Search This Blog

Wednesday, June 5, 2019

లవ-కుశ సుబ్రహ్మణ్యం

తెలుగు సినిమా జగత్తులో ఆణిముత్యాలు ఎన్నైనా మకుటముగా నిలిచినవి మాత్రం అతి కొన్నే! అందులో చెప్పుకోదగినది "లవ-కుశ " . ఈరోజుకీ సినిమాలకి దిక్సూచి, కొలమానము లవ-కుశ... ఎన్ని పౌరాణిక చిత్రాలు వచ్చినా లవ-కుశ మాత్రము.. "న భూతో న భవిష్యతి ". అందులో నటించిన సుబ్రహ్మణ్యం గారు... అదే కుశుడు గారు ఆయన అనుభవాలను మనకు ఈ ఎందరో మహానుభావులు " ద్వారా చెప్పారు.

 

బాల్యం- విద్యాభ్యాసం :

 

శ్రీ సుబ్రహ్మణ్యంగారు 1946 ఏప్రెల్ 21, గొల్లపాలెం లో జన్మించారు. వారి తల్లి సుబ్బాయమ్మగారు, తండ్రి వియూరి సుబ్బారావు గారు. వారి నాన్నగారిని "గొల్లపాలెం అబ్బాయి " గారు అనేవారు.(మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారిని 'కాకినాడ అబ్బాయీ అనేవారుట). ఆయన యన్ మెన్స్ క్లబ్ మెంబర్ గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు. 1953 లో దంటు భాస్కర రావు గారి ప్రోత్సాహంతో లవకుశ నాటకం వేశారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన తమ్ముడు ఫకీర్ బాబు.

 

 

వీరి నటన చూసి ఆ తరవాతి కాలంలో సి. పుల్లయ్యగారి "లవకుశ " లో సుబ్రహ్మణ్యంగారినే కుశుడి పాత్రకు ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యం తమ్ముడిని అదే సినిమాలో సుర్యకాంతం కొడుక్కా నటింపచేశారు. ఈ లవకుశ సీనిమా ఐదేళ్ళ పాటు తీయడం వలన సుబ్రహ్మణ్యంగారు బడికి వెళ్ళలేకపోయారు. ఆ విధంగా చదువు కొనసాగలేదు.

నటించిన ఇతర సినిమాలు :

" వెలుగు నీడలు " సినిమాలో జగ్గయ్య మేనల్లుడిగా, "శ్రీవేంకటేశ్వర మహత్యం " సినిమాలో శాంతకుమారి పాట పాడినప్పుడు చిన్ని కృష్ణుడిగా, "సీతారామ కల్యాణం " లో చిన్నరాముడిగా (గురుబ్రహ్మ పాటలో), 2006 లో వచ్చిన 'కల్యాణం ' అనే సినిమాలో కూడా నటించారు.

 

వివాహం :

 

సుబ్రహ్మణ్యం గారికి వారికి 1978 లో వివాహం అయ్యింది. ముగ్గురు కొడులు. వారి శ్రీమతి నర్శారత్నం గారికి మూడొవ సంతానం కలిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలు ఆవిడ మంచానికే అంకితమవ్వాల్సి వచ్చింది. 2017 లో ఆవిడ పరమపదించారు.

వారి భార్య కి ఒంట్లో బాలేదని ఒకసారి ఆయన నాకు చెప్పారు. అప్పుడు నేను కొంతమంది మిత్రుల సహకారంతో (ఈ ఎఫ్.బి. లో ఉన్నారు వారంతా) వారికి సాయం చేశాను. ఆ డబ్బు అందిన వారం రోజులకే వారి భార్య పరమపదించారు. నేను ఆయనకు ఫోన్ చేసి "ఆ డబ్బు ఇలా ఉపయోగపడినందుకు చింతిస్తున్నాను " పరామర్శిస్తే "తల్లీ! పెళ్ళికంటే ఎవరేనా సాయం చేస్తారు, ఈ కార్యక్రమానికి ఎవరిని సాయం అడుగుతాను, కరక్ట్ టైం కి డబ్బు అందేలా ఇచ్చావు " అని అన్నారు.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యంగారు అమలాపురంలో టైలరింగ్ చేసుకుంటున్నారు. కోటీశ్వరులకు లేని గౌరవమర్యాదలు వారికి ఈ లవకుశ సినిమా ద్వారా లభించాయని ఆనందపడుతూ ఉంటారు.

 

 

 

 

 

 

 

No comments:

Post a Comment