నాకు ఇష్టమైన వ్యాసాలు, నేను పత్రికలకు వ్రాసిన వ్యాసాలు, కొన్ని పిచ్చాపాటి విషయాలు పొందుపరచుకున్న అందమైన "ఊహల కుటీరం " ఇది.
Search This Blog
Friday, September 29, 2017
లలిత భావ నిలయ
1967 లో విడుదలైన సంగీత, సాహిత్యాల అపురూప మేళవింపు 'రహస్యం ' . ఈ సినిమాలో నాగేశ్వర రావు, ఎస్. వి. రంగా రావు, కృష్ణ కుమారి, బి. సరోజా దేవి నటించారు. సంగీతము అందించినది ఘంటసాల గారు. సాహిత్యం మల్లది రామకృష్ణ శాస్త్రి. నాగేశ్వరరావు అంత వరకు ఒక లవ్ బాయ్ గా నటించారు. ఈ సినిమాలో కత్తి యుద్ధాలతో కాస్త వెరైటిగా కనిపిస్తారు. సంగీతపరంగానూ, సాహితీపరంగా చాలా అత్యుత్తమ నాణ్యత కలిగిన సినిమా అయినా అనుకున్నంత హిట్ కాలేకపొయింది. కానీ ఈ సినిమాలోని ప్రతి పాట ఒక ఆణిముత్యము. ఇప్పుడు ఒక పాట గురించి తెలుసుకుంద్దాము...
రహస్యం సినిమా కోసం ముగురమ్మలను వర్ణిస్తూ ఒక పాట వ్రాసి మల్లాది గారు... ఘంటసాలకి ఇచ్చి "సరస్వతీ దేవి వర్ణన సరస్వతీ రాగములో, లక్ష్మీదేవిని వర్ణన శ్రీరాగములో, లలితాదేవి (పార్వతిదేవి) వర్ణన లలితరాగములో " స్వర పరచమన్నారుట. ఆ సాహిత్యానికి ఘంటసాల మాస్టారుగారు ఈ విధముగా స్వరపరిచారు. అలా స్వరపరచిన పాట అర్ధమిదిగో ...
సంగీతము, సాహిత్యము సరస్వతిదేవి యొక్క స్థనద్వయాలు , ఒకటి గ్రోలినప్పుడు మధురాతి మధురము, మరొకటి ఆలోచనలను రేకెతించేది. ఒక కంటితో సంగీతాన్ని అందిస్తూ, మరొక కంటితో సాహిత్యాన్ని ప్రసాదిస్తుంది ఆ తల్లి.
అందుకే కాళిదాసు ' అశ్వధాటి స్త్రోత్రము " లో " రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ '"
ఆవిడని మించిన సౌందర్యము మరొకటి లేదు, అందుకే 'రుపాధికా శిఖరి (అధికమైన అందానికి శిఖరం ఆవిడ)
అరుణవసన.. = ఎఱ్ఱని వస్త్రములు ధరించునది /
అమలహసనా = అమలినమైన నవ్వు కలది(మాలీన్యము లేని నవ్వు ఆవిడ సొంతము)
మాలిని= పార్వతి, శివుని ఇష్టురాలు
భ్రామరి = భ్రామరాంబ..
శివుడు మల్లికార్జునుడిగా అవతారమెత్తి శ్రీశైలంలో ఒక మల్లె పువ్వుగా మారిపోయారుట, అప్పుడు ఆవిడ భ్రామరి అంటే నల్ల తుమ్మెదగా మారి ఆయన చుట్టూ తిరిగిందిట. ఈ రోజుకీ శ్రీశైలములో భ్రమరాంబ గుడి వెనుక తుమ్మెదల రొద వినపడుతుంది.
ఇక్కడ ఆవిడని భ్రమరముగా పోలిస్తే శివతాండవ స్త్రోత్రములో మాత్రం " రసప్రవాహ మాధురీ విజృంభణా మధువ్రతం " రసప్రవాహముగా ఉన్న ఆవిడ ముఖము దగ్గరకు విజృంభించిన మధువ్రతము అంటే తుమ్మదగా ఆ పరమేశ్వరుడు వచ్చాడుట.
సినిమా లో ఈ పాటని 'అంజలీదేవి ' ని పరమేశ్వరిగా, నారదుడిగా 'హరనాథ్ ' నటించారు. లలితా పరమేశ్వరి ఇలాగే ఉంటుందా అనిపించి పూర్ణ చంద్రబింబం లాంటి వదనం అంజలీదేవిది. ఆ ముఖములో చిరునవ్వు కూడా వెన్నెల కురిపిస్తోందా అనిపిస్తుంది. ' సామగానప్రియ ' అని అమ్మవారిని కీర్తిస్తాము, అలా ఆ పాటకి ఆనందిస్తున్నట్టుగా ఆవిడ సంతోషాన్ని ప్రకటించే తీరు అద్భుతము.
Very nice!
ReplyDeleteమీరు ధన్యులు. ఇంతకన్నా ఏమీ వ్యక్తీకరించడానికి మాటలు రావడం లేదు. 🙏
ReplyDelete