ముందుచూపున్నవాళ్ళం...ఓ నాలుగు చీరలు ముందుగా ప్లాన్ చేసుకోలేమా ? స్థితప్రజ్ఞత గురించి నాలుగు చేతులతో పనిచేసే ఆడాళ్ళకు ప్రత్యేకంగా చెప్పాలటండీ ? అర్ధం చేసుకోరూ....

      Delete
    4. శ్రావణ మాసం అంటేనే అలకరణ.. అలకరణ అంటే ఆడవారు. ఆడవారు పూజ చెసేటప్పుడు అమ్మవారిలా అలకరించుకొని పూజ చేయాలిట. సో నో కాంప్రమైజ్ అండి చీరల్లో... అంతే! Thanks Rajyalaxmi gaaru

      Delete
  3. మొన్న శుక్రవారం తొమ్మిది వంటలు ఎందుకు చేసారండీ...వరలక్ష్మీ వ్రతం ఇంకా రాలేదు కదా ?

    ReplyDelete
  4. పేలాలు ఎందుకో చెప్పండి ప్లీజ్...ఆలోచనలు అక్కడే తిరుగుతున్నాయి.

    ReplyDelete
    Replies
    1. పెళ్ళిలో పెళ్ళికూతురిని తమ్ముడు లేక అన్న చేతిలొనుంచి పెళ్ళికూతురి చేతిలోకి పేలాలు వేయిస్తారు. ఆ పేలాలు మంత్రంతో పెళ్ళికొడుకు అగ్నిలో వేస్తాడు. పెళ్ళి అయ్యాక సన్నికల్లు తొక్కేముందు ఉంటుంది ఈ తంతు. (హోమాలు చేసేటప్పుడు, స్థాలీపాకం అంటారు)

      Delete
    2. This comment has been removed by the author.

      Delete
  5. నీహారిక గారూ,
    వివాహ మంత్రార్థాలూ హోమాలూ వగైరా గురించి వ్రాయాలంటే చాలా పెద్దగ్రంథం అవుతుంది. క్లుప్తంగా ఈమాటలో వివాహాలూ తతంగాలూ అని ఒక వ్యాసంలో వచ్చింది చదవండి.

    ReplyDelete
    Replies
    1. తప్పకుండా చదువుతానండీ ...కాకపోతే మాకు హోమం, అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయడం ఉండవు. అందుకే పేలాలు సంగతి తెలియలేదు.

      Delete
    2. నేనూ తప్పకుండా చదువుతాను శ్యామలీయం గారు!

      Delete
    3. నీహారిక గారూ, వివాహంలో సప్తపది ఉండదా మీకు? ఆశ్చర్యంగా ఉంది. వివాహక్రతువులో న్యాయస్థానాలు జీలకర్ర-బెల్లం ఉంచటాన్నీ, సప్తపదిని (అగ్నిహోత్రం చుట్టూ ఏడు మార్లు ప్రదక్షణం చేయటం) సాక్ష్యంగా పరిగణిస్తాయి కాని మంగళసూత్రధారణను పరిగణించవు! ఇకపోతే లాజలు అంటే పేలాలు. పేలాలను అగ్నికి పెండ్లికుమార్తెచేత హోమంలో ఆహుతిగా అర్పణ చేయించటమే లాజహమం.

      Delete
    4. హోమం, అగ్ని ఉండవు కదా ? ఈ మధ్య కొందరు హోమం ఏర్పాటు చేస్తున్నారు కానీ హోమం వల్ల పొగ వస్తుందని మానేసారేమో అని నా డౌటు...సప్తపది అంటే అరుంధతి నక్షత్రం చూపించడానికి తీసుకెళతారు కదా ? అదే సప్తపది అనేసుకుంటాం.మంగళసూత్రధారణ కంటే జీలకర్రా బెల్లానికే ప్రాధాన్యతనిస్తారు.ముహూర్తం టైం కి జీలకర్రా బెల్లం పెట్టేసి తీరిగ్గా సూత్రధారణ చేయిస్తారు.రెండు చీరలు కట్టుకోవాలి కదండీ ? మీరు మరీ బెదిరిపోకండి :))

      Delete
    5. చీరలు రెండే! ఒకటి బుట్టలో కట్టుకునేది, రెండు "మధుపర్కం (తేనె, పాలు కాదు.. హాఫ్ వైట్ సారీ, కొందరు పసుపులో ముంచుతారు). ఇక పెళ్లి అంతా ఆ మధుపర్కం తోనే జరుగుతుంది. వేరే ఏ చీర కట్టుకోవక్కర్లేదు. రాత్రి పెళ్ళి అయితే ఆ రాత్రంతా హోమాలతోనే తెల్వారుతుంది.

      Delete