Search This Blog

Friday, August 31, 2018

శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు

మిత్రులకు నమస్కారములు! నాదతనుమనిశం ఆ శంకరుడైతే... ఈ శ్యామసుందరుడు 'రాగా తనుమనిశం ... అనురాగా తనుమనిశం " . ఆ అనురాగం లో సగభాగం వారి అర్ధాంగి జయలక్ష్మి గారు. వీణకి తంత్రులులాగా వారు ఒకే రాగం పలుకుతారు.. అదే అనురాగము అను రాగం! తాళికి ముందు ద్వైతమై.. రాగ, తాన, పల్లవి అనే మూడుముళ్ళతో అద్వైతమయ్యారు ఈ సంగీత సహచరులు.  

 



 ఈ  నెల మన " ఎందరో మహానుభావులు "   శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు, వారి సతీ మణి శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు!




Wednesday, August 15, 2018

స్వతంత్ర దినోత్సవం



ఈ రోజు స్వతంత్ర దినోత్సవం.. ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటూ ఫ్రిడ్జ్ తలుపులు తీశాను, దూట కనిపించింది.. దూట కొబ్బరికోరు వేసి పులిహార కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా! పక్కనే ఒక ఆనపకాయ కనిపించింది.. పెరట్లో బచ్చలి ఆకులు బాగా పెరిగాయి, కసిన్ని బచ్చలి ఆకులు వేసి ఆనపకాయ ఆవపెట్టి పులుసు చేస్తే! ముద్దపప్పులోకి ఈ పులుసు చాలా బాగుంటుంది. మా మామ్మ అయితే పప్పు బాగా దోరగా వేయించి వండేది ఇత్తడిగిన్నెకి. మా చినమామ్మ గారు ఈ కందిపప్పుని 'మంగలం ' లో వేయించేవారు. మంగలం అంటే కుండకి ఒక వైపు కన్న ఉండేది, అందులో వేయించే వారు. ' ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ' అనే జాతీయం కూడా ఉంది. నా పెళ్ళికి పేలాలు కూడా ఈ మంగళం లోనే వేయించింది మా చినమామ్మ. చేతిలో పేలాలు వేస్తే రాత్రి కాలక్షేపానికి తినడానికి ఇచ్చారనుకొన్నా పెళ్ళిలో, నా ఆలోచన పసిగట్టి గురువుగారు "అమ్మాయి అవి తినడానికి కాదు ఆగు " అని వార్నింగు ఇచ్చారు.. ఇదే కోతి కొమ్మచ్చి అంటే ఒక విషయం లో నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపొవడం. ఈ ఆలోచనలు కోతులే!


ఆ... ఏం చెప్తున్నాను.. ఫ్రిడ్జ్ లో కూరగాయలు వండాల్సిన వంట గురించి కదా! కొన్ని వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పచ్చని వంకాయలైతే కొత్తిమీరి కారానికి బాగుంటాయి, అదే నీలం వంకాయలైతే కారం పెట్టి కూరకి బాగుంటాయి.. అదే సంతర్పణ కూర, కోనసీమ వాలైతే ధనియాలు వేస్తారు, అదే విశాఖపట్టణం వాలైతే మెంతి కారం అని మెంతులు వేస్తారు. చిన్న చిన్న వంకాయలతో సివంగిపులుసు కూడా చేస్తారు. పక్కనే దోసకాయ కూడా ఉంది, దోసకాయ పచ్చడిముక్కలు తిని చాలా రోజులయ్యింది. రెండు ఆవపెట్టినవి అయితే బాగోదు వేడిచేసేస్తుంది, దోసకాయ టమాట ఇంగువ వేసి పచ్చడి బాగుంటుంది.. సింపుల్ గా!! 

 


అయినా స్వాత్రంత్ర దినోత్సవం నాడు కూడా ఈ వంటేమిటో? నాకూ స్వాత్రంత్రం కావాలి!! మా చిన్నప్పుడూ టి.వి. లో నవంబర్ 14 శనివారం న "మాకూ స్వాత్రంత్రం కావాలి " అనే సినిమా వచ్చింది. సినిమా అంతా కోతుల మయం, అప్పుడు దూరదర్శన్ తప్ప సినిమాలు చూడటానికి మరి వేరే దిక్కు లేదు.. మళ్ళీ మరునాడు ఆదివారం అదే సినిమా హిందిలో వచ్చింది. చాలా బాధ కోపం వచ్చేశాయి. (మళ్ళీ కోతి కొమ్మచ్చి).


అమ్మో ఇలా ఆలోచిస్తే పన్నెండు అయ్యిపోతుంది.. వండాల్సిన వాటికి కావల్సినవి తీసుకొని ఫ్రిడ్జ్ తలుపేసేశాను. అరగంటలో వంట రెడీ! టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి అందరినీ పిలిచాను. ముద్ద పప్పు, ఉసిరి పచ్చడి అన్నము వడ్దించా.. ఇంకా అన్నట్టు చూపులు! " ఇంకేంటి? ఇంతే ! " అని నేనూ శివగామిలా చూశాను.


మా చిన్నది " ముద్దపప్పు అన్నమా? నేను తినను! " అని అరిచింది. టి.వి. ఆన్ చేశాను "అభిరుచి ' లో రాజు గారు సొయా రైస్ చేయడం ఎలాగో చెప్తున్నాడు. అది చూస్తూ ఈ పప్పు అన్నము తినేసింది.


పొద్దుట నుంచి ఇదేనా వండావు? అని ప్రశ్న.. పొద్దుటే మా ఫ్రండ్ మాలతి పుట్టిన రోజు విష్ చేయ్యాలి కదా? ఆ తరవాత అర్పిత, శ్రీదేవి  వాట్స్ ఆప్ లో పెట్టిన చీరలు చూడాలి కదా!(కొన్నాకొనకపోయినా) ఆ తరవాత టి. వి. లో వచ్చిన అల్లూరి సీతా రామ రాజు, ఇంకో చానల్ లో హింది లో వస్తున్న సుభాష్ చంద్ర బోస్ చూడద్దు, అసలే దేశభక్తి సినిమాలు! పొద్దుటే సందీప్ పెళ్ళికి వినాయకుడిని మీదికడితే వెళ్ళొచ్చాను కదా పేరంటానికి! ఒక్కమనిషి ఇన్ని పనులు అసలు ఎలా చేసుకొగలుగుతోందన్న సానుభూతే లేదు జనాలకి! అయినా మొన్న శుక్రవారం తొమ్మిది రకాల పిండి వంటలు వండానా? ఇలా ఒకరోజు పొట్టకి పని తగ్గించాలి కదా!


" రెండు వారాల క్రితం కూరలు లేవని పప్పు అన్నము పెట్టావు, ఈ రోజు అన్ని కూరలు ఉన్నా పప్పు అన్నమే! " అన్న కామెంటు..


" ఏదీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉండటం... స్థితప్రజ్ఞత్వం అంటారు " అని అన్నాను.


ఇంకేదైనా అనేస్తారేమో అని వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన 'నారదబ్బ కాయ " ఊరగాయ తెచ్చా. అబ్బా! ఆ నారదబ్బ కాయ వేడి వేడి అన్నములో కలుపుకొని నెయ్యేసుకొని తింటే!! ఆ ముక్క కమ్మటి పెరుగన్నములో తింటే!! ఇంక మాటలు లేవు.


ఈ ఆవకాయలు, ఈ నారదబ్బకాయలు.. జీవనదులు. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వచ్చే నదులు కావు... నిత్య పుష్కరిణీలు ఇవి నాలాంటి వారికి!!





Friday, August 3, 2018

నాన్న

మన తెలుగు సినిమా పాటల్లో "నాన్న " మీద వ్రాసిన పాటలు (నాన్న నెత్తి మీదా, వీపు మీదా కాదు.. నాన్న ని ఉద్దేశించి వ్రాసిన పాటలు) చాలా తక్కువనే అనాలి. ఈ రోజు శృతిలయలు సినిమా చూశాను(ఎన్నోసారో గుర్తులేదు, లెక్కపెట్టనూ లేదు). కె. విశ్వనాథ్ గారు వారి సినిమాలో క్లైమాక్స్ పాటకి ఎప్పుడూ పెద్దపీఠే వేస్తారు.  అలాగే శృతిలయలు సినిమాలో షణ్ముఖ శ్రీనివాస్  డాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ( శివతాండవం), తల్లి(సుమలత)వచ్చి తండ్రికి కొడుకుని పరిచయం చేస్తూ " తనదు వరసత్వము వారసత్వముగనిడి తనువిచ్చు తండ్రికిదే తొలివందనం ... తండ్రికిదే తొలివందనం " అని పాడుతుంది. పదప్రయోగం ఎంత బాగుందో కదా!

సినిమా పాటలలో "అమ్మ/తల్లి " కే అగ్రతాంబూలం ఇచ్చారు. పాపం "నాన్న " ఎప్పుడూ అమ్మ వెనకాలే..(పాటలలో కూడా). ఇంకో నాన్న పాట అనగానే గుర్తొచ్చేది " నాన్నా నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా  (ధర్మదాత) " .  అది కూడా తల్లి లేనందుకు ఆ నాన్న ని పొగిడారు తప్పా... తల్లి ఉంటే అంత పొగడ్తలు లభించేవి కాదు "నాన్న " కి.


ఇక తండ్రి గొప్పతనం చెప్పే అసలైన సిసలైన పాట "పాండురంగ మహత్యం " లో " దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి. ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని " అని తండ్రి యొగ్గ గొప్పతనము సముద్రాల(రాఘవాచార్య) గారు అద్భుతంగా చెప్పారు. బ్రహ్మోపదేశముతో ఇటు ఈ లోకానికి, అటు పరలోకానికి కావల్సిన పుణ్యం ఇచ్చేది తండ్రే కదా!

కొన్ని పాటలలో అయితే " తల్లితండ్రీ " అని ద్వంద సమాసంలో వారిని ఒకటిగా కలిపి పొగిడేస్తూ ఉంటారు, అందుకంటే అది అద్వితీయ బంధము. అంతెందుకు చిదంబరంలో ఉన్న "నటరాజస్వామి " భంగిమను గుర్తు తెచ్చుకోండి. ఆయన కుడి చేత్తో అభయహస్తం చూపిస్తూ ఎడం చెయ్యి ఎడం కాలు వైపు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎడం భాగం "అమ్మది". అంటే " అమ్మ కాలు పట్టుకుంటే నేను మోక్షం ఇస్తాను అని అంటూ అగ్నిని ఒక చేత్తో పట్టుకొని మరీ అభయమిస్తున్నాడు ఆ జగత్ పిత. ఇవన్ని తెలుసుకున్నారు కాబట్టే రామదాసు కూడా "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి " అని ఆ రామయ్య తండ్రి సిఫార్స్ చేశాడు.

ఏది ఎవైనా

" యే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము
యే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
యే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరము
యే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము

అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమై
తపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన లేరే  
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా..."