Search This Blog
Thursday, December 27, 2018
Wednesday, December 26, 2018
అరుణ కిరణం...
నిన్న మా ఫ్రండ్ మానస కూతురి పుట్టినరోజుకి వెళ్ళాను. అక్కడ కి వెళ్ళి కూర్చూగానే మా ఫ్రండ్ వాళ్ళ చుట్టం ఒకావిడ నా చేతిలో ఒక జూస్ గ్లాస్ పెట్టింది. ఇంకా ఆ పుట్టినరోజు పిల్లని తయ్యారు చేస్తున్నారు. నేను వెళ్ళి మా ఫ్రండ్ అత్తగారిని పలకరించి ఆవిడ పక్కన కూర్చున్నాను. ఆవిడ కాస్త పొట్టిగా పాత సినిమాలో ' రాజసులోచన ' లా ఉంటుంది.
ఆవిడ నన్ను పలకరించిందే కానీ చూపులు మాత్రం నిలకడగా లేవు.. ఏదో వెతుకుతోంది... ఇంత లో వెనకకు చూసింది.. అక్కడ ఆవిడ మనవడు (కూతురి కొడుకు) కొత్త పెళ్ళం చెయ్యి పట్టుకొని నవ్వుతూ కబుర్లు చెబుతున్నాడు. అంతే "ఒరేయ్ కిరణు.. కాస్త జానాలలోకి రారా " అని కాస్త సీర్యస్ గానే అంది. ఇంతలో నా ఫ్రండ్ వచ్చి " వాడు జనాలలోనే కదా ఉన్నాడు " అని నవ్వుతూ అంది. నన్ను పలకరించి మళ్ళీ లోపలకి వెళ్ళిపోయింది మానస.
ఇంతలో ఆ కిరణ్ వెనకాల వంటిట్లో రెండు కుర్చీలు వేసుకొని, అతను అతని భార్య అరుణ మళ్లీ కబుర్లు చెప్పేసుకుంటున్నారు. ఇంతలో ఈ రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణు.. ఇలా వచ్చి మావయ్య పక్కన కూర్చోరా " అంది. అబ్బే మన కిరణుడికి తాత్కాలిక చెవుడు వచ్చేసింది... వినిపించుకునట్టుగా నటించేశాడు. ఈ రాజసులోచనగారు ఆగలేదు మళ్ళీ గొంతులో స్థాయి పెంచి పిలించింది. ఇంక ఆ అబ్బాయి తప్పదన్నట్టు లేచి వచ్చి హాల్ లో మానసా వాళ్ళ ఆయన పక్కన కూర్చున్నాడు. ఇక్కడ కిరణ్.. ఎదురుకుండా వంటిట్లో అరుణ.. హ్మ్మ్మ్.. కాసేపు కళ్ళతో కబుర్లు చెప్పేసుకోవడం, చూపులతో సైగలు చేసేసుకోవడం మొదలెట్టారు. అటు చూసి ఇటు చూసి కిరణు మళ్లీ వెళ్ళి అరుణ పక్కన చేరాడు. మళ్ళీ మన రాజసులోచన గారు వెతుకోవడం మొదలెట్టింది... ఇంతలో కేక్ కట్టింగులు అయ్యాయి. ఈ రాజసులోచన గారి దృష్టి అంతా కిరణ్ వైపు, నా దృష్టి అంతా ఈవిడవైపే ఉండిపోయాయి.
ఒక ప్లేట్ లో పెద్ద కేక్ ముక్క పట్టుకొని కిరణ్ , అరుణ పక్కకెళ్లీ సగం సగం తింటున్నారు. ఇంతలో మన రాజసులోచన గారు.. "ఒరేయ్ కిరణూ.. ఇక్కడ కేకు ఉందిరా.. రా " అని అరిచింది. పాపం కిరణ్ అరుణని వదలలేక వదలలేక అమ్మమ్మ దగ్గరకు వచ్చాడు.
ఇంక భోజనాల తంతు మొదలయ్యింది. రాజసులోచన గారి హడావిడి చూసి ఆవిడకి ఒక ప్లేట్ లో భోజనం పెట్టి పైకి వెళ్ళి కూర్చోమని ఆవిడ కొడుకు(మానస భర్త) చెప్పాడు... ఆవిడ మెట్లు ఎక్కుతూ ఎక్కుతూ .. "ఒరేయ్ కిరణు.. నువ్వు ఇలా రా " అని పిలిచింది. ఆవిడ కొడుకు.. "నిన్ను వెళ్ళమంటే నువ్వు వెళ్ళు , వాడిని ఎందుకు పిలుస్తావు... ఏదైనా వడ్దన పని ఉంటే వాడు చేయాలి కదా " అని చెప్పి రాజసులోచన గారిని మేడ ఎక్కించేశారు. ఇక అరుణ, కిరణులు సరదాగ నవ్వుకుంటూ వడ్దన చేస్తుంటే అందరికీ చూడ ముచ్చటగా అనిపించింది. అరుణతోటే కదా కిరణం ఉండేది!!
ఒక చిన్న మొక్కని పాతి నీరు పోసి పెంచి పెద్ద చేశాక, తీరా అది ఫలాలు ఇచ్చే సమయానికి ఎవరో వచ్చి ఆ చెట్టుని తనది అనేస్తే.. ఆ పెంచిన వ్యక్తికి ఒకరకమైన బాధ, దుగ్ధ వేస్తుంది. ఈ రాజసులోచన గారి బాధ అదే. చిన్నప్పుడు తల్లీతండ్రీ పోతే ఈ రాజసులోచన గారు(అసలు పేరు ఇప్పటికీ తెలీదు) ఆ కిరణ్ ని పెంచింది. ఎక్కడ ఆ కొత్త పిల్ల ఆవిడ మనవడిని ఆవిడకి దూరం చేసేస్తుందో అన్న భయం. ఆ మనవడు అమాయకుడని, ఆ కొత్తగా వచ్చిన పిల్ల వాడిని ఆడించేస్తుందన్న భయము... ఈ భయంతోటే కాస్త ఎక్కువ చొరవ తీసుకుంటారు వాళ్ళ జీవితాలలో... ఆ చెట్టు నాదే, ఆ కొత్త పిల్ల నాదే అన్న భావం వస్తే ఈ బాధ ఉండదు. ఎక్కువ చొరవ తీసుకుంటే వాళ్ళు మొదట నవ్వుకున్నా తరవాత తరవాత విసుకుంటారు కూడా. చెప్పడం తేలికే ఈ విషయం కానీ ఆచరించడం కష్టం... అయినా తప్పదు మన గౌరవం మనం నిలుపుకోవాలంటే!!
Sunday, December 9, 2018
ప్రయాగ
"నిన్ను అక్కడ నుంచి పక్కకు రమ్మని చెప్పాను కదమ్మా " అని ఐదో సారో ఆరో సారో అన్నారు పంతులు గారు సునందతో...
" వాడికి సరిగ్గా తెలియటం లేదండి " అని మళ్ళీ అదే జవాబు ఇచ్చింది సునంద...
"వాడికి అర్ధమయ్యేటట్టు నేను చెబుతా, నువ్వు పక్కకు రావమ్మా " అని కాస్త కటువుగా చెప్పారు పంతులు గారు.
చుట్టుపక్కల ఎనిమిదిమంది వారి వారి పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నారు, అందరూ 40 ఏళ్లు దాటిన వారే, కొందరు 60 ఏళ్ళు దాటిన వారూ ఉన్నారు! అందులో ఒకే ఒకడు మాత్రం పది పదకొండేళ్ళ మధ్యలో ఉన్న వాడు... పేరు సంతోష్! వాడికి ఏదీ అర్ధం కావటం లేదు... అందుకు అతని తల్లి మాటిమాటికి వచ్చి పంతులుగారు చెప్పింది ఎలా చెయ్యాలో చెబుతోంది, ఇది ఆ పంతులుగారికి నచ్చక ఆవిడని కసురుకుంటున్నాడు.
"ఒరేయ్... అంత పెద్ద పెద్ద ఉండలు కాదురా... ఆ పిండితో నలభై ఉండలు చెయ్యాలి... నువ్వు ఐదు ఉండలు చేశావు ఒక్కో ఉండని ఎనిమిది చిన్న ఉండలు చెయ్యి " అని గదమాయిస్తూ చెప్పారు ఆ పంతులు గారు.
సంతోష్ ఆయన చెప్పినట్టే భయం భయంగా చేస్తున్నాడు. చుట్టూ ఉన్నవారు అక్కడ జరిగేది చూడలేక సునందని అడిగారు " ఆ పిల్లాడు ఎవరికి పిండప్రదానం చేస్తున్నాడమ్మా? " అని
" నా భర్తకేనండి " అని వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ అంది సునంద
అప్పుడు చూశాను ఆవిడని రమారమీ 25 - 27 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా మొహం లో లేతదనం పోలేదు. ఎవరూ ఆ పిల్లాడికి తల్లి అని అనుకోరు, అక్కేమో అని అనిపిస్తుంది. ఇంత కష్టమా ఇంత చిన్న వయసులో?
" ప్రయాగ, కాశి, గయలో శ్రాద్ధం పెట్టిన వాడే అసలైన కొడుకుగా మన పురాణాలు చెబుతున్నాయి " అని గట్టిగా పంతులుగారు అన్నారు.
" చేతికున్న ఆ దర్భ పడిపోయిందిరా.. చూసుకో " అని సంతోష్ తో అన్నారు పంతులుగారు...
వాడు దర్భ అంటే ఏంటో అని విస్తరిలో చూస్తున్నాడు, సునంద ఆగలేక మళ్ళీ దగ్గరకు వెళ్ళి ఆ దర్భని తీసి ఇవ్వబోయింది..
"వాడికి తెలుగు అర్ధమౌతుంది కదా? నేను తెలుగులోనే చెబుతున్నాను కదమ్మా... నువ్వు పక్కకు వెళ్ళు " అని మళ్ళీ గదమాయించాడు
చిన్నబుచ్చుకొన్న మొహం తో మళ్ళీ వెనకాలకి వచ్చింది సునంద.
"ఎలా పొయారమ్మ మీ వారు? " అని ఎవరో ఆ గుంపులో అడిగారు
" యాక్సిడెంట్ లో పోయారండి " అని సమాధానం ఇచ్చింది సునంద
" ఏదైనా ఆస్తి పాస్తులున్నాయా మరి? నువ్వేదైన ఉద్యోగం చేస్తున్నావా? " అని అడిగింది ఒక పెద్దావిడ ఉండబట్టలేక...
" ఒక పాన్ షాప్ ఉందండి, వెయ్యి గజాల స్థలం మాధాపూర్ లో ఉంది, అదిగో మా అమ్మ నాన్నతో ఉంటున్నాను " అని సంతోష్ పక్కన పితృకర్మలు చేస్తున్న తన తండ్రిని చూపించింది సునంద.
" అయ్యో తాత మనవడు ఇలా ప్రయాగలో ఒకేసారి పిండప్రదానం చేస్తున్నారా? పగవారికి కూడా ఇలాంటి కష్టం రాకూడదు " అని కళ్ళ నీరు పెట్టుకుంది ఒక పెద్దావిడ
"నేను ఎక్కువ చదువుకోలేదండి, టెంత్ అయ్యిన వెంఠనే పెళ్ళి, పెళ్లైన ఏడాదిలోపలే వీడు పుట్టేశారు " అని చెప్పింది సునంద
" వీడెనా ఇంకా పిల్లలు ఉన్నారా? " అని ఇంకో ప్రశ్న
" ఇంకో ఆడపిల్ల ఉందండి "
"చెయ్యి ఎడమవైపు తిప్పాలిరా అలా కాదు " అని మళ్ళీ పంతులుగారి అరుపు
చెయ్యి అన్ని వైపుల తిప్పెస్తూ పంతులుగారి వైపు తిప్పాడు సంతోష్
"నాకు కాదురా ఆ పిండం పెట్టేది అటు వైపు తిప్పి నేను చెప్పింది చెప్పు " అని అన్నారు పంతులుగారు
ఆ మాటకి కాస్త నవ్వు వచ్చినా అక్కడి జనాలు మాత్రం నవ్వితే ఎమంటారో అని నవ్వలేకపోయారు..
పక్కన ఉన్న సంతోష్ తాత కళ్ళతో అలా కాదు అని సైగ చేశాడు. అది అర్ధం చేసుకున్నాడేమో తాత ఎలా చేస్తున్నాడో చూసి అలా చెయ్యి తిప్పాడు సంతోష్.
మొత్తానికి ప్రయాగలో సంతోష్ చేత అతని తండ్రికి శ్రార్ధం పెట్టించింది సునంద. అందరూ ఆ పంతులుగారికి తోచిన రొక్కం చెల్లిస్తున్నారు. డబ్బులు ఇచ్చి అతని కాళ్ళకి దండం పెడుతున్నారు
సంతోష్ చేతికి రెండు వందల రుపాయిలు ఇచ్చి పంతులుగారికి ఇవ్వమని చెప్పించి సునంద.
సంతోష్ భయంగా ఆయన దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన చెయ్యి అడ్డం పెట్టారు
"అయ్యా.. డబ్బులు తక్కువైతే ఇంకో వంద ఇస్తానండి " అని సునంద పాపం కళ్ళలో నీళ్లతో అంది
"అమ్మా.. శ్రద్ధగా పెట్టేది శ్రార్ధం. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయికి వచ్చిన కష్టం శతృవులకు కూడా రాకూడదమ్మా! ఎంతో డబ్బున్నా, శాస్త్రీయ కుటుంబాలకు చెందినవారు తల్లి తండ్రి పోతే ఎవరో ఒకరికి (డబ్బులు) కూలి ఇచ్చి దహన సంస్కారాలు చేయిస్తున్నారు. ఇక ఇలా ప్రయాగ, కాశీలో, గయలో పిండప్రధానం అనేదే లేదు. అలాంటిది నీ కొడుకు నా ద్వారా ఆ క్రతువు చేయించుకున్నాడు, ఆ తృప్తి చాలమ్మా. వాడిని కసిరింది వాడి ఆలోచనలు అటు ఇటు పోకూడదని, తప్పుగా అనుకోకే.. నా కూతురు లాంటి దానివి " అని పంతులుగారు అనడంతో అందరూ ఆయనవైపు చేతులు జోడించి మరీ చూశారు
సంతోష్ వైపు చూసి "అయ్యవారి కాళ్ళకి దండం పెట్టు " అని చెప్పింది సునంద
కాళ్లకి దండం పెట్టిన సంతొష్ ని లేవదీస్తూ " ఒరేయ్.. మీ నాన్న ఏ లోకాలలో ఉన్నా ఆయన ఆత్మకి శాంతి కలిగించావు, ఉన్నత లోకాలు కలిగేటట్టుగా చేశావు. , బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకొని ఆవిడకీ కూడా ఆనందాన్ని ఇవ్వు " అని అన్నారు పంతులు గారు.
"యథా నవనీతం హృదయం బాహ్మణస్య
వాచి కురో నిశిత స్త్రీక్షధాః " గుర్తొచ్చింది.
ప్రయాగ వెళ్ళినప్పుడు ఆయనకి నా తరఫున కూడా దండం పెట్టండి.
Friday, November 23, 2018
పాటకలు
పున్నమి రాత్రిలో కూసే కోయిలలా ...
సముద్రపుటొడ్డున మేసే గోవులా..
కార్తీకాన విరబూసిన మల్లిలా...
నిత్యమూ ఆహ్లాదంగా నీ నవ్వు ఉంటుంది...
(రాత్రి పూట కోయిలా, సముద్రపు ఒడ్డున లేని గడ్డి మేసే ఆవు, కార్తీక మాసంలో మల్లెపువ్వు... దేవుడా)
నడిరోడ్డున ఏడుస్తొన్న ఆకాలి ఏడుపులు వినపడుతూ కూడా నువ్వు ఎలా తినగలుగుతున్నావు?
(అన్నం తినేటప్పుడు నాకు చెవులు పని చెయ్యవు)
పండక్కి నువ్వొక్కదానివే బట్టలు కొనుకుంటే చాలా... దేశంలో బట్టలు లేని వారు ఎందరో...
(పండక్కి కొత్త బట్టలు కొనికొని వెసుకోవడానికి కూడా కోర్టు అనుమతి కావాలా?)
ఇవన్నీ పొద్దుటే వచ్చే వాట్స్ ఆప్ లో కవితా సందేశాలు...కవితలనబడే ముక్కలు చేసేసిన వాక్యాలు.
ఇంకొందరు పాత పాటలలో అక్కడో ముక్క ఇక్కడో ముక్క తీసుకొని అతికించేసి రాసేస్తూ ఉంటారు. అప్పటికే మనసు చంపుకొని "వహ వా.. " అన్నాను...
అన్నకా ఇంకా పెట్రేగి పోయి..."గంగాభగీరథి సమానురాలైన మా అమ్మ నిత్య పవిత్రురాలు " అంటూ రాసేశారు.. వాళ్ళ నాన్న గుండ్రాయిలా ఉన్నాడు. ఇలా అనకూడదు భర్త ఉన్న వాళ్లని అంటే "పద ప్రయోగం బాగుందని అనేశా... " అంటూ సకిళింపు లాంటి ఇకిలింపు...
రేపటి నుంచి రివర్స్ లో నేనూ పాటల ముక్కలు కవితలుగా .. అంటే "పాటకలు " (అబ్బాబ్బ ఎంత బాగుందో పేరు) రాసేసి పంపేస్తా.. అంతే!!
Tuesday, October 30, 2018
జ్యోతి
హాల్ అంతా కోలాహలంగా ఉంది. చాలా రోజుల తరవాత కలుసుకున్న చుట్టాలతో ఎప్పటెప్పటివో కబుర్లతో చాలా సందడిగా ఉంది. ఇంకా జ్యోతి రాలేదు. అందరూ తన గురించే ఎదురు చూస్తున్నారు. జ్యోతి భర్త దీపక్ వచ్చిన వారందరికీ కూల్ డ్రింకులు అందాయో లేదో చూస్తూ, అక్కడ పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ హాల్ అంతా తిరుగుతున్నాడు. జ్యోతీ దీపక్ లు చాలా శ్రీమంతులు. అటువంటి వారింట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అప్పటికే అక్కడ చేరిన కొంతమంది జ్యోతి సంతానం గురించి ఎన్నో కాలక్షేపం కబుర్లు చెప్పుకోసాగారు. కొందరు కామెడీలు కూడా చేశారు. కాసేపయ్యాక జ్యోతి, తన అమ్మ, అత్తగార్లతో హాల్ కి వచ్చింది. జ్యోతి చేతిలో ఏడాది పిల్లాడు, జ్యోతి వాళ్ళ అమ్మ చేతిలో రెండున్నర ఏళ్ళ పాప, జ్యోతి అత్తగారి చేతిలో మూడేళ్ళ పాప ఉన్నారు. అందరూ కాసేపు ఆశ్చర్యమూ, వెటకారముతో కూడిన నవ్వులతో జ్యోతిని పలకరించారు.
"ఈ రోజుల్లో కూడా ఇంకా ముగ్గురు పిల్లల్ని సాకడం అబ్బో... " అని వంకరగా...
" కాస్తైనా చూసుకోవాల్సింది జ్యోతి " అని ఇంకొకరు ఉచిత సలహా పారేశారు.
"ముగ్గుర్ని... కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది " అని ఒకరంటే...
"సంతాన లక్ష్మిలా భలే నిండుగా ఉన్నావు " అని ఒకరు
అసలు విషయం గ్రహించిన జ్యోతి మాత్రం అందరికీ చిరునవ్వే సమాధానం ఇచ్చింది. కేక్ కట్టింగ్ అయ్యాక, అందరికీ అడిగి అడిగి కొసరి కొసరి మరీ వడ్డించి కడుపు నిండేలా అన్ని రుచికరమైన పదార్ధాలు తినిపించారు జ్యోతీ దీపక్ లు. ఇక అందరూ వెళ్ళే ముందు జ్యోతి.. "ఒక్క నిమిషం మీ అందరితో కొంచం మాట్లాడాలి " అని అంది.
"మీరందరూ ఈరోజు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థాంక్స్. నాకు పెళ్లైనప్పటి నుంచి పిల్లలు కావాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. దీపక్ కి కూడా పిల్లలంటే చాలా ఇష్టము. మా దురదృష్టమేంటో కానీ పెళ్ళైన 10 ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదు. మా పేర్లల్లో జ్యోతీ దీపక్ ఉన్నా మా జీవితాలలో మాత్రం వెలుగు లేదు. ఎంత డబ్బు ఉన్నా పిల్లల చేత "అమ్మ " అని అనిపించుకోని ఆ వెలితి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. అన్ని రకాలుగా ప్రయత్నించివిసిగి వేశారిపోయాక ఇదిగో అప్పుడు "ద్యుతి " వచ్చింది. మా జీవితం లో నిజం గా ద్యుతి ద్యుతినే తెచ్చింది. కానీ అప్పటికీ నాకు ఇంకా తనివి తీరలేదు. ద్యుతికి ఏడాదిన్నర వచ్చాక ద్యుతికి చెల్లెలు "మయూఖ " వచ్చింది. వాళ్ళ అల్లరితో ఇల్లంతా కళకళలాడింది. మా మొహాలలో చిరునవ్వు కూడా అంత అందంగానే విరబూసింది. ఇంక వాళ్ళిద్దరికీ ఒక తమ్ముడు కావాలని అనిపించింది మాకు.. అంతే ఇదిగో "చిరాగ్ " గాడు వచ్చాడు నేనున్నానంటూ! గత పదేళ్ళుగా "అమ్మా " అన్న పిలుపు కోసం ఎంత తపించిపొయానో... దేవుడు దానికి రెట్టింపుగా ప్రతి నిమిషం "అమ్మ , అమ్మా " అంటూ నా వెంట తిరిగే ముగ్గురు ముత్యాలని ఇచ్చాడు. వారి నవ్వుల పువ్వులతో, ఏడ్పుల గాడ్పులతో, కోపాల కారాలతో, ముద్దుల తీపితో నాకూ రోజు ఉగాదే!
నేను ఒక కూతురిగా అమ్మ నాన్నల నుంచీ అన్ని సిరులు పొందాను. ఇంక ఒక భార్యగా దీపక్ నాకు అన్ని ముచ్చట్లు తీర్చాడు. కానీ ఒక తల్లిగా పొందాల్సిన ముచ్చట్లేవి నాకు పదేళ్ల పాటు దక్కలేదు. నాకు తల్లిగా పిల్లల నవ్వులు కావాలనుకున్నా, వాళ్లతో నిద్ర లేని రాత్రులు కావాలనుకున్నా, వాళ్ళ అలకలు తో కూడిన దొంగ ఏడ్పులు కావాలనుకున్నా, నచ్చినవి ఇస్తే మురిసిపోయి ముద్దులతో కురిపించే ప్రేమ కావాలనుకున్నా, భయపడి "అమ్మా " అని చుట్టేసుకున్నప్పుడు భద్రత అవ్వాలనుకున్నా! అందరూ వాళ్ళ పిల్లల అల్లరితో విసిగిపోతూ ముచ్చటగా చెప్పుకొని కబుర్లు నేనూ చెప్పాలనుకున్నా! నేనూ అలా విసిగిపోవాలనుకున్నా! అమ్మగా నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలని పొందాలనుకున్నా! ఇందాక ఎవరో అన్నట్టు " కాస్త చూసి అందంగా ఉన్న పిల్లల్ని తెచ్చుకోవాల్సిందే " అని .. "మీ కడుపున పుట్టిన పిల్లలు ఏ వంకరతోనైనా పుడితే మీది కాదు అని వదిలేసి వస్తారా? మీరందరూ శారీరక నొప్పులు పడి "తల్లి " కాగలిగారు.. నేనూ ఎంతో మానసిక వ్యధపడే ఇన్నాళ్ళకు ఒక "అమ్మ " ని అయ్యాను. మీ అందరికీ ఏ కష్టం లేకుండా " అమ్మ " అని అనిపించుకునే వరం దక్కింది. అలా దక్కని వారికి ఎడారిలో ఒక అమృతం చుక్కలా ఇలా " అమ్మా " అని పిలిపించుకొని అవకాశం ఇచ్చిన అనాథశరణాలయాలకు ఎంతో ఋణపడి ఉన్నాము. ఇప్పుడు నేను మా పిల్లల అల్లరితో ఆటలతో అలసిపోతున్నాను, వారి కబుర్లలో తేలిపోతున్నాను, వారి ముద్దులలో మునిగిపోతున్నాను... ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇప్పుడు నా దగ్గరే ఉంది. నేను నా డబ్బు దర్పం చూపించడానికి ఈ ఫంక్షన్ చేశానని అనుకోవద్దు.. నేనూ "అమ్మ " ని అయ్యానన్న గర్వం తో చేశాను. ఏరోజూ నా పిల్లల్ని నేను అనాథశరణాలయం నుంచి తెచ్చుకున్నానని మాత్రం అనొద్దు " అని అందరికీ దండాలు పెట్టింది.
కుదిరితే జ్యోతి లాంటివారి విశాల హృదయానికి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము... అంతే తప్పా.. పిల్లలు అందంగా లేరనో, ఏ కులమో, ఏ మతమో అని వారిని వేలెత్తి చూపి కుసంస్కారాన్ని బయట పెట్టుకోవద్దు!!
Saturday, October 20, 2018
శక్తి
నిన్న
పొద్దుట కూరలకోసమని మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ
ఇల్లు, అర్పిత నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు నెలలే
అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్నా
రమ్మని చెప్పింది.
అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి
అడుగుపెడుతున్న అనుభూతి, ఇంటి ముందు మెలికల ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇంటిని తీర్చిదిద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి
ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా,
ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చా.
కాసేపు
పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసర నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు
ఆమెకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిపోనట్టు
పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం! ఒక గజేంద్రమోక్షము , గోపికలు కృష్ణుని ఘట్టాలు తీర్చిదిద్దిన విధానానికి
మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా " ఇదీ ఒక పెద్దపనేనా "
అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.
"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...
ఒక
చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక అలంకారము చేసి,
పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు
మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు
వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని
పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది.
మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు
చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు,
టిఫిలతో సరిపోయింది.
ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టగా
ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు ఆయన ఫ్రండ్స్ ని తీసుకొచ్చి వీణ కచేరి
చేయమని పురమాయించారు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన
వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళలేదు.
ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు
స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు
వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు
చేయించడములో, సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడైపోయింది, ఈయన సాయంత్రము లేటుగా రావడం తో ఆ రోజు గుడికి
వెళ్ళలేకపోయాము.
ఇలా నవరాత్రులు హాడవిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక
నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే
మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని
కౌగిలించుకొని రొప్పుతూ , ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా
దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి
తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే
ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న
వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళీ, రత్తాలుని
కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త బుద్ధి చెప్పి వచ్చాం. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం
అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలన్న ఆలోచనే మరచిపోయాము.
ఇంక దశమి రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో
పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాళ్లలతో
చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కి వచ్చిన చుట్టాలందరు ఎవరిళ్లలకు వారు
వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను
అడిగితే..
" ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.
చాలా ఉక్రోషం వచ్చేసింది.
" నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా? " అని నిలదీసా...
" నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..
" అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా? " అని అడిగా కాస్త గట్టిగా...
అందుకు
ఆయన చిద్విలాసంగా..." నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి
చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు
నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో
కలిసిపోయినప్పుడు బాలా త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తున్నప్పుడు
ఒక గాయత్రిని చూశా, వీణాపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చిన్నప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని
చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...
ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా
సిగ్గుతో నవ్వింది. " ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో
గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన "అని చెప్పింది.
"నిజమే కదా
అర్పితా! స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి
మహిషాసురమర్ధిని " అని అనేసి అలా ఇంటి దారి పట్టాను.
Friday, August 31, 2018
శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు
మిత్రులకు నమస్కారములు! నాదతనుమనిశం ఆ శంకరుడైతే... ఈ శ్యామసుందరుడు 'రాగా తనుమనిశం ... అనురాగా తనుమనిశం " . ఆ అనురాగం లో సగభాగం వారి అర్ధాంగి జయలక్ష్మి గారు. వీణకి తంత్రులులాగా వారు ఒకే రాగం పలుకుతారు.. అదే అనురాగము అను రాగం! తాళికి ముందు ద్వైతమై.. రాగ, తాన, పల్లవి అనే మూడుముళ్ళతో అద్వైతమయ్యారు ఈ సంగీత సహచరులు.
ఈ నెల మన " ఎందరో మహానుభావులు " శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు, వారి సతీ మణి శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు!
Subscribe to:
Posts (Atom)



