Search This Blog

Friday, June 1, 2018

సినిమా పిచ్చోళ్ళు

" నా ఆజ్ఞ దిక్కరించితే నీకు ఇంట్లో చోటు లేదు, నీకు నీ కుటుంబం ముఖ్యమో, లేక వాళ్ళు ముఖ్యమో తేల్చుకో, నీకు నేను కావాలో వాళ్ళు కావాలో నిర్ణయించుకో " ... ఏంటీ ఈ డైలాగు వింటే ఏదో సినిమాలలో మాట వినకుండా ఎవరినో ప్రేమిస్తొన్న కొడుక్కి తండ్రి ఇచ్చే వార్నింగ్ లా ఉంది కదా... అసలు విషయమేమిటంటే మా సినిమా యాక్టర్ ఆంటి వాళ్ళ అబ్బాయితో అన్న మాటలు. వాడు ఆ కాలనీలో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఆవిడ వచ్చి వారసి గూడా లో వాళ్ల అన్న ఇంటికి వెళ్ళమని అంది, వాడు "ఊహూ ఆడుకుంటా " అని అన్నాడు.. అంతే ఈ డైలాగు వదిలింది ఆవిడ.

 

ఆ ఆంటీ పేరు నాకు గుర్తులేదు! కానీ ఆవిడ విపరీతంగా సినిమాలు చూసేది, వారానికి కానీసం లో కనీసం నాలుగు! అంకుల్ కి అస్సల్ సినిమాలంటే పడేది కాదు, సినిమాలకి డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. సినిమా టికేట్టు కోసం ఆవిడ ఇంట్లో పూలు, పళ్ళు, కాయలు, సగం వాడేసిన మావిడి కాయ ముక్కలు, మిగిలిపోయిన కాయగూరలు అమ్మేసుకునేది. 🤭🤭అప్పుడప్పుడు బియ్యమూ, పప్పులు, ఉప్పులు కూడా!! ఒక్కసారి అమ్మడానికి ఏవీ లేకపొతే ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు తాకట్టు పెట్టేసింది. నాకు ఆవిడ "సితామాలక్ష్మి " సినిమాలో తాల్లూరి రాజేశ్వరి లా అనిపించేది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కళ్ళు, నోరూ భలే తిప్పేసుకునేది. అప్పట్లో ఆ పేరు నాకు తెలీదు, అందుకు ఆవిడని "సినిమా యాక్టర్ ఆంటీ " అనేదాన్ని, పాపం తెగ మురిసిపోయి ముక్కలైపోయేది. వాళ్ళ అన్నయ్యకి కూడా సినిమాల పిచ్చి బాగా ఉండేది. అప్పుడప్పుడు అతను ఈవిడకి డబ్బులు ఇచ్చేవాడు.

 

ఆవిడకి ఒక కొడుకు, ఒక కూతురు, పేరు శ్రీదేవి, కృష్ణ. ఆంటీ సినిమా చూసీ ఆ సినిమాలో హీరోయిన్ లా చిత్ర విచిత్ర జడలు వేసేది శ్రీదేవికి. ఆ శ్రీదేవిని తయ్యారు చేసి " నా కన్నుల వెన్నెల, నా హృదయాలలో చిరు జల్లు నువ్వే " అని ముద్దు పెట్టుకునేది. ఈ హరివిల్లు, చిరుజల్లు, మమతల కోవెల, పులకింత, పాలపుంత వగైరా పదప్రయోగాలు ఆవిడ రోజూ వాడేది. ఏంటో మా ఇళ్ళల్లో ఇలా ఎప్పుడూ అనేవారు కాదేమో భలే నచ్చేసేవి ఆ మాటలు మాకు!

 

కృష్ణ ఎప్పుడేనా "అమ్మా! ఈరోజు సాంబారు చాలా బాగుంది " అని అంటే...

"అందులో నా ప్రేమ రంగరించాను, బాగోదా మరి " అనేది...

మా ఇళ్ళల్లో ఎప్పుడూ కారం, మిరియాలు, కొబ్బరే వేసేవారు ఈ సాంబారులో, ఈ రంగరించడం ఏంటో మరి!! 

 🤔

ఆవిడ అంతటితో ఆగలేదు, గోరింటాకు రుబ్బుతూ " గోరింటా పూసింది కొమ్మలేకుండా " అని, పూలు కోస్తొనప్పుడు "పూజ సేయ పూలు తెచ్చాను " అని, మరేదో పని చేస్తూ "ఆడది కోరుకునే వరాలు రెండే రెండు " అని పాడుకునేది.😀 

😆

ఇక ఆంటీ వాళ్ళ అన్నయ్య సిని యాక్టర్ "బాలయ్య " అభిమాని. చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ఎప్పుడూ పాతికమంది(ద)నేసుకొని తిరిగేవాడు. వాళ్లందిరిని బాలయ్య సినిమాకి తీసుకొని వెళ్ళి వారి తిండితిప్పలు చూసుకొనేవాడు. బాలయ్య సినిమా రిలీజు అయిన రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం టికెట్లు ఆయనే కొనేసేవాడు. ఆయన పరివారం మొత్తం ఆ సినిమా చూడాల్సిందే!

 

ఆ అంకుల్, ఈ సినిమ యాక్టర్ ఆంటీ కలిసినప్పుడు చూడాలీ.. "రక్తసంబంధం " సినిమాయే!! "నీ ప్రేమే నాకు శ్రీరామ రక్షా అన్నయ్య " అని ఆవిడ అంటే, " నా కంటికి, మా ఇంటికి దివ్వెవు నువ్వే, ఒక కొమ్మకి పూసిన పువ్వులం మనము చెల్లెమ్మ " అని ఆయన అనేవాడు... ఒక్కొసారి వాళ్ళు చెప్పే డైలాగులు ఏ సినిమాలోవో మాకు తెలిసిపోయేవి కూడా! కానీ ఆ డైలాగులలో కామెడీ అప్పట్లో తెలియలేదు!!  

😄

ఆ అంకుల్ యంగ్ గా ఉన్న "వెంకయ్య నాయుడు " లా ఉండేవాడు. ఒకసారి ఆయనకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చేసింది. పాపం చుట్టూ ఉన్న ఈ మంద ఒక్కక్కరే తప్పుకున్నారు. ఆ అంకుల్ కి మతి కూడా చెడిపోయింది. 😥రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఆయనలో ఆయనే గట్టిగా మాట్లాడేసుకునేవాడు. ఒకసారి ఇలా వెళ్తూ వెళ్తూ తప్పిపోయాడు. పాపం ఇంట్లో వాళ్ళు చాలా వెతికారు. ఆయనకి డిగ్రీ చదివే ఒక కొడుకు, ఇంజినీరింగు చదివే ఇంకో కొడుకూ ఉన్నారు. వాళ్ళు చెరో బైకు వేసుకొని మరీ ఊరంతా వెతికారు. అప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఆయన "తిరుపతి బస్సు " ఎక్కేశారని చెప్పారు. వెంటనే వాళ్ళు తిరుపతి బయలుదేరాలనుకున్నారు. తిరుపతి ఏదైనా చిన్న నగరమా ఆయన దొరకడానికి? అయినా బయలుదేరారు.

 

ఆ కొడుకులు తిరుపతి బస్సు దిగి ఒక పేపరు కొనుకొన్నారు. ఒక నిర్ణయానికి వచ్చినవారులా వెంటనే ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. ఒక సినిమా హాల్ కి వెళ్ళారు , ఆ సినిమా హాల్లో బాలయ్య " తల్లి తండ్రులు " సినిమా చూస్తూ కనిపించాడు వాళ్ళ 'కన్నతండ్రి"! 😎😎😍

3 comments:

  1. // “రక్తసంబంధం " సినిమాయే!! “ // 😀😀.

    ఆ రోజుల్లో కొంతకాలం పాటు వచ్చిన సినిమాలలో అన్నాచెల్లెళ్ళు “అన్నయ్యా”, “చెల్లీ” అంటూ తెగ కావిలించేసుకునేవాళ్ళు. మీ సినిమా ఆంటీ, ఆవిడ అన్నయ్య కూడా అలా చెయ్యలేదు కదా కొంపతీసి 😳😳?

    ReplyDelete
    Replies
    1. :)) అంతవరకూ లేదు కానీ డైలాగులే భారిగా ఉండేవి. థాంక్స్ అండి.

      Delete