Search This Blog

Sunday, December 9, 2018

ప్రయాగ

"నిన్ను అక్కడ నుంచి పక్కకు రమ్మని చెప్పాను కదమ్మా " అని ఐదో సారో ఆరో సారో అన్నారు పంతులు గారు సునందతో...

" వాడికి సరిగ్గా తెలియటం లేదండి " అని మళ్ళీ అదే జవాబు ఇచ్చింది సునంద...

"వాడికి అర్ధమయ్యేటట్టు నేను చెబుతా, నువ్వు పక్కకు రావమ్మా " అని కాస్త కటువుగా చెప్పారు పంతులు గారు.


చుట్టుపక్కల ఎనిమిదిమంది వారి వారి పితృదేవతలకి శ్రాద్ధం పెడుతున్నారు, అందరూ 40 ఏళ్లు దాటిన వారే, కొందరు 60 ఏళ్ళు దాటిన వారూ ఉన్నారు! అందులో  ఒకే ఒకడు మాత్రం పది పదకొండేళ్ళ మధ్యలో ఉన్న వాడు... పేరు సంతోష్! వాడికి ఏదీ అర్ధం కావటం లేదు... అందుకు అతని తల్లి మాటిమాటికి  వచ్చి పంతులుగారు చెప్పింది ఎలా చెయ్యాలో చెబుతోంది, ఇది ఆ పంతులుగారికి నచ్చక ఆవిడని కసురుకుంటున్నాడు.


"ఒరేయ్... అంత పెద్ద పెద్ద ఉండలు కాదురా... ఆ పిండితో నలభై ఉండలు చెయ్యాలి... నువ్వు ఐదు ఉండలు చేశావు ఒక్కో ఉండని ఎనిమిది చిన్న ఉండలు చెయ్యి " అని గదమాయిస్తూ చెప్పారు ఆ పంతులు గారు.


సంతోష్ ఆయన చెప్పినట్టే భయం భయంగా చేస్తున్నాడు.  చుట్టూ ఉన్నవారు అక్కడ జరిగేది చూడలేక సునందని అడిగారు " ఆ పిల్లాడు ఎవరికి పిండప్రదానం చేస్తున్నాడమ్మా? " అని


" నా భర్తకేనండి  " అని వస్తున్న దుఖాన్ని ఆపుకుంటూ అంది సునంద


అప్పుడు చూశాను ఆవిడని రమారమీ 25 - 27 ఏళ్ళ మధ్యలో ఉంటుంది. ఇంకా మొహం లో లేతదనం పోలేదు. ఎవరూ ఆ పిల్లాడికి తల్లి అని అనుకోరు, అక్కేమో అని అనిపిస్తుంది.  ఇంత కష్టమా ఇంత చిన్న  వయసులో? 

" ప్రయాగ, కాశి, గయలో శ్రాద్ధం పెట్టిన వాడే అసలైన కొడుకుగా మన పురాణాలు చెబుతున్నాయి " అని గట్టిగా పంతులుగారు అన్నారు.


" చేతికున్న ఆ దర్భ పడిపోయిందిరా.. చూసుకో " అని సంతోష్ తో అన్నారు పంతులుగారు...

వాడు దర్భ అంటే ఏంటో అని విస్తరిలో చూస్తున్నాడు, సునంద ఆగలేక మళ్ళీ దగ్గరకు వెళ్ళి ఆ దర్భని తీసి ఇవ్వబోయింది..

"వాడికి తెలుగు అర్ధమౌతుంది కదా? నేను తెలుగులోనే చెబుతున్నాను కదమ్మా... నువ్వు పక్కకు వెళ్ళు " అని మళ్ళీ  గదమాయించాడు


చిన్నబుచ్చుకొన్న మొహం తో మళ్ళీ వెనకాలకి వచ్చింది సునంద.

"ఎలా పొయారమ్మ మీ వారు? " అని ఎవరో ఆ గుంపులో అడిగారు

" యాక్సిడెంట్ లో పోయారండి " అని సమాధానం ఇచ్చింది సునంద


" ఏదైనా ఆస్తి పాస్తులున్నాయా మరి? నువ్వేదైన ఉద్యోగం చేస్తున్నావా? " అని అడిగింది ఒక పెద్దావిడ ఉండబట్టలేక...

" ఒక పాన్ షాప్ ఉందండి, వెయ్యి గజాల స్థలం మాధాపూర్ లో ఉంది, అదిగో మా అమ్మ నాన్నతో ఉంటున్నాను " అని సంతోష్ పక్కన పితృకర్మలు చేస్తున్న తన తండ్రిని చూపించింది సునంద.


" అయ్యో తాత మనవడు ఇలా ప్రయాగలో ఒకేసారి పిండప్రదానం చేస్తున్నారా? పగవారికి కూడా ఇలాంటి  కష్టం రాకూడదు " అని కళ్ళ నీరు పెట్టుకుంది ఒక పెద్దావిడ


"నేను ఎక్కువ చదువుకోలేదండి, టెంత్ అయ్యిన వెంఠనే పెళ్ళి, పెళ్లైన ఏడాదిలోపలే వీడు పుట్టేశారు " అని చెప్పింది సునంద


" వీడెనా ఇంకా పిల్లలు ఉన్నారా? " అని ఇంకో ప్రశ్న


" ఇంకో ఆడపిల్ల ఉందండి "


"చెయ్యి ఎడమవైపు తిప్పాలిరా అలా కాదు " అని మళ్ళీ పంతులుగారి అరుపు


చెయ్యి అన్ని వైపుల  తిప్పెస్తూ పంతులుగారి వైపు తిప్పాడు  సంతోష్


"నాకు కాదురా ఆ పిండం పెట్టేది అటు వైపు తిప్పి నేను చెప్పింది చెప్పు " అని అన్నారు  పంతులుగారు


ఆ మాటకి కాస్త నవ్వు వచ్చినా అక్కడి జనాలు మాత్రం నవ్వితే ఎమంటారో అని నవ్వలేకపోయారు..

పక్కన ఉన్న సంతోష్ తాత కళ్ళతో అలా కాదు అని సైగ చేశాడు. అది అర్ధం చేసుకున్నాడేమో తాత ఎలా చేస్తున్నాడో చూసి అలా చెయ్యి తిప్పాడు సంతోష్.


మొత్తానికి ప్రయాగలో సంతోష్ చేత అతని తండ్రికి శ్రార్ధం పెట్టించింది సునంద. అందరూ ఆ పంతులుగారికి తోచిన రొక్కం చెల్లిస్తున్నారు. డబ్బులు ఇచ్చి అతని కాళ్ళకి దండం పెడుతున్నారు

సంతోష్ చేతికి రెండు వందల రుపాయిలు ఇచ్చి పంతులుగారికి ఇవ్వమని చెప్పించి సునంద.

సంతోష్ భయంగా ఆయన దగ్గరకు వెళ్ళి డబ్బులు ఇవ్వబోతుంటే ఆయన చెయ్యి అడ్డం పెట్టారు

"అయ్యా.. డబ్బులు తక్కువైతే ఇంకో వంద ఇస్తానండి " అని సునంద పాపం కళ్ళలో నీళ్లతో అంది


"అమ్మా.. శ్రద్ధగా పెట్టేది శ్రార్ధం. ఇంత చిన్న వయసులో మీ అబ్బాయికి వచ్చిన కష్టం శతృవులకు కూడా రాకూడదమ్మా! ఎంతో డబ్బున్నా, శాస్త్రీయ కుటుంబాలకు చెందినవారు తల్లి తండ్రి పోతే ఎవరో ఒకరికి (డబ్బులు) కూలి  ఇచ్చి  దహన సంస్కారాలు చేయిస్తున్నారు. ఇక ఇలా ప్రయాగ, కాశీలో, గయలో పిండప్రధానం అనేదే లేదు. అలాంటిది నీ కొడుకు నా ద్వారా ఆ క్రతువు చేయించుకున్నాడు, ఆ తృప్తి చాలమ్మా. వాడిని కసిరింది వాడి ఆలోచనలు అటు ఇటు పోకూడదని, తప్పుగా అనుకోకే.. నా కూతురు లాంటి దానివి  "   అని పంతులుగారు అనడంతో అందరూ ఆయనవైపు చేతులు జోడించి మరీ చూశారు

సంతోష్ వైపు చూసి "అయ్యవారి కాళ్ళకి దండం పెట్టు " అని చెప్పింది సునంద

కాళ్లకి దండం పెట్టిన సంతొష్ ని లేవదీస్తూ " ఒరేయ్.. మీ నాన్న ఏ లోకాలలో ఉన్నా ఆయన  ఆత్మకి శాంతి కలిగించావు, ఉన్నత లోకాలు కలిగేటట్టుగా చేశావు. , బాగా చదువుకొని అమ్మని బాగా చూసుకొని ఆవిడకీ కూడా ఆనందాన్ని ఇవ్వు " అని అన్నారు  పంతులు గారు.


 "యథా నవనీతం హృదయం బాహ్మణస్య

వాచి కురో నిశిత స్త్రీక్షధాః  " గుర్తొచ్చింది.


ప్రయాగ వెళ్ళినప్పుడు ఆయనకి నా తరఫున కూడా దండం పెట్టండి. 

5 comments:

  1. ఇది కథో, వాస్తవంగా జరిగిన సంఘటనో తెలియదు కానీ ... ఉన్నత వ్యక్తిత్వం కలిగిన మనిషిలా అనిపిస్తున్నారు ఆ పంతులు గారు. అటువంటి వారు అరుదైన వ్యక్తులు 🙏.

    ReplyDelete
  2. ఇది యధార్ధ సంఘటన విన్నకోట నరసింహరావుగారు.

    ReplyDelete
  3. చక్కటి వృత్తాంతం అందునా పరమపావన కాశీలో. విప్రుడికి కోపం ఆభరణం. ఈపూటే చదివాను. మీరు అవధరించండి.

    http://sahitinandanam.blogspot.com/2018/12/blog-post_9.html

    ReplyDelete