Search This Blog

Saturday, June 30, 2018

డాక్టర్

" సహస్ర శీరుషః పురుషః సహస్రాక్ష సహస్రపాత్.... " అంటూ రోజు ఆ విరాట రూపాన్ని స్తుతిస్తూనే ఉంటాము. వేయి తలలతో, వేయి కళ్ళతో, వేయి చేతులతో ఎప్పుడూ ఆ స్థితి కారకుడు ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. కొందరు అతన్ని విష్ణువుగా పిలిస్తే, కొందరు శక్తిగా పిలుస్తారు, ఇంకొందరు విశ్వేశ్వరుడిగా మరికొందరి నారాయణుడిగా కొలుస్తారు. మరి కొందరు 'వైద్యుడి ' గా కొలుస్తారు.

కింద కనిపించే ఫొటో బెంగుళూరులో 'నారాయణ హృదయాలయ ' లోపలకి అడుగుపెడుతుంటేనే కనిపిస్తుంది. ఒకొక్క చేతిలో ఒక్కొక్క దేవత నివాసమున్నట్టుగా ఉన్న ఆ విగ్రహం. ఈ విగ్రహానికి ఇక్కడ పని చేసే డాక్టర్లకి సంబంధం ఏంటా అని ఆలోచించాను. ఆ విగ్రహం చూడగానే ' వైద్యో నారాయణో హరి ' అని గుర్తుకొచ్చింది. 

నిజంగా ప్రతి డాక్టరూ ఆ విగ్రహంలోలాగా ఒక్క నిముషములో వేయి తలల ఆలోచనలతో, వేయి చేతులు చేసే పనులతో ఎల్లప్పుడూ సహాయం కోసం నిలచి ఉంటారు. రాత్రనక పగలనక రోగులని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.

వారి చేతుల మీద ఎంత మందికి జన్మనిచ్చినా వారు గర్వపడరు, వారి చేతుల మీద మరెంత మంది ప్రాణాలు పోగొట్టుకొనినా నిరుత్సాహపడని స్థితప్రజ్ఞులు. అందుకే ' తొలిదేబ్యో భిషక్ ' గా నమక చమకాలలో ఆ శివుడికి కొలుస్తున్నాము.

మెడలో పాముకు బదులు 'సెతస్కోపు ' తో.. పీతాంబరాలకు బదులు ' తెల్లటి ఆప్రాన్ ' తో హరిహరుల కలయిక రూపమై కనిపించే దేవతలే ఈ వైద్యులు. అప్పుడే పుట్టిన పాపాయిని మొట్టమొదటి సారి స్పర్శించేది వీరే! వారి సేవలు అనిర్వచనీయము. 

ఈ రోజు మా ఊరి డాక్టర్ గారు డాక్టర్ (ఖండవల్లి) సుబ్బారావు గారిని తలచుకోలేకపోతే అది విశ్వాసఘాతమే! ఆయన ఆ చుట్టుపక్కల ఊర్లకి 'దేవుడు " ... కాదు కాదు.. "వైద్యుడు "! ఎందుకంటే ఆ దేవుడు అందరికి కనపడడు, ఈయన అయితే పిలిచినవారిని ఎప్పుడూ అండగా ఉండేవారు! ఆయన ఇప్పుడు ఆ స్వర్గంలో వైద్యం చేస్తూ ఉండి ఉంటారు.

వైద్య వృత్తిలో ఉండి ఎంతో మానవసేవ చేస్తున్న డాక్టర్ మితృలకు అభినందనవందనం!






No comments:

Post a Comment