Search This Blog
Saturday, June 30, 2018
డాక్టర్
" సహస్ర శీరుషః పురుషః సహస్రాక్ష సహస్రపాత్.... " అంటూ రోజు ఆ విరాట రూపాన్ని స్తుతిస్తూనే ఉంటాము. వేయి తలలతో, వేయి కళ్ళతో, వేయి చేతులతో ఎప్పుడూ ఆ స్థితి కారకుడు ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. కొందరు అతన్ని విష్ణువుగా పిలిస్తే, కొందరు శక్తిగా పిలుస్తారు, ఇంకొందరు విశ్వేశ్వరుడిగా మరికొందరి నారాయణుడిగా కొలుస్తారు. మరి కొందరు 'వైద్యుడి ' గా కొలుస్తారు.
Monday, June 4, 2018
ప్రకృతి
మన పురాణాలు " పుష్పవాన్ అంటే తోటలు, పొలాలు కలగడం, ప్రజావాన్ అంటే మంచి సంతానం, కష్టసుఖాలు పంచుకొనే వారు ఉండటం, పశుమాన్ అంటే పాడి కలిగి ఉండటం " కలిగినవాడినే అసలైన శ్రీమంతుడిగా చెప్పింది. కానీ ఒక కండీషన్ ... నీటిలోన భగవంతుడు, ఆ భగవంతునిలో నీరు పరస్పరం ఆశ్రయాలై ఉన్నట్లు తెలుసుకున్నవారికి.. అంటే వారిద్దరూ అభేదం అని తెలిసుకొన్నవారికే ఈ ఆఫర్ అన్న మాట. ( చన్ద్రమా వా ఆపాం పుష్పం, పుష్పవా ప్రజావాన్, పశుమాన్ భవతి, య ఏవం వేద).
అలాగే అగ్ని నీటి మీద ఆధరపడి ఉంటుంది, నీరు అగ్ని మీద, వాయువు నీటి మీద, నీరు వాయువు మీద (అదే ) , అంతే కాక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ నీటికి అధిష్టన దేవతలుగా భావించి వాటిని నమ్మి రక్షించేవాడే వేదాన్ని నమ్మేవాడు అని కూడా చెప్పింది. (అగ్నిర్వా అపా మాయతనం, వాయుర్వా అపా మాయతనం, ఆసోవై తపన్న పామాయతనం, చన్ద్రమా వా ఆపా మాయతనం). అంటే ఇవన్నీ నీటి మీద ఆధారపడి ఉన్నాయి, నీరు కూడా వీటి మీద ఆధారపడి ఉంది. ఇది తెలుసుకున్నవాడే వేదాన్ని తెలుసుకుంటాడు. పొద్దుటే పూజామందిరంలో ఈ మంత్ర పుష్పం చక్కగా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని చదివేసి.. ఒక పువ్వు తీసి ఆ విశ్వనాథుడి పాదాల దగ్గర పెట్టేసి.. వీటన్నిటి రక్షించేస్తానని సంస్కృతం లో వొట్టేసేసి బయటకి వచ్చి కాళ్ళు చేతులు కడుకోడానికో లేక మొహం కడుకోడానికో కుళాయి తిప్పేసి ఫోన్ లో మునిగిపోతూ ఉంటాము.
ఒక్కసారి సగరుల ని గుర్తుతెచ్చుకుందాము, భూమిని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తేనే కదా వారు అటు నరకానికి కానీ, స్వర్గానికి కానీ వెళ్ళని గతి పట్టింది. వారి కోసం గంగ వస్తే కానీ వారికి మోక్షం దొరకలేదు. ఈ రోజుల్లో మన కోసం తపస్సు చేసి ఏ గంగని భూలోకానికి దింపే వారసులు లేరు.. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాము.
మన పురాణాలలో ప్రకృతి పార్వతిదేవితో పోల్చారు. ఆవిడని గౌరవించి పూజించిన నాడు ఆర్తానాదులు పాలిట అన్నపూర్ణ అవుతుంది. ప్రకృతితో ఆటలాడితే మహప్రళయసాక్షిణి అవుతుంది.
Friday, June 1, 2018
సినిమా పిచ్చోళ్ళు
" నా ఆజ్ఞ దిక్కరించితే నీకు ఇంట్లో చోటు లేదు, నీకు నీ కుటుంబం ముఖ్యమో, లేక వాళ్ళు ముఖ్యమో తేల్చుకో, నీకు నేను కావాలో వాళ్ళు కావాలో నిర్ణయించుకో " ... ఏంటీ ఈ డైలాగు వింటే ఏదో సినిమాలలో మాట వినకుండా ఎవరినో ప్రేమిస్తొన్న కొడుక్కి తండ్రి ఇచ్చే వార్నింగ్ లా ఉంది కదా... అసలు విషయమేమిటంటే మా సినిమా యాక్టర్ ఆంటి వాళ్ళ అబ్బాయితో అన్న మాటలు. వాడు ఆ కాలనీలో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఆవిడ వచ్చి వారసి గూడా లో వాళ్ల అన్న ఇంటికి వెళ్ళమని అంది, వాడు "ఊహూ ఆడుకుంటా " అని అన్నాడు.. అంతే ఈ డైలాగు వదిలింది ఆవిడ.
ఆ ఆంటీ పేరు నాకు గుర్తులేదు! కానీ ఆవిడ విపరీతంగా సినిమాలు చూసేది, వారానికి కానీసం లో కనీసం నాలుగు! అంకుల్ కి అస్సల్ సినిమాలంటే పడేది కాదు, సినిమాలకి డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. సినిమా టికేట్టు కోసం ఆవిడ ఇంట్లో పూలు, పళ్ళు, కాయలు, సగం వాడేసిన మావిడి కాయ ముక్కలు, మిగిలిపోయిన కాయగూరలు అమ్మేసుకునేది.
🤭
🤭అప్పుడప్పుడు బియ్యమూ, పప్పులు, ఉప్పులు కూడా!! ఒక్కసారి అమ్మడానికి ఏవీ లేకపొతే ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు తాకట్టు పెట్టేసింది. నాకు ఆవిడ "సితామాలక్ష్మి " సినిమాలో తాల్లూరి రాజేశ్వరి లా అనిపించేది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కళ్ళు, నోరూ భలే తిప్పేసుకునేది. అప్పట్లో ఆ పేరు నాకు తెలీదు, అందుకు ఆవిడని "సినిమా యాక్టర్ ఆంటీ " అనేదాన్ని, పాపం తెగ మురిసిపోయి ముక్కలైపోయేది. వాళ్ళ అన్నయ్యకి కూడా సినిమాల పిచ్చి బాగా ఉండేది. అప్పుడప్పుడు అతను ఈవిడకి డబ్బులు ఇచ్చేవాడు.
ఆవిడకి ఒక కొడుకు, ఒక కూతురు, పేరు శ్రీదేవి, కృష్ణ. ఆంటీ సినిమా చూసీ ఆ సినిమాలో హీరోయిన్ లా చిత్ర విచిత్ర జడలు వేసేది శ్రీదేవికి. ఆ శ్రీదేవిని తయ్యారు చేసి " నా కన్నుల వెన్నెల, నా హృదయాలలో చిరు జల్లు నువ్వే " అని ముద్దు పెట్టుకునేది. ఈ హరివిల్లు, చిరుజల్లు, మమతల కోవెల, పులకింత, పాలపుంత వగైరా పదప్రయోగాలు ఆవిడ రోజూ వాడేది. ఏంటో మా ఇళ్ళల్లో ఇలా ఎప్పుడూ అనేవారు కాదేమో భలే నచ్చేసేవి ఆ మాటలు మాకు!
కృష్ణ ఎప్పుడేనా "అమ్మా! ఈరోజు సాంబారు చాలా బాగుంది " అని అంటే...
"అందులో నా ప్రేమ రంగరించాను, బాగోదా మరి " అనేది...
మా ఇళ్ళల్లో ఎప్పుడూ కారం, మిరియాలు, కొబ్బరే వేసేవారు ఈ సాంబారులో, ఈ రంగరించడం ఏంటో మరి!!
🤔
ఆవిడ అంతటితో ఆగలేదు, గోరింటాకు రుబ్బుతూ " గోరింటా పూసింది కొమ్మలేకుండా " అని, పూలు కోస్తొనప్పుడు "పూజ సేయ పూలు తెచ్చాను " అని, మరేదో పని చేస్తూ "ఆడది కోరుకునే వరాలు రెండే రెండు " అని పాడుకునేది.
😀
😆
ఇక ఆంటీ వాళ్ళ అన్నయ్య సిని యాక్టర్ "బాలయ్య " అభిమాని. చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ఎప్పుడూ పాతికమంది(ద)నేసుకొని తిరిగేవాడు. వాళ్లందిరిని బాలయ్య సినిమాకి తీసుకొని వెళ్ళి వారి తిండితిప్పలు చూసుకొనేవాడు. బాలయ్య సినిమా రిలీజు అయిన రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం టికెట్లు ఆయనే కొనేసేవాడు. ఆయన పరివారం మొత్తం ఆ సినిమా చూడాల్సిందే!
ఆ అంకుల్, ఈ సినిమ యాక్టర్ ఆంటీ కలిసినప్పుడు చూడాలీ.. "రక్తసంబంధం " సినిమాయే!! "నీ ప్రేమే నాకు శ్రీరామ రక్షా అన్నయ్య " అని ఆవిడ అంటే, " నా కంటికి, మా ఇంటికి దివ్వెవు నువ్వే, ఒక కొమ్మకి పూసిన పువ్వులం మనము చెల్లెమ్మ " అని ఆయన అనేవాడు... ఒక్కొసారి వాళ్ళు చెప్పే డైలాగులు ఏ సినిమాలోవో మాకు తెలిసిపోయేవి కూడా! కానీ ఆ డైలాగులలో కామెడీ అప్పట్లో తెలియలేదు!!
😄
ఆ అంకుల్ యంగ్ గా ఉన్న "వెంకయ్య నాయుడు " లా ఉండేవాడు. ఒకసారి ఆయనకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చేసింది. పాపం చుట్టూ ఉన్న ఈ మంద ఒక్కక్కరే తప్పుకున్నారు. ఆ అంకుల్ కి మతి కూడా చెడిపోయింది.
😥రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఆయనలో ఆయనే గట్టిగా మాట్లాడేసుకునేవాడు. ఒకసారి ఇలా వెళ్తూ వెళ్తూ తప్పిపోయాడు. పాపం ఇంట్లో వాళ్ళు చాలా వెతికారు. ఆయనకి డిగ్రీ చదివే ఒక కొడుకు, ఇంజినీరింగు చదివే ఇంకో కొడుకూ ఉన్నారు. వాళ్ళు చెరో బైకు వేసుకొని మరీ ఊరంతా వెతికారు. అప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఆయన "తిరుపతి బస్సు " ఎక్కేశారని చెప్పారు. వెంటనే వాళ్ళు తిరుపతి బయలుదేరాలనుకున్నారు. తిరుపతి ఏదైనా చిన్న నగరమా ఆయన దొరకడానికి? అయినా బయలుదేరారు.
ఆ కొడుకులు తిరుపతి బస్సు దిగి ఒక పేపరు కొనుకొన్నారు. ఒక నిర్ణయానికి వచ్చినవారులా వెంటనే ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. ఒక సినిమా హాల్ కి వెళ్ళారు , ఆ సినిమా హాల్లో బాలయ్య " తల్లి తండ్రులు " సినిమా చూస్తూ కనిపించాడు వాళ్ళ 'కన్నతండ్రి"!
😎
😎
😍
Sunday, May 6, 2018
సరసాల జవరాలను
చిత్రం : సీతారామ కల్యాణం (1961)
సంగీతం : గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత : సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం : పి. లీల
పల్లవి :
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ...
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను...
మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను..
చరణం 1 :
బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసు పొంకములోనా
సంగీత నాట్యాల నైపుణిలోనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ
సంగీత నాట్యాల నైపుణిలోనా
నా సాటి నెరజాణ కనరాదుగా
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను..
చరణం 2 :
మగువల నొల్లని మునియైనా
మగువల నొల్లని మునియైనా
నా నగుమొగమును గన చేజాచడా
యాగము యోగము ధ్యానములన్నీ ...
యాగము యోగము ధ్యానములన్నీ ...
నా బిగికౌగిలి సుఖమునకేగా
సరసాల జవరాలను... నేనే గదా
సరసాల జవరాలను..
*****************************
ఈ పాట సీతారామ కల్యాణం సినిమాలోనిది. పాడినవారు పి. లీల, సంగీతం గాలిపెంచల నరసింహారావు, సాహిత్యము సముద్రాల రాఘవాచార్య. ఈ పాట కుచలకుమారి మీద చిత్రీకరించారు. సినిమాలో ఆవిడ రంభగా నటించారు. రంభ తనని తాను పొగుడుకుంటూ పాడుకునే జావళి ఇది. ఇది తెలిసో తెలియకో రావణుడిని ఆకర్షించినందుకు ఈ పాట జావళి అయ్యింది. ఈ పాట అయ్యాకే రావణుడు రంభని బలాత్కరిస్తాడు, నలకూబరుడి శాపానికి లోనౌతాడు. (కొన్ని గ్రంధాలలో రంభే శపించింది అని కూడా ఉంది).
ఈ జావళిలో రంభ తనను తాను పొగుడుకుంటూ "యాగము యోగము దానములన్నీ నా బిగికౌగిలి సుఖమునకేగా " అని చాలా గర్వంగా అంటుంది. ఎన్ని తపస్సులైనా, ఎన్ని యాగాలైనా చేసేది స్వర్గం కోసమూ, ఆ స్వర్గ సుఖాల కోసమే కదా! ఆ స్వర్గంలో ముఖ్య ఆకార్షణ తనే (రంభే) అని ఎంత గర్వంగా చెప్పుకుందో కదా!
Thursday, May 3, 2018
మాధవపెద్ది సురేష్
మిత్రులకు నమస్కారములు! ఈ నెల ఎందరో మహానుభావు లలో తెలుగు సినీ సంగీత దర్శకులు "మాధవపెద్ది సురేష్ " గారు గురించి తెలుసుకుందాము. వారి సినీ సంగీతం వహించిన సినిమాలు రాశి తక్కువయినా వాశిలో ఎందరో హృదయాలు "మధురమే సుధాగానం " అనేటట్టు చేశాయి. వారు చాలా సౌమ్య భాషి, మంచి వ్యక్తి ఆయన. ఆయనకి తగిన ఇల్లాలే నిర్మల గారు(చిట్టి పిన్ని). మాధవపెద్ది సురేష్ గారి సంగీతమంత మాధుర్యం నిర్మల గారి వంట. ఆవిడ చేతి 'పండుమిరపకాయ పచ్చడి(కొరివికారం) ' సూపర్.. మాటలు లేవు! ఆ సంగీతం, ఈ వంటకం ఆస్వాదించాలి కానీ వర్ణించలేము.
సురేష్ గారూ, నిర్మల గారు! మీ పరిచయం ఒక అదృష్టం. ఎప్పటికీ మీ అభిమానాన్ని కోరుతూ.. మీ విశాలి.
Wednesday, April 25, 2018
నీవెంత నెరజాణవౌరా
నీవెంత నెరజాణవౌరా...
ఈ రోజు మన "జావళి " జయభేరి సినిమాలోని "నీవెంత నెరజాణవౌరా " . ఈ పాట రాసినవారు మల్లాది రామకృష్ణశాస్త్రి గారు. మొట్టమొదట చెప్పుకోవాల్సినది ఒక మగవాడిని పట్టుకొని "నెరజాణ " అని సంభోదించడం. మల్లాదివారి గురించి ఎంత చెప్పినా తక్కువే! తెలుగు పాటలని "చిరంజీవులు " చేసిన కలం ఆయనది.
ఆయన బహుభాషావేత్త. బహుముఖప్రజ్ఞాశాలి. ఈపాటకి సంగీత దర్శకులు పెండ్యాలగారు. నృత్య దర్శకులు "వెంపటి పెద సత్యం " గారు. ఈ పాట విని పెదసత్యం గారు మల్లది వారితో "పాట కాస్త సరి చెస్తే నాట్యానికి బాగుంటుందండి. ఇక్కడ కాస్త అడుగులకి ఇబ్బంది అవుతోంది " అని అన్నారుట. అందుకు మల్లాది వారు " మిగిలిన పాటంతా బానే ఉంది కదా? ఈ చిన్న చోటే కదా? ఆ ఒక్క చోట అంజమ్మ (అంజలీ దేవి) ని కాస్త తల గోక్కోమని చెప్పండి, అందంగా ఉంటుంది " అనేసి కండువా దులిపి భుజాన వెసుకొని వెళ్ళిపోయారుట. ఈ జావళి మాత్రం అంజలీదేవి మీద కాకుండా ఆ నాటి నాట్యతార "రాజసులోచన " పై చిత్రీకరించారు.
చిత్రం : జయభేరి (1959)
సంగీతం : పెండ్యాల
గీతరచయిత : మల్లాది
నేపధ్య గానం : ఎం. ఎల్. వసంత కుమారి
పల్లవి :
నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...
నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...
నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
అనుపల్లవి :
తెనెలు చిలికించు గానము వినగానే...
తెనెలు చిలికించు గానము వినగానే... ఈ మేను పులకించురా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
సరసులు తలలూచు సొగసరి నిను జూడా
ఉల్లంబు కల్లోల మేరా సమ్మోహనాంగ
నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...
చరణం 1 :
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
చనువుగ దరి చేరి మరి మరి మురిపించు
పరువముగలదానరా.. స్వామీ...
సిరిగన కనులాన.. ఆ... ఆ.. ఆ...
సిరిగన కనులాన.. సిగలో విరులానా
మౌనమే వినోదమా... ఇదే సరాగమా నవమదన
నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
నీవెంత నెరజాణవౌరా...
చరణం 2 :
బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా.. స్వామీ
బాలను లాలించి ఏలుట మరియాద కాదన వాదౌనురా..
మీరిన మోదాన వేమరు నిను వేడు
భామను వరించరా.. తరించరా...
శృంగారధామ ఏలరా... యీ మోడి చాలురా
సరసుడవని వింటిరా.. చతురత కనుగొంటిరా
వన్నె చిన్నె గమనించవేలరా... వన్నెకాడ కరుణించవేలరా
వగలొలికే పలుకులతో నను చేకొమ్మని... నీ కొమ్మని.. నీ సొమ్మని
దరా పురంధరా.. యిదే మనవీ మన్నన సేయరా నాదమయా
మనవి వినర... మనసు పడర పరమ రసిక శిఖామణి...
నీవెంత నెరజాణవౌరా...
సుకుమారా... కళామోహనా.. సంగీతానంద...
నీవెంత నెరజాణవౌరా...
ఆ... ఆ.. ఆ...
Tuesday, April 24, 2018
జావళి
కృష్ణుడి పేరు వినగానే ఎవరికైనా గుర్తువచ్చేది అతని రాసక్రీడలు . బృందావన విహారాలు, గోపికలతో సరససల్లాపాలు. గోపికల విరహవేదనలు. భక్తజయదేవుడు తన గీతగోవిందం లో ఆ క్రీడలని, ఆ విరహాలని చక్కగా వర్ణించారు . ఆ తరువాత వచ్చిన క్షేత్రయ్య పదాలు ఇంచుమించు అదే తరహాలో ఉన్నవే! ఈ జయదేవుడి అష్టపదులు, క్షేత్రయ్య పదాల యొక్క ముఖ్య ఉద్దేశాలు ఒకటే అదే కృష్ణుడి మీద ప్రేమ! అవే "జావళి " కి మూలాధారాలు అని అనుకోవచ్చు.
అవి కృష్ణుడి ఊహించుకొని పాడినవి అయితే, ఈ జావళీలు మాత్రం కథానాయుకుడిని ఊహించు కొని / ఉద్దేశింస్తూ పాడేవే. పదానికి జావళికీ అదే తేడా . పదంలో సంగీతం ఎక్కువ గా నూ చిక్కగాను ఉంటుంది , జావళీలలో మాత్రం సాహిత్యము ఎక్కువగాను ఉంటుంది . శాస్త్రీయ సంగీతంలో ఒక ప్రక్రియే ఈ జావళి. ఈ జావళీలలో ఎక్కువ శృంగారానికే ప్రాధాన్యము ఇచ్చేవిగా ఉంటాయి. కొన్ని సంధర్భాలలో భక్తి కూడా మెండుగా ఉంటుంది. జావళీలు ఒక పల్లవి, అనుపల్లవి, రెండు లేక మూడు చరణాలతో ఉంటాయి.
తెలుగు సినిమా పాటలో ఈ జావళీలు ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. కథానాయకుడికి నిగూఢంగా సందేశాలు తెలియచేయడమే సినిమాలలో జావళీ యొక్క ప్రధాన ఉద్దేశం. కొన్ని సంధర్భాలలో కాస్త నాటుగా ఎల్లలు దాటిన శృంగారంతో కనిపించినా జావళీలకు మాత్రం ఒక నిశ్చితమైన స్థానము కలదు సినిమాలలో. శృంగార సాహిత్యాన్ని గంభీరంగా వ్యక్త పరచే జావళీలు ఎప్పుడూ హుందాగానే ఉంటాయి.
రాజు దగ్గర నాట్యం చేసే నర్తకీమణులకు ఈ జావళీలు ఎక్కువ పెట్టేవారు సినిమాలలో. ఆ తరవాత నాయకుడి ప్రేరేపించడానికి నాయికామణులు, లేక ప్రతినాయికలు నాట్యం చేస్తూ ఆలపించే జావళీలు కొన్ని. కొన్ని జావళీల గురించి చర్చించుకుంద్దాము.
Subscribe to:
Posts (Atom)


