Search This Blog

Saturday, May 27, 2017

మాయామయి

నా టెంత్ క్లాస్ అయ్యాక బోలెడు వేసవి శెలవలు వచ్చాయి. అప్పుడు ఇంట్లో ఉన్న చందమామలు, బాలరంజని, మాయదారి ముసలమ్మ మొదలైన చిన్న చిన్న పెద్ద కథల పుస్తకలన్నీ చదివేశాను. మా నాన్నగారు అప్పుడు నాకు "మాయమయి " అని ఒక పుస్తకం ఇచ్చారు. అది 10 భాగాలు. మొదటి రెండు భాగాలు వీరేంద్ర సింహుడు (తేజసింహుడు, దేవీసింహుడు అనుచరులు), చంద్రకాంత (చపల, చంప అనుచరులు) వీరోచితమైన కథ. వారు ఒక నిధిని ఛేదించడం కథ సారాంశం. ఆ తరవాత ఎనిమిది భాగాలు ఆ చంద్రకాంత సంతతి అయిన ఇంద్రజీత్ సింహుడు, ఆనంద సింహుడు కథలు. వారి స్నేహితులు భైరవ సింహుడు, తారా సింహుడు. ఈ నవల వ్రాసినది బెంగాళి రచయిత 'భోలానాథ్ ' . 'గోరా ' నవల రాసినప్పుడు రవీంద్రనాథ్ టాగోర్ ఆ నవలలో నాయకుడి తెలివితేటలని వర్ణిస్తూ ఆ యువకుడు 'భోలానాథ్ ' అంత తెలివైనవాడు అని భోలానాథ్ ని కీర్తించాడు. ఆ కథలో ఎన్నో పాత్రలు ఉన్నాయి, ప్రతీ పాత్ర ముఖ్యమైనదే! చదివిన వాళ్ళము ఒకవేళ ఆ పాత్ర గురించి మరచిపోతే రచయితే గుర్తు తెచ్చేవారు ( "ఫలాన చోట ఆ పాత్ర వచ్చింది మీకు గుర్తుంది కదా అని) . ఈ నవలని తెలుగులో అనువదించినవారు బొందలపాటి శివరామకృష్ణయ్య, శకుంతల గార్లు.

 


అప్పుడు ఆ కథ చదువుతున్నప్పుడు ఏదో లోకంలో విహరించేదాన్ని. నేనే కాదు మా ఇంట్లో ఈ కథ ఎవరు చదివినా ఆ మాయమయి 'మాయ ' లో ఉండేవాళ్ళము. భోజనానికి రాకుండా పొలానికి వెళ్ళి మా అత్తయ్యలు, బాబయ్యలు ఈ కథ చదువుతూ ఉంటే మా చినమామ్మ గారు ఈ పుస్తకం ఇచ్చినందుకు నా నాన్న గారిని తిట్టేవారు. ఆ నవలలో 'దేవ్ ఘడ్ ' 'విజయ్ ఘడ్ ' నగరాల వర్ణన చదివినప్పుడు, ముఖ్య కథానాయిక అయిన 'కమిలిని /లాడిలి ' పరాక్రమము అందం చదివినప్పుడు రొమాంచితమైపోయేవాళ్ళము. ఒకసారి అనుకున్నాము కూడా "ఈ నవల సినిమా తీస్తే ఎలా ఉంటుంది " అని. మళ్ళీ మేమే అనుకున్నాము " అంత గొప్ప నవల సినిమా తీయగలరా? అంత సాహసం చేయడం చాలా కష్టం " అని.

 

కానీ ఈ మధ్య 'బాహుబలి " లో అనూష్క విలు విద్య, మాహిష్మతి సామ్రాజ్యం చూపించిన తీరు చూశాక మాయామయి గుర్తుకొచ్చింది. ఆ సినిమాలోని యుద్ధ నైపుణ్యాన్ని చూపించిన తీరు అవన్నీ మాయామయిలో వర్ణించినవే! రాజమౌళి గారి ఈ సినిమాకి స్ఫూర్తి ఏదైనా కావొచ్చు... కానీ మా 'మాయా మయి " మా కళ్ళకు చాలా ఏళ్ళ తరవాత కనిపించింది.

 

 

 

8 comments:

  1. చాలా ఆనందం. మీరూ మాయామయి చదివారా?! చాలా బాగుంటుంది. ఇప్పుడు అది మీ దగ్గర ఉందా? ఉంటే మరీ ఆనందం!!

    ReplyDelete
  2. అవునండి ... మాయమయి చదివాను. అది ఇప్పుడు మా నాన్నగారి దగ్గరే ఉంది (10 భాగాలు).

    ReplyDelete
    Replies
    1. దయచేసి ఎక్కడ దొరుకుతుందో తెలయజేయగల‌రు

      Delete
  3. ఈ మాయామయి (గమనిక- మాయమయి కాదండి. యాకు దీర్ఘం ఉందిక్కడ) కోసం వెదుకుతున్నాను. కాపీలు ఎక్కడన్నా దొరికితే బాగుండును. మీరు వివరం కనుక్కోగలిగితే దయచేసి తెలియజేయ ప్రార్థన.

    ఆ పుస్తకాన్ని నా బాల్యంలో చదివినా ఇంకా దాని గురించి కొన్ని జ్ఞాపకా లున్నాయి!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి సరి చేసినందుకు...


      ఇప్పుడు దొరకడం లేదండి. నేనూ వెతుకుతున్నాను.

      Delete
  4. ఒక చిన్న సాంకేతికవ్యాఖ్య.

    స్త్రీల విషయంలో పులకరింత అనీ పురుషుల విషయంలో రోమాంచము అనీ వ్యవహారం.

    ఐతే ఆధునికులకు భాషావిషయికమైన సలహా ఇవ్వటం అపార్ధాలకు దారితీయటం కొన్ని సార్లు జరిగింది కాబట్టి నా సూచన మీకు నచ్చని పక్షంలో మన్నించ ప్రార్థన.

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి సరి చేసినందుకు...

      Delete
    2. ఈ తేడా నాకూ తెలియదు. తెలియచేసినందుకు ధన్యవాదాలు.

      Delete