Search This Blog

Saturday, March 24, 2018

శ్రీరామ నవమి

 



 

చైత్రమాసం ఆరంభం.. అప్పుడప్పుడే ఎండలు కొంచం కొంచం ముదురుతూ ఉంటాయి. తెల్లవారుజామునే "కౌశల్య సుప్రజా రామా " అంటూ అటు రాముణ్ణి ఇటు ఇంట్లో జనాలని నిద్రలేపే సుప్రభాతాలు. బయట మా వీధికొచ్చే ముసలితాత హార్మోనియం పట్టుకొని " జయ జయ శ్రీరామా రఘువరా " అంటూ ఇంకో సుప్రభాతం. సుప్రభాతం అవ్వడమేమిటి... "అదిగో భద్రాద్రి.. గౌతమి ఇదిగో చూడండి " అంటూ అపర రామదాసులాగా మన బాలమురళీ కృష్ణగారు మనల్ని ఉన్న చోట నుంచే భద్రాచలం తీసుకొని ఆ పుణ్య గౌతమితో పాటూ రాములోరి దర్శనం చేయించేసేవారు. ఇంతలో పక్కన ఉన్న ఐసోల రామం గారి ఇంట్లో నుంచి రామ రక్షా స్త్రోత్రంతో శ్రీరామ పట్టాభిషేకం మొదలయ్యేది. ఆ పక్క వీధిలో రామాలయంలో నుంచి మంత్రాలుతో రామ కల్యాణానికి అంకురార్పణ మొదలయ్యేది.


తలంటు పోసుకొని కళ్ళల్లో కుంకుడి రసం పడిన మంట ఒక వైపూ, ఎండలో పట్టు పరికిణీ చిరాకు ఇంకొక వైపూ, చిక్కు జడలో మల్లెపూల బరువు ఒక వైపూ, ఇన్ని చిరాకులలతో ఆ రామ దర్శనానికి వెళ్తూ ఉన్న ఆనందం.. ఉగాది పచ్చడి తిని ఇంకా వారమే అవుతోంది కదా.. ఆ రుచులు ఇలా జీవితంలో అగుపడతాయేమో అని అనిపిస్తూ ఉండేది.


రామాలయంలో రాముడికి ఒక దండం, వస్తూ వస్తూ అమ్మత్త వాళ్ళ రాముడికి ఇంకో దండం, ఆ తరవాత మా పక్కింటి ఐసోల రామం గారి రాముడికి ఇంకో దండం. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. రామ పట్టాభిషేకం మా ఐసోల రామం గారి ఇంట్లో చాలా బాగా జరిగేది. మంత్రం పుష్పం చాలా బాగా చదివేవారు ఆయన, ఇంకా సాంభ శివ రావు గారూ! ఆ పూజ చూసి ఇంటికి వచ్చి ఇంట్లో టి.వి. లో లవ కుశ చూసేవాళ్ళం. ఈ లవ కుశ చూడలేని రామ నవమి మా చిన్నప్పుడు లేనే లేదు. ఆ సినిమా అవుతుండగా ఇంతలో రేడియో లో భద్రాద్రి రామయ్య కల్యాణం పెట్టేవారు. వ్యాఖ్యానం ఉషశ్రీ గారూ, మల్లాది వారు! అబ్బా.. ఇంతవరకూ నేను ప్రత్యక్షంగా భద్రాద్రి రామయ్య కల్యాణం చూడలేదు కానీ అలా అని నాకు ఎప్పుడూ అనిపించకపోవడానికి కారణం మల్లాది వారే! "అమ్మా.. సీతమ్మా! కాస్త తల పైకెత్తి రాముల వారిని చూడమ్మా" అంటూ ఆ కల్యాణ వైభోగం అంతా కళ్ళకు కట్టేవారు! ఆ కల్యాణం సరిగ్గా మిడసరి లగ్నం లో అయ్యేది. ఇటు వైపు రేడియోలో భద్రాద్రి రామయ్య కల్యాణం, ఇంకో వైపు నుంచి పక్కన ఐసోల రామం గారి ఇంట్లో నుంచి గట్టి మేళం, ఆ పక్క నుంచి పక్క వీధి రామాలయం నుంచి మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా ఆ సీతారామ కల్యాణం జరిగేది. కల్యాణం అయ్యిన వెంటనే "శ్రీ సీతారాముల కల్యాణం చూదము రారండి " పాట! ఈ పాట లేని శ్రీరామ నవమి కానీ పెళ్ళి కానీ ఉండదంటే అతిశయోక్తి కాదేమో!!


ఇవన్నీ అయ్యాక ఇంట్లో నైవేద్యం పెట్టిన పానకం, వడపప్పు ప్రసాదం తినడం. ఆ పానకం కూడా ఒక పక్క తీయగా ఇంకో పక్క మిరియాల ఘాటుతో భలే గొప్ప రుచిగా ఉండేది. "జనన మరణ భయ శోక విదూరం.. సకల శాస్త్ర నిగమాగమ సారం... "


ఆ ముచ్చట్లు దాటి ఈ జీవిత ప్రయాణం లో ఎంతో ముందుకి వచ్చినా... శ్రీరామ నవమి అనగానే మనసు మాత్రం అక్కడ నుంచి రానంటోంది!!



మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. శ్రీరామ రక్షా!!








2 comments:

  1. చాలా బాగా రాశారు - అందుకోండి ప్రతి శుభాభివందనాలు!

    ReplyDelete