Search This Blog

Thursday, December 21, 2017

నూరు గొడ్లను తిన్న రాబందు

"పెళ్ళికూతురు ఎలా వుంటుంది వదినా "

"కార్తీక మాసం తేగలా ఉంది వదినా "

నాకు భలే నవ్వొచ్చింది. ఎందుకంటే ఆ పెళ్ళికి నేనూ వెళ్ళాను. ఆ పెళ్ళికూతురు సన్నగా తెల్లగా ఉంది.

ఇంతలో అటుగా వెళ్తొన్న మా ఊరి అల్లుడు గారు " ఆ పాలల్లో పడ్డ బల్లిలా ఉంది.. అదీ ఒక అందమే " అన్నాడు. బల్లి పాలలో పడితే ఎలా ఉంటుందో ఊహించుకున్నా... యాక్... ఛీ.. ఇదో పోలికా..

"పెళ్ళికొడుకు రేవులో తాడిలా ఉన్నాడు.. ఇంటికి బూజు దులపడానికి పనికొస్తాడు బాగా " అని అనేసి వెళ్ళిపోయాడు.

ఆయనకి ఎదురు చెప్పడం ఊరిలో ఎవరికీ రాదు. అందరికి భయమో లేక గౌరవమో తెలీదు. ఆయన పేరు గౌతమేశ్వరుడు. మా ఊరిలో ఓ పెద్దాయకి అల్లుడు ఇతగాడు. ఊరులో మొత్తం ఆ పెద్దాయకి అన్నదమ్ములే ఉండటంతో ఊరిమొత్తానికి అల్లుడై కూర్చున్నాడు. ఆయన భార్య సర్వలక్ష్మి ఆయనకు సమ ఉజ్జే!

వీధి అరుగు మీద కూర్చొని అటు వెళ్ళే వాళ్ళని ఇటు వచ్చేవారిని పట్టుకొని " ఏవే ఇలా రా " లేక పోతే "ఒరేయ్ ఇలా రా అని పిలిచే వారు " తీరా వాళ్ళు వచ్చాక ఆ వచ్చిన వ్యక్తిని ఏదో అడిగి వాడిని ఇదిగో ఇలాంటి పుల్ల విరుపు మాట ఏదో ఒకటి అనేసి పంపేవారు.

ఒకసారి నేను పేరంటానుంచి వస్తుంటే "ఇలా రావే " అని పిలిచింది మా సరత్తయ్య.

నన్ను చూసి గౌతమేశ్వరుడు గారు "దీనిది అచ్చు వీళ్ళ నాన్న మొహమే " అన్నాడు

"అవును ఐదు పైసల మొహమూ " అంది సరత్తయ్య

" పావుకోళ్ళ మొహమూ ఇదీనూ " అన్నాడు గౌతమేశ్వరుడు మావయ్య

"వీళ్ళ అమ్మ ది సిబ్బిరేకు మొహం.. గుండ్రంగా ఉంటుంది, దీనికే వాళ్ళ నాన్న, మామ్మ మొహం వచ్చింది.. మీరన్నట్టు పావుకోళ్ళ మొహం " అని అంది సరత్తయ్య నవ్వుతూ....

నాకు ఈ పావుకోళ్ళు అంటే అప్పటికి తెలీదు. అదేదో జాతి కోళ్ళు అనుకున్నా. ఇంటికొచ్చి మా మామ్మకు చెప్పా

"గవాక్షుడిలా మొహం వేసుకొని వచ్చే పోయే వాళ్ళని అనడమే వాడికి తెలుసు, అయినా ఆ సరమ్మ కూడా సొంత పిన్ని ని అని కూడా చూడకుండా పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆ మాటలేంటీ? " అని బాధపడింది. కానీ ఆ సరత్తయ్యని అనే ధైర్యం లేదు మా మామ్మకి. ఇంతకీ ఆ గవాక్షుడెవడో తెలీదు.

ఊర్లో పెళ్ళీళ్ళు అయితే ఆడపెళ్ళివారికి మగపెళ్ళివారికి గొడవలు పెట్టేసేవారు ఈ గౌతమేశ్వరుడు గారు! ఒకసారి మా ఊర్లో ఒకాయన కూతురు పెళ్ళి చేసుకున్నాడు. కాకినాడ నుంచి మగపెళ్ళివారి బస్సు విడిది ఇంటి దగ్గర దిగింది. చాలా సేపు బస్సు ప్రయాణం చేసి ఉన్నారు పాపం ఆడవాళ్ళకి కాలకృత్యాలకి ఇబ్బందిగా ఉండి ఉంటుందని, అందులో ఒక పెద్దాయన ఈ గౌతమేశ్వరుడి దగ్గరకు వచ్చి " ఆడవాళ్ళు ఎవరేనా ఉన్నారా అండి? " అని అడిగాడు

ఈయనకి అసలే వెటకారం పాళ్ళు ఎక్కువ " ఏం... ఎంత మంది కావాలేంటీ? " అని అడిగాడు వెటకారంగా నవ్వుతూ...

అంతే మగపెళ్ళివారు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఒక అరగంట ఆ మగపెళ్ళివారికీ, ఈ గౌతమేశ్వరుడికి పోట్లాట. పాపం ఆడపిల్ల తండ్రి అందరిని బతిమాలుకొని పెళ్ళి చేశాడు.

ఇలా ఉండగా ఆ సరత్తయ్య ఇంట్లోకి ఒక పక్క వాటాలోకి మా ఊరి మాష్టారు అద్దెకొచ్చారు. వాళ్లకి ఒక 4 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. వాడికి పిలిచి రోజు ఏదో ఒకటి అంటునే ఉండేవారు ఆ దంపతులు. అక్కడితో ఆగక దారిలో వచ్చే పోయే వాళ్ళని ఆ పిల్లాడి చేత "లం.. కొడకా " అని తిట్టించేవారు. జనాలు మనసులో తిట్టుకుంటూ ఏవీ అనకుండా వెళ్ళిపోయేవారు.

ఒకసారి మా ఊరి ఆస్థాన మంగలాకారుడు ఎం. ధర్మరాజు(మంగలి ధర్మరాజు) , ఆ మాష్టారి అబ్బాయి శంకర్ కట్టింగ్ చేయడానికి వచ్చాడు. ఆ ఇంటి అరుగు మీద కూర్చొబెట్టి తల ని దువ్వుతున్నాడు ఎం. ధర్మరాజు. ఆ బుజ్జి శంకర్ " నాకు చిరంజీవి కట్టింగ్ చేయ్ ధల్మలాజు ... " అని ఇంకా ఏదో చెబుతున్నాడు

ఇంతలో గౌతమేశ్వరుడు "వెధవకి డిప్పకట్టింగ్ చేసేయ్... నాలుగేళ్ళు లేవు వీడికి చిరంజీవి కావాల్సి వచ్చాడా " అని అన్నాడు 

 అంతే ఆ నాలుగేళ్ళ కిశోరం.." ఈ వెధవ ఇలాగే అంటాడు, గవాక్షుడు మొహం వేసుకొని.. పగిలిన మంగలం మొహం వీడూనూ, రేవులో తాడిలా పెరిగాడు కానీ.. లం...కొడుకు " అనేసి పారిపోయాడు.

అక్కడున్న అందరూ నోరు కళ్ళు తెరచుకొని అలా ఉండుపోయారు. మరునాడు గౌతమేశ్వరుడు మావయ్యకి హార్ట్ ఎటాక్ వచ్చిపోయాడు. అత్తయ్యకి నోరు పడిపొయింది. జరిగింది చెప్పడానికి ఆయన లేడు, చెబ్దామన్న సరత్తయ్యకి నోరూ లేదు (అప్పుడు, ఇప్పుడు ఆవిడే లేదు), ధర్మరాజు చెప్పడు.. శంకర్ చెప్పలేడు... అంతే!

 

 

Wednesday, December 13, 2017

ఆనందం


ఆనందం ఎక్కడ ఉంది? ఖరీదైన వస్తువులలోనా? పెద్ద పెద్ద బంగ్లాలలోనా? కాస్ట్లీ బట్టలలోనా? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి? ఎంత మంది గురువులని ఆశ్రయించాలి? ఇవన్నీ ఒక ఎత్తు.. ప్రకృతి పార్వతీ దేవి స్వరూపంగా భావించే వారికి ప్రతి అణువు ఒక పాఠమే! ప్రతి జంతువు, ప్రతి పునుగు  మనకు ప్రతి నిత్యం ఏదో ఒకటి భోధిస్తూనే వుంటుంది. 


అసలు విషయానికి వస్తే.. గత నెల్లాళ్ల నుంచి మా ఇంటి కిటికీ దగ్గరకు ఒక పక్షి పొద్దుటే అదేదో డ్యూటికి వచ్చినట్టువస్తోంది. సాయంత్రం చీకటి పడెవరకు ఆ కిటికీ బయట నుంచి దాని మొహం దానికి కనిపిస్తోందేమో,  రోజూ ఆ ప్రతి బింబంతో పోట్లాటే! ఆ కిటికీ దాటాక ఏ లోకం ఉందో అని దాని ఆలోచనో ఏమిటో మరి! దాని ముక్కు ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం కూడా వేస్తుంది అది కిటికీని కొట్టే విధానం చూస్తే! ఒకసారి ఆ కిటికీ తలుపు తీసి "అంత అందమైనది కానే కాదు పిచ్చమ్మ " అని చెప్పాలనిపిస్తుంది.



ఇంకో విషయం... మా పనిమనిషి కూతురు. దాని పేరు సత్య. రోజూ రాగానే "ఆంటీ బిస్ కెట్లు  " అంటుంది. బిస్ కెట్టు ఇస్తే కొన్ని సార్లు తింటుంది, మరి కొన్ని సార్లు దాచుకుంటుంది. కానీ ఈ రోజు అది ఆ బిస్కెట్టు పాకెట్టు తీసుకొని అద్దం లో చూసుకొంటూ డాన్స్ చేస్తుకుంటూ పాటలు పాడుకోసాగింది. చాలా సేపు దాని వైపు ముచ్చటగా చూస్తూనే ఉన్నా! తరవాత ఆ బిస్కెట్లతో బ్రిడ్జ్ కట్టింది, ఇంకా ఏవేవో కట్టింది. 


సాయి బాబా జీవిత చరిత్రలో "ఈశావాస్యోపనిషత్ " ఘట్టం గుర్తొచ్చింది. లేదన్న చింతన లేదు, ఉందన్న గర్వం లేదు. ఎప్పటికీ నిలిచే ఆనందమే... నిత్యానందం... బ్రహ్మానందం.!!

Sunday, December 3, 2017

వోలేటి పార్వతీశం

వోలేటి పార్వతీశం గారు... ఒక గొప్ప రచయిత, వ్యక్త, నిగర్వి, సాహితీవేత్త, పరిశోధకుడు, అన్నిటినీ మించి... ఒక మంచి వ్యక్తి! దూరదర్శన్ లో 'జాబులు - జవాబులు " లో తనదైన ఒక ముద్ర వేసుకొన్న వారు. వేంకట పార్వతీశ్వర కవులలో ఒకరైన వోలేటి పార్వతీశం గారి మనువడు. విద్వత్కవి శ్రీ కందుకూరి రామభద్రరావు గారి దౌహిత్రుడు. సుప్రసిద్ధ గేయకవి "శశాంక  గారి " తనయుడు. ఇవి వారికి జన్మతహ లభించిన అదృష్టాలు.  

 

 

వారిది శ్రవణ సుభగమైన కంఠస్వరం. ఎన్నో అర్హతలు కలిగినా ఏమాత్రమూ అహం లేని గొప్ప వ్యక్తి వారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు ప్రసారమాధమానికి సేవలందించారు. గంభీర గళంతో, స్వచ్ఛమైన భాషణంతో, అచ్చమైన భావంతో, అందమైన లాస్యంతో తెలుగు భాషకే వన్నె తెచ్చిన నిలువెత్తు తెలుగు సంతకం... వోలేటి గారు!!

ఏమాత్రము గర్వమూ, అతిశయోక్తి లేకుండా వారి గురించి తెలుసుకోడానికి వెళ్ళిన నాతో వారి జీవిత విశేషాలు చెప్పారు.
ఇప్పటికీ ఎన్నో సాహితీ సభలకు అధ్యక్షత వహించి ఎంతో సాహితీ సేవ చేస్తున్న 'మహానుభావులు"  !!    ఆ మహానుభావుడి ద్వారా విన్న ఆయన జీవిత విషయాలు మీతో పంచుకుంటున్నాను.