Search This Blog
Friday, September 29, 2017
లలిత భావ నిలయ
మాలిని... మనోన్మనీ
Tuesday, September 26, 2017
దసరా
దసరా అనగానే అమ్మవారి పూజలే గుర్తొస్తాయి. రోజుకో అవతారంతో ఆవిడ మనల్ని అలరిస్తుంది. ఆ అమ్మ ఆశీస్సులు ఈ రూపంలో ప్రతి ఇంట్లోనూ ఉంటాయి...
మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు...
నిన్న పొద్దుట కూరలకోసమని మార్కెట్‌కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ ఇల్లు, అర్పిత నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు... నెలలే అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్న రమ్మని చెప్పింది.
అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి అడుగుపెడుతోన్న అనుభూతి, ఇంటి ముందు మెళికల ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇల్లు తీర్చిదిద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా, ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకములోకి వచ్చా.
కాసేపు పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసర నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు ఆమెకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిపోనట్టు పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం! ఒక గజేంద్రమోహక్షము, గోపికలు కృష్ణుని ఘట్టాలు తీర్చిదిద్దిన విధానానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా " ఇదీ ఒక పెద్దపనేనా " అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.
"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...
ఒక చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారిని రోజుకొక అలంకారము చేసి, పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది. మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు, టిఫిలతో సరిపోయింది.
ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టగా ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు ఆయన ఫ్రండ్స్ ని తీసుకొచ్చి వీణ కచేరి చేయమని పురమాయించారు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారు దర్శనానికి తీసుకెళ్ళలేదు.
ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు చేయించడములో సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడయ్యిపోయింది, ఈయన సాయంత్రము లేటుగా రావడం తో ఆ రోజు గుడికి వెళ్ళలేకపోయాము.
ఇలా నవరాత్రులు హాడవిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని కౌగిలించుకొని రొప్పుతూ , ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళీ, రత్తాలిని కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త గడ్డి పెట్టి వచ్చాము. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలి అన్న ఆలోచనే మరచిపోయాము.
ఇంక దసరా రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాల్లతో చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కీ వచ్చిన చుట్టాలందరు ఎవరిల్లకు వారు వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను అడిగితే..
" ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.
చాలా ఉక్రోషం వచ్చేసింది.
" నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా? " అని నిలదీసా...
" నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..
" అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా? " అని అడిగా కాస్త గట్టిగా...
అందుకు ఆయన చిద్విలాసంగా..." నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో కలిసిపోయినప్పుడు బాల త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తోనప్పుడు ఒక గాయత్రిని చూశా, వీణపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చినప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...
ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా సిగ్గుతో నవ్వింది. ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన అని చెప్పింది.
"నిజమే కదా అర్పితా! స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి మహిషాసురమర్ధిని " అని అనేసి అలా ఇంటి దారి పట్టాను.
Saturday, September 23, 2017
సంపెంగ
నానాసూన వితానవాసనల నానందించు సారంగ మే
లా నన్నొల్ల దఁటంచు గంధఫలి బల్కాలం దపం బంది యో
షా నాసాకృతిఁ దాల్చి సర్వసుమనస్సౌరభ్యసంవాసి యై
పూనెం బ్రేక్షణమాలికా మధుకర పుంజంబు లిర్వంకలన్
సంపెంగ పువ్వు తన మీద తుమ్మెదలు వాలటంలేదని బాధపడి తపస్సు చేసిందిట, ఆ తపస్సుకి ఫలితంగా ఎప్పుడూ తుమ్మెదలని(నల్ల తుమ్మెదలను) తన తో కట్టిపరేసుకొనేలా 'గిరికా దేవి " ముక్కుగా మారిందిట!
ఈ పద్యం వసుచరిత్రలోనిది, వ్రాసినది ముక్కుతిమ్మన. ఈ పద్యం రాసినందుకే ఆయనకు "ముక్కు " అన్న బిరుదు తగిలించారన్న ప్రచారం కూడా ఉంది. ఈ పద్యాన్ని రామరాజభూషణుడు నాలుగు వేల వరహాలిచ్చి కొనుకున్నాడన్న ప్రచారమూ ఉంది. కానీ రామరాజు భూషణూడికి ఇంకొకరి పద్యాలు సంగ్రహించేతంట అవసరం లేదని కొంతమంది విజ్ఞులు అంటూ ఉంటారు.
( ఏది ఏవైతే మనకెందుకు? పద్యం సంపెంగిపువ్వంత సువాసనతో కూడుకొని ఉంది.. దాన్నీ ఆస్వాదిద్దాం అంతే! :)
ఒకసారి తంగిరాల సుబ్బారావుగారిని కలిసినప్పుడు అడిగాను ఇంతకీ ఆవిడ (గిరికాదేవి ) ముక్కు ఏ సంపెంగతో పోల్చారని. ఎందుకంటే నాకు తెలిసిన సంపెంగలు "బుట్ట సంపెంగ, ఆకు సంపెంగ, సింహాచలం సంపెంగ, కోడుగుడ్డు సంపెంగ " ఉన్నాయి. అప్పుడాయన "సింహాచలం సంపెంగలా ఉండే తెల్లటి సంపెంగతో ఆవిడ ముక్కుని పోల్చరని " చెప్పారు.
ఈ సంపెంగకి " చంపకము, చనుపకము, చాంపేయము, దీపపుష్పము, పచంపచము, పీతపుష్పము, భ్రమరాతిథి, సంపంగె, సంపెంగ, సురభి, స్థిరగంధము, స్థిరపుష్పము, హేమపుష్పము " అన్న పేర్లు ఉన్నాయి.
లలితా సహస్రనామాలలో అమ్మవారిని "చాంపేయకుసుమ ప్రియ " అని స్థుతిస్తారు. అంటే ఆవిడకు సంపెంగి పూలంటే ఇష్టమన్న ఒక అర్ధం.
"చాంపేయం " అంటే బంగారము అనే ఇంకో అర్ధం ఉంది. అంటే ఆవిడకు "బంగారు పూలంటే ఇష్టమని " అనుకోవచ్చు.
అదీ కాక బంగారు వర్ణం గల పులన్నా ఇష్టమన్న అర్ధమూ
ఉంది.
ది.
అమ్మవారి కొప్పుని వర్ణించినప్పుడు " చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచా " , ఆవిడ కొప్పుచంపకమూ(సంపెంగ), అశోకము, పున్నాగపూలతో నిండి ఉందీ. ఏ స్త్రీయేనా శిరోజాలకు మంచి సువాసన కలగాలని కొప్పులో పూలు తురుముకుంటుంది, కానీ అమ్మవారి కొప్పులో పూలు మాత్రం ఆవిడ శిరోజాల వాసన గ్రహించడానికి చేరుకున్నాయిట.
Friday, September 22, 2017
సహభాష్ కోకనాడి
“సహభాష్ కోకనాడి " అనే కవి పేరు విన్నారా ఎప్పుడేనా? అది ఆయన అసలు పేరు కాదు.. కలం పేరు. ఆ కవికి ఆ కలం పేరు ఉందని తెలిసిన వారు బహు కొద్దిమందేనేమో! ఎనిమిది భాషలలో ఆ కవి రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, గద్య, పద్య, కవితా రచనలు చేశారు. పన్నెండు భాషలలో అనర్గళంగా మాట్లాడగల సమర్ధుడు ఆయన. అందునా ఒక తెలుగు వాడు. ఆయన సొంత ఊరైన కాకినాడని తన కలంపేరుగా పెట్టుకొన్న మహా మనిషి, అమరగాయకుడు " ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు" .... అందరికి సుపరిచయం.. "పి.బి. శ్రీనివాస్ " అనే!
ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడ, సంస్కృతం ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు. ఉర్దూ కవితలు రాసినప్పుడు “సహభాష్ కోకనాడి ” అనే పేరుతో రాసేవారు. ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడలో 3000 లకు పైగా పాటలు పాడారు. ఆకలి రాజ్యం సినిమాలో "తూ హై రాజా మై హూ రాణి " అనే హింది పాట వ్రాసింది పి.బి. శ్రీనివాస్ గారే!
ఒకసారి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పి.బి. శ్రీనివాస్ గారి పాట విని ఆయన కుమారుడైన పావన శాస్త్రి గారితో " ఈ పాట పాడిందెవరూ? " అని అడిగారుట.
"పి.బి. శ్రీనివాస్ అదే ప్రతివాద భయంకర శ్రీనివాస్ అని... " అని ఆయన కుమారుడు జావాబివ్వగా
"మగటిమి ఉన్న గాత్రం .. భలే ఉంది " అని అన్నారుట ఆ గంభీర గాత్రాన్ని విని.
" డైమాండ్ టి " ... అనే ప్రక్రియతో ఒక మేలకర్త రాగానికి ఆరోహణ, అవరోహణలు చెబుతూ ఆ రాగాన్ని సులువుగా గుర్తుపెట్టుకోగల నైపుణ్యాన్ని ఎందరో విద్యార్ధులకు భోధించారు పి.బి. శ్రీనివాస్ గారు. అలా 72 మేలకర్త రాగాలను సులువుగా గుర్తించ గల ప్రక్రియ కనిపెట్టింది వారే! ఆయన కొన్ని రాగాలను సృష్టించారు కూడా! ఆ రాగాలకు సాహిత్యం కూడా వారే రాసుకునేవారు. ఆయన మన సమకాలికులైన వాగ్గేయకారుడు.
వారు ఎక్కడకు వెళ్ళినా ఆయన కారు నిండా పుస్తకాలతో నిండి ఉంటుంది. వారు ఏ సభలకు వెళ్ళినా ఒక చంటి పిల్లాడిని చేతిలో ఎత్తుకున్నట్టు ఆయన చేతిలో ఎప్పుడూ కనీసంలో కనీసం నాలుగైదు పుస్తకాలు ఉండేవి. ఆయన జీవితం లో పుస్తకాలకి అంతటి స్థానం ఉందన్న మాటా! వారి దగ్గర ఎక్కువ పుస్తకాలే కాదు... ఎక్కువ పెన్నులు కూడా ఎప్పుడూ ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న "ఫౌంటేన్ పెన్నులు " మరే రచయిత దగ్గరా లేవేమో! ఆయన ఎక్కువగా రాసుకునే చోటు "వుడ్ లాండ్స్ " (డ్రైవ్ ఇన్) . అక్కడ వారికోసం ఒక బెంచి, కుర్చి ఆ "వుడ్ లాండ్స్ " వారు ప్రత్యేకంగా ఉంచేవారుట.
ఒకసారి భువనచంద్రగారు "ఇంత వరకు మీరు కన్నడా లో రాజ్ కుమార్ గారికి ఎక్కువ పాటలు పాడారు కదా... ఇప్పుడు ఆయన పాటలు ఆయనే పాడుకుంటున్నారు.. దాని మీద మీ స్పందన ఏంటీ? " అని అడుగగా...
"అంత గొప్ప గాయకుడు ఏమాత్రమూ అతిశయోక్తి లేకుండా నాచేత పాడించుకోవడం నా అదృష్టం " అని చేతులు పైకెత్తి నమస్కరిస్తూ అన్నారు. ఈ ఉదాహరణ చాలదూ వారి సంస్కారానికి, వినయానికి?
సినిమా పాటలే కాదు, అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు ఘజల్స్ లోనూ ప్రావీణ్యులు పి.బి. శ్రీనివాస్ గారు! మన తెలుగు రాష్ట్రంలో కన్నా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గొప్ప గొప్ప సత్కారాలు పొందారు వీరు. అత్యుత్తమ అవార్డ్ అయిన "కన్నడ రాజ్యోత్సవ " అవార్డు ఇచ్చి సన్మానించింది కర్ణాటక ప్రభుత్వం.
తమిళ్ నాడు ప్రభుత్వం "కళై మామణి , విద్వత్ శిరోమణి " తో పురస్కరించింది. మన తెలుగు ప్రభుత్వం ఎప్పటిలాగానే ఒక విద్వాంసుడికి ఏ అవార్డ్ ఇవ్వక తన గొప్ప చాటుకుంది. ఈ రోజు వారి జయంతి... ఆయనకు నివాళులు.
(వారి గురించి ఎంతో రాద్దామని ఉన్నా.. నాకు వచ్చిన భాష ఇంతే సహకరించింది. వారి గురించి ఎన్నో విషయాలు తెలియ చేసిన భువనచంద్ర గారికి మనస్ఫూర్తిగా వందనాలు).
Wednesday, September 20, 2017
పున్నాగ
టైం 8:15... అప్పుడే భక్తి రంజని అయ్యింది. మా భోజనం కూడా అయ్యేది ఆ టైం కే! ఇప్పటిలాగా పొద్దుటే గాజు ప్లేట్ లో ఇడ్లీలో, దోశలతో పక్కన ఒక గ్లాస్ పళ్ళ రసంతో బ్రేక్ ఫాస్ట్ తినే రోజులు కావు. పొద్దుటే కలగలుపు పప్పూ అన్నము, పెరుగూ అన్నము... పొద్దుట బ్రేక్ ఫాస్ట్ అనబడు భోజనం, మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ నుంచి లంచ్ కి ఇంటికి వచ్చి అదే పప్పు, ఒక కూరా, మళ్ళీ పెరుగన్నం. సాయంత్రం 4 ఇంటికి స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ అదే పప్పూ... అదే కూరా... అదే పెరుగూ అన్నము. అప్పుడప్పుడు "అదే కూరా, అదే పప్పూ, అదే అన్నము " అని "అదే నీవు అదే నేను " కి ప్యారెడిగా పాడుకునేవాళ్ళము. రాత్రి డిన్నర్ కి వేరే కూర, రసం, (పచ్చడి ఆప్షనల్) పెరుగు అన్నము. ఇన్ని సార్లు అన్నం తిన్నా కాలెరీలు ఎక్కువయ్యిపోతాయన్న బాధ .. కాదూ ఆలోచనే లేని రోజులు.
స్కూల్ కి తయ్యారవుతుండగా జనరంజని మొదలయ్యేది. "ఇదే ఇదే నేను కోరుకుంది.. ఇలా ఇలా చూడాలని ఉంది " పాట వస్తోంది. ఈ పాట పక్కింటి వెంకట్ అన్నయ్య, స్వరాజ్యలక్ష్మి అక్క లంగా ఓణీ వేసుకొని వచ్చినప్పుడు పాడాడు. "ఆ జడపొడుగూ మెడ నునుపూ చూస్తుంటే " అని కూడా పాడాడు. ఆ అక్క కూడా " ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది " అని పాటకు పాట రిప్లై ఇచ్చింది. అప్పుడు ఈ పాటలు, ఆ సీన్లు సేవ్ చేసేసుకొని ఉన్నాను. కాస్త పెద్దయ్యాక డీ కోడ్ చేసుకొంటే అర్ధమయ్యాయి ఆ పాటల రాయబారాలు.
జనరంజని లో రెండు పాటలు అయ్యాక స్కూల్ కి బయలుదేరేవాళ్ళము నేనూ మా తమ్ముడు. పోస్ట్ ఆఫీస్ దగ్గరకు రాగానే శిరీష, అర్పిత కలిసేవారు. ముగ్గురం ముందు రోజు టి.వి. లో వచ్చిన చిత్రహార్ లో పాటల గురించో, చిత్రలహరిలో "హే కృష్ణా ముకుందా మురారీ " అనే ఒక్క పాటతో చిత్రలహరి అవ్వగొట్టెసినందుకో బాధపడిపోయేసేవాళ్ళము. పాలబూత్ సందు చివర్లో సంపెంగి చెట్టు కి ఏవైనా పూలు ఉన్నాయేమో అని ఒకసారి వెతికేసి... ఉంటే కోసేసుకొని... మళ్ళీ స్కూల్ కి ప్రయాణం కొనసాగించేవాళ్ళం. పాల బూత్ సందుకి ఎడం వైపు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఇంటి ఎదురుగా "డాంబర్ ఇంటికి " పక్కన ఒక "పున్నాగ చెట్టు " ఉండేది. ఆ చెట్టు కింద బోలెడు పూలు పడి ఉండేవి. ఆ పూలు ఏరుకొని ఏ టీచర్ కి ఇవ్వాలో అని ఆలోచించుకుంటూ రామ్ నగర్ గుండు దాటే వాళ్ళం.
స్కూల్ కి ఎదురుగా ఒక ఇంటి దగ్గర "గౌరీ మనోహరి " పూలు ఉండేవి. ఇంక ఆ పూల మీద వాలేవాళ్ళము. ఆ పూలు కూడా కోసుకొని అప్పుడు స్కూల్ కి వెళ్ళేవాళ్ళము. లలితా నగర్ నుంచి వచ్చే జ్యోతి ఎక్కువగా "కౌరవ పాండవుల " పూలు తెచ్చేది. మేము పోగేసి తెచ్చిన ఈ పూలన్నీ ఎక్కువగా "రమా కుమారి " టీచర్ కి ఇచ్చేవాళ్ళము. పాపం ఆవిడ " ఇవన్నీ షో పూలు తలలో పెట్టుకోరు " అని అనకుండా అన్నీ పూలు తలలో పెట్టుకునే వారు. మాకు ఆవిడ అలా పూలు పెట్టుకుంటే చాలా ఆనందం వేసేది. పూలు గుచ్చుకోడానికి దారం లేకపోయినా ఒక తొడిమలో ఇంకో పూవు పేర్చి మాలగా అల్లుకునేవారు రమా కుమారీ టీచర్. ఆ మాలే తలలో తురుముకొనేవారు ఆవిడ.
ఇలా పూలు పోగేస్తూ పోగేస్తూ ఉన్నరోజుల్లో ఒకరోజు "గౌరీ మనోహరి " పూలు కోస్తూ అర్పిత పుచ్చకాయిలా దొర్లిపోయింది. అలా దొర్లి ఒక స్కూటర్ ముందు పడింది... ఆ స్కూటర్ అతను సడన్ గా బ్రేక్ వేశాడు. కీచ్ మని సౌండ్ తో ఆగింది ఆయన స్కూటర్... అర్పితకి ఏవీ కాలేదు. కానీ మా అందరికీ ఒకటే ఒణుకు, భయం. ఆ అంకుల్ కూడా భయపడి కాస్త ధైర్యం తెచ్చుకొని " ఏమీ జరగలేదు కదా బిడ్డా " అని మొదట పరామర్శించి, ఆ తరవాత మందలించారు. ఇంక ఆ రోజు లగాయెత్తు పూలు కోసే ప్రక్రియ మానుకున్నాము.
ఈ రోజు పొద్దుట మా పెరటి తలుపు తీస్తుంటే దూరంగా ఉన్న పున్నాగ పూల వాసన ఈ జ్ఞాపకాలన్నింటినీ ఒకసారి కళ్ళముందు కదిలించింది.
Monday, September 18, 2017
రాచ్చిప్ప
" రాచ్చిప్ప మొహం నువ్వూనూ " అని కొందరు,
"ఎన్ని సార్లు చెప్పినా ఆ బుర్రకి ఏదీ ఎక్కదు.. సుద్ద మొద్దురాచిప్ప " అని పాపం ఆ రాచిప్పని బోలెడు అవమానించేస్తారు.
పూర్వం ఆ రాచిప్పలో పులుసు చేసుకొని రెండు రోజుల పాటు తినేవారుట. ఆ రోజు వండిన పదార్ధాల వేడి మరునాటికి కూడా ఉండేదిట. మా చిన్నప్పుడు చద్దికుండ వసారా లో మాగాయితో , ఉప్పుతో ఉండేవి ఈ రాచ్చిప్పలు.
ఒకసారి ఈ మధ్యనే మాధవపెద్ది సురేశ్ గారింటికి వెళ్లాను. ఆయనతో కబుర్లు చెబుతుంటే వారి సతీమణి (చిట్టి పిన్ని), వంటింట్లో ఇంగువ పోపు వేస్తున్నారు. తీరా ఆ పోపు దేనిలోకో అని చూడగా కొరివికారం (పండు మెరపకాయల పచ్చడి) ఓ రాచ్చిప్పలో వేసి దానికి ఇంగువ పోపు! అసలే కొరివికారం,ఆ పై ఇంగువ, అదీ రాచ్చిప్పలో... రుచి అద్భుతం. ఇంక అప్పటి నుంచి ఎలాగైనా ఇంట్లోకి రాచ్చిప్పని తీసుకొని రావాలని దృఢనిశ్చయానికి వచ్చేశా.
ఆ తరవాత వైజాగ్ వెళ్ళాను, అక్కడ అందరినీ "రాచ్చిప్ప ఉందా మీ ఇంట్లో " అని అడిగా. కొందరికి కోపం కూడా వచ్చేసింది. వాళ్ళనే అన్నననుకొని.
:( కాఫీ నీళ్ళు కూడా ఇవ్వకుండా పంపేశారు.
😔
ఇంకొకరి ఇంటికి వెళ్ళి " మీ ఇంట్లో రాచ్చిప్ప ఉందా? " అని అడిగితే ఆ కోడలు మూసిముసిగా నవ్వింది. ఆ అత్తగారు కారాలు మిరియాలు నూరారు. ఇంక వైజాగ్ లో ఎవరిని అడగకూడదని అనుకొన్న.
ఆ తరవాత అమలాపురం లో "వేట ' మొదలెట్టా. రోడ్డు మీద 'రుబ్బు రోళ్ళు " కనిపిస్తే, వాటిని అమ్మే వాళ్ళ దగ్గరకు వెళ్ళి "రాచ్చిప్ప ఉందా? " అని అడిగేద్దాన్ని. వాళ్ళు నా మొహాన్ని అదోలా చూసేవారు
:(
ఇలా అందరినీ అడిగి అడిగి అలసిపొయాను. " ఇన్నేళ్ళు నన్ను "రాచ్చిప్ప రాచ్చిప్ప " అని తిట్టేవారు మీరంతా, ఇప్పుడు నీకు అంత తొందరగా దొరుకుతానా? " అని రాచ్చిప్ప అన్నట్టనిపించేది.
ఒక శుభ దినాన్న అందరం కలిసి ఐనవెల్లి విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్ళాము. గుడి బయట బొమ్మలు అమ్ముకొనే వాళ్ళ దగ్గర పొరపాటునా ఈ రాచ్చిప్ప కనిపిస్తుందేమో అన్న ఆశ. అటు నుంచి మా వారి మేనత్తని చూడటానికి వెళ్ళాము. ఆవిడ ఇంట్లోని వెళ్లగానే నా కళ్ళు నా ప్రమేయం లేకుండా ఇంటిని వెతికేశాయి. అంతే... టక్కు మని ఒక చోట ఆగాయి. ఆ గూట్లో పెద్ద "రాచ్చిప్ప " . అంతే మనసంతా ఆ రాచ్చిప్ప మీదే!
😍
"ఏం తల్లి రాచ్చిప్ప కావాలా? " అని మనసు అడిగినట్టనిపించింది. పాపం ఆ పెద్దావిడ ఏం మాట్లాడిందో, నేనేమి సమాధానం ఇచ్చానో గుర్తు లేదు.
ఇంక ఆగలేక అడిగేశా " మీరు ఆ రాచ్చిప్పతో ఏం చేస్తారు? "అని
"ముగ్గు పోసుకుంటా " అని ఆవిడ సమాధానం
ఇంక లాభం లేదు... చల్లకొచ్చి ముంత దాచడమెందుకు?
"నాకు ఇస్తారా ఆ రాచ్చిప్పని " అని అడిగా
ఆవిడ నావైపు చెత్త ఏరుకోడానికి వచ్చిన మునిసిపాలిటి వాన్ లో వ్యక్తి ని చూసినట్టు చూసి "దాన్నేం చేసుకుంటావే? " అని అడిగింది.
"కొరివికారం లో పోపు వేసుకుంటా " అని చెప్పా
"సరే ఇస్తాలే " అని అన్నారు.
" నా దగ్గర ఇంకా రెండు చిన్న రాచ్చిప్పలు కూడా ఉన్నాయి " అని ఆవిడ మాటల సందర్భంలో అన్నారు ,
(" ఏం తల్లీ ఇంకో రెండు రాచ్చిప్పలు కావాలా? "
)
😍
నా కళ్లల్లో మెరుపు... " అవి కూడా ఇచ్చేయండి " అని అడిగేశా
మొత్తానికి ఆవిడకి వీడుకోలు చెప్పి ఆ రాచ్చిప్పలు తెచ్చేసుకున్నానోచ్ !
ఇదిగో ఈ రోజు ఆ రాచ్చిప్పలలో కొరివికారం వేసి అందులో పోపు వేసుకొని, వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తినేశా!
😍
😌
రావుబాల సరస్వతి దేవి
తెలుగు పాటల మణిహారములో సరస్వతీ దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గుళికగా అందించిన గాయకులు ఎందరో. ప్రతి పలుకు సుమ దలాలుగా తగిలే గాయనీలు మాత్రము కొద్దిమందే. లాలిత్యం, హాయిగా రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో చెప్పుకోతగినవారు రావుబాల సరస్వతి దేవి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ.
93 సంవత్సరాలు వయసులో ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడ ద్వారా మనకు తెలిసిన కొన్ని విషయాలు.
మీ జననం :
నేను 1928 ఆగస్ట్ 28న మద్రాస్ లో జన్మించాను. పెరిగింది గుంటూరు జిల్లా బాపట్లలో. నాన్న పార్థసారథి, అమ్మ విశాలాక్షి.
మీ విద్యాభ్యాసం :
పాటల మీద ఆసక్తి ఎక్కువ అవ్వడంతో, చదువు మీద శ్రద్ధ తగ్గింది. స్కూల్ కి ఎగ్గొట్టడం మొదలగునవి చేసేదాన్ని. అమ్మ తిట్టి, కొట్టేది. కానీ నాన్న గారు మాత్రం బాగా ప్రోత్సాహం ఇచ్చారు.
పాటల మీద మీకు కలిగిన ఆసక్తి :
మా తండ్రి గారికి ఒక థియేటర్ ఉండేది, అక్కడ ఎక్కువగా నాటకాలు, మూకీ సినిమాలు ప్రదర్శించేవారు. శ్రీరంజని, స్థానం నరసింహా రావు గారు, కపిలవాయి మొదలగువారందరు అప్పుడు ఆ నాటకాలలో నటించేవారు. వారు పాడే తీరు చూసి పాడాలనే కుతూహలం కలిగింది. ఒకసారి కపిలవాయి రఘునాథం గారు ఒక నాటకం ప్రదర్శిస్తున్నారు, ఆ నాటకానికి నేను మా అమ్మగారితో కలిసి వెళ్ళాను. అప్పుడు ఆ నాటకం లో "నమస్తే ప్రాణనాథ" అనే పాట నేను పాడుతానని మారాము చేశాను. మా అమ్మ ఊరుకోమన్నా ఊరుకోలేదు. ఇదంతా స్టేజ్ మీదనుండి కపిలవాయి గారు చూశారు. అంతే స్టేజ్ దిగి నన్ను ఎత్తుకొని ఆ పాట స్టేజ్ మీద పాడించారు. అది చూసి ఆ నాటకానికి వచ్చిన వారు, నటించినవారు చాలా ముచ్చట పడ్డారు.
సినీగీతాలు పాడుటకు మీకు కలిగిన అవకాశం:
గుంటూరులో కొబ్బరపు సుబ్బారావు గారు హెచ్.ఎం.వి. లో గ్రాంఫోను రికార్డింగ్ చేసేవారు. "భక్త కుచేల" సినిమా కోసం, కుచేలుని కూతురిగా నటించడానికి, తన పాట తాను పాడుకునే పిల్ల కోసం చూస్తున్నారు. ఎవరో నా పేరు చెప్పారు. 1934లో, అంటే నా 6 సం||ల వయసులో మొదటి సారిగా సినిమాలకి పాట పాడాను నేను. ఆ రోజుల్లో ఆ వయస్సులో పాటలు పాడిన రికార్డ్ నాకే దక్కింది.
సినిమాలలో బాలనటిగా మీ ప్రవేశం :
సి. పుల్లయ్య గారు "సతీ అనసూయ", "దృవవిజయం"(1935) తీయడానికి నిర్ణయించుకున్నారు. అందులో నటించేవారందరూ 13 ఏళ్ల లోపువారే. ఆ సినిమాలో "గంగ" పాత్ర నన్ను వరించింది. ఆ సమయం లో రికార్డింగ్ కలకత్తాలో జరిగింది. ఆ రికార్డింగ్ కి మా నాన్న గారు తీసుకొని వెళ్ళారు. ఆ సమయం లో నన్ను ఎవరు ఎన్ని పాటలు పాడమన్నా సరే ఒక "కాడ్బెరీ చాక్లెట్" ఇస్తే పాడేసేదాన్ని. అప్పుడు నేను పాడిన పాటలన్నీ " ఈస్ట్ ఇండియ స్టూడియో " లో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో నేను "సైగల్" మొ|| పెద్దవారిని చూసి నేర్చుకునే అవకాశం లభించింది. నా గొంతులో వచ్చే మార్ధవ్యము, లాలిత్యము అలా బెంగాళీ గాయకులను చూసి అలవరించుకున్నదే.
కె. సుబ్రహ్మణ్యంగారు "భక్త కుచేల"(తమిళ్) లో యాక్ట్ చేయమని అడిగారు నన్ను. నాకు ఆ సమయంలో తమిళ్ లో మాట్లాడటమే వచ్చు, కాబట్టి పెద్ద పెద్ద బోర్డుల మీద డైలాగులు తెలుగులో వ్రాసి చెప్పించేవారు. ఆ డైలాగులు అన్నింటికీ చెరో "కాడ్బరీ చాక్లెట్" ఇచ్చేవారు. ఆ సినిమాలో కుచేలుని కూతురు, బాల కృష్ణునిగా నటించాను. (ద్విపాత్రాభినయం)
ఆ తరవాత తీసిన "బాల యోగిని"లో కూడా నటించాను. అలా "బాల" కృష్ణుడు, "బాల"యోగినిలో నటించడంతో " సరస్వతి " అని అమ్మా నాన్న పెట్టిన పేరు కాస్త "బాల సరస్వతి" గా మారింది.
శాస్త్రీయ సంగీతం మీరు ఎక్కడ నేర్చుకున్నారు :
ఆ తరవాత గుంటూరు వదిలి మా కుటుంబమంతా "మద్రాస్" చేరాము. ఆలతూరు సుబ్బయ్య గారి దగ్గర శాస్త్రీయ సంగీతము అభ్యసించాను. పునాది కోసం సంగీతం నేర్చుకున్నాను కానీ సింగపూర్ రబ్బర్ లా సాగే ఆ రాగాలన్నా, ఆ గమకాలన్నా అంత ఇష్టము ఉండేది కాదు నాకు. అందువల్లనే అటువంటి పాటలు పాడటానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడూ అలా పాడటానికి సాహసించలేదు కూడా. నాకు సున్నితమైన, ఆహ్లాదకరమైన సంగీతమే ఇష్టము. అది ఆనాటిది కానివ్వండి, ఈనాటిదైనా కానివ్వండి- కేకలు పెట్టే పాటలు, సాగతీసే పాటలు ఏ నాడు పాడలేదు, ఇష్టపడలేదు.
కథానాయికగా సినిమాల్లో ప్రవేశం :
"ఇల్లాలు" సినిమా తీయడానికి గూడవల్లి రామబ్రహ్మం గారు ఎస్. రాజేశ్వరరావు గారిని యాక్టర్, సంగీత దర్శకుడిగా స్వీకరించారు. అదే సినిమాకు హీరోయిన్ గా నన్ను తీసుకున్నారు. కానీ, నన్ను ఒక తమిళ్ అమ్మాయిగా పరిచయం చేశారు. ఆ విధంగా సినిమాలలో ప్రవేశం జరిగింది. అప్పటి నుండి ఎస్. రాజేశ్వరరావు గారితో ఎన్నో పాటలు పాడాను.
ఏ.ఐ.ఆర్. లో మీ ప్రవేశం :
ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో సాయంత్రము 7:30 కి జరిగే పాటల కార్యక్రమములో పాడవలసిన గాయని రాలేదు. అప్పుడు నేను పని చేస్తున్న స్టుడియోకి "ఎవరైనా పాడేవారు ఉన్నారా?" అంటూ కబురు పంపించారు. స్టూడియో ఓనర్ "ఒకరేమిటి! రాజేశ్వర రావు, బాల సరస్వతి అనే ఇద్దరు పిడుగులు ఉన్నారు" అని మమ్మల్ని పంపారు . ఆ విధంగా ఏ.ఐ. ఆర్. లో పాడే అవకాశం 1940 లో లభించింది. లైట్ మ్యూజిక్ అనేది ఏ.ఐ.ఆర్. లో ప్రారంభమయ్యింది అప్పటి నుండే.
మీ నాన్నగారి సినిమాల్లో పాడారా :
అప్పటికి నేను ఇంకా "చైల్డ్ ఆర్టిస్ట్" గా సినిమాలలో చేస్తున్నాను. మా నాన్న గారు "రాధిక" అనే సినిమా తీశారు. పద్మనాభం బాలకృష్ణునిగా, రఘురామయ్య గారు (ఈల పాట) పెద్ద కృష్ణునిగా నటించారు. ఆ సినిమా హిట్ కాలేదు కానీ, అందులో నేను పాడిన "గోకులంలో కృష్ణుడు నల్లన, గోకులంలో పాలు తెల్లన" చాలా ప్రజాధరణ పొందింది.
ప్లే బ్యాక్ సింగర్ గా మీ కెరీర్ :
1943లో భాగ్యలక్ష్మి సినిమా తీశారు. అందులో కమలా కోట్నీస్ యాక్ట్ చేశారు. ఆవిడకు ప్లే బ్యాక్ నేను పాడాను, అదీ బి.ఎన్.ఆర్. గారి ప్రోత్సాహం తో. ఆ సినిమాకి నేను పాడిన పాట "తిన్నే మీద చిన్నోడా" తెలుగులో మొట్ట మొదటి ప్లే బ్యాక్ వేరే వారికి పాడినది.
మీ వివాహం, తదనంతరం మీ కెరీర్ :
నా 15వ ఏట అంటే 1944 లో కోలంక రాజా వారితో (వెంకటగిరి సంస్థానం) నా వివాహం అయ్యింది. ఆ తరవాత పాటకి శృతి తప్పింది. ఇంట్లో వారు ఇలా సినిమాలలో పాడటం చిన్నతనంగా భావించేవారు. కాబట్టి వారికి చెప్పి, నా చేత పాటలు పాడించడం మాన్పించేశారు. ఏ.ఐ.ఆర్. కి మాత్రం పాడటానికి అనుమతి ఇచ్చారు.
ఆ తరవాత నా అంతట నేనే కొన్ని పాటలు కంపోస్ చేసుకొని రేడియో లో పాడాను. "చలి గాలి వచ్చింది", "నల్లని వాడా నీ గొల్ల కన్నెనోయి", "హాయమ్మ హాయి బంగారు పాపాయి", "గోపాల కృష్ణుడు" చాలా ప్రాచుర్యం పొందాయి. అలా గత 5-6 సం||ల వరకు పాడాను.
మీరు ఎటువంటి పాటలు పాడటానికి ఇష్టపడతారు :
ఆర్టిస్ట్ వాయస్ కల్చర్ కి తగినట్టుగా పాటలు ఇస్తే ఎలాంటి పాటలైనా వినసొంపుగా ఉంటాయి. అలా కాక నా చేత అరుపులు, హై పిచ్ లో పాడిస్తే అవి కర్ణకఠోరమే. అందుకే కొన్ని పాటలు పాడననే చెప్పాను. నాకు సాటిస్ఫాక్షన్ లేని పాటలు ఎంత బలవంత పెట్టినా పాడలేను.
అప్పటి మీ తోటి గాయనీగాయకులతో మీ సాన్నిహిత్యం :
అప్పుడు పాడిన వారిలో ఎం.ఎల్. వసంత కుమారి , పి.ఎం. పెరి నాయక్ , టి.వి. రత్నం వీళ్లంతా తమిళ్ గాయనీమణులు. నా తరవాత పాడినవాళ్ళలో జిక్కి, లీల, జమునారాణిలతో సన్నిహితం కలదు.
జెమిని స్టూడియోస్ వారు "రాజీ నా ప్రాణం" అనే సినిమాకి "మల్లె పూలు మొల్ల పూలు" అనే పాట వెస్టర్న్ స్టైల్లో పెట్టారు, అంత రేంజ్ లో పాడటానికి కొద్దిగా కష్టపడ్డాను. నాతో పాడేటప్పుడు ఘంటసాల వారి శృతి తగ్గించుకొని పాడేవారు. ఏ.ఎం. రాజా గారిది నాతో సరిగ్గా సరిపోయేది.
ఇష్టమైన పాట :
తెనాలి రామకృష్ణలో "ఝం ఝం కంకణములు మ్రోగ"(జావలి), స్వప్న సుందరి లో పాటలు అన్నీ ఇష్టము.
కష్టపడి పాడిన పాట :
"రాజీ నా ప్రాణం" లో "మల్లె పూలు" పాట 5 రోజులు పట్టింది రికార్డ్ చేయాడానికి. చిన్న తప్పుకే మళ్ళీ మొత్తం పాట మొదలెట్టాల్సి వచ్చేది. 60- 70 మంది ఆర్కెస్ట్రాలో ఏ ఒక్కరు తప్పు వాయించినా మళ్ళీ కథ మొదటికే. ఇలా ప్రాణాలు తోడింది "రాజీ నా ప్రాణం".
ధరణికి గిరి భారమా పాట గురించి :
ఈ పాట సినీ ప్రపంచానికి దూరమయ్యే ముందు పాడిన పాట , చాలా ప్రజాధరణ పొందింది.
అభిమాన గాయనీ గాయకులు :
ట్యూన్, సంగీతము నచ్చితే ఏ పాటైనా ఎవరు పాడినా వింటాను. ఎవరైనా ఒరిజినల్ వాయిస్ లో పాడితే చక్కగా ఉంటుంది, ఫాల్స్ వాయిస్ లో కీచు గొంతుతో పాడితే కర్ణకఠోరమే.
ఇష్టమైన రాగం :
భీంపలాస్ "తలపు తీయునంతలోనే తత్తరపాటు ఎందుకోయి" సి.వి. సుబ్బరామన్ చేసిన ఆ రాగం ఇప్పటికీ మరువనిది. ఎస్. రాజేశ్వరరావు గారికి కూడా ఇష్టమైన రాగం ఇదే. ఆయన ఎక్కువ పాటలు చేసినది కూడా ఇదే రాగం లో. మేము ఎక్కువగా పాడినది ఈ రాగం లోనే అవడం మూలంగానేమో చాల ఇష్టమైన రాగం అయ్యింది.
సినిమాలో చివరి పాట :
"సంఘం చెక్కిన శిల్పాలు" (విజయనిర్మల తీసినది) లో నాచేత పాడించింది. రమేశ్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో.
ఈ నాటి పాటల పై అభిప్రాయము:
భాష రానివారి చేత కూడా పాడించినప్పుడు అందులో భావం, తప్పొప్పులు చెప్పి పాడించాలి. అప్పుడే పాట సుస్థిరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఎస్. రాజేశ్వర రావు గారు, సుసర్ల దక్షిణా మూర్తి , పెండ్యాల సి.వి. సుబ్బరామన్ గారు... వీరందరు నా తరవాత వచ్చిన వారే, కానీ నాకంటే పెద్దవారు. వారిని ఈ రోజుకీ గుర్తు పెట్టుకునేలా చేసింది వారి ఆహ్లాదకరమైన పాటలే.
అవార్డ్స్ :
ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు.
ప్రస్తుతం మీ జీవితం:
1974లో భర్త పోయాక మైసూర్ లో సెటిల్ అయ్యాను. కానీ ఎన్.టి.ఆర్. నన్ను ఆంధ్రాకి రమ్మని బతిమాలి తగిన స్థానాన్ని ఇస్తామని అన్నారు. కాని తీరా వచ్చాక ఆయన పదవి నుండి, ఆ తరవాత శాశ్వతంగా పోవడంతో నేను మళ్ళీ ఏ గుర్తింపు లేకుండా ఉండిపోయాను.
గాయనిగా మీ ప్రస్థానంలో ఒక చోట ఆగిపోయారు.. గాయనిగా మీరు కోల్పోయినదేంటి?
నా తరవాత వచ్చిన ఎందరో గాయనీమణులు చాలా ఖ్యాతి పొందారు, అది వారి అదృష్టము, వారి విద్వత్తు కి ఒక మైలు రాయి కావచ్చు, కానీ వారు మంచి సంగీత దర్శకుల చేతిలో పడటం వజ్రానికి సాన పెట్టడం లాంటిదే. కొందరు సంగీత దర్శకులు చేసిన ప్రయోగాలు వారికి వరాలయ్యాయి.
జానకి సన్నాయితో కలిసి ఆలపించిన పాట, ఎస్.రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో సుశీల పాడిన వీణ పాటలు, వారి ఖ్యాతి కిరీటంలో చక్కటి మణులు. ఇలాంటి అవకాశాలు నాకు లభించలేదు.
ఈ వయసులోనూ ఏమాత్రమూ విసుగు లేకుండా అడిగీ ప్రశ్నలన్నింటికీ చాలా శాంతంగా, వినయంగా జవాబిచ్చిన 'బాల సరస్వతీ దేవి " గారికి కృతజ్ఞతలు. భగవంతుడు ఆవిడకు ఆయురారోగ్యాలు ఇవ్వలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Subscribe to:
Posts (Atom)