Search This Blog

Thursday, June 6, 2019

చేదు మనిషి

"అయ్యో అయ్యో ఇంట్లో చేదు వృక్షం ఉంటే ఇంటికి అరీష్టమని ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కదా? " అంటూ మళ్ళీ వచ్చాడు సాక్షి రంగారావు గారు. ఆయనంటే ఎవరో నాకు తెలీదు, కానీ అచ్చు సాక్షి రంగారావులా ఉండేవాడు. ఎప్పుడు ఎవరింటికి వచ్చినా చెట్ల గురించే మాట్లాడేవాడు. అలా అని చెట్టు పాతమని ఎప్పుడూ చెప్పేవాడు కాదు, చెట్లు కొట్టెయమనే చెప్పేవాడు.


మా పక్కింట్లో ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదని ఆయన వాదన. ప్రతి వారం వచ్చేసేవాడు, వచ్చిన వాడు ఊరుకోకుండా ఇదిగో ఆ చెట్టుని కొట్టెయ్యమని చెవిలో ఇల్లు కట్టుకొని అరిచేవాడు. మా పక్కింటి వాళ్ళ బాత్ రూం పక్కనే కుంకుడు చెట్టు ఉండేది, బాత్ రూం నుంచి విసిరేసిన ఆ కుంకుడు గింజలు పాపం వాటంతట అవే మొలకలెత్తి, ఆ బాత్ రూం నుంచి వచ్చే నీళ్లతో చెట్తై కూర్చున్నాయి. మేము ఆ కాయలని పిన్నీసుతో గుచ్చి, బుడగలూదేవాళ్ళము.


ఇక మా ఇంట్లో, పక్కవారింట్లో జామచెట్లు ఉండేవి. ఈ సాక్షిరంగారావు, "ఇదిగో ఆ ఫల వృక్షాలు ఇంట్లో ఉండకూడదు, పిల్లలకి అరీష్టము " అని అనేవాడు. ఆయన మాటలు ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోలేదు. మాకు ఈ జామ చెట్లు  సాయంకాలము ఆడుకొనే ప్లే గ్రౌండ్స్, ఆ చెట్టు కాయలే ఈవింగ్ స్నాక్స్. మాకే కాదు రామచిలుకలకి, కోతిపిల్లలకి కూడా చెట్టు అంటే చాలా ఇష్టము. ఆ జామచెట్టుని కొట్టేయమంటే మా పిల్లల గ్యాంగ్ కి చాలా కోపం వచ్చేది. ఆయన వస్తున్నాడంటేనే విసుగ్గా అనిపించేది. ఆ వేపచెట్టు కన్నా ఇతనే చేదు మనిషి అని అనిపించేది.


మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఒకసారి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి కాబోయే భర్త బైక్ మీద బయటకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.


ఈ పెద్దమనిషి అదే మన సాక్షి రంగారావు వచ్చి " చెప్పానా, ఆ చేదు మొక్క వలనే ఈ అరీష్టము, ఆ ఫల వృక్షము కూడా,  ముందు ఆ చెట్లను కొట్టించేసేయండి " అని మళ్ళి చెప్పాడు. తొభై తొమ్మిది గొడ్దలి దెబ్బలకు పడని వృక్షము, వందో దెబ్బకు పడినట్టు, ఆ రోజు ఆ మాటలు ఆ ఇంట్లో వాళ్లకి బాగా పని చేసాయి. పెళ్ళీ కి ముందు చెట్టు కొట్టకూడదని ఎందరో చెప్పినా వినలేదు, ఆ మరునాడే ఆ వేప చెట్టు, కుంకుడు చెట్టు జామ చెట్టు కొట్టేశారు.


అవి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని మోసిన చెట్లు, అట్లతద్ది వస్తే మా అందరిని ఉయ్యాలూపిన ఆ వేప చెట్టు,  విరిగిపోయినా ఇంట్లో  చెక్క ఉయ్యాలయ్యి ఆ అక్క (పెళ్ళైన అమ్మాయి ) పిల్లలకి కూడా జోలపాట పాడింది. 

 

 

No comments:

Post a Comment