Search This Blog

Tuesday, July 31, 2018

శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు

శుభోదయం!

ఆయన నడిచే వేదాలసారము... ఈ భూలోకానికి భగవంతుడి గురించి చెప్పి జనాలని సన్మార్గంలో పెట్టడానికి అవతరించిన "శుకమహర్షి " .. ఆయనే ప్రవచన పితామహులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు!  వారు వేదాలకే నెలవైన కుటుంబంలో ఆగస్ట్ 28,  1925 న జన్మించారు . వారి తండ్రి గారి పేరు శ్రీదక్షిణామూర్తి గారు. వారి విద్యాభ్యాసం వారి తాతగారైన శ్రీ రామకృష్ణ విద్వత్ చేనుల గారి వద్దే సాగింది. శ్రీ రామకృష్ణ విద్వత్ చేనులు గారు బహుభాషా పండితులు. చంద్రశేఖర శాస్త్రి గారికి తెలుగు సంస్కృత భాషలలో తర్ఫీదు ఇచ్చినది వారి తాతగారే! వారి తాతగారి అభిలాషమెరకే శ్రీచంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచనాలు చేయసాగారు.

శ్రీచంద్రశేఖ్ర శాస్త్రి గారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యతగా నియమించారు. భధ్రాచలంలో ప్రతి ఏటా జరిగే సీతా రామ కల్యాణం మాత్రం ఎవరూ మరచిపోని విధంగా వారు వ్యాఖ్యానించారు. "అమ్మా! సీతమ్మ.. కాస్త తల పైకెత్తి రాములు వారి వంక చూడమ్మా " అని వారు వ్యాఖ్యానించిన తీరు జనకమహారాజుని గుర్తు చేస్తుంది. వారు మన సమకాలికులు కావడం మన అదృష్టము. 

ఇప్పటికి వారు చేసిన ప్రవచనాలు వందలు దాటే ఉంటాయి. ఎన్ని ప్రవచనాలు చేసినా "పలికెడిది రామభద్రుండట " అని అంతా ఆ రామకృపగా భావించే భక్తాగ్రేసరులు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారు! వారితో నాకు లభించిన ఈ ఇంటర్వ్యూ వారి వినయానికి దర్పనం. నా మహద్భాగ్యం. 

గంగవెల్లువని చిన్న కమండలలో పట్టి తేవాలన్న నా అత్యాశకు మన్నించండి. కొన్ని కారణాలవల్ల వారు మొదట విడియో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. వారు సతిమణి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నా ఈ ప్రయత్నాన్ని పెద్దమనస్సుతో ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. నచ్చితే పొగడ్తలు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారికి, నచ్చకపోతే తిట్లు నాకు !!  

 

 

 

'అమ్మా' యి




కావేరి కి అమ్మని వదిలి వెళ్ళాలంటే బెంగగా ఉంది. కావేరి చిన్న పిల్లేమీ కాదు ఇద్దరు పిల్లల తల్లి.


 పది రోజులు శెలవలకని  సంక్రాంతికి  వచ్చింది. ఆ పది రోజులు పది నిమిషాలలా గడచిపోయాయి. ఈ పది రోజుల్లో అమ్మ తనకి ఇష్టమైనవి అన్నీ వండి కొసరి కొసరి వడ్డిస్తూ కబుర్లు చెప్తూ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ నవ్విస్తూ తనని మళ్ళీ ఒక చంటిపిల్లని చేసేసింది. సంక్రాంతి ముందు రోజు పిల్లలకి భోగి పళ్ళు పోసి పిల్లల చేత బొమ్మల కొలువు పెట్టించి మళ్ళీ తన  చిన్నతనాన్ని తనకి బహుమతిగా ఇచ్చింది. ఇంక నాన్నగారు పిల్లలకి కావాల్సిన జీళ్లు, తేగలు, మొక్కగుడ్లు తెచ్చిపెడుతూ అసలు వాళ్ళకి బోర్ కొట్టకుండా చూసుకొన్నారు. వాళ్ళని పొలానికి సాయంత్రము పూట తీసుకెళ్ళి బోరింగులో స్నానాలు చేయించి వాళ్ళ ముచ్చట్లు తీర్చేవారు.


ఆ ఇల్లు... అదే తన పుట్టిల్లు... తనకొక దేవాలయము. తన బాల్యమంతా అక్కడే గడచింది. అక్కడ ప్రతి చెట్టు, ప్రతీ గడప, ప్రతీ గోడ తనతో ఎన్నో ఊసులాడుతున్నట్టు ఉంటుంది.

 చిన్నతనములో తను ముగ్గు వేస్తూన్నంతసేపు తనకి కాపల కాస్తూ నిద్దర ఆపుకుంటూ ఉండేవాళ్ళు అమ్మ నాన్న.  తను అందరి కన్నా పెద్ద ముగ్గు వేయాలని చాలా పెద్ద పెద్ద ముగ్గులతో వాకిలి అంతా నింపే ప్రయత్నములో రాత్రి 11 వరకు ఉండేది. అంత వరకు ఎన్ని పనులున్న అమ్మ తనతో పాటే ఉండేది.  ఇప్పటికీ అలా ముగ్గు వేస్తుంటే అమ్మ నిద్దర ఆపుకుంటూ అరుగు మీద కూర్చునే ఉంది.  

తన చిన్నప్పుడు తనకి భోగి పళ్ళు పోసి దిష్టి తీసి ప్రపంచంలో తనే అమ్మ దృష్టిలో అందగత్తేనేమో అనిపించేలా చూసేది. సంక్రాంతి రోజు తన చేత బొమ్మల కొలువు పెట్టించి అన్ని బొమ్మలలో తనని మురిపాల పసిడి బొమ్మగా చేసేది.

ఇంక కనుమ రోజు తన చేతితోటే పని వాళ్ళకు బట్టలు, డబ్బులు, బహుమతులు ఇప్పించేది.

అమ్మ వాళ్ళ ఇంటిలో తనో యువరాణి. ఆడింది ఆట పాడింది పాట. తనకి ఇష్టమైనది ఏదైనా చేయటానికి ఎప్పుడూ అమ్మ రెడీగా ఉండేది. అదీ తను అడగకుండా తన మనసు గ్రహంచి మరీ తనకి ఇష్టమైనవి ఇచ్చేది.   ఒకసారి ఇంటికి వచ్చిన ఒక చుట్టాలావిడ " కావేరి! నీ బెస్ట్ ఫ్రండ్ ఎవరే? " అని అదిగింది. వెంటనే కావేరి " మా అమ్మే నాకు బెస్ట్ ఫ్రండ్ " అని అంది. ఆ మాటకి అమ్మ తెగ మురిసిపోయింది. నిజమే అమ్మ కన్న తనకి సన్నిహితురాలైన స్నేహితురాలు లేదు.....

ఇంత అపురూపంగా పెరిగిన తను ఎవరో ఒక ముక్కుమొహం తెలియని వాడి కోసం ఇంత ప్రేమగా చూసుకొనే అమ్మ, నాన్న ని వదిలి వెళ్ళిపోయిందా?

ఎప్పుడు శెలవకి వచ్చినా ఇలా చుట్టం చూపుగా అమ్మ నాన్నని చూసి వెళ్ళిపోవాలా? ఎప్పుడూ ఆడపిల్ల తల్లిదండ్రి వద్ద ఉండలేదా? ఆడపిల్ల అంటే ఆడ పిల్లేనా? ఇంతలా ప్రేమించిన వాళ్ళకి దూరంగా ఎందుకుండాలి?  ఇంత అపురూపంగా పెంచిన అమ్మాయి పెళ్ళి అయ్యాక  పరాయి ఎందుకయ్యిపోతుంది?  

ఏంటో పొద్దుట నుండి ఎంత ఆపినా ఆగట్లేదు కన్నీళ్ళు, ఎక్కడ అమ్మ చూసి బాధపడుతుందో అని ఇలా పెరట్లో మొక్కలు, చెట్ల వైపుకు వచ్చి ఫోన్ లో ప్రండ్ తో మాట్లాడుతున్నట్లు  భారంగా తిరుగుతోంది కావేరి. దూరంగా చెట్టు మీద గువ్వలు అరుస్తున్నాయి.. గూడు వీడేడి వేళ, గూటికేగెడి వేళ పక్షి గొంతును మించి పాట గలదే...అన్న గరికపాటి వారి మాట గుర్తుకొచ్చింది. నిజమే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, అమ్మ వాళ్ళ ఇల్లు వదినప్పుడు మనసుకి ఎన్ని భావాలో కదా?

అమ్మా.. అమ్మా అని గట్టిగా అమ్మని పట్టుకొని ఏడ్వాలని ఉంది.

అ...మ్మా...

అ... మ్మా...

తన గొంతు కాదు ... పెద్దగా వినపడుతోంది అరుపు... అది తన చిన్న కూతురి అరుపు...

"అమ్మా! అమ్మమ్మ నిన్ను రమ్మని పిలుస్తోంది" అని చెప్పింది.

"నువ్వు వెళ్లు.. నేను ఇదిగో వస్తున్నాను రెండు నిమిషాలలో"

అవునూ!!! అమ్మ కూడా ఒక అమ్మాయే కదా ఈ ఇంటికి వచ్చినప్పుడు, తన తల్లీదండ్రికి గారాలపట్టిగా పెరిగి నాన్న చెయ్యి పట్టుకొని, నాన్నతో పాటు నాన్న వైపు వాళ్ళందరికి ఆప్తురాలయ్యింది. ఇంటికి భాగ్యలక్ష్మిలా, ప్రేమమూర్తిగా నిలబడింది. అమ్మ పెళ్ళి చేసుకునేటప్పటికి నాన్న కూడా అమ్మకి పరాయి మనిషే కదా? మరి తనూ అంతే కదా... తనూ ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లి... తల్లిగా తనూ పిల్లలకి ప్రేమ పంచాలి. మెట్టినింటిలో పుట్టింటి గౌరవం నిలపాలి. మెట్టినింటి వాళ్ళని తనవాళ్ళగా చూసుకోవాలి.  తన అమ్మలానే తనూ  తన పిల్లలకు  ఆదర్శం కావాలి.


తన ప్రశ్నలకి సమాధానము దొరికిందన్నట్లు చూసింది కావేరి తన కూతురి వైపు...

 




Saturday, June 30, 2018

డాక్టర్

" సహస్ర శీరుషః పురుషః సహస్రాక్ష సహస్రపాత్.... " అంటూ రోజు ఆ విరాట రూపాన్ని స్తుతిస్తూనే ఉంటాము. వేయి తలలతో, వేయి కళ్ళతో, వేయి చేతులతో ఎప్పుడూ ఆ స్థితి కారకుడు ప్రపంచాన్ని కాపాడుతూ ఉంటాడు. కొందరు అతన్ని విష్ణువుగా పిలిస్తే, కొందరు శక్తిగా పిలుస్తారు, ఇంకొందరు విశ్వేశ్వరుడిగా మరికొందరి నారాయణుడిగా కొలుస్తారు. మరి కొందరు 'వైద్యుడి ' గా కొలుస్తారు.

కింద కనిపించే ఫొటో బెంగుళూరులో 'నారాయణ హృదయాలయ ' లోపలకి అడుగుపెడుతుంటేనే కనిపిస్తుంది. ఒకొక్క చేతిలో ఒక్కొక్క దేవత నివాసమున్నట్టుగా ఉన్న ఆ విగ్రహం. ఈ విగ్రహానికి ఇక్కడ పని చేసే డాక్టర్లకి సంబంధం ఏంటా అని ఆలోచించాను. ఆ విగ్రహం చూడగానే ' వైద్యో నారాయణో హరి ' అని గుర్తుకొచ్చింది. 

నిజంగా ప్రతి డాక్టరూ ఆ విగ్రహంలోలాగా ఒక్క నిముషములో వేయి తలల ఆలోచనలతో, వేయి చేతులు చేసే పనులతో ఎల్లప్పుడూ సహాయం కోసం నిలచి ఉంటారు. రాత్రనక పగలనక రోగులని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు.

వారి చేతుల మీద ఎంత మందికి జన్మనిచ్చినా వారు గర్వపడరు, వారి చేతుల మీద మరెంత మంది ప్రాణాలు పోగొట్టుకొనినా నిరుత్సాహపడని స్థితప్రజ్ఞులు. అందుకే ' తొలిదేబ్యో భిషక్ ' గా నమక చమకాలలో ఆ శివుడికి కొలుస్తున్నాము.

మెడలో పాముకు బదులు 'సెతస్కోపు ' తో.. పీతాంబరాలకు బదులు ' తెల్లటి ఆప్రాన్ ' తో హరిహరుల కలయిక రూపమై కనిపించే దేవతలే ఈ వైద్యులు. అప్పుడే పుట్టిన పాపాయిని మొట్టమొదటి సారి స్పర్శించేది వీరే! వారి సేవలు అనిర్వచనీయము. 

ఈ రోజు మా ఊరి డాక్టర్ గారు డాక్టర్ (ఖండవల్లి) సుబ్బారావు గారిని తలచుకోలేకపోతే అది విశ్వాసఘాతమే! ఆయన ఆ చుట్టుపక్కల ఊర్లకి 'దేవుడు " ... కాదు కాదు.. "వైద్యుడు "! ఎందుకంటే ఆ దేవుడు అందరికి కనపడడు, ఈయన అయితే పిలిచినవారిని ఎప్పుడూ అండగా ఉండేవారు! ఆయన ఇప్పుడు ఆ స్వర్గంలో వైద్యం చేస్తూ ఉండి ఉంటారు.

వైద్య వృత్తిలో ఉండి ఎంతో మానవసేవ చేస్తున్న డాక్టర్ మితృలకు అభినందనవందనం!






Monday, June 4, 2018

ప్రకృతి

మన పురాణాలు " పుష్పవాన్ అంటే తోటలు, పొలాలు కలగడం, ప్రజావాన్ అంటే మంచి సంతానం, కష్టసుఖాలు పంచుకొనే వారు ఉండటం, పశుమాన్ అంటే పాడి కలిగి ఉండటం " కలిగినవాడినే అసలైన శ్రీమంతుడిగా చెప్పింది. కానీ ఒక కండీషన్ ... నీటిలోన భగవంతుడు, ఆ భగవంతునిలో నీరు పరస్పరం ఆశ్రయాలై ఉన్నట్లు తెలుసుకున్నవారికి.. అంటే వారిద్దరూ అభేదం అని తెలిసుకొన్నవారికే ఈ ఆఫర్ అన్న మాట. ( చన్ద్రమా వా ఆపాం పుష్పం, పుష్పవా ప్రజావాన్, పశుమాన్ భవతి, య ఏవం వేద).

 

అలాగే అగ్ని నీటి మీద ఆధరపడి ఉంటుంది, నీరు అగ్ని మీద, వాయువు నీటి మీద, నీరు వాయువు మీద (అదే ) , అంతే కాక సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆ నీటికి అధిష్టన దేవతలుగా భావించి వాటిని నమ్మి రక్షించేవాడే వేదాన్ని నమ్మేవాడు అని కూడా చెప్పింది. (అగ్నిర్వా అపా మాయతనం, వాయుర్వా అపా మాయతనం, ఆసోవై తపన్న పామాయతనం, చన్ద్రమా వా ఆపా మాయతనం). అంటే ఇవన్నీ నీటి మీద ఆధారపడి ఉన్నాయి, నీరు కూడా వీటి మీద ఆధారపడి ఉంది. ఇది తెలుసుకున్నవాడే వేదాన్ని తెలుసుకుంటాడు. పొద్దుటే పూజామందిరంలో ఈ మంత్ర పుష్పం చక్కగా చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని చదివేసి.. ఒక పువ్వు తీసి ఆ విశ్వనాథుడి పాదాల దగ్గర పెట్టేసి.. వీటన్నిటి రక్షించేస్తానని సంస్కృతం లో వొట్టేసేసి బయటకి వచ్చి కాళ్ళు చేతులు కడుకోడానికో లేక మొహం కడుకోడానికో కుళాయి తిప్పేసి ఫోన్ లో మునిగిపోతూ ఉంటాము.

 

 

ఒక్కసారి సగరుల ని గుర్తుతెచ్చుకుందాము, భూమిని ఇష్టం వచ్చినట్టు తవ్వేస్తేనే కదా వారు అటు నరకానికి కానీ, స్వర్గానికి కానీ వెళ్ళని గతి పట్టింది. వారి కోసం గంగ వస్తే కానీ వారికి మోక్షం దొరకలేదు. ఈ రోజుల్లో మన కోసం తపస్సు చేసి ఏ గంగని భూలోకానికి దింపే వారసులు లేరు.. కాబట్టి ప్రకృతిని కాపాడుకుందాము.

 

 

మన పురాణాలలో ప్రకృతి పార్వతిదేవితో పోల్చారు. ఆవిడని గౌరవించి పూజించిన నాడు ఆర్తానాదులు పాలిట అన్నపూర్ణ అవుతుంది. ప్రకృతితో ఆటలాడితే మహప్రళయసాక్షిణి అవుతుంది.



Friday, June 1, 2018

సినిమా పిచ్చోళ్ళు

" నా ఆజ్ఞ దిక్కరించితే నీకు ఇంట్లో చోటు లేదు, నీకు నీ కుటుంబం ముఖ్యమో, లేక వాళ్ళు ముఖ్యమో తేల్చుకో, నీకు నేను కావాలో వాళ్ళు కావాలో నిర్ణయించుకో " ... ఏంటీ ఈ డైలాగు వింటే ఏదో సినిమాలలో మాట వినకుండా ఎవరినో ప్రేమిస్తొన్న కొడుక్కి తండ్రి ఇచ్చే వార్నింగ్ లా ఉంది కదా... అసలు విషయమేమిటంటే మా సినిమా యాక్టర్ ఆంటి వాళ్ళ అబ్బాయితో అన్న మాటలు. వాడు ఆ కాలనీలో ఉన్న పిల్లలతో ఆడుకుంటున్నాడు, ఆవిడ వచ్చి వారసి గూడా లో వాళ్ల అన్న ఇంటికి వెళ్ళమని అంది, వాడు "ఊహూ ఆడుకుంటా " అని అన్నాడు.. అంతే ఈ డైలాగు వదిలింది ఆవిడ.

 

ఆ ఆంటీ పేరు నాకు గుర్తులేదు! కానీ ఆవిడ విపరీతంగా సినిమాలు చూసేది, వారానికి కానీసం లో కనీసం నాలుగు! అంకుల్ కి అస్సల్ సినిమాలంటే పడేది కాదు, సినిమాలకి డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. సినిమా టికేట్టు కోసం ఆవిడ ఇంట్లో పూలు, పళ్ళు, కాయలు, సగం వాడేసిన మావిడి కాయ ముక్కలు, మిగిలిపోయిన కాయగూరలు అమ్మేసుకునేది. 🤭🤭అప్పుడప్పుడు బియ్యమూ, పప్పులు, ఉప్పులు కూడా!! ఒక్కసారి అమ్మడానికి ఏవీ లేకపొతే ఇంట్లో ఉన్న ఇత్తడి సామాన్లు తాకట్టు పెట్టేసింది. నాకు ఆవిడ "సితామాలక్ష్మి " సినిమాలో తాల్లూరి రాజేశ్వరి లా అనిపించేది. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు కళ్ళు, నోరూ భలే తిప్పేసుకునేది. అప్పట్లో ఆ పేరు నాకు తెలీదు, అందుకు ఆవిడని "సినిమా యాక్టర్ ఆంటీ " అనేదాన్ని, పాపం తెగ మురిసిపోయి ముక్కలైపోయేది. వాళ్ళ అన్నయ్యకి కూడా సినిమాల పిచ్చి బాగా ఉండేది. అప్పుడప్పుడు అతను ఈవిడకి డబ్బులు ఇచ్చేవాడు.

 

ఆవిడకి ఒక కొడుకు, ఒక కూతురు, పేరు శ్రీదేవి, కృష్ణ. ఆంటీ సినిమా చూసీ ఆ సినిమాలో హీరోయిన్ లా చిత్ర విచిత్ర జడలు వేసేది శ్రీదేవికి. ఆ శ్రీదేవిని తయ్యారు చేసి " నా కన్నుల వెన్నెల, నా హృదయాలలో చిరు జల్లు నువ్వే " అని ముద్దు పెట్టుకునేది. ఈ హరివిల్లు, చిరుజల్లు, మమతల కోవెల, పులకింత, పాలపుంత వగైరా పదప్రయోగాలు ఆవిడ రోజూ వాడేది. ఏంటో మా ఇళ్ళల్లో ఇలా ఎప్పుడూ అనేవారు కాదేమో భలే నచ్చేసేవి ఆ మాటలు మాకు!

 

కృష్ణ ఎప్పుడేనా "అమ్మా! ఈరోజు సాంబారు చాలా బాగుంది " అని అంటే...

"అందులో నా ప్రేమ రంగరించాను, బాగోదా మరి " అనేది...

మా ఇళ్ళల్లో ఎప్పుడూ కారం, మిరియాలు, కొబ్బరే వేసేవారు ఈ సాంబారులో, ఈ రంగరించడం ఏంటో మరి!! 

 🤔

ఆవిడ అంతటితో ఆగలేదు, గోరింటాకు రుబ్బుతూ " గోరింటా పూసింది కొమ్మలేకుండా " అని, పూలు కోస్తొనప్పుడు "పూజ సేయ పూలు తెచ్చాను " అని, మరేదో పని చేస్తూ "ఆడది కోరుకునే వరాలు రెండే రెండు " అని పాడుకునేది.😀 

😆

ఇక ఆంటీ వాళ్ళ అన్నయ్య సిని యాక్టర్ "బాలయ్య " అభిమాని. చాలా పెద్ద వ్యాపారం ఉండేది. ఎప్పుడూ పాతికమంది(ద)నేసుకొని తిరిగేవాడు. వాళ్లందిరిని బాలయ్య సినిమాకి తీసుకొని వెళ్ళి వారి తిండితిప్పలు చూసుకొనేవాడు. బాలయ్య సినిమా రిలీజు అయిన రోజు ఫస్ట్ డే ఫస్ట్ షో మొత్తం టికెట్లు ఆయనే కొనేసేవాడు. ఆయన పరివారం మొత్తం ఆ సినిమా చూడాల్సిందే!

 

ఆ అంకుల్, ఈ సినిమ యాక్టర్ ఆంటీ కలిసినప్పుడు చూడాలీ.. "రక్తసంబంధం " సినిమాయే!! "నీ ప్రేమే నాకు శ్రీరామ రక్షా అన్నయ్య " అని ఆవిడ అంటే, " నా కంటికి, మా ఇంటికి దివ్వెవు నువ్వే, ఒక కొమ్మకి పూసిన పువ్వులం మనము చెల్లెమ్మ " అని ఆయన అనేవాడు... ఒక్కొసారి వాళ్ళు చెప్పే డైలాగులు ఏ సినిమాలోవో మాకు తెలిసిపోయేవి కూడా! కానీ ఆ డైలాగులలో కామెడీ అప్పట్లో తెలియలేదు!!  

😄

ఆ అంకుల్ యంగ్ గా ఉన్న "వెంకయ్య నాయుడు " లా ఉండేవాడు. ఒకసారి ఆయనకి వ్యాపారంలో బాగా నష్టం వచ్చేసింది. పాపం చుట్టూ ఉన్న ఈ మంద ఒక్కక్కరే తప్పుకున్నారు. ఆ అంకుల్ కి మతి కూడా చెడిపోయింది. 😥రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఆయనలో ఆయనే గట్టిగా మాట్లాడేసుకునేవాడు. ఒకసారి ఇలా వెళ్తూ వెళ్తూ తప్పిపోయాడు. పాపం ఇంట్లో వాళ్ళు చాలా వెతికారు. ఆయనకి డిగ్రీ చదివే ఒక కొడుకు, ఇంజినీరింగు చదివే ఇంకో కొడుకూ ఉన్నారు. వాళ్ళు చెరో బైకు వేసుకొని మరీ ఊరంతా వెతికారు. అప్పుడు ఎవరో తెలిసిన వాళ్ళు ఆయన "తిరుపతి బస్సు " ఎక్కేశారని చెప్పారు. వెంటనే వాళ్ళు తిరుపతి బయలుదేరాలనుకున్నారు. తిరుపతి ఏదైనా చిన్న నగరమా ఆయన దొరకడానికి? అయినా బయలుదేరారు.

 

ఆ కొడుకులు తిరుపతి బస్సు దిగి ఒక పేపరు కొనుకొన్నారు. ఒక నిర్ణయానికి వచ్చినవారులా వెంటనే ఒకరి మొహం ఒకరు చూసుకొన్నారు. ఒక సినిమా హాల్ కి వెళ్ళారు , ఆ సినిమా హాల్లో బాలయ్య " తల్లి తండ్రులు " సినిమా చూస్తూ కనిపించాడు వాళ్ళ 'కన్నతండ్రి"! 😎😎😍

Sunday, May 6, 2018

సరసాల జవరాలను

చిత్రం  :  సీతారామ కల్యాణం (1961)
సంగీతం  :  గాలిపెంచల నరసింహారావు
గీతరచయిత  :  సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం  :  పి. లీల   




పల్లవి :

ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ...

సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను...


మురిపాలు వెలబోయు భామలలోన
మురిపాలు వెలబోయు భామలలోన


సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను..



చరణం 1 :



బంగారు రంగారు మైజిగిలోన
బంగారు రంగారు మైజిగిలోన
పొంగారు వయసు పొంకములోనా


సంగీత నాట్యాల నైపుణిలోనా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..ఆ.. ఆ.. ఆ.. ఆ
సంగీత నాట్యాల నైపుణిలోనా
నా సాటి నెరజాణ కనరాదుగా



సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను..



చరణం 2 : 


మగువల నొల్లని  మునియైనా
మగువల నొల్లని  మునియైనా
నా నగుమొగమును గన చేజాచడా


యాగము యోగము ధ్యానములన్నీ ...
యాగము యోగము ధ్యానములన్నీ ...
నా బిగికౌగిలి సుఖమునకేగా



సరసాల జవరాలను...  నేనే గదా
సరసాల జవరాలను..

 

 

 


                    *****************************



ఈ పాట సీతారామ కల్యాణం సినిమాలోనిది. పాడినవారు పి. లీల, సంగీతం గాలిపెంచల నరసింహారావు,   సాహిత్యము  సముద్రాల రాఘవాచార్య.  ఈ పాట కుచలకుమారి మీద చిత్రీకరించారు. సినిమాలో ఆవిడ రంభగా నటించారు. రంభ తనని తాను పొగుడుకుంటూ పాడుకునే జావళి ఇది. ఇది తెలిసో తెలియకో రావణుడిని ఆకర్షించినందుకు ఈ పాట జావళి అయ్యింది. ఈ పాట అయ్యాకే రావణుడు రంభని బలాత్కరిస్తాడు, నలకూబరుడి శాపానికి లోనౌతాడు. (కొన్ని గ్రంధాలలో రంభే శపించింది అని కూడా ఉంది).   


ఈ జావళిలో రంభ తనను తాను పొగుడుకుంటూ "యాగము యోగము దానములన్నీ  నా బిగికౌగిలి సుఖమునకేగా " అని చాలా గర్వంగా అంటుంది. ఎన్ని తపస్సులైనా, ఎన్ని యాగాలైనా చేసేది స్వర్గం కోసమూ, ఆ స్వర్గ సుఖాల కోసమే కదా! ఆ స్వర్గంలో ముఖ్య ఆకార్షణ తనే (రంభే) అని ఎంత గర్వంగా చెప్పుకుందో కదా!



Thursday, May 3, 2018

మాధవపెద్ది సురేష్

మిత్రులకు నమస్కారములు! ఈ నెల ఎందరో మహానుభావు లలో తెలుగు సినీ సంగీత దర్శకులు "మాధవపెద్ది సురేష్ " గారు గురించి తెలుసుకుందాము. వారి సినీ సంగీతం వహించిన సినిమాలు రాశి తక్కువయినా వాశిలో ఎందరో హృదయాలు "మధురమే సుధాగానం " అనేటట్టు చేశాయి. వారు చాలా సౌమ్య భాషి, మంచి వ్యక్తి ఆయన. ఆయనకి తగిన ఇల్లాలే నిర్మల గారు(చిట్టి పిన్ని). మాధవపెద్ది సురేష్ గారి సంగీతమంత మాధుర్యం నిర్మల గారి వంట. ఆవిడ చేతి 'పండుమిరపకాయ పచ్చడి(కొరివికారం) ' సూపర్.. మాటలు లేవు! ఆ సంగీతం, ఈ వంటకం ఆస్వాదించాలి కానీ వర్ణించలేము.


సురేష్ గారూ, నిర్మల గారు! మీ పరిచయం ఒక అదృష్టం. ఎప్పటికీ మీ అభిమానాన్ని కోరుతూ.. మీ విశాలి.