నాకు ఇష్టమైన వ్యాసాలు, నేను పత్రికలకు వ్రాసిన వ్యాసాలు, కొన్ని పిచ్చాపాటి విషయాలు పొందుపరచుకున్న అందమైన "ఊహల కుటీరం " ఇది.
Search This Blog
Tuesday, July 31, 2018
'అమ్మా' యి
కావేరి కి అమ్మని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంది. కావేరి చిన్న పిల్లేమీ కాదు ఇద్దరు పిల్లల తల్లి.
పది రోజులు శెలవలకని సంక్రాంతికి వచ్చింది. ఆ పది రోజులు పది నిమిషాలలా గడచిపోయాయి. ఈ పది రోజుల్లో అమ్మ తనకి ఇష్టమైనవి అన్నీ వండి కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు చెప్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ నవ్విస్తూ తనని మళ్ళీ ఒక చంటిపిల్లని చేసేసింది. సంక్రాంతి ముందు రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసి పిల్లల చేత బొమ్మల కొలువు పెట్టించి మళ్ళీ తన చిన్నతనాన్ని తనకి బహుమతిగా ఇచ్చింది. ఇంక నాన్నగారు పిల్లలకి కావాల్సిన జీళ్లు, తేగలు, మొక్కగుడ్లు తెచ్చిపెడుతూ అసలు వాళ్ళకి బోర్ కొట్టకుండా చూసుకొన్నారు. వాళ్ళని పొలానికి సాయంత్రము పూట తీసుకెళ్ళి బోరింగులో స్నానాలు చేయించి వాళ్ళ ముచ్చట్లు తీర్చేవారు.
ఆ ఇల్లు... అదే తన పుట్టిల్లు... తనకొక దేవాలయము. తన బాల్యమంతా అక్కడే గడచింది. అక్కడ ప్రతి చెట్టు, ప్రతీ గడప, ప్రతీ గోడ తనతో ఎన్నో ఊసులాడుతున్నట్టు ఉంటుంది.
చిన్నతనములో తను ముగ్గు వేస్తూన్నంతసేపు తనకి కాపల కాస్తూ నిద్దర ఆపుకుంటూ ఉండేవాళ్ళు అమ్మ నాన్న. తను అందరి కన్నా పెద్ద ముగ్గు వేయాలని చాలా పెద్ద పెద్ద ముగ్గులతో వాకిలి అంతా నింపే ప్రయత్నములో రాత్రి 11 వరకు ఉండేది. అంత వరకు ఎన్ని పనులున్న అమ్మ తనతో పాటే ఉండేది. ఇప్పటికీ అలా ముగ్గు వేస్తుంటే అమ్మ నిద్దర ఆపుకుంటూ అరుగు మీద కూర్చునే ఉంది.
తన చిన్నప్పుడు తనకి భోగి పళ్ళు పోసి దిష్టి తీసి ప్రపంచంలో తనే అమ్మ దృష్టిలో అందగత్తేనేమో అనిపించేలా చూసేది. సంక్రాంతి రోజు తన చేత బొమ్మల కొలువు పెట్టించి అన్ని బొమ్మలలో తనని మురిపాల పసిడి బొమ్మగా చేసేది.
ఇంక కనుమ రోజు తన చేతితోటే పని వాళ్ళకు బట్టలు, డబ్బులు, బహుమతులు ఇప్పించేది.
అమ్మ వాళ్ళ ఇంటిలో తనో యువరాణి. ఆడింది ఆట పాడింది పాట. తనకి ఇష్టమైనది ఏదైనా చేయటానికి ఎప్పుడూ అమ్మ రెడీగా ఉండేది. అదీ తను అడగకుండా తన మనసు గ్రహంచి మరీ తనకి ఇష్టమైనవి ఇచ్చేది. ఒకసారి ఇంటికి వచ్చిన ఒక చుట్టాలావిడ " కావేరి! నీ బెస్ట్ ఫ్రండ్ ఎవరే? " అని అదిగింది. వెంటనే కావేరి " మా అమ్మే నాకు బెస్ట్ ఫ్రండ్ " అని అంది. ఆ మాటకి అమ్మ తెగ మురిసిపోయింది. నిజమే అమ్మ కన్న తనకి సన్నిహితురాలైన స్నేహితురాలు లేదు.....
ఇంత అపురూపంగా పెరిగిన తను ఎవరో ఒక ముక్కుమొహం తెలియని వాడి కోసం ఇంత ప్రేమగా చూసుకొనే అమ్మ, నాన్న ని వదిలి వెళ్ళిపోయిందా?
ఎప్పుడు శెలవకి వచ్చినా ఇలా చుట్టం చూపుగా అమ్మ నాన్నని చూసి వెళ్ళిపోవాలా? ఎప్పుడూ ఆడపిల్ల తల్లిదండ్రి వద్ద ఉండలేదా? ఆడపిల్ల అంటే ఆడ పిల్లేనా? ఇంతలా ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఎందుకుండాలి? ఇంత అపురూపంగా పెంచిన అమ్మాయి పెళ్ళి అయ్యాక పరాయి ఎందుకయ్యిపోతుంది?
ఏంటో పొద్దుట నుండి ఎంత ఆపినా ఆగట్లేదు కన్నీళ్ళు, ఎక్కడ అమ్మ చూసి బాధపడుతుందో అని ఇలా పెరట్లో మొక్కలు, చెట్ల వైపుకు వచ్చి ఫోన్ లో ప్రండ్ తో మాట్లాడుతున్నట్లు భారంగా తిరుగుతోంది కావేరి. దూరంగా చెట్టు మీద గువ్వలు అరుస్తున్నాయి.. గూడు వీడేడి వేళ, గూటికేగెడి వేళ పక్షి గొంతును మించి పాట గలదే...అన్న గరికపాటి వారి మాట గుర్తుకొచ్చింది. నిజమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ వాళ్ళ ఇల్లు వదినప్పుడు మనసుకి ఎన్ని భావాలో కదా?
అమ్మా.. అమ్మా అని గట్టిగా అమ్మని పట్టుకొని ఏడ్వాలని ఉంది.
అ...మ్మా...
అ... మ్మా...
తన గొంతు కాదు ... పెద్దగా వినపడుతోంది అరుపు... అది తన చిన్న కూతురి అరుపు...
"అమ్మా! అమ్మమ్మ నిన్ను రమ్మని పిలుస్తోంది" అని చెప్పింది.
"నువ్వు వెళ్లు.. నేను ఇదిగో వస్తున్నాను రెండు నిమిషాలలో"
అవునూ!!! అమ్మ కూడా ఒక అమ్మాయే కదా ఈ ఇంటికి వచ్చినప్పుడు, తన తల్లీదండ్రికి గారాలపట్టిగా పెరిగి నాన్న చెయ్యి పట్టుకొని, నాన్నతో పాటు నాన్న వైపు వాళ్ళందరికి ఆప్తురాలయ్యింది. ఇంటికి భాగ్యలక్ష్మిలా, ప్రేమమూర్తిగా నిలబడింది. అమ్మ పెళ్ళి చేసుకునేటప్పటికి నాన్న కూడా అమ్మకి పరాయి మనిషే కదా? మరి తనూ అంతే కదా... తనూ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి... తల్లిగా తనూ పిల్లలకి ప్రేమ పంచాలి. మెట్టినింటిలో పుట్టింటి గౌరవం నిలపాలి. మెట్టినింటి వాళ్ళని తనవాళ్ళగా చూసుకోవాలి. తన అమ్మలానే తనూ తన పిల్లలకు ఆదర్శం కావాలి.
తన ప్రశ్నలకి సమాధానము దొరికిందన్నట్లు చూసింది కావేరి తన కూతురి వైపు...
చదువుతూంటే నాక్కూడా మా అమ్మా అమ్మమ్మ కళ్ల ముందు మెదిలారు మేడం..ఎంతో హృద్యంగా చెప్పారు..))
ReplyDeleteThanks anDi
Delete