Search This Blog

Sunday, September 11, 2016

జాతీయాలు

1. అక్కన్న మాదన్నలు : ఎన్నటికీ విడని అన్నదమ్ములు, స్నేహితులను అక్కన్న మాదన్నలుగా పేర్కొంటారు. 
అక్కన్న మాదన్నలు రామదాసు మేనమామలు, తానీష దగ్గర పనిచేసే మంత్రులు. ఇలాగే రాహుకేతులు, జంటకవులు, జయవిజయులు, సుందోపసుందులు అని కూడా అంటారు. 


2. అగ్గిమీద గుగ్గిలం : కోపముతో రగిలిపోవడము. 

 దీపావళి నాడు నూనేలో ముంచిన బట్ట ఒక పుల్లకి చుట్టి దానికి మైనాన్ని రాసి వెలిగిస్తారు. అది వెలుగుతూ ఉండగా పైన గుగ్గిలం వేస్తారు. అది చాలా ఎక్కువగా మండుతుంది. 


3. అగ్రతాంబూలం :
ఏవైన యాగాలకు, పూజలు పూర్తి అయ్యాక ఒక యోగ్యత కలిగిన వ్యక్తిని పూజించి  తాంబూలమిచ్చి సత్కరిస్తారు. అలా సభలో ప్రముఖులకు అగ్రతాంబూలమివ్వడమని అంటారు. క్షీరసాగరమధనములో మొదట హాలాహలము పుట్టినప్పుడు దాన్నీ స్వీకరించమని దేవతలు శివుడికి అగ్రతాంబూలమిచ్చినట్టు పోతనగారు చెప్పారు. 
ఆ తరవాత రాజసూయాగములో ధర్మరాజు  శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిచ్చి సత్కరించినట్లు మహాభారతములో పేర్కొంది. సభలో ప్రముఖలలో ముఖ్యులను గౌరవించడమే అగ్రతాంబూలము. 


4. అధః పాతాళం : తక్కువ స్థాయికి/ నీచ స్థాయికి  చేరడం.

భూమి కింద ఏడులోకాల్లో ఎంతో అడుగున ఉండే పాతాళంలో కూడా ఇంకా అడుగు భాగం.


5. అంధకరదీపిక (న్యాయం) : అశక్తుడు.
గుడ్డివాని చేతికి దీపం ఇస్తే ఎంత ప్రయోజనమో  అశక్తుడికి అవకాశమీయడము కూడా అంతే. 


6. అడవి కాచిన వెన్నెల : వృధా అవ్వడము. 
అడవిలో వెన్నెల కాచినా ఎవరికీ ఉపయోగము ఉండదు.  అలాగే వస్తువు(గుణము) ఉన్నా కూడా ఉపయోగపడకపోవడం. 


7.అగ్గి పగ  : నిప్పులాంటి దహించే కోపంతో కూడిన పగ. ఉద్దం సింఘ్ ఇందుకు చక్కని ఉదాహరణ, జలియన్ వాలాభాఘ్ లో చనిపోయిన తన మిత్రుల, బంధువుల శవాలను చూసి ఆ పగతో ఆ ఘాతకానికి కారకుడైన మైకేల్ ఓ డ్వయెర్ ని 21 సంవత్సరాల తరవాత కాల్చి చంపాడు. 


8.అగ్నిస్నాతుడు : అగ్నితో స్నానమాడిన వాడు అని అర్ధము. అంటే అగ్నిపునీతుడు. నిప్పులాంటి మనిషికి వాడే జాతీయము.  

9.అడుగంటింది : అయ్యిపోయింది, క్షీణించింది అని అర్ధము. 


10.అక్షింతలు వేయు: నిజముగా అక్షితలు వేయడం కాదు ఈ జాతీయము అర్ధము. తిట్టడానికి వ్యగముగా వాడే జాతీయము ఇది.  




11. అగ్నిపిండం(దుడుకుపిండం) : నీతి నిజాయితిలకు, స్వచ్చతకు  మారుపేరుగా నిప్పుని సూచిస్తారు. అలా ముక్కు సూటిగా వెళ్ళే వ్యక్తులకు ఈ జాతీయము ఉపయోగిస్తారు. కొంతమంది దరి చేరిన వారిని తమ ప్రవర్తనతోటి, మాటలతోటి బాధపెట్టే వాళ్ళకి కూడా ఈ జాతియము వాడుతారు. 

2 comments: