Search This Blog

Tuesday, April 10, 2018

జ్ఞాపకాలు

"పాతా...బాతా... సీతామ్మా " అంటూ రోజూ మధ్యాహ్నం ఒకతను వీధుల్లో అరచుకుంటూ వెళ్ళేవాడు. సీతకి  ఈ " పాత.. బాత "ఎంటో చాలా రోజులు అర్ధం కాలేదు.  రోజు మిడసరి లగ్నంలో వచ్చేవాడు. నెత్తిమీద ఒక గంప పెట్టుకొని అందులో ఏవో కొన్ని గిన్నెలు పెట్టుకొని అరుస్తూ వీధి వీధి తిరిగేవాడు. అతను అరుస్తుంటే చిన్నపిల్లలమేమో (అప్పుడు) మేమూ అదే స్టైల్ లో అరవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఓసారి మా చిన్నమావయ్య మేము అన్నది విని నవ్వి, ఆ వీధిలో అతను "పాతా బాతా సీతామ్మా " అని అరవడం లేదు.. "పాతా బట్టలకి స్టీల్ బాసాన్లమ్మా " అని అరుస్తున్నాడని గీతాబోధ చేశాడు.  😄

రోజూ పొద్దు పొద్దుటే ఆరు, ఆరున్నర మధ్యలో, మళ్ళీ సాయంత్రం ఐదూ ఐదున్నర మధ్యలో సైకిల్ మీద ఒకతను వచ్చేవాడు.. అతను ప్రతీ వీధి తిరుగుతూ "బుల్లమ్మా " అని అరచుకుంటూ వెళ్ళేవాడు. పాపం ఎవరో బుల్లమ్మ ని వెతుకుంటున్నాడేమో అని అనుకునేదాన్ని నేను. మధ్య మధ్యలో కొందరి ఇంటి లోపలకి వెళ్ళీ ఒక పొట్లం ఇచ్చి బుల్లమ్మని వెతుకునేవాడు..పాపం. తరవాత కాలం లో అర్ధమయ్యింది ఏమిటంటే అతను "బుల్లమ్మ " ని వెతుకోవడం లేదని అతను "పూలమ్మా " అని అరుస్తూ అమ్ముకునేవాడని.    😜 


అలాగే వీధిలో "మౌజ్ " అని అరిచేవాడు.. ఎదో ఎలక అమ్మేవాడు అనుకునేవాళ్ళం.. తీరా చూస్తే అది "చీటీ వాలా మౌజ్ (అదేనండి చుక్కల అరటి పళ్ళు). 

మా ఊరులో ఇలాగే "ప్పో... " అంటూ మిట్ట మధ్యాహ్నం పూట ఒకడు వచ్చేవాడు. అతను అమ్మేది "ఉప్పు " . ఎప్పుడూ ఉప్పో అని అమ్మేవాడు కాదు, ఆ ఊరిలో ఎవరిదేనా పెళ్ళి కుదిరితే  " పెళ్ళివారుప్పో " అనీ, పెళ్ళి అయితే "కొత్త కాపురం ఉప్పో " అని, లేకపోతే "అత్తాకోడలుప్పో " అనో , ఎండా కాలం లో "ఆవకాయుప్పో " అని అరుస్తూ ఉండేవాడు. ఒకసారి మా పక్కూరిలో ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు కొట్టుకొని వేరింటి కాపురం పెట్టుకొన్నారు, ఆ ఊరు వెళ్ళి ఈ ఉప్పు అతను " వేరింటి కాపురం ఉప్పో " అని అరిచాడు. పాపం అతన్ని ఎముకళ్ళొకి ఉప్పులేకుండా కొట్టేశారు ఆ అత్తాకోడళ్ళు. 😢😢😢😢😢

ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మా వీధిలోకి "ప్పో " అని అరుస్తూ ఒకావిడ వచ్చింది. వెళ్ళి చూస్తే అది "ఉప్పు " కాదు.. "సొప్పు (ఆకుకూరలు). ఇదిగో పైన చెప్పిన వారందరూ  గుర్తుకొచ్చేశారు. 😎

1 comment:

  1. హ హ,
    బెంగళూరుకు వచ్చిన కొత్తలో నాకు అదే అర్థం కాలేదు, ..ప్పో అంటే ఏంటో, తర్వాత ఆకు కూరలు అని తెలిసింది.
    బావుంది చక్కగా బాల్య స్మృతులు గుర్తుకు తెఛ్చారు.
    రాజేశ్వరి.

    ReplyDelete