Search This Blog

Sunday, June 30, 2019

శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి

హాస్య కథలకు ఆమేచిరునామా...

తెలుగు కథా ప్రపంచంలో ఆమెది ఒక సుస్థిర స్థానం... 

నవ్వించడం ఆవిడ చేస్తున్న మహాయజ్ఞం....

విజయం ఆవిడ పథం...

(ధైర్య) లక్ష్మి ఆవిడ నైజం... 

నడిచే నవ్వుల రథం...

ఆవిడే.. శ్రీమతి పొత్తూరి విజయ లక్ష్మి గారు.


జననం :


విజయ లక్ష్మి గారు విజయ నామసంవత్సరం (అనగా  1953) జులై లో బాపట్లకు 9 కిలోమీటర్లు ఉన్న యాజలి లో జన్మించారు. వారి నాన్న గారు పి.డబల్యు  ఇంజినీరు కావడం వలన వారికి ఎక్కువ ట్రాన్స్ఫర్లు ఉండేవి.  కాబట్టి ఆవిడ చదువు చాలా ఊర్లల్లో జరిగింది. ఏడాదికి రెండో మూడో ఊర్లు తిరగడం మూలంగా ఎందరో వ్యక్తులను, వ్యక్తివ్యాలను,  దగ్గరగా పరిశీలించే అవకాశం ఆవిడకు లభించింది.  అదే తరవాత తరవాత రోజుల్లో ఆవిడకు కథా వస్తువులుగా పనికొచ్చాయి. విజయలక్ష్మి గారి నాన్న గారికి ఆవిడని ఒక డాక్టర్ గా చూడాలన్న కోరిక! కానీ ఆవిడకు పరీక్షలు రాయాలంటే బద్ధకం. పాస్ అవ్వడానికి ఎన్ని మార్కులు కావాలో అంతే పరీక్ష రాసేవారుట. ఆవిడ ఒక రచయిత్రి అవ్వాలని ఏనాడు అనుకోలేదు. పరీక్షలో జవాబు రాయడానికే బద్ధకించే తను ఇన్నిన్ని పేజీల నవలలూ, కథలు ఎలా రాయగలుగుతున్నానో అని ఆశ్చర్యపడ్డారు.


వివాహం :


విజయలక్ష్మి గారికి 17 వ ఏటనే వివాహం అయ్యింది. వివాహం అయిన వెంటనే ఆవిడ భర్త శివరావు గారితో కలిసి "చిత్తరంజన్ " కి వెళ్ళారు. తరవాత ఒక గృహిణిగా ఆవిడ ఇంటికి వచ్చేవారి వండి పెట్టడం, పిల్లల్ని చూసుకోవడంలో పూర్తిగా లీనమైయ్యిపోయారు. వారికి ఒక అమ్మాయి శిరీష, కలకత్తాలో స్థిరపడ్డారు, శిరీష ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా "దాదాసాహెబ్ " అవార్డ్ తెచ్చుకున్నారు. ఒక అబ్బాయి ప్రవీణ్ హైదరాబాద్ లో ఉంటున్నారు.




రచయిత్రిగా :


1982 లో చిత్తరంజన్ లో తెలుగు పిల్లల చేత చిన్ని చిన్ని తెలుగు నాటకాలు వేయించడానికి చిన్న చిన్న కథలు రాశారు. అదే ఆవిడ రచయిత్రిగా మొదటి మెట్టు. తరవాత కొద్ది రోజులకి "స్క్రిప్ రెడిగా ఉంది.. సినిమా తీయ్యండి " అనే పేరుతో ఒక వ్యంగ్య కథ రాశారు అది "ఆంధ్ర ప్రభ " కి పంపారు. కొన్ని రోజుల వరకు అటు నుంచి ఏ రకమైనా ప్రత్యుత్తరం రాలేదు. మరి కొన్ని రోజుల తరవాత 'చతుర ' కి "ప్రేమించని ప్రేయశి " పేరుతో ఒక నవల రాశారు. కానీ 'చతుర ' వారు "ప్రేమ లేఖ " అనే పేరు మార్చారు. ఇలా రెండు కథలు పేపర్లలో పడడంతో ఇక వెనుకకు తిరిగి చూడవలసిన అవసరం రాలేదు విజయ లక్ష్మి గారికి.


ఎక్కువ హాస్య కథలే రాసే విజయలక్ష్మి గారు అప్పుడప్పుడు కొన్ని హాస్యేతర కథలు కూడా రాసి ప్రేక్షకుల మన్ననలను పొందారు. అందులో ముఖ్యంగా చెప్పాల్సింది "ఆత్మ కథ " . ఈ కథ " ...." లో సిరియల్గా వచ్చింది. చివరి భాగం పోస్ట్ చేశాక ప్రేక్షకుల నుండి  ఏడుప్తో ఆవిడకు ఫోన్ ల  వరదే వచ్చింది. 


ఆవిడ జ్ఞాపకాలను పదిలపరచి మనకు బహుమతిగా "జ్ఞాపకాల జావళి " గా ఇచ్చారు.


అలాగే పూర్వీ కథ... మనస్సుని కలిచివేస్తుంది, మానవత అంటే ఇదేనా అని అనిపిస్తుంది.
  


కథా వస్తువు :


విజయ లక్ష్మి గారికి  ఒక కథ అంటే అందులో కుటుంబం మొత్తం ఉండాలి. అందుకే ఆవిడ చుట్టూ ఉన్న జనాలే ఆవిడ కథా వస్తువులుగా ఎన్నుకొనేవారు. ఉదాహరణకి శ్రీవారికి ప్రేమ లేఖలో "సుత్తి వీర భద్ర రావు " కారెక్టరు... ఆవిడ మాతామహులే, పేకాట గాంగ్ వారి శ్రీవారి స్నేహితులే, కథలు చెప్పే శ్రీలక్ష్మి వారి ఇంటి పక్కావిడే.  ఆత్మ కథలో "బల్వి " చిత్తరంజన్ లో వారి స్నేహితుడే!


రచనలు : 


మా ఇంటి రామాయణం, పూర్వి, ఆత్మ కథ, పొత్తూరి విజయ లక్ష్మి హాస్య కథలు, ఆనందమే అందం, చంద్ర హారం,సంపూర్ణ గొలాయణం... అన్నీ అపురూపమైన కథలే!




సినిమాలో ప్రవేశం :


1983 లో ఉషా కిరణ్ మూవీస్ వారు చతురలో పడిన "ప్రేమ లేఖ " ఆధారంగా సినిమా తీయాలనుకున్నారుట. దానికి డైరెక్టర్ జంధ్యాల గారు. సువర్ణానికి సుగంధాన్ని అబ్బినట్టుగా  విజయ లక్ష్మి గారి హాస్య కథ, జంధ్యాల గారి దర్శకత్వంలో "శ్రీవారికి ప్రేమలేఖ " గా విజయవంతమయ్యింది.  అలా విజయ లక్ష్మి గారి రచన సినీ జగత్తులో కూడా వెలిగింది. ఆ తరవాత  "సంపూర్ణ గోలాయణం ", "ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం " అనే నవలలు కూడా సినిమాలుగా తెరకెక్కాయి.


చిరంజీవి నటించిన "చూడాలని ఉంది " సినిమాలో బెంగాల్ లో ఇంటి కోసం వెతుకుతున్నప్పుడు బ్రహ్మానందం చెప్పే డైలాగులు విజయలక్ష్మి గారు రాసినవే. ఇలా సినిమాలలో అప్పుడప్పుడు రాసినా పూర్తిగా మాత్రం కథలు రాయడం లోనే స్థిరపడారు విజయలక్ష్మి గారు.


సంఘ సేవకురాలిగా :


చిత్తరంజన్ లొ ఉండగా విజయలక్ష్మి గారు తెలుగు ఎసోషియేషన్ కి జెన్రల్ సెకరేటరీగా ఉండేవారు. అప్పుడే ఆర్ధికంగా వెనుక బడిన పిల్లలకి స్కూల్ ఫీజిలు, స్త్రీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సాయం చేశారు.


"నా  కథలు ఎవరి కష్టాలు తీర్చకపోవచ్చు, కానీ కాసేపైనా కష్టాలను మరచి హాయిగా నవ్వుకొనే భాగ్య కలిపిస్తాయి.., ఇది చాలు నా రచనలకి " అని ఆనంద పడ్డారు.


బహుమతులు అవార్డ్ లు :


2012 లో స్వాతికి రాసిన "సన్మానం " కథకి అనీల్ అవార్డ్ వచ్చింది.

పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటి నుంచి "కీర్తి పురస్కారము "

గృహలక్ష్మి స్వర్ణకంకణం

ముణిమాణిక్యం నరసింహ రావుగారి "స్మారకపురస్కారము"

భానుమతి గారి పురస్కారము


ఈ బహుమతులు, అవార్డులు  విజయలక్ష్మిగారిని వరించి తరించాయి. 



ఆనందమే అందం :


" " 1970 లో నా పదిహేడవ ఏట ఏమీ తెలియని అమాయకత్వంలో "చిత్తరంజన్ " లో అడుగుపెట్టాను. భాష రాదు, ఒంటరి జీవితం, జీవితంలో సుఖాలే కాదు కష్టాలనీ చవి చూశాను. మా తాతగారు " ఎప్పుడేనా ఏదైనా సమస్య వస్తే ఒకసారి రామాయణం, భారతం గుర్తు తెచ్చుకో... నీకు తప్పకుండా పరీష్కారం దొరుకుతుంది. 


మనకు ఆకలి వేస్తే మనమే తినాలి, అట్లాగే మనకు కష్టం వస్తే మనమే భరించాలి. నీ కష్టాలు అందరితోనూ చెప్పుకోకు... నీ వ్యధ్య ఎదుటివారికి సొద " అన్న మాటలు నాకు భగవద్గీత ...

 

జీవితం ఇచ్చిన కష్టాలను తలచుకుంటూ బాధ పడే కంటే, అదే జీవితం ఇచ్చిన ఆనందాన్ని తీసుకొంటే మరింత ఆనందం పొందచ్చు. ఇదే నేను నమ్మిన సూత్రము... ఇదే నా కథలకు ఆధారం. "


ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉండే పొత్తూరి విజయలక్ష్మి గారు ఆవిడ జీవిత అనుభవాలను జ్ఞాపకాలను నాతో పంచుకుంటూ చెప్పిన మాటలు ఇవి.


ప్రస్తుతం :


పస్తుతం "ఆంధ్ర భూమి " లో "నోస్టాల్జి " రాస్తున్నారు. అప్పుడప్పుడు పత్రికలకు కథలు పంపుతున్నారు. ఫేస్ బుక్ లో కూడ అరాస్తున్నారు. వారు ఫేస్ బుక్ లో వారి పుస్తకాల  గురించి ఒక ఆర్టికల్ పెట్టినప్పుడు పుస్తకాలు సెట్ సెట్లే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.    


నవ్వుల ప్రపంచంలో విహరింప చేసే ఆ హాస్య సామ్రాజ్ఞి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 










Thursday, June 6, 2019

చేదు మనిషి

"అయ్యో అయ్యో ఇంట్లో చేదు వృక్షం ఉంటే ఇంటికి అరీష్టమని ఎన్నిసార్లు చెప్పినా మీ చెవికి ఎక్కదా? " అంటూ మళ్ళీ వచ్చాడు సాక్షి రంగారావు గారు. ఆయనంటే ఎవరో నాకు తెలీదు, కానీ అచ్చు సాక్షి రంగారావులా ఉండేవాడు. ఎప్పుడు ఎవరింటికి వచ్చినా చెట్ల గురించే మాట్లాడేవాడు. అలా అని చెట్టు పాతమని ఎప్పుడూ చెప్పేవాడు కాదు, చెట్లు కొట్టెయమనే చెప్పేవాడు.


మా పక్కింట్లో ఒక వేప చెట్టు ఉండేది. ఆ చెట్టు ఇంటి ఆవరణలో ఉండకూడదని ఆయన వాదన. ప్రతి వారం వచ్చేసేవాడు, వచ్చిన వాడు ఊరుకోకుండా ఇదిగో ఆ చెట్టుని కొట్టెయ్యమని చెవిలో ఇల్లు కట్టుకొని అరిచేవాడు. మా పక్కింటి వాళ్ళ బాత్ రూం పక్కనే కుంకుడు చెట్టు ఉండేది, బాత్ రూం నుంచి విసిరేసిన ఆ కుంకుడు గింజలు పాపం వాటంతట అవే మొలకలెత్తి, ఆ బాత్ రూం నుంచి వచ్చే నీళ్లతో చెట్తై కూర్చున్నాయి. మేము ఆ కాయలని పిన్నీసుతో గుచ్చి, బుడగలూదేవాళ్ళము.


ఇక మా ఇంట్లో, పక్కవారింట్లో జామచెట్లు ఉండేవి. ఈ సాక్షిరంగారావు, "ఇదిగో ఆ ఫల వృక్షాలు ఇంట్లో ఉండకూడదు, పిల్లలకి అరీష్టము " అని అనేవాడు. ఆయన మాటలు ఎవ్వరూ ఎక్కువగా పట్టించుకోలేదు. మాకు ఈ జామ చెట్లు  సాయంకాలము ఆడుకొనే ప్లే గ్రౌండ్స్, ఆ చెట్టు కాయలే ఈవింగ్ స్నాక్స్. మాకే కాదు రామచిలుకలకి, కోతిపిల్లలకి కూడా చెట్టు అంటే చాలా ఇష్టము. ఆ జామచెట్టుని కొట్టేయమంటే మా పిల్లల గ్యాంగ్ కి చాలా కోపం వచ్చేది. ఆయన వస్తున్నాడంటేనే విసుగ్గా అనిపించేది. ఆ వేపచెట్టు కన్నా ఇతనే చేదు మనిషి అని అనిపించేది.


మా పక్కింటి వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కుదిరింది. ఒకసారి ఆ అమ్మాయి, ఆ అమ్మాయికి కాబోయే భర్త బైక్ మీద బయటకు వెళ్ళి వస్తుంటే యాక్సిడెంట్ అయ్యింది. చిన్న చిన్న దెబ్బలు తగిలాయి అంతే.


ఈ పెద్దమనిషి అదే మన సాక్షి రంగారావు వచ్చి " చెప్పానా, ఆ చేదు మొక్క వలనే ఈ అరీష్టము, ఆ ఫల వృక్షము కూడా,  ముందు ఆ చెట్లను కొట్టించేసేయండి " అని మళ్ళి చెప్పాడు. తొభై తొమ్మిది గొడ్దలి దెబ్బలకు పడని వృక్షము, వందో దెబ్బకు పడినట్టు, ఆ రోజు ఆ మాటలు ఆ ఇంట్లో వాళ్లకి బాగా పని చేసాయి. పెళ్ళీ కి ముందు చెట్టు కొట్టకూడదని ఎందరో చెప్పినా వినలేదు, ఆ మరునాడే ఆ వేప చెట్టు, కుంకుడు చెట్టు జామ చెట్టు కొట్టేశారు.


అవి చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని మోసిన చెట్లు, అట్లతద్ది వస్తే మా అందరిని ఉయ్యాలూపిన ఆ వేప చెట్టు,  విరిగిపోయినా ఇంట్లో  చెక్క ఉయ్యాలయ్యి ఆ అక్క (పెళ్ళైన అమ్మాయి ) పిల్లలకి కూడా జోలపాట పాడింది. 

 

 

Wednesday, June 5, 2019

లవ-కుశ సుబ్రహ్మణ్యం

తెలుగు సినిమా జగత్తులో ఆణిముత్యాలు ఎన్నైనా మకుటముగా నిలిచినవి మాత్రం అతి కొన్నే! అందులో చెప్పుకోదగినది "లవ-కుశ " . ఈరోజుకీ సినిమాలకి దిక్సూచి, కొలమానము లవ-కుశ... ఎన్ని పౌరాణిక చిత్రాలు వచ్చినా లవ-కుశ మాత్రము.. "న భూతో న భవిష్యతి ". అందులో నటించిన సుబ్రహ్మణ్యం గారు... అదే కుశుడు గారు ఆయన అనుభవాలను మనకు ఈ ఎందరో మహానుభావులు " ద్వారా చెప్పారు.

 

బాల్యం- విద్యాభ్యాసం :

 

శ్రీ సుబ్రహ్మణ్యంగారు 1946 ఏప్రెల్ 21, గొల్లపాలెం లో జన్మించారు. వారి తల్లి సుబ్బాయమ్మగారు, తండ్రి వియూరి సుబ్బారావు గారు. వారి నాన్నగారిని "గొల్లపాలెం అబ్బాయి " గారు అనేవారు.(మ్యూజిక్ డైరెక్టర్ ఆదినారాయణరావు గారిని 'కాకినాడ అబ్బాయీ అనేవారుట). ఆయన యన్ మెన్స్ క్లబ్ మెంబర్ గా ఉండేవారు. చిన్నప్పటి నుంచి నాటకాలు వేసేవారు. 1953 లో దంటు భాస్కర రావు గారి ప్రోత్సాహంతో లవకుశ నాటకం వేశారు సుబ్రహ్మణ్యం గారు, ఆయన తమ్ముడు ఫకీర్ బాబు.

 

 

వీరి నటన చూసి ఆ తరవాతి కాలంలో సి. పుల్లయ్యగారి "లవకుశ " లో సుబ్రహ్మణ్యంగారినే కుశుడి పాత్రకు ఎన్నుకున్నారు. సుబ్రహ్మణ్యం తమ్ముడిని అదే సినిమాలో సుర్యకాంతం కొడుక్కా నటింపచేశారు. ఈ లవకుశ సీనిమా ఐదేళ్ళ పాటు తీయడం వలన సుబ్రహ్మణ్యంగారు బడికి వెళ్ళలేకపోయారు. ఆ విధంగా చదువు కొనసాగలేదు.

నటించిన ఇతర సినిమాలు :

" వెలుగు నీడలు " సినిమాలో జగ్గయ్య మేనల్లుడిగా, "శ్రీవేంకటేశ్వర మహత్యం " సినిమాలో శాంతకుమారి పాట పాడినప్పుడు చిన్ని కృష్ణుడిగా, "సీతారామ కల్యాణం " లో చిన్నరాముడిగా (గురుబ్రహ్మ పాటలో), 2006 లో వచ్చిన 'కల్యాణం ' అనే సినిమాలో కూడా నటించారు.

 

వివాహం :

 

సుబ్రహ్మణ్యం గారికి వారికి 1978 లో వివాహం అయ్యింది. ముగ్గురు కొడులు. వారి శ్రీమతి నర్శారత్నం గారికి మూడొవ సంతానం కలిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణించింది. అప్పటి నుంచి దాదాపు నలభై సంవత్సరాలు ఆవిడ మంచానికే అంకితమవ్వాల్సి వచ్చింది. 2017 లో ఆవిడ పరమపదించారు.

వారి భార్య కి ఒంట్లో బాలేదని ఒకసారి ఆయన నాకు చెప్పారు. అప్పుడు నేను కొంతమంది మిత్రుల సహకారంతో (ఈ ఎఫ్.బి. లో ఉన్నారు వారంతా) వారికి సాయం చేశాను. ఆ డబ్బు అందిన వారం రోజులకే వారి భార్య పరమపదించారు. నేను ఆయనకు ఫోన్ చేసి "ఆ డబ్బు ఇలా ఉపయోగపడినందుకు చింతిస్తున్నాను " పరామర్శిస్తే "తల్లీ! పెళ్ళికంటే ఎవరేనా సాయం చేస్తారు, ఈ కార్యక్రమానికి ఎవరిని సాయం అడుగుతాను, కరక్ట్ టైం కి డబ్బు అందేలా ఇచ్చావు " అని అన్నారు.

ప్రస్తుతం సుబ్రహ్మణ్యంగారు అమలాపురంలో టైలరింగ్ చేసుకుంటున్నారు. కోటీశ్వరులకు లేని గౌరవమర్యాదలు వారికి ఈ లవకుశ సినిమా ద్వారా లభించాయని ఆనందపడుతూ ఉంటారు.