Search This Blog

Tuesday, October 30, 2018

జ్యోతి

 

 

 

హాల్ అంతా కోలాహలంగా ఉంది. చాలా రోజుల తరవాత కలుసుకున్న చుట్టాలతో ఎప్పటెప్పటివో కబుర్లతో చాలా సందడిగా ఉంది. ఇంకా జ్యోతి రాలేదు. అందరూ తన గురించే ఎదురు చూస్తున్నారు. జ్యోతి భర్త దీపక్ వచ్చిన వారందరికీ కూల్ డ్రింకులు అందాయో లేదో చూస్తూ, అక్కడ పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ హాల్ అంతా తిరుగుతున్నాడు. జ్యోతీ దీపక్ లు చాలా శ్రీమంతులు. అటువంటి వారింట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అప్పటికే అక్కడ చేరిన కొంతమంది జ్యోతి సంతానం గురించి ఎన్నో కాలక్షేపం కబుర్లు చెప్పుకోసాగారు. కొందరు కామెడీలు కూడా చేశారు. కాసేపయ్యాక జ్యోతి, తన అమ్మ, అత్తగార్లతో హాల్ కి వచ్చింది. జ్యోతి చేతిలో ఏడాది పిల్లాడు, జ్యోతి వాళ్ళ అమ్మ చేతిలో రెండున్నర ఏళ్ళ పాప, జ్యోతి అత్తగారి చేతిలో మూడేళ్ళ పాప ఉన్నారు. అందరూ కాసేపు ఆశ్చర్యమూ, వెటకారముతో కూడిన నవ్వులతో జ్యోతిని పలకరించారు.

"ఈ రోజుల్లో కూడా ఇంకా ముగ్గురు పిల్లల్ని సాకడం అబ్బో... " అని వంకరగా...

" కాస్తైనా చూసుకోవాల్సింది జ్యోతి " అని ఇంకొకరు ఉచిత సలహా పారేశారు.

"ముగ్గుర్ని... కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది " అని ఒకరంటే...

"సంతాన లక్ష్మిలా భలే నిండుగా ఉన్నావు " అని ఒకరు

అసలు విషయం గ్రహించిన జ్యోతి మాత్రం అందరికీ చిరునవ్వే సమాధానం ఇచ్చింది. కేక్ కట్టింగ్ అయ్యాక, అందరికీ అడిగి అడిగి కొసరి కొసరి మరీ వడ్డించి కడుపు నిండేలా అన్ని రుచికరమైన పదార్ధాలు తినిపించారు జ్యోతీ దీపక్ లు. ఇక అందరూ వెళ్ళే ముందు జ్యోతి.. "ఒక్క నిమిషం మీ అందరితో కొంచం మాట్లాడాలి " అని అంది.  



"మీరందరూ ఈరోజు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థాంక్స్.  నాకు పెళ్లైనప్పటి నుంచి పిల్లలు కావాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. దీపక్ కి కూడా పిల్లలంటే చాలా ఇష్టము. మా దురదృష్టమేంటో కానీ పెళ్ళైన 10 ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదు. మా పేర్లల్లో జ్యోతీ దీపక్ ఉన్నా మా జీవితాలలో మాత్రం వెలుగు లేదు. ఎంత డబ్బు ఉన్నా పిల్లల చేత "అమ్మ " అని అనిపించుకోని ఆ వెలితి అనుభవిస్తే కానీ అర్ధం కాదు.   అన్ని రకాలుగా ప్రయత్నించివిసిగి వేశారిపోయాక  ఇదిగో అప్పుడు "ద్యుతి " వచ్చింది. మా జీవితం లో నిజం గా ద్యుతి ద్యుతినే తెచ్చింది. కానీ అప్పటికీ నాకు ఇంకా తనివి తీరలేదు. ద్యుతికి ఏడాదిన్నర వచ్చాక ద్యుతికి చెల్లెలు  "మయూఖ "  వచ్చింది. వాళ్ళ అల్లరితో ఇల్లంతా కళకళలాడింది. మా మొహాలలో చిరునవ్వు కూడా అంత అందంగానే విరబూసింది. ఇంక వాళ్ళిద్దరికీ ఒక తమ్ముడు కావాలని అనిపించింది మాకు.. అంతే ఇదిగో "చిరాగ్ " గాడు వచ్చాడు నేనున్నానంటూ! గత పదేళ్ళుగా "అమ్మా " అన్న పిలుపు కోసం ఎంత తపించిపొయానో... దేవుడు దానికి రెట్టింపుగా ప్రతి నిమిషం "అమ్మ , అమ్మా " అంటూ నా వెంట తిరిగే ముగ్గురు ముత్యాలని ఇచ్చాడు. వారి నవ్వుల పువ్వులతో, ఏడ్పుల గాడ్పులతో, కోపాల కారాలతో, ముద్దుల తీపితో నాకూ రోజు ఉగాదే! 



నేను ఒక కూతురిగా అమ్మ నాన్నల నుంచీ అన్ని సిరులు పొందాను. ఇంక ఒక భార్యగా దీపక్ నాకు అన్ని ముచ్చట్లు తీర్చాడు. కానీ ఒక తల్లిగా పొందాల్సిన ముచ్చట్లేవి నాకు పదేళ్ల పాటు దక్కలేదు. నాకు తల్లిగా పిల్లల నవ్వులు కావాలనుకున్నా, వాళ్లతో నిద్ర లేని రాత్రులు కావాలనుకున్నా, వాళ్ళ అలకలు తో కూడిన దొంగ ఏడ్పులు కావాలనుకున్నా, నచ్చినవి ఇస్తే మురిసిపోయి ముద్దులతో కురిపించే ప్రేమ కావాలనుకున్నా, భయపడి "అమ్మా " అని చుట్టేసుకున్నప్పుడు భద్రత అవ్వాలనుకున్నా! అందరూ వాళ్ళ పిల్లల అల్లరితో విసిగిపోతూ ముచ్చటగా చెప్పుకొని కబుర్లు నేనూ చెప్పాలనుకున్నా! నేనూ అలా విసిగిపోవాలనుకున్నా! అమ్మగా నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలని పొందాలనుకున్నా! ఇందాక ఎవరో అన్నట్టు " కాస్త చూసి అందంగా ఉన్న పిల్లల్ని తెచ్చుకోవాల్సిందే " అని .. "మీ కడుపున పుట్టిన పిల్లలు ఏ వంకరతోనైనా పుడితే మీది కాదు అని వదిలేసి వస్తారా?  మీరందరూ శారీరక నొప్పులు పడి "తల్లి " కాగలిగారు.. నేనూ ఎంతో మానసిక వ్యధపడే ఇన్నాళ్ళకు ఒక "అమ్మ " ని అయ్యాను. మీ అందరికీ ఏ కష్టం లేకుండా " అమ్మ " అని అనిపించుకునే వరం దక్కింది. అలా దక్కని వారికి ఎడారిలో ఒక అమృతం చుక్కలా ఇలా " అమ్మా " అని  పిలిపించుకొని అవకాశం ఇచ్చిన అనాథశరణాలయాలకు ఎంతో ఋణపడి ఉన్నాము. ఇప్పుడు నేను మా పిల్లల అల్లరితో ఆటలతో అలసిపోతున్నాను, వారి కబుర్లలో తేలిపోతున్నాను, వారి ముద్దులలో మునిగిపోతున్నాను... ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇప్పుడు నా దగ్గరే ఉంది.   నేను  నా డబ్బు దర్పం చూపించడానికి ఈ ఫంక్షన్ చేశానని అనుకోవద్దు.. నేనూ "అమ్మ " ని అయ్యానన్న గర్వం తో చేశాను. ఏరోజూ నా పిల్లల్ని నేను అనాథశరణాలయం నుంచి తెచ్చుకున్నానని మాత్రం అనొద్దు  " అని అందరికీ దండాలు పెట్టింది.  



కుదిరితే జ్యోతి లాంటివారి విశాల హృదయానికి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము... అంతే తప్పా.. పిల్లలు అందంగా లేరనో, ఏ కులమో,  ఏ మతమో అని వారిని వేలెత్తి చూపి కుసంస్కారాన్ని బయట పెట్టుకోవద్దు!! 




No comments:

Post a Comment