నాకు ఇష్టమైన వ్యాసాలు, నేను పత్రికలకు వ్రాసిన వ్యాసాలు, కొన్ని పిచ్చాపాటి విషయాలు పొందుపరచుకున్న అందమైన "ఊహల కుటీరం " ఇది.
Search This Blog
Saturday, October 20, 2018
శక్తి
నిన్న
పొద్దుట కూరలకోసమని మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ
ఇల్లు, అర్పిత నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు నెలలే
అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్నా
రమ్మని చెప్పింది.
అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి
అడుగుపెడుతున్న అనుభూతి, ఇంటి ముందు మెలికల ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇంటిని తీర్చిదిద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి
ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా,
ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చా.
కాసేపు
పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసర నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు
ఆమెకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిపోనట్టు
పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం! ఒక గజేంద్రమోక్షము , గోపికలు కృష్ణుని ఘట్టాలు తీర్చిదిద్దిన విధానానికి
మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా " ఇదీ ఒక పెద్దపనేనా "
అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.
"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...
ఒక
చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక అలంకారము చేసి,
పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు
మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు
వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని
పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది.
మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు
చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు,
టిఫిలతో సరిపోయింది.
ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టగా
ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు ఆయన ఫ్రండ్స్ ని తీసుకొచ్చి వీణ కచేరి
చేయమని పురమాయించారు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన
వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళలేదు.
ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు
స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు
వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు
చేయించడములో, సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడైపోయింది, ఈయన సాయంత్రము లేటుగా రావడం తో ఆ రోజు గుడికి
వెళ్ళలేకపోయాము.
ఇలా నవరాత్రులు హాడవిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక
నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే
మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని
కౌగిలించుకొని రొప్పుతూ , ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా
దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి
తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే
ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న
వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళీ, రత్తాలుని
కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త బుద్ధి చెప్పి వచ్చాం. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం
అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలన్న ఆలోచనే మరచిపోయాము.
ఇంక దశమి రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో
పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాళ్లలతో
చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కి వచ్చిన చుట్టాలందరు ఎవరిళ్లలకు వారు
వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను
అడిగితే..
" ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.
చాలా ఉక్రోషం వచ్చేసింది.
" నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా? " అని నిలదీసా...
" నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..
" అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా? " అని అడిగా కాస్త గట్టిగా...
అందుకు
ఆయన చిద్విలాసంగా..." నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి
చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు
నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో
కలిసిపోయినప్పుడు బాలా త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తున్నప్పుడు
ఒక గాయత్రిని చూశా, వీణాపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చిన్నప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని
చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...
ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా
సిగ్గుతో నవ్వింది. " ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో
గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన "అని చెప్పింది.
"నిజమే కదా
అర్పితా! స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి
మహిషాసురమర్ధిని " అని అనేసి అలా ఇంటి దారి పట్టాను.
క్రితం సంవత్సరం దసరా సందర్భంగా కూడా ఇదే కథ వ్రాసినట్లున్నారు? అఫ్కోర్స్ కథ మనోహరంగా ఉంది లెండి, ఎన్నిసార్లయినా చదవచ్చు 👌.
ReplyDeleteచాల బాగుంది విశాలి గారు.నిజం కూడా.అమ్మకు అంబ కు తేడాయేముంది
ReplyDelete.
Thanks Sarada gaaru!!
Delete