Search This Blog
Friday, November 23, 2018
Tuesday, October 30, 2018
జ్యోతి
హాల్ అంతా కోలాహలంగా ఉంది. చాలా రోజుల తరవాత కలుసుకున్న చుట్టాలతో ఎప్పటెప్పటివో కబుర్లతో చాలా సందడిగా ఉంది. ఇంకా జ్యోతి రాలేదు. అందరూ తన గురించే ఎదురు చూస్తున్నారు. జ్యోతి భర్త దీపక్ వచ్చిన వారందరికీ కూల్ డ్రింకులు అందాయో లేదో చూస్తూ, అక్కడ పనివాళ్ళకు పనులు పురమాయిస్తూ హాల్ అంతా తిరుగుతున్నాడు. జ్యోతీ దీపక్ లు చాలా శ్రీమంతులు. అటువంటి వారింట్లో చిన్న ఫంక్షన్ అయినా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. అప్పటికే అక్కడ చేరిన కొంతమంది జ్యోతి సంతానం గురించి ఎన్నో కాలక్షేపం కబుర్లు చెప్పుకోసాగారు. కొందరు కామెడీలు కూడా చేశారు. కాసేపయ్యాక జ్యోతి, తన అమ్మ, అత్తగార్లతో హాల్ కి వచ్చింది. జ్యోతి చేతిలో ఏడాది పిల్లాడు, జ్యోతి వాళ్ళ అమ్మ చేతిలో రెండున్నర ఏళ్ళ పాప, జ్యోతి అత్తగారి చేతిలో మూడేళ్ళ పాప ఉన్నారు. అందరూ కాసేపు ఆశ్చర్యమూ, వెటకారముతో కూడిన నవ్వులతో జ్యోతిని పలకరించారు.
"ఈ రోజుల్లో కూడా ఇంకా ముగ్గురు పిల్లల్ని సాకడం అబ్బో... " అని వంకరగా...
" కాస్తైనా చూసుకోవాల్సింది జ్యోతి " అని ఇంకొకరు ఉచిత సలహా పారేశారు.
"ముగ్గుర్ని... కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది " అని ఒకరంటే...
"సంతాన లక్ష్మిలా భలే నిండుగా ఉన్నావు " అని ఒకరు
అసలు విషయం గ్రహించిన జ్యోతి మాత్రం అందరికీ చిరునవ్వే సమాధానం ఇచ్చింది. కేక్ కట్టింగ్ అయ్యాక, అందరికీ అడిగి అడిగి కొసరి కొసరి మరీ వడ్డించి కడుపు నిండేలా అన్ని రుచికరమైన పదార్ధాలు తినిపించారు జ్యోతీ దీపక్ లు. ఇక అందరూ వెళ్ళే ముందు జ్యోతి.. "ఒక్క నిమిషం మీ అందరితో కొంచం మాట్లాడాలి " అని అంది.
"మీరందరూ ఈరోజు మా పిల్లల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థాంక్స్. నాకు పెళ్లైనప్పటి నుంచి పిల్లలు కావాలనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. దీపక్ కి కూడా పిల్లలంటే చాలా ఇష్టము. మా దురదృష్టమేంటో కానీ పెళ్ళైన 10 ఏళ్ళ వరకు పిల్లలు పుట్టలేదు. మా పేర్లల్లో జ్యోతీ దీపక్ ఉన్నా మా జీవితాలలో మాత్రం వెలుగు లేదు. ఎంత డబ్బు ఉన్నా పిల్లల చేత "అమ్మ " అని అనిపించుకోని ఆ వెలితి అనుభవిస్తే కానీ అర్ధం కాదు. అన్ని రకాలుగా ప్రయత్నించివిసిగి వేశారిపోయాక ఇదిగో అప్పుడు "ద్యుతి " వచ్చింది. మా జీవితం లో నిజం గా ద్యుతి ద్యుతినే తెచ్చింది. కానీ అప్పటికీ నాకు ఇంకా తనివి తీరలేదు. ద్యుతికి ఏడాదిన్నర వచ్చాక ద్యుతికి చెల్లెలు "మయూఖ " వచ్చింది. వాళ్ళ అల్లరితో ఇల్లంతా కళకళలాడింది. మా మొహాలలో చిరునవ్వు కూడా అంత అందంగానే విరబూసింది. ఇంక వాళ్ళిద్దరికీ ఒక తమ్ముడు కావాలని అనిపించింది మాకు.. అంతే ఇదిగో "చిరాగ్ " గాడు వచ్చాడు నేనున్నానంటూ! గత పదేళ్ళుగా "అమ్మా " అన్న పిలుపు కోసం ఎంత తపించిపొయానో... దేవుడు దానికి రెట్టింపుగా ప్రతి నిమిషం "అమ్మ , అమ్మా " అంటూ నా వెంట తిరిగే ముగ్గురు ముత్యాలని ఇచ్చాడు. వారి నవ్వుల పువ్వులతో, ఏడ్పుల గాడ్పులతో, కోపాల కారాలతో, ముద్దుల తీపితో నాకూ రోజు ఉగాదే!
నేను ఒక కూతురిగా అమ్మ నాన్నల నుంచీ అన్ని సిరులు పొందాను. ఇంక ఒక భార్యగా దీపక్ నాకు అన్ని ముచ్చట్లు తీర్చాడు. కానీ ఒక తల్లిగా పొందాల్సిన ముచ్చట్లేవి నాకు పదేళ్ల పాటు దక్కలేదు. నాకు తల్లిగా పిల్లల నవ్వులు కావాలనుకున్నా, వాళ్లతో నిద్ర లేని రాత్రులు కావాలనుకున్నా, వాళ్ళ అలకలు తో కూడిన దొంగ ఏడ్పులు కావాలనుకున్నా, నచ్చినవి ఇస్తే మురిసిపోయి ముద్దులతో కురిపించే ప్రేమ కావాలనుకున్నా, భయపడి "అమ్మా " అని చుట్టేసుకున్నప్పుడు భద్రత అవ్వాలనుకున్నా! అందరూ వాళ్ళ పిల్లల అల్లరితో విసిగిపోతూ ముచ్చటగా చెప్పుకొని కబుర్లు నేనూ చెప్పాలనుకున్నా! నేనూ అలా విసిగిపోవాలనుకున్నా! అమ్మగా నేను ఈ ప్రపంచంలో ఉన్న అన్ని సుఖాలని పొందాలనుకున్నా! ఇందాక ఎవరో అన్నట్టు " కాస్త చూసి అందంగా ఉన్న పిల్లల్ని తెచ్చుకోవాల్సిందే " అని .. "మీ కడుపున పుట్టిన పిల్లలు ఏ వంకరతోనైనా పుడితే మీది కాదు అని వదిలేసి వస్తారా? మీరందరూ శారీరక నొప్పులు పడి "తల్లి " కాగలిగారు.. నేనూ ఎంతో మానసిక వ్యధపడే ఇన్నాళ్ళకు ఒక "అమ్మ " ని అయ్యాను. మీ అందరికీ ఏ కష్టం లేకుండా " అమ్మ " అని అనిపించుకునే వరం దక్కింది. అలా దక్కని వారికి ఎడారిలో ఒక అమృతం చుక్కలా ఇలా " అమ్మా " అని పిలిపించుకొని అవకాశం ఇచ్చిన అనాథశరణాలయాలకు ఎంతో ఋణపడి ఉన్నాము. ఇప్పుడు నేను మా పిల్లల అల్లరితో ఆటలతో అలసిపోతున్నాను, వారి కబుర్లలో తేలిపోతున్నాను, వారి ముద్దులలో మునిగిపోతున్నాను... ప్రపంచంలో ఉన్న ఐశ్వర్యమంతా ఇప్పుడు నా దగ్గరే ఉంది. నేను నా డబ్బు దర్పం చూపించడానికి ఈ ఫంక్షన్ చేశానని అనుకోవద్దు.. నేనూ "అమ్మ " ని అయ్యానన్న గర్వం తో చేశాను. ఏరోజూ నా పిల్లల్ని నేను అనాథశరణాలయం నుంచి తెచ్చుకున్నానని మాత్రం అనొద్దు " అని అందరికీ దండాలు పెట్టింది.
కుదిరితే జ్యోతి లాంటివారి విశాల హృదయానికి మనస్ఫూర్తిగా నమస్కరిద్దాము... అంతే తప్పా.. పిల్లలు అందంగా లేరనో, ఏ కులమో, ఏ మతమో అని వారిని వేలెత్తి చూపి కుసంస్కారాన్ని బయట పెట్టుకోవద్దు!!
Saturday, October 20, 2018
శక్తి
నిన్న
పొద్దుట కూరలకోసమని మార్కెట్కి వెళ్ళాను, మార్కెట్ పక్కనే అర్పిత వాళ్ళ
ఇల్లు, అర్పిత నా చిన్ననాటి స్నేహితురాలు. కలిసి చాలా రోజులు.. ఉహు నెలలే
అయ్యింది, ఇంట్లో ఉందో లేదో అని ఒకసారి ఫోన్ చేశా. తను ఇంట్లోనే ఉన్నా
రమ్మని చెప్పింది.
అర్పిత ఇంట్లోకి అడుగెడుతుంటేనే ఒక పర్ణశాలలోకి
అడుగుపెడుతున్న అనుభూతి, ఇంటి ముందు మెలికల ముగ్గు, చల్లటి చెట్ల గాలి, తను ఇంటిని తీర్చిదిద్దే విధానం చూసి ఇంకా ముచ్చటేస్తుంది. ఇల్లు ఇప్పటికి
ఎన్నిసార్లు చూసినా కొత్తగా అనిపిస్తుంది. విశ్మయముతో ఇల్లు చూస్తూ ఉన్నా,
ఇంతలో "ఇంక ఇంట్లోకి వస్తావా" అన్న అర్పిత పిలుపుతో ఈ లోకంలోకి వచ్చా.
కాసేపు
పిచ్చాపాటి కబుర్లు అయ్యాక దసర నాటి బొమ్మలకొలువు ఫొటోలు చూపించింది. అసలు
ఆమెకి అంత ఓపిక ఎక్కడిది, ఇంటి పని, వంట పని, తోట పని, ఇవి సరిపోనట్టు
పేయింటింగ్, అల్లికలు, బొమ్మల కొలువుకి బొమ్మల్ని తయ్యారు చేయడం! ఒక గజేంద్రమోక్షము , గోపికలు కృష్ణుని ఘట్టాలు తీర్చిదిద్దిన విధానానికి
మెచ్చుకోకుండా ఉండలేకపోయా. మెచ్చుకున్నా, పొగిడినా " ఇదీ ఒక పెద్దపనేనా "
అని సున్నితంగా తోసిపారేస్తుంది తను.
"దసరా బాగా జరుపుకున్నట్టున్నావే " అని అడిగా...
ఒక
చిరునవ్వు నవ్వుతూ... " నవరాత్రులలో అమ్మవారికి రోజుకొక అలంకారము చేసి,
పూజ చేశాను. దగ్గరలోనే అమ్మవారి గుడికి తీసుకెళ్ళమని ఆయనతో నవరాత్రులు
మొదలవ్వక ముందే చెప్పాను. తీరా నవరాత్రి మొదలయిన రోజే ఇంటికి చుట్టాలు
వచ్చారు. మా ఆడపడుచు, పిల్లలు. ఆడపడుచుకి ఈ ఊరిలో ఏదో ఆఫీస్ పని ఉందని
పిల్లలతో సహా వచ్చి పిల్లలని నాకు వదిలి తాను ఆఫీస్ పని లో బిజీ అయ్యింది.
మొదటి రోజంతా ఆడపడుచు పిల్లలతోటే సరిపోయింది. ఇక రెండో రోజూ ఆడపడుచు తరఫు
చుట్టాలు ఆవిడని పిల్లల్ని చూడటానికి వచ్చారు. ఆ రోజు వాళ్ళకి వంట, టీలు,
టిఫిలతో సరిపోయింది.
ఇంట్లో పిల్లలు, చుట్టాలు పని తెమలడమే కష్టగా
ఉంటే మూడో రోజు సాయంత్రము శ్రీవారు ఆయన ఫ్రండ్స్ ని తీసుకొచ్చి వీణ కచేరి
చేయమని పురమాయించారు, అందరి ముందు అడిగారు ఇంక కాదనలేక ఒక కీర్తన
వాయించాను. వచ్చిన వాళ్ళు తెగ ముచ్చట పడిపోయారు. ఇంక మూడో రోజు కూడా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్ళలేదు.
ఆ మరునాడు ఆడపడుచు పిల్లలు
స్కూల్లో ఇచ్చిన హోం వర్కులు బయటకు తీసి నా దగ్గరకు వచ్చారు. ఇంక ఆ రోజు
వాళ్ల చేత హోం వర్కులు చేయించడములో బిజీ అయ్యా. వాళ్ళకిచ్చిన ప్రాజెక్టులు
చేయించడములో, సాయము చేయడముతో సమయం ఎలా గడచిందో తెలియకుండా సాయంత్రము ఏడైపోయింది, ఈయన సాయంత్రము లేటుగా రావడం తో ఆ రోజు గుడికి
వెళ్ళలేకపోయాము.
ఇలా నవరాత్రులు హాడవిడిగా గడచిపోతూ వచ్చాయి. ఇంక
నవమి రోజు పిల్లల్ని, చుట్టాలని తయ్యారు చేసి తీరా గుడికి వెళ్దామనుకుంటే
మా పనిమనిషి రత్తాలు ఏడుస్తూ మొహనికి రక్తం కారుతూ, చంటి పిల్లని
కౌగిలించుకొని రొప్పుతూ , ఏడుస్తూ వచ్చింది. దాని మొగుడు మూడోసారి కూడా
దానికి ఆడపిల్ల పుట్టిందని ఆ చంటి పిల్లని ఎవరికో అమ్మడానికి
తీసుకెళ్తున్నాడని, అడ్డం వచ్చిన రత్తాలుని కొట్టాడని చెప్పింది. అంతే
ఎక్కడ లేని కోపం వచ్చింది. మా కజిన్ పోలీస్ డిపార్ట్మెంట్లో పని చేస్తొన్న
వాడిని వెంటనే పిలిపించి... రత్తాలు ని తీసుకొని ఇంటికి వెళ్ళీ, రత్తాలుని
కొట్టినా, పిల్లలని అమ్మినా పోలీస్ స్టేషన్ లో పెట్టిస్తానని కాస్త బుద్ధి చెప్పి వచ్చాం. అసలు ఆడపిల్లంటే అంత అలుసా? అని ఆ రోజంతా మనసు అల్లకల్లోలం
అయ్యింది. ఆ గొడవ అయ్యేటప్పటికి రాత్రి 10 అయ్యింది. ఇంక గుడికి వెళ్ళాలన్న ఆలోచనే మరచిపోయాము.
ఇంక దశమి రానే వచ్చింది. ఇంటి నిండా జనాలతో
పండగ వాతావరణము భలేగా అనిపించింది. సాయంత్రము బొమ్మలకొలువుతో పేరంటాళ్లలతో
చాలా బిజీ అయ్యాము. సాయంత్రము ట్రైన్ కి వచ్చిన చుట్టాలందరు ఎవరిళ్లలకు వారు
వెళ్ళిపోయారు. అప్పుడేనా కనీసం గుడికి తీసుకెళ్తారేమో అని ఆయన్ను
అడిగితే..
" ఇప్పుడు గుడికి ఎందుకోయ్" అని అడిగారు.
చాలా ఉక్రోషం వచ్చేసింది.
" నవరాత్రులలో ఒక్క రోజు కూడా అమ్మవారిని దర్శించుకోలేదు, ఈ రోజు చివరి రోజు, ఈ రోజు కూడా తీసుకేళ్ళరా? " అని నిలదీసా...
" నువ్వు చూడలేదేమో కానీ, నేను మాత్రం రోజు దర్శించుకుంటూనే ఉన్నాగా" అని అన్నారు..
" అంటే నన్ను తీసుకెళ్ళకుండా మీరొక్కరే వెళ్ళొచ్చేశారా? " అని అడిగా కాస్త గట్టిగా...
అందుకు
ఆయన చిద్విలాసంగా..." నవరాత్రులలో మొదటి రోజు ఇంటికి
చుట్టాలొచ్చినప్పుడు.. వాళ్ళని ఆప్యాయతగా పలకరించి అన్నము పెట్టేటప్పుడు
నీలో అన్నపూర్ణాదేవిని చూశాను, పిల్లలతో ఆడుతూ పాడుతూ వాళ్ళల్లో
కలిసిపోయినప్పుడు బాలా త్రిపుర సుందరిని చూశా, వాళ్లకి చదువు చెప్తున్నప్పుడు
ఒక గాయత్రిని చూశా, వీణాపాణిగా ఉన్న నీలో సరస్వతినీ చూశా, కోపం వచ్చిన్నప్పుడు నీలో ఒక దుర్గ, మహిషాసురమర్ధినినీ చూశా... ఇంక రోజు సౌందర్యలహరిని
చూస్తూనే ఉన్నా..." అంటూ నవ్వారు...
ఈ విషయము చెప్తోన్న అర్పిత కూడా
సిగ్గుతో నవ్వింది. " ఇలా ఒక పొగడ్త విసిరేసి మొత్తానికి నన్ను నవరాత్రులలో
గుడికి మాత్రం తీసుకేళ్ళలేదు ఆయన "అని చెప్పింది.
"నిజమే కదా
అర్పితా! స్త్రీ ఒక శక్తిస్వరూపిణి... కొందరికి సౌందర్యలహరి, కొందరికి
మహిషాసురమర్ధిని " అని అనేసి అలా ఇంటి దారి పట్టాను.
Friday, August 31, 2018
శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు
మిత్రులకు నమస్కారములు! నాదతనుమనిశం ఆ శంకరుడైతే... ఈ శ్యామసుందరుడు 'రాగా తనుమనిశం ... అనురాగా తనుమనిశం " . ఆ అనురాగం లో సగభాగం వారి అర్ధాంగి జయలక్ష్మి గారు. వీణకి తంత్రులులాగా వారు ఒకే రాగం పలుకుతారు.. అదే అనురాగము అను రాగం! తాళికి ముందు ద్వైతమై.. రాగ, తాన, పల్లవి అనే మూడుముళ్ళతో అద్వైతమయ్యారు ఈ సంగీత సహచరులు.
ఈ నెల మన " ఎందరో మహానుభావులు " శ్రీ అయ్యగారి శ్యామసుందరం గారు, వారి సతీ మణి శ్రీమతి అయ్యగారి జయలక్ష్మి గారు!
Wednesday, August 15, 2018
స్వతంత్ర దినోత్సవం
ఈ రోజు స్వతంత్ర దినోత్సవం.. ఏదైనా స్పెషల్ గా వండాలనుకుంటూ ఫ్రిడ్జ్ తలుపులు తీశాను, దూట కనిపించింది.. దూట కొబ్బరికోరు వేసి పులిహార కూర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా! పక్కనే ఒక ఆనపకాయ కనిపించింది.. పెరట్లో బచ్చలి ఆకులు బాగా పెరిగాయి, కసిన్ని బచ్చలి ఆకులు వేసి ఆనపకాయ ఆవపెట్టి పులుసు చేస్తే! ముద్దపప్పులోకి ఈ పులుసు చాలా బాగుంటుంది. మా మామ్మ అయితే పప్పు బాగా దోరగా వేయించి వండేది ఇత్తడిగిన్నెకి. మా చినమామ్మ గారు ఈ కందిపప్పుని 'మంగలం ' లో వేయించేవారు. మంగలం అంటే కుండకి ఒక వైపు కన్న ఉండేది, అందులో వేయించే వారు. ' ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు ' అనే జాతీయం కూడా ఉంది. నా పెళ్ళికి పేలాలు కూడా ఈ మంగళం లోనే వేయించింది మా చినమామ్మ. చేతిలో పేలాలు వేస్తే రాత్రి కాలక్షేపానికి తినడానికి ఇచ్చారనుకొన్నా పెళ్ళిలో, నా ఆలోచన పసిగట్టి గురువుగారు "అమ్మాయి అవి తినడానికి కాదు ఆగు " అని వార్నింగు ఇచ్చారు.. ఇదే కోతి కొమ్మచ్చి అంటే ఒక విషయం లో నుంచి ఇంకో విషయానికి వెళ్ళిపొవడం. ఈ ఆలోచనలు కోతులే!
ఆ... ఏం చెప్తున్నాను.. ఫ్రిడ్జ్ లో కూరగాయలు వండాల్సిన వంట గురించి కదా! కొన్ని వంకాయలు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో పచ్చని వంకాయలైతే కొత్తిమీరి కారానికి బాగుంటాయి, అదే నీలం వంకాయలైతే కారం పెట్టి కూరకి బాగుంటాయి.. అదే సంతర్పణ కూర, కోనసీమ వాలైతే ధనియాలు వేస్తారు, అదే విశాఖపట్టణం వాలైతే మెంతి కారం అని మెంతులు వేస్తారు. చిన్న చిన్న వంకాయలతో సివంగిపులుసు కూడా చేస్తారు. పక్కనే దోసకాయ కూడా ఉంది, దోసకాయ పచ్చడిముక్కలు తిని చాలా రోజులయ్యింది. రెండు ఆవపెట్టినవి అయితే బాగోదు వేడిచేసేస్తుంది, దోసకాయ టమాట ఇంగువ వేసి పచ్చడి బాగుంటుంది.. సింపుల్ గా!!
అయినా స్వాత్రంత్ర దినోత్సవం నాడు కూడా ఈ వంటేమిటో? నాకూ స్వాత్రంత్రం కావాలి!! మా చిన్నప్పుడూ టి.వి. లో నవంబర్ 14 శనివారం న "మాకూ స్వాత్రంత్రం కావాలి " అనే సినిమా వచ్చింది. సినిమా అంతా కోతుల మయం, అప్పుడు దూరదర్శన్ తప్ప సినిమాలు చూడటానికి మరి వేరే దిక్కు లేదు.. మళ్ళీ మరునాడు ఆదివారం అదే సినిమా హిందిలో వచ్చింది. చాలా బాధ కోపం వచ్చేశాయి. (మళ్ళీ కోతి కొమ్మచ్చి).
అమ్మో ఇలా ఆలోచిస్తే పన్నెండు అయ్యిపోతుంది.. వండాల్సిన వాటికి కావల్సినవి తీసుకొని ఫ్రిడ్జ్ తలుపేసేశాను. అరగంటలో వంట రెడీ! టేబుల్ మీద అన్నీ సిద్ధం చేసి అందరినీ పిలిచాను. ముద్ద పప్పు, ఉసిరి పచ్చడి అన్నము వడ్దించా.. ఇంకా అన్నట్టు చూపులు! " ఇంకేంటి? ఇంతే ! " అని నేనూ శివగామిలా చూశాను.
మా చిన్నది " ముద్దపప్పు అన్నమా? నేను తినను! " అని అరిచింది. టి.వి. ఆన్ చేశాను "అభిరుచి ' లో రాజు గారు సొయా రైస్ చేయడం ఎలాగో చెప్తున్నాడు. అది చూస్తూ ఈ పప్పు అన్నము తినేసింది.
పొద్దుట నుంచి ఇదేనా వండావు? అని ప్రశ్న.. పొద్దుటే మా ఫ్రండ్ మాలతి పుట్టిన రోజు విష్ చేయ్యాలి కదా? ఆ తరవాత అర్పిత, శ్రీదేవి వాట్స్ ఆప్ లో పెట్టిన చీరలు చూడాలి కదా!(కొన్నాకొనకపోయినా) ఆ తరవాత టి. వి. లో వచ్చిన అల్లూరి సీతా రామ రాజు, ఇంకో చానల్ లో హింది లో వస్తున్న సుభాష్ చంద్ర బోస్ చూడద్దు, అసలే దేశభక్తి సినిమాలు! పొద్దుటే సందీప్ పెళ్ళికి వినాయకుడిని మీదికడితే వెళ్ళొచ్చాను కదా పేరంటానికి! ఒక్కమనిషి ఇన్ని పనులు అసలు ఎలా చేసుకొగలుగుతోందన్న సానుభూతే లేదు జనాలకి! అయినా మొన్న శుక్రవారం తొమ్మిది రకాల పిండి వంటలు వండానా? ఇలా ఒకరోజు పొట్టకి పని తగ్గించాలి కదా!
" రెండు వారాల క్రితం కూరలు లేవని పప్పు అన్నము పెట్టావు, ఈ రోజు అన్ని కూరలు ఉన్నా పప్పు అన్నమే! " అన్న కామెంటు..
" ఏదీ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు ఒకేలా ఉండటం... స్థితప్రజ్ఞత్వం అంటారు " అని అన్నాను.
ఇంకేదైనా అనేస్తారేమో అని వంటింట్లోకి వెళ్ళి అమ్మ ఇచ్చిన 'నారదబ్బ కాయ " ఊరగాయ తెచ్చా. అబ్బా! ఆ నారదబ్బ కాయ వేడి వేడి అన్నములో కలుపుకొని నెయ్యేసుకొని తింటే!! ఆ ముక్క కమ్మటి పెరుగన్నములో తింటే!! ఇంక మాటలు లేవు.
ఈ ఆవకాయలు, ఈ నారదబ్బకాయలు.. జీవనదులు. పన్నెండేళ్లకోసారి పుష్కరాలు వచ్చే నదులు కావు... నిత్య పుష్కరిణీలు ఇవి నాలాంటి వారికి!!
Friday, August 3, 2018
నాన్న
మన తెలుగు సినిమా పాటల్లో "నాన్న " మీద వ్రాసిన పాటలు (నాన్న నెత్తి మీదా, వీపు మీదా కాదు.. నాన్న ని ఉద్దేశించి వ్రాసిన పాటలు) చాలా తక్కువనే అనాలి. ఈ రోజు శృతిలయలు సినిమా చూశాను(ఎన్నోసారో గుర్తులేదు, లెక్కపెట్టనూ లేదు). కె. విశ్వనాథ్ గారు వారి సినిమాలో క్లైమాక్స్ పాటకి ఎప్పుడూ పెద్దపీఠే వేస్తారు. అలాగే శృతిలయలు సినిమాలో షణ్ముఖ శ్రీనివాస్ డాన్స్ ప్రోగ్రాం ఇచ్చినప్పుడు ( శివతాండవం), తల్లి(సుమలత)వచ్చి తండ్రికి కొడుకుని పరిచయం చేస్తూ " తనదు వరసత్వము వారసత్వముగనిడి తనువిచ్చు తండ్రికిదే తొలివందనం ... తండ్రికిదే తొలివందనం " అని పాడుతుంది. పదప్రయోగం ఎంత బాగుందో కదా!
సినిమా పాటలలో "అమ్మ/తల్లి " కే అగ్రతాంబూలం ఇచ్చారు. పాపం "నాన్న " ఎప్పుడూ అమ్మ వెనకాలే..(పాటలలో కూడా). ఇంకో నాన్న పాట అనగానే గుర్తొచ్చేది " నాన్నా నీ మనసే వెన్నా, అమృతం కన్నా అది ఎంతో మిన్నా (ధర్మదాత) " . అది కూడా తల్లి లేనందుకు ఆ నాన్న ని పొగిడారు తప్పా... తల్లి ఉంటే అంత పొగడ్తలు లభించేవి కాదు "నాన్న " కి.
ఇక తండ్రి గొప్పతనం చెప్పే అసలైన సిసలైన పాట "పాండురంగ మహత్యం " లో " దేహము, విజ్ఞానము, బ్రహ్మోపదేశమిచ్చి. ఇహపరాలు సాధించే హితమిచ్చిన తండ్రిని " అని తండ్రి యొగ్గ గొప్పతనము సముద్రాల(రాఘవాచార్య) గారు అద్భుతంగా చెప్పారు. బ్రహ్మోపదేశముతో ఇటు ఈ లోకానికి, అటు పరలోకానికి కావల్సిన పుణ్యం ఇచ్చేది తండ్రే కదా!
కొన్ని పాటలలో అయితే " తల్లితండ్రీ " అని ద్వంద సమాసంలో వారిని ఒకటిగా కలిపి పొగిడేస్తూ ఉంటారు, అందుకంటే అది అద్వితీయ బంధము. అంతెందుకు చిదంబరంలో ఉన్న "నటరాజస్వామి " భంగిమను గుర్తు తెచ్చుకోండి. ఆయన కుడి చేత్తో అభయహస్తం చూపిస్తూ ఎడం చెయ్యి ఎడం కాలు వైపు చూపిస్తూ ఉంటాడు. ఆయన ఎడం భాగం "అమ్మది". అంటే " అమ్మ కాలు పట్టుకుంటే నేను మోక్షం ఇస్తాను అని అంటూ అగ్నిని ఒక చేత్తో పట్టుకొని మరీ అభయమిస్తున్నాడు ఆ జగత్ పిత. ఇవన్ని తెలుసుకున్నారు కాబట్టే రామదాసు కూడా "నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి " అని ఆ రామయ్య తండ్రి సిఫార్స్ చేశాడు.
ఏది ఎవైనా
" యే పాద సీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమల తరము
యే పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్య తమము
యే పాద తీర్ధము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలిన అమృత ఝరము
యే పాద స్మరణ నాగేంద్రశయను ధ్యానమ్ము కన్నను మహానందకరము
అట్టి పితరుల పద సేవ ఆత్మ మరచి ఇహ పరంబులకెడమై
తపించువారి కావగల వారు లేరు, లేరు ఈ జగాన లేరే
నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్నా..."
Tuesday, July 31, 2018
శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు
శుభోదయం!
ఆయన నడిచే వేదాలసారము... ఈ భూలోకానికి భగవంతుడి గురించి చెప్పి జనాలని సన్మార్గంలో పెట్టడానికి అవతరించిన "శుకమహర్షి " .. ఆయనే ప్రవచన పితామహులు శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు! వారు వేదాలకే నెలవైన కుటుంబంలో ఆగస్ట్ 28, 1925 న జన్మించారు . వారి తండ్రి గారి పేరు శ్రీదక్షిణామూర్తి గారు. వారి విద్యాభ్యాసం వారి తాతగారైన శ్రీ రామకృష్ణ విద్వత్ చేనుల గారి వద్దే సాగింది. శ్రీ రామకృష్ణ విద్వత్ చేనులు గారు బహుభాషా పండితులు. చంద్రశేఖర శాస్త్రి గారికి తెలుగు సంస్కృత భాషలలో తర్ఫీదు ఇచ్చినది వారి తాతగారే! వారి తాతగారి అభిలాషమెరకే శ్రీచంద్రశేఖర శాస్త్రి గారు ప్రవచనాలు చేయసాగారు.
శ్రీచంద్రశేఖ్ర శాస్త్రి గారికి తిరుమల తిరుపతి దేవస్తానం వారు బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యతగా నియమించారు. భధ్రాచలంలో ప్రతి ఏటా జరిగే సీతా రామ కల్యాణం మాత్రం ఎవరూ మరచిపోని విధంగా వారు వ్యాఖ్యానించారు. "అమ్మా! సీతమ్మ.. కాస్త తల పైకెత్తి రాములు వారి వంక చూడమ్మా " అని వారు వ్యాఖ్యానించిన తీరు జనకమహారాజుని గుర్తు చేస్తుంది. వారు మన సమకాలికులు కావడం మన అదృష్టము.
ఇప్పటికి వారు చేసిన ప్రవచనాలు వందలు దాటే ఉంటాయి. ఎన్ని ప్రవచనాలు చేసినా "పలికెడిది రామభద్రుండట " అని అంతా ఆ రామకృపగా భావించే భక్తాగ్రేసరులు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారు! వారితో నాకు లభించిన ఈ ఇంటర్వ్యూ వారి వినయానికి దర్పనం. నా మహద్భాగ్యం.
గంగవెల్లువని చిన్న కమండలలో పట్టి తేవాలన్న నా అత్యాశకు మన్నించండి. కొన్ని కారణాలవల్ల వారు మొదట విడియో ఇంటర్వ్యూ ఇవ్వలేదు. వారు సతిమణి గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. నా ఈ ప్రయత్నాన్ని పెద్దమనస్సుతో ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను. నచ్చితే పొగడ్తలు శ్రీచంద్రశేఖర శాస్త్రులు గారికి, నచ్చకపోతే తిట్లు నాకు !!
Subscribe to:
Posts (Atom)


