Search This Blog
Saturday, September 23, 2017
Friday, September 22, 2017
సహభాష్ కోకనాడి
“సహభాష్ కోకనాడి " అనే కవి పేరు విన్నారా ఎప్పుడేనా? అది ఆయన అసలు పేరు కాదు.. కలం పేరు. ఆ కవికి ఆ కలం పేరు ఉందని తెలిసిన వారు బహు కొద్దిమందేనేమో! ఎనిమిది భాషలలో ఆ కవి రెండు లక్షల యాభై వేలకు పైగా వచన, గద్య, పద్య, కవితా రచనలు చేశారు. పన్నెండు భాషలలో అనర్గళంగా మాట్లాడగల సమర్ధుడు ఆయన. అందునా ఒక తెలుగు వాడు. ఆయన సొంత ఊరైన కాకినాడని తన కలంపేరుగా పెట్టుకొన్న మహా మనిషి, అమరగాయకుడు " ప్రతివాద భయంకర శ్రీనివాస్ గారు" .... అందరికి సుపరిచయం.. "పి.బి. శ్రీనివాస్ " అనే!
ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడ, సంస్కృతం ఇలా చాలా భాషల్లో నిష్ణాతులు. ఉర్దూ కవితలు రాసినప్పుడు “సహభాష్ కోకనాడి ” అనే పేరుతో రాసేవారు. ఆయన హిందీ, ఇంగ్లీష్, తమిళ్, మళయాళం, ఉర్ధు, తుళు, కోంకణి, కన్నడలో 3000 లకు పైగా పాటలు పాడారు. ఆకలి రాజ్యం సినిమాలో "తూ హై రాజా మై హూ రాణి " అనే హింది పాట వ్రాసింది పి.బి. శ్రీనివాస్ గారే!
ఒకసారి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పి.బి. శ్రీనివాస్ గారి పాట విని ఆయన కుమారుడైన పావన శాస్త్రి గారితో " ఈ పాట పాడిందెవరూ? " అని అడిగారుట.
"పి.బి. శ్రీనివాస్ అదే ప్రతివాద భయంకర శ్రీనివాస్ అని... " అని ఆయన కుమారుడు జావాబివ్వగా
"మగటిమి ఉన్న గాత్రం .. భలే ఉంది " అని అన్నారుట ఆ గంభీర గాత్రాన్ని విని.
" డైమాండ్ టి " ... అనే ప్రక్రియతో ఒక మేలకర్త రాగానికి ఆరోహణ, అవరోహణలు చెబుతూ ఆ రాగాన్ని సులువుగా గుర్తుపెట్టుకోగల నైపుణ్యాన్ని ఎందరో విద్యార్ధులకు భోధించారు పి.బి. శ్రీనివాస్ గారు. అలా 72 మేలకర్త రాగాలను సులువుగా గుర్తించ గల ప్రక్రియ కనిపెట్టింది వారే! ఆయన కొన్ని రాగాలను సృష్టించారు కూడా! ఆ రాగాలకు సాహిత్యం కూడా వారే రాసుకునేవారు. ఆయన మన సమకాలికులైన వాగ్గేయకారుడు.
వారు ఎక్కడకు వెళ్ళినా ఆయన కారు నిండా పుస్తకాలతో నిండి ఉంటుంది. వారు ఏ సభలకు వెళ్ళినా ఒక చంటి పిల్లాడిని చేతిలో ఎత్తుకున్నట్టు ఆయన చేతిలో ఎప్పుడూ కనీసంలో కనీసం నాలుగైదు పుస్తకాలు ఉండేవి. ఆయన జీవితం లో పుస్తకాలకి అంతటి స్థానం ఉందన్న మాటా! వారి దగ్గర ఎక్కువ పుస్తకాలే కాదు... ఎక్కువ పెన్నులు కూడా ఎప్పుడూ ఉంటాయి. ఆయన దగ్గర ఉన్న "ఫౌంటేన్ పెన్నులు " మరే రచయిత దగ్గరా లేవేమో! ఆయన ఎక్కువగా రాసుకునే చోటు "వుడ్ లాండ్స్ " (డ్రైవ్ ఇన్) . అక్కడ వారికోసం ఒక బెంచి, కుర్చి ఆ "వుడ్ లాండ్స్ " వారు ప్రత్యేకంగా ఉంచేవారుట.
ఒకసారి భువనచంద్రగారు "ఇంత వరకు మీరు కన్నడా లో రాజ్ కుమార్ గారికి ఎక్కువ పాటలు పాడారు కదా... ఇప్పుడు ఆయన పాటలు ఆయనే పాడుకుంటున్నారు.. దాని మీద మీ స్పందన ఏంటీ? " అని అడుగగా...
"అంత గొప్ప గాయకుడు ఏమాత్రమూ అతిశయోక్తి లేకుండా నాచేత పాడించుకోవడం నా అదృష్టం " అని చేతులు పైకెత్తి నమస్కరిస్తూ అన్నారు. ఈ ఉదాహరణ చాలదూ వారి సంస్కారానికి, వినయానికి?
సినిమా పాటలే కాదు, అటు శాస్త్రీయ సంగీతంలోనూ ఇటు ఘజల్స్ లోనూ ప్రావీణ్యులు పి.బి. శ్రీనివాస్ గారు! మన తెలుగు రాష్ట్రంలో కన్నా పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రంలో గొప్ప గొప్ప సత్కారాలు పొందారు వీరు. అత్యుత్తమ అవార్డ్ అయిన "కన్నడ రాజ్యోత్సవ " అవార్డు ఇచ్చి సన్మానించింది కర్ణాటక ప్రభుత్వం.
తమిళ్ నాడు ప్రభుత్వం "కళై మామణి , విద్వత్ శిరోమణి " తో పురస్కరించింది. మన తెలుగు ప్రభుత్వం ఎప్పటిలాగానే ఒక విద్వాంసుడికి ఏ అవార్డ్ ఇవ్వక తన గొప్ప చాటుకుంది. ఈ రోజు వారి జయంతి... ఆయనకు నివాళులు.
(వారి గురించి ఎంతో రాద్దామని ఉన్నా.. నాకు వచ్చిన భాష ఇంతే సహకరించింది. వారి గురించి ఎన్నో విషయాలు తెలియ చేసిన భువనచంద్ర గారికి మనస్ఫూర్తిగా వందనాలు).
Wednesday, September 20, 2017
పున్నాగ
టైం 8:15... అప్పుడే భక్తి రంజని అయ్యింది. మా భోజనం కూడా అయ్యేది ఆ టైం కే! ఇప్పటిలాగా పొద్దుటే గాజు ప్లేట్ లో ఇడ్లీలో, దోశలతో పక్కన ఒక గ్లాస్ పళ్ళ రసంతో బ్రేక్ ఫాస్ట్ తినే రోజులు కావు. పొద్దుటే కలగలుపు పప్పూ అన్నము, పెరుగూ అన్నము... పొద్దుట బ్రేక్ ఫాస్ట్ అనబడు భోజనం, మధ్యాహ్నం మళ్ళీ స్కూల్ నుంచి లంచ్ కి ఇంటికి వచ్చి అదే పప్పు, ఒక కూరా, మళ్ళీ పెరుగన్నం. సాయంత్రం 4 ఇంటికి స్కూల్ నుంచి వచ్చాక మళ్ళీ అదే పప్పూ... అదే కూరా... అదే పెరుగూ అన్నము. అప్పుడప్పుడు "అదే కూరా, అదే పప్పూ, అదే అన్నము " అని "అదే నీవు అదే నేను " కి ప్యారెడిగా పాడుకునేవాళ్ళము. రాత్రి డిన్నర్ కి వేరే కూర, రసం, (పచ్చడి ఆప్షనల్) పెరుగు అన్నము. ఇన్ని సార్లు అన్నం తిన్నా కాలెరీలు ఎక్కువయ్యిపోతాయన్న బాధ .. కాదూ ఆలోచనే లేని రోజులు.
స్కూల్ కి తయ్యారవుతుండగా జనరంజని మొదలయ్యేది. "ఇదే ఇదే నేను కోరుకుంది.. ఇలా ఇలా చూడాలని ఉంది " పాట వస్తోంది. ఈ పాట పక్కింటి వెంకట్ అన్నయ్య, స్వరాజ్యలక్ష్మి అక్క లంగా ఓణీ వేసుకొని వచ్చినప్పుడు పాడాడు. "ఆ జడపొడుగూ మెడ నునుపూ చూస్తుంటే " అని కూడా పాడాడు. ఆ అక్క కూడా " ఎటు చూసినా ఒక బొమ్మే కనిపించింది ఆ కళ్ళలో నా బొమ్మే కదలాడింది " అని పాటకు పాట రిప్లై ఇచ్చింది. అప్పుడు ఈ పాటలు, ఆ సీన్లు సేవ్ చేసేసుకొని ఉన్నాను. కాస్త పెద్దయ్యాక డీ కోడ్ చేసుకొంటే అర్ధమయ్యాయి ఆ పాటల రాయబారాలు.
జనరంజని లో రెండు పాటలు అయ్యాక స్కూల్ కి బయలుదేరేవాళ్ళము నేనూ మా తమ్ముడు. పోస్ట్ ఆఫీస్ దగ్గరకు రాగానే శిరీష, అర్పిత కలిసేవారు. ముగ్గురం ముందు రోజు టి.వి. లో వచ్చిన చిత్రహార్ లో పాటల గురించో, చిత్రలహరిలో "హే కృష్ణా ముకుందా మురారీ " అనే ఒక్క పాటతో చిత్రలహరి అవ్వగొట్టెసినందుకో బాధపడిపోయేసేవాళ్ళము. పాలబూత్ సందు చివర్లో సంపెంగి చెట్టు కి ఏవైనా పూలు ఉన్నాయేమో అని ఒకసారి వెతికేసి... ఉంటే కోసేసుకొని... మళ్ళీ స్కూల్ కి ప్రయాణం కొనసాగించేవాళ్ళం. పాల బూత్ సందుకి ఎడం వైపు ఖండవల్లి లక్ష్మీరంజనం గారు ఇంటి ఎదురుగా "డాంబర్ ఇంటికి " పక్కన ఒక "పున్నాగ చెట్టు " ఉండేది. ఆ చెట్టు కింద బోలెడు పూలు పడి ఉండేవి. ఆ పూలు ఏరుకొని ఏ టీచర్ కి ఇవ్వాలో అని ఆలోచించుకుంటూ రామ్ నగర్ గుండు దాటే వాళ్ళం.
స్కూల్ కి ఎదురుగా ఒక ఇంటి దగ్గర "గౌరీ మనోహరి " పూలు ఉండేవి. ఇంక ఆ పూల మీద వాలేవాళ్ళము. ఆ పూలు కూడా కోసుకొని అప్పుడు స్కూల్ కి వెళ్ళేవాళ్ళము. లలితా నగర్ నుంచి వచ్చే జ్యోతి ఎక్కువగా "కౌరవ పాండవుల " పూలు తెచ్చేది. మేము పోగేసి తెచ్చిన ఈ పూలన్నీ ఎక్కువగా "రమా కుమారి " టీచర్ కి ఇచ్చేవాళ్ళము. పాపం ఆవిడ " ఇవన్నీ షో పూలు తలలో పెట్టుకోరు " అని అనకుండా అన్నీ పూలు తలలో పెట్టుకునే వారు. మాకు ఆవిడ అలా పూలు పెట్టుకుంటే చాలా ఆనందం వేసేది. పూలు గుచ్చుకోడానికి దారం లేకపోయినా ఒక తొడిమలో ఇంకో పూవు పేర్చి మాలగా అల్లుకునేవారు రమా కుమారీ టీచర్. ఆ మాలే తలలో తురుముకొనేవారు ఆవిడ.
ఇలా పూలు పోగేస్తూ పోగేస్తూ ఉన్నరోజుల్లో ఒకరోజు "గౌరీ మనోహరి " పూలు కోస్తూ అర్పిత పుచ్చకాయిలా దొర్లిపోయింది. అలా దొర్లి ఒక స్కూటర్ ముందు పడింది... ఆ స్కూటర్ అతను సడన్ గా బ్రేక్ వేశాడు. కీచ్ మని సౌండ్ తో ఆగింది ఆయన స్కూటర్... అర్పితకి ఏవీ కాలేదు. కానీ మా అందరికీ ఒకటే ఒణుకు, భయం. ఆ అంకుల్ కూడా భయపడి కాస్త ధైర్యం తెచ్చుకొని " ఏమీ జరగలేదు కదా బిడ్డా " అని మొదట పరామర్శించి, ఆ తరవాత మందలించారు. ఇంక ఆ రోజు లగాయెత్తు పూలు కోసే ప్రక్రియ మానుకున్నాము.
ఈ రోజు పొద్దుట మా పెరటి తలుపు తీస్తుంటే దూరంగా ఉన్న పున్నాగ పూల వాసన ఈ జ్ఞాపకాలన్నింటినీ ఒకసారి కళ్ళముందు కదిలించింది.
Monday, September 18, 2017
రాచ్చిప్ప
" రాచ్చిప్ప మొహం నువ్వూనూ " అని కొందరు,
"ఎన్ని సార్లు చెప్పినా ఆ బుర్రకి ఏదీ ఎక్కదు.. సుద్ద మొద్దురాచిప్ప " అని పాపం ఆ రాచిప్పని బోలెడు అవమానించేస్తారు.
పూర్వం ఆ రాచిప్పలో పులుసు చేసుకొని రెండు రోజుల పాటు తినేవారుట. ఆ రోజు వండిన పదార్ధాల వేడి మరునాటికి కూడా ఉండేదిట. మా చిన్నప్పుడు చద్దికుండ వసారా లో మాగాయితో , ఉప్పుతో ఉండేవి ఈ రాచ్చిప్పలు.
ఒకసారి ఈ మధ్యనే మాధవపెద్ది సురేశ్ గారింటికి వెళ్లాను. ఆయనతో కబుర్లు చెబుతుంటే వారి సతీమణి (చిట్టి పిన్ని), వంటింట్లో ఇంగువ పోపు వేస్తున్నారు. తీరా ఆ పోపు దేనిలోకో అని చూడగా కొరివికారం (పండు మెరపకాయల పచ్చడి) ఓ రాచ్చిప్పలో వేసి దానికి ఇంగువ పోపు! అసలే కొరివికారం,ఆ పై ఇంగువ, అదీ రాచ్చిప్పలో... రుచి అద్భుతం. ఇంక అప్పటి నుంచి ఎలాగైనా ఇంట్లోకి రాచ్చిప్పని తీసుకొని రావాలని దృఢనిశ్చయానికి వచ్చేశా.
ఆ తరవాత వైజాగ్ వెళ్ళాను, అక్కడ అందరినీ "రాచ్చిప్ప ఉందా మీ ఇంట్లో " అని అడిగా. కొందరికి కోపం కూడా వచ్చేసింది. వాళ్ళనే అన్నననుకొని.
:( కాఫీ నీళ్ళు కూడా ఇవ్వకుండా పంపేశారు.
😔
ఇంకొకరి ఇంటికి వెళ్ళి " మీ ఇంట్లో రాచ్చిప్ప ఉందా? " అని అడిగితే ఆ కోడలు మూసిముసిగా నవ్వింది. ఆ అత్తగారు కారాలు మిరియాలు నూరారు. ఇంక వైజాగ్ లో ఎవరిని అడగకూడదని అనుకొన్న.
ఆ తరవాత అమలాపురం లో "వేట ' మొదలెట్టా. రోడ్డు మీద 'రుబ్బు రోళ్ళు " కనిపిస్తే, వాటిని అమ్మే వాళ్ళ దగ్గరకు వెళ్ళి "రాచ్చిప్ప ఉందా? " అని అడిగేద్దాన్ని. వాళ్ళు నా మొహాన్ని అదోలా చూసేవారు
:(
ఇలా అందరినీ అడిగి అడిగి అలసిపొయాను. " ఇన్నేళ్ళు నన్ను "రాచ్చిప్ప రాచ్చిప్ప " అని తిట్టేవారు మీరంతా, ఇప్పుడు నీకు అంత తొందరగా దొరుకుతానా? " అని రాచ్చిప్ప అన్నట్టనిపించేది.
ఒక శుభ దినాన్న అందరం కలిసి ఐనవెల్లి విఘ్నేశ్వరుడి దర్శనానికి వెళ్ళాము. గుడి బయట బొమ్మలు అమ్ముకొనే వాళ్ళ దగ్గర పొరపాటునా ఈ రాచ్చిప్ప కనిపిస్తుందేమో అన్న ఆశ. అటు నుంచి మా వారి మేనత్తని చూడటానికి వెళ్ళాము. ఆవిడ ఇంట్లోని వెళ్లగానే నా కళ్ళు నా ప్రమేయం లేకుండా ఇంటిని వెతికేశాయి. అంతే... టక్కు మని ఒక చోట ఆగాయి. ఆ గూట్లో పెద్ద "రాచ్చిప్ప " . అంతే మనసంతా ఆ రాచ్చిప్ప మీదే!
😍
"ఏం తల్లి రాచ్చిప్ప కావాలా? " అని మనసు అడిగినట్టనిపించింది. పాపం ఆ పెద్దావిడ ఏం మాట్లాడిందో, నేనేమి సమాధానం ఇచ్చానో గుర్తు లేదు.
ఇంక ఆగలేక అడిగేశా " మీరు ఆ రాచ్చిప్పతో ఏం చేస్తారు? "అని
"ముగ్గు పోసుకుంటా " అని ఆవిడ సమాధానం
ఇంక లాభం లేదు... చల్లకొచ్చి ముంత దాచడమెందుకు?
"నాకు ఇస్తారా ఆ రాచ్చిప్పని " అని అడిగా
ఆవిడ నావైపు చెత్త ఏరుకోడానికి వచ్చిన మునిసిపాలిటి వాన్ లో వ్యక్తి ని చూసినట్టు చూసి "దాన్నేం చేసుకుంటావే? " అని అడిగింది.
"కొరివికారం లో పోపు వేసుకుంటా " అని చెప్పా
"సరే ఇస్తాలే " అని అన్నారు.
" నా దగ్గర ఇంకా రెండు చిన్న రాచ్చిప్పలు కూడా ఉన్నాయి " అని ఆవిడ మాటల సందర్భంలో అన్నారు ,
(" ఏం తల్లీ ఇంకో రెండు రాచ్చిప్పలు కావాలా? "
)
😍
నా కళ్లల్లో మెరుపు... " అవి కూడా ఇచ్చేయండి " అని అడిగేశా
మొత్తానికి ఆవిడకి వీడుకోలు చెప్పి ఆ రాచ్చిప్పలు తెచ్చేసుకున్నానోచ్ !
ఇదిగో ఈ రోజు ఆ రాచ్చిప్పలలో కొరివికారం వేసి అందులో పోపు వేసుకొని, వేడి వేడి అన్నంలో ఆ పచ్చడి కలుపుకొని తినేశా!
😍
😌
రావుబాల సరస్వతి దేవి
తెలుగు పాటల మణిహారములో సరస్వతీ దేవిని అలరించిన స్వర కుసుమాలు ఎన్నో. ప్రతీ పాట ఒక తేనె గుళికగా అందించిన గాయకులు ఎందరో. ప్రతి పలుకు సుమ దలాలుగా తగిలే గాయనీలు మాత్రము కొద్దిమందే. లాలిత్యం, హాయిగా రాగ యుక్తం ఆలపించే గాయనీమణులలో చెప్పుకోతగినవారు రావుబాల సరస్వతి దేవి గారు. తన గాత్రంతో మనసులను సుదూర తీరాలలో ఓలలాడించగల స్వర బాల. గట్టిగా మీటితే తంత్రులు కందిపోతాయేమో అనిపించే సున్నిత స్వర రాగవీణ.
93 సంవత్సరాలు వయసులో ఆవిడ ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. ఆవిడ ద్వారా మనకు తెలిసిన కొన్ని విషయాలు.
మీ జననం :
నేను 1928 ఆగస్ట్ 28న మద్రాస్ లో జన్మించాను. పెరిగింది గుంటూరు జిల్లా బాపట్లలో. నాన్న పార్థసారథి, అమ్మ విశాలాక్షి.
మీ విద్యాభ్యాసం :
పాటల మీద ఆసక్తి ఎక్కువ అవ్వడంతో, చదువు మీద శ్రద్ధ తగ్గింది. స్కూల్ కి ఎగ్గొట్టడం మొదలగునవి చేసేదాన్ని. అమ్మ తిట్టి, కొట్టేది. కానీ నాన్న గారు మాత్రం బాగా ప్రోత్సాహం ఇచ్చారు.
పాటల మీద మీకు కలిగిన ఆసక్తి :
మా తండ్రి గారికి ఒక థియేటర్ ఉండేది, అక్కడ ఎక్కువగా నాటకాలు, మూకీ సినిమాలు ప్రదర్శించేవారు. శ్రీరంజని, స్థానం నరసింహా రావు గారు, కపిలవాయి మొదలగువారందరు అప్పుడు ఆ నాటకాలలో నటించేవారు. వారు పాడే తీరు చూసి పాడాలనే కుతూహలం కలిగింది. ఒకసారి కపిలవాయి రఘునాథం గారు ఒక నాటకం ప్రదర్శిస్తున్నారు, ఆ నాటకానికి నేను మా అమ్మగారితో కలిసి వెళ్ళాను. అప్పుడు ఆ నాటకం లో "నమస్తే ప్రాణనాథ" అనే పాట నేను పాడుతానని మారాము చేశాను. మా అమ్మ ఊరుకోమన్నా ఊరుకోలేదు. ఇదంతా స్టేజ్ మీదనుండి కపిలవాయి గారు చూశారు. అంతే స్టేజ్ దిగి నన్ను ఎత్తుకొని ఆ పాట స్టేజ్ మీద పాడించారు. అది చూసి ఆ నాటకానికి వచ్చిన వారు, నటించినవారు చాలా ముచ్చట పడ్డారు.
సినీగీతాలు పాడుటకు మీకు కలిగిన అవకాశం:
గుంటూరులో కొబ్బరపు సుబ్బారావు గారు హెచ్.ఎం.వి. లో గ్రాంఫోను రికార్డింగ్ చేసేవారు. "భక్త కుచేల" సినిమా కోసం, కుచేలుని కూతురిగా నటించడానికి, తన పాట తాను పాడుకునే పిల్ల కోసం చూస్తున్నారు. ఎవరో నా పేరు చెప్పారు. 1934లో, అంటే నా 6 సం||ల వయసులో మొదటి సారిగా సినిమాలకి పాట పాడాను నేను. ఆ రోజుల్లో ఆ వయస్సులో పాటలు పాడిన రికార్డ్ నాకే దక్కింది.
సినిమాలలో బాలనటిగా మీ ప్రవేశం :
సి. పుల్లయ్య గారు "సతీ అనసూయ", "దృవవిజయం"(1935) తీయడానికి నిర్ణయించుకున్నారు. అందులో నటించేవారందరూ 13 ఏళ్ల లోపువారే. ఆ సినిమాలో "గంగ" పాత్ర నన్ను వరించింది. ఆ సమయం లో రికార్డింగ్ కలకత్తాలో జరిగింది. ఆ రికార్డింగ్ కి మా నాన్న గారు తీసుకొని వెళ్ళారు. ఆ సమయం లో నన్ను ఎవరు ఎన్ని పాటలు పాడమన్నా సరే ఒక "కాడ్బెరీ చాక్లెట్" ఇస్తే పాడేసేదాన్ని. అప్పుడు నేను పాడిన పాటలన్నీ " ఈస్ట్ ఇండియ స్టూడియో " లో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో నేను "సైగల్" మొ|| పెద్దవారిని చూసి నేర్చుకునే అవకాశం లభించింది. నా గొంతులో వచ్చే మార్ధవ్యము, లాలిత్యము అలా బెంగాళీ గాయకులను చూసి అలవరించుకున్నదే.
కె. సుబ్రహ్మణ్యంగారు "భక్త కుచేల"(తమిళ్) లో యాక్ట్ చేయమని అడిగారు నన్ను. నాకు ఆ సమయంలో తమిళ్ లో మాట్లాడటమే వచ్చు, కాబట్టి పెద్ద పెద్ద బోర్డుల మీద డైలాగులు తెలుగులో వ్రాసి చెప్పించేవారు. ఆ డైలాగులు అన్నింటికీ చెరో "కాడ్బరీ చాక్లెట్" ఇచ్చేవారు. ఆ సినిమాలో కుచేలుని కూతురు, బాల కృష్ణునిగా నటించాను. (ద్విపాత్రాభినయం)
ఆ తరవాత తీసిన "బాల యోగిని"లో కూడా నటించాను. అలా "బాల" కృష్ణుడు, "బాల"యోగినిలో నటించడంతో " సరస్వతి " అని అమ్మా నాన్న పెట్టిన పేరు కాస్త "బాల సరస్వతి" గా మారింది.
శాస్త్రీయ సంగీతం మీరు ఎక్కడ నేర్చుకున్నారు :
ఆ తరవాత గుంటూరు వదిలి మా కుటుంబమంతా "మద్రాస్" చేరాము. ఆలతూరు సుబ్బయ్య గారి దగ్గర శాస్త్రీయ సంగీతము అభ్యసించాను. పునాది కోసం సంగీతం నేర్చుకున్నాను కానీ సింగపూర్ రబ్బర్ లా సాగే ఆ రాగాలన్నా, ఆ గమకాలన్నా అంత ఇష్టము ఉండేది కాదు నాకు. అందువల్లనే అటువంటి పాటలు పాడటానికి ఇష్టపడేదాన్ని కాదు. ఎప్పుడూ అలా పాడటానికి సాహసించలేదు కూడా. నాకు సున్నితమైన, ఆహ్లాదకరమైన సంగీతమే ఇష్టము. అది ఆనాటిది కానివ్వండి, ఈనాటిదైనా కానివ్వండి- కేకలు పెట్టే పాటలు, సాగతీసే పాటలు ఏ నాడు పాడలేదు, ఇష్టపడలేదు.
కథానాయికగా సినిమాల్లో ప్రవేశం :
"ఇల్లాలు" సినిమా తీయడానికి గూడవల్లి రామబ్రహ్మం గారు ఎస్. రాజేశ్వరరావు గారిని యాక్టర్, సంగీత దర్శకుడిగా స్వీకరించారు. అదే సినిమాకు హీరోయిన్ గా నన్ను తీసుకున్నారు. కానీ, నన్ను ఒక తమిళ్ అమ్మాయిగా పరిచయం చేశారు. ఆ విధంగా సినిమాలలో ప్రవేశం జరిగింది. అప్పటి నుండి ఎస్. రాజేశ్వరరావు గారితో ఎన్నో పాటలు పాడాను.
ఏ.ఐ.ఆర్. లో మీ ప్రవేశం :
ఒకసారి ఆల్ ఇండియా రేడియోలో సాయంత్రము 7:30 కి జరిగే పాటల కార్యక్రమములో పాడవలసిన గాయని రాలేదు. అప్పుడు నేను పని చేస్తున్న స్టుడియోకి "ఎవరైనా పాడేవారు ఉన్నారా?" అంటూ కబురు పంపించారు. స్టూడియో ఓనర్ "ఒకరేమిటి! రాజేశ్వర రావు, బాల సరస్వతి అనే ఇద్దరు పిడుగులు ఉన్నారు" అని మమ్మల్ని పంపారు . ఆ విధంగా ఏ.ఐ. ఆర్. లో పాడే అవకాశం 1940 లో లభించింది. లైట్ మ్యూజిక్ అనేది ఏ.ఐ.ఆర్. లో ప్రారంభమయ్యింది అప్పటి నుండే.
మీ నాన్నగారి సినిమాల్లో పాడారా :
అప్పటికి నేను ఇంకా "చైల్డ్ ఆర్టిస్ట్" గా సినిమాలలో చేస్తున్నాను. మా నాన్న గారు "రాధిక" అనే సినిమా తీశారు. పద్మనాభం బాలకృష్ణునిగా, రఘురామయ్య గారు (ఈల పాట) పెద్ద కృష్ణునిగా నటించారు. ఆ సినిమా హిట్ కాలేదు కానీ, అందులో నేను పాడిన "గోకులంలో కృష్ణుడు నల్లన, గోకులంలో పాలు తెల్లన" చాలా ప్రజాధరణ పొందింది.
ప్లే బ్యాక్ సింగర్ గా మీ కెరీర్ :
1943లో భాగ్యలక్ష్మి సినిమా తీశారు. అందులో కమలా కోట్నీస్ యాక్ట్ చేశారు. ఆవిడకు ప్లే బ్యాక్ నేను పాడాను, అదీ బి.ఎన్.ఆర్. గారి ప్రోత్సాహం తో. ఆ సినిమాకి నేను పాడిన పాట "తిన్నే మీద చిన్నోడా" తెలుగులో మొట్ట మొదటి ప్లే బ్యాక్ వేరే వారికి పాడినది.
మీ వివాహం, తదనంతరం మీ కెరీర్ :
నా 15వ ఏట అంటే 1944 లో కోలంక రాజా వారితో (వెంకటగిరి సంస్థానం) నా వివాహం అయ్యింది. ఆ తరవాత పాటకి శృతి తప్పింది. ఇంట్లో వారు ఇలా సినిమాలలో పాడటం చిన్నతనంగా భావించేవారు. కాబట్టి వారికి చెప్పి, నా చేత పాటలు పాడించడం మాన్పించేశారు. ఏ.ఐ.ఆర్. కి మాత్రం పాడటానికి అనుమతి ఇచ్చారు.
ఆ తరవాత నా అంతట నేనే కొన్ని పాటలు కంపోస్ చేసుకొని రేడియో లో పాడాను. "చలి గాలి వచ్చింది", "నల్లని వాడా నీ గొల్ల కన్నెనోయి", "హాయమ్మ హాయి బంగారు పాపాయి", "గోపాల కృష్ణుడు" చాలా ప్రాచుర్యం పొందాయి. అలా గత 5-6 సం||ల వరకు పాడాను.
మీరు ఎటువంటి పాటలు పాడటానికి ఇష్టపడతారు :
ఆర్టిస్ట్ వాయస్ కల్చర్ కి తగినట్టుగా పాటలు ఇస్తే ఎలాంటి పాటలైనా వినసొంపుగా ఉంటాయి. అలా కాక నా చేత అరుపులు, హై పిచ్ లో పాడిస్తే అవి కర్ణకఠోరమే. అందుకే కొన్ని పాటలు పాడననే చెప్పాను. నాకు సాటిస్ఫాక్షన్ లేని పాటలు ఎంత బలవంత పెట్టినా పాడలేను.
అప్పటి మీ తోటి గాయనీగాయకులతో మీ సాన్నిహిత్యం :
అప్పుడు పాడిన వారిలో ఎం.ఎల్. వసంత కుమారి , పి.ఎం. పెరి నాయక్ , టి.వి. రత్నం వీళ్లంతా తమిళ్ గాయనీమణులు. నా తరవాత పాడినవాళ్ళలో జిక్కి, లీల, జమునారాణిలతో సన్నిహితం కలదు.
జెమిని స్టూడియోస్ వారు "రాజీ నా ప్రాణం" అనే సినిమాకి "మల్లె పూలు మొల్ల పూలు" అనే పాట వెస్టర్న్ స్టైల్లో పెట్టారు, అంత రేంజ్ లో పాడటానికి కొద్దిగా కష్టపడ్డాను. నాతో పాడేటప్పుడు ఘంటసాల వారి శృతి తగ్గించుకొని పాడేవారు. ఏ.ఎం. రాజా గారిది నాతో సరిగ్గా సరిపోయేది.
ఇష్టమైన పాట :
తెనాలి రామకృష్ణలో "ఝం ఝం కంకణములు మ్రోగ"(జావలి), స్వప్న సుందరి లో పాటలు అన్నీ ఇష్టము.
కష్టపడి పాడిన పాట :
"రాజీ నా ప్రాణం" లో "మల్లె పూలు" పాట 5 రోజులు పట్టింది రికార్డ్ చేయాడానికి. చిన్న తప్పుకే మళ్ళీ మొత్తం పాట మొదలెట్టాల్సి వచ్చేది. 60- 70 మంది ఆర్కెస్ట్రాలో ఏ ఒక్కరు తప్పు వాయించినా మళ్ళీ కథ మొదటికే. ఇలా ప్రాణాలు తోడింది "రాజీ నా ప్రాణం".
ధరణికి గిరి భారమా పాట గురించి :
ఈ పాట సినీ ప్రపంచానికి దూరమయ్యే ముందు పాడిన పాట , చాలా ప్రజాధరణ పొందింది.
అభిమాన గాయనీ గాయకులు :
ట్యూన్, సంగీతము నచ్చితే ఏ పాటైనా ఎవరు పాడినా వింటాను. ఎవరైనా ఒరిజినల్ వాయిస్ లో పాడితే చక్కగా ఉంటుంది, ఫాల్స్ వాయిస్ లో కీచు గొంతుతో పాడితే కర్ణకఠోరమే.
ఇష్టమైన రాగం :
భీంపలాస్ "తలపు తీయునంతలోనే తత్తరపాటు ఎందుకోయి" సి.వి. సుబ్బరామన్ చేసిన ఆ రాగం ఇప్పటికీ మరువనిది. ఎస్. రాజేశ్వరరావు గారికి కూడా ఇష్టమైన రాగం ఇదే. ఆయన ఎక్కువ పాటలు చేసినది కూడా ఇదే రాగం లో. మేము ఎక్కువగా పాడినది ఈ రాగం లోనే అవడం మూలంగానేమో చాల ఇష్టమైన రాగం అయ్యింది.
సినిమాలో చివరి పాట :
"సంఘం చెక్కిన శిల్పాలు" (విజయనిర్మల తీసినది) లో నాచేత పాడించింది. రమేశ్ నాయుడు గారి సంగీత దర్శకత్వంలో.
ఈ నాటి పాటల పై అభిప్రాయము:
భాష రానివారి చేత కూడా పాడించినప్పుడు అందులో భావం, తప్పొప్పులు చెప్పి పాడించాలి. అప్పుడే పాట సుస్థిరంగా ఉంటుంది. ఆ రోజుల్లో ఎస్. రాజేశ్వర రావు గారు, సుసర్ల దక్షిణా మూర్తి , పెండ్యాల సి.వి. సుబ్బరామన్ గారు... వీరందరు నా తరవాత వచ్చిన వారే, కానీ నాకంటే పెద్దవారు. వారిని ఈ రోజుకీ గుర్తు పెట్టుకునేలా చేసింది వారి ఆహ్లాదకరమైన పాటలే.
అవార్డ్స్ :
ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు.
ప్రస్తుతం మీ జీవితం:
1974లో భర్త పోయాక మైసూర్ లో సెటిల్ అయ్యాను. కానీ ఎన్.టి.ఆర్. నన్ను ఆంధ్రాకి రమ్మని బతిమాలి తగిన స్థానాన్ని ఇస్తామని అన్నారు. కాని తీరా వచ్చాక ఆయన పదవి నుండి, ఆ తరవాత శాశ్వతంగా పోవడంతో నేను మళ్ళీ ఏ గుర్తింపు లేకుండా ఉండిపోయాను.
గాయనిగా మీ ప్రస్థానంలో ఒక చోట ఆగిపోయారు.. గాయనిగా మీరు కోల్పోయినదేంటి?
నా తరవాత వచ్చిన ఎందరో గాయనీమణులు చాలా ఖ్యాతి పొందారు, అది వారి అదృష్టము, వారి విద్వత్తు కి ఒక మైలు రాయి కావచ్చు, కానీ వారు మంచి సంగీత దర్శకుల చేతిలో పడటం వజ్రానికి సాన పెట్టడం లాంటిదే. కొందరు సంగీత దర్శకులు చేసిన ప్రయోగాలు వారికి వరాలయ్యాయి.
జానకి సన్నాయితో కలిసి ఆలపించిన పాట, ఎస్.రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో సుశీల పాడిన వీణ పాటలు, వారి ఖ్యాతి కిరీటంలో చక్కటి మణులు. ఇలాంటి అవకాశాలు నాకు లభించలేదు.
ఈ వయసులోనూ ఏమాత్రమూ విసుగు లేకుండా అడిగీ ప్రశ్నలన్నింటికీ చాలా శాంతంగా, వినయంగా జవాబిచ్చిన 'బాల సరస్వతీ దేవి " గారికి కృతజ్ఞతలు. భగవంతుడు ఆవిడకు ఆయురారోగ్యాలు ఇవ్వలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Thursday, August 17, 2017
శ్రీ కొంపెల్ల రామకృష్ణ గారు
మేరుపర్వత గంభీరులు, సున్నిత మనస్కులు, మూర్తీభవించిన సంస్కారము, సాహితీ ప్రియులు, అన్నిటి కన్నా ముఖ్యంగా చెప్పుకోదగిన విశేషం... ఆయన నడిచే తెలుగు నిఘంటువు.... ఆయనే శ్రీ కొంపెల్ల రామకృష్ణ మూర్తి గారు. వారిని చూడటమే ఒక యోగం, ఆయనతో మాట్లాడటమే ఒక భాగ్యం, ఆయన ఆశీస్సులు పొందటం పూర్వ జన్మ ఫలము.
శ్రీ కొంపెల్ల రామకృష్ణ గారు 1949 డిసెంబరు 25 న జన్మించారు. వారు తల్లి శ్రీమతి కామేశ్వరమ్మ గారు, తండ్రి శ్రీ వేంకటేశ్వర్లు గారు. వారి విద్యాభాస్యం కొవ్వూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠములోనూ, ఆంధ్రా విశ్వవిద్యాలయంలోను జరిగింది. వారు 1976 నుంది 2007 వరకు గోదావరిగని లో సీనియర్ తెలుగు పండితుడిగా చేసి ఎందరినో విద్యావంతులుగా చేశారు. వారి తెలుగు భాష అమోఘము. వారు గొంతెత్తి పద్యము పాడితే చెవులకు తుప్పులొదిలిపోవాల్సిందే! తేనెలో ఊరేసిన రసాలమామిడి ఆయననోట తెలుగు మాట. ఒకప్పుడు దూరదర్శన్ లో ఏలూరుపాటి అనంతరామయ్య గారు నిర్వహించిన 'పద్యాల తోరణం " లో వారు పాల్గొన్నారు.
వారి రచనలు :
1. వెన్నెలలో వడగాల్పులు
2. సంకీర్ణ సంధ్య (కవితా సంకలనాలు)
3. తమసోమా జోతిర్గమయ
4. స్మరణ సందేశాలు ( లఘు వ్యాసాలు)
5. మానవతా మందిరం ( లఘునాటికలు)
6. దక్షయజ్ఞం (పౌరాణిక నాటకం)
7. ధర్మప్రభ (సందేశాత్మక వ్యాసాలు)
చాణక్య నీతి అని రోజుకొక పద్యం ఫేస్ బుక్ లో పెడుతూ తెలుగు భాషా సేవ చేస్తున్నారు. అంతే కాదు "ఆంధ్ర మహాభారతా " న్ని ఎందరికో అందుబాటులోకి తీసుకొని రావడానికి సులభమైన భాషలో రాస్తున్నారు. త్వరలోనే అది కూడా పూర్తవుతుంది.
వారి అర్ధాంగి భాస్కర లక్ష్మిగారు కూడా అన్నిటా ఆయనకి సమానురాలే! వారిరువురిని కలిసే భాగ్యము నాకు లభించింది. వారి ఆదరాభిమానాలు పొందగలిగిన అదృష్టవంతురాలిని నేను. మాష్టారు, పిన్ని గారు.... అనేక పాదాభివందనాలు.
మాష్టారూ! గంగా జలం తీసుకొని రాడానికి నేనో చిన్న గిన్నె తీసుకొని వెళ్ళిన అమాయకురాలిని. మీ నుంచి కూడా అలానే కొంచమే తీసుకొని రాగలిగాను. ఇది నా తెంపరితనముగా భావించకండి, నా అమాయకత్వం అని గ్రహించి క్షమించండి!
Friday, July 28, 2017
తుం ఆగయే హో....
పెనం మీద వేడి వేడి పెసరట్టు నోరూరిస్తోంది! తినాలని ఉంది కానీ... తనతో పాటు తింద్దామని ఒక ప్లేట్ లో తనకి రెండు, నాకు ఒకటి ఉంచాను. నిన్న కూడా అంతే... తనకి నా చేతి ఇడ్లీలంటే ఇష్టమని, నేను తినకుండా తన కోసం వైట్ చేసి చివరకి రాత్రి ఆ చల్లారిన ఇడ్లీనే తిని ఉన్నాను. నేనే తన గురించి ఇంత ఆత్రము పడాలి కానీ, అసలు తనకి నేను గుర్తొస్తానా? వెళ్ళి పదిహేను రోజులయ్యింది, ఒక్క సారైనా ఫోన్ చేస్తే కదా! నేను చేద్దామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉంది. ఇదేం మనిషో! కాసంత అభిమానం కూడా లేదు! రోజు తనతోటే టీ తాగే అలవాటు, టీ తాగుతొన్నంత సేపు ఎన్ని కబుర్లో! ఏంటో ఇప్పుడు ఒక్కదాన్నే తాగుతోంటే చాలా వెలితిగా ఉంది. తను వచ్చాక కొన్ని రోజులు మాట్లాడకూడదు. ముభావంగా ఉండాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అలుసు అయ్యిపోతాను! తనకిప్పుడు వాళ్ళ వాళ్ళతో టైం పాస్ అవుతుండవచ్చు, నాకే అంతా శూన్యం గా ఉంది లైఫ్! 😞
" తెరే మేరే హోటో పే మీటే మీటే గీత్ మిత్వా " అని కాలింగ్ బెల్! ఒకప్పుడు కాలింగ్ బెల్ "డింగ్ డాంగ్ " అని మ్రోగేవి. అదేంటో ఇప్పుడు పూర్తి పాటలు. ఏం "మీటే మీటే గీత్" వినిపిస్తుందో వచ్చి! ఈ పాట హిందిలో "చాందిని " సినిమాలోది. ఇదే డబ్బింగ్ కూడ అచేస్తే మా క్లాస్ లో ఒక తుంటరి "నీకీ నాకి పెదవులలో తియ్య తియ్యని పాటలే ప్రియా " అని మక్కికి మక్కి అనువాదం చేసింది. ఈ పాట ఎప్పుడు విన్న నాకు ఆ తెలుగు పారెడి గుర్తొస్తుంది! 😋
తనేమో అని ఆత్రంగా వెళ్ళి చూస్తే పక్కింటావిడ! ఆవిడ ఎందుకొచ్చిందో అర్ధమయ్యింది. కాస్త కాఫీ చేసి ఆవిడకో గ్లాస్, నాకో గ్లాస్ తెచ్చుకొన్నా! ఏవేవో కబుర్లు చెబుతోంది. "ఇంకా తను రాలేదా? " అని అసలు ప్రశ్న వేసేసింది. కళ్ళలో నుంచి ఉబుకి వస్తోన్న నీటిని ఆపుకొని.. "లేదండి " అని ఏదో పనునట్టు వంటింట్లోకి వచ్చేశా! 😢😢ఆవిడ తన గురించి కనుకోడానికే వచ్చింది. కాఫీ తాగి కాసన్ని ఊసుబోని కబుర్లు చెప్పి వెళ్ళింది.
టైమ్ పదయ్యింది... ఇంక ఈ రోజు తను వచ్చే అవకాశాలు తక్కువే! ఇంక తప్పద్దు.. తినాలి! ఏ పాటు తప్పినా సాపాటు తప్పదు కదా... వంటింట్లోకి తప్పనిసరై వెళ్ళాను. "ఏం వండాలి? ఏదో సింగిల్ ఐటమ్ చేసేసుకుంటా! ఆకలి తీరాలి అంతే! " రుచుల మీద మనసు వెళ్ళడం లేదు! గత పదిహేనురోజూల నుండి తినాలి కాబట్టి తింటున్నాను! కాళ్ళు ఒళ్ళు ఒకటే నొప్పి... తను రాగానే ఈ విషయం కూడా చెప్పాలి... ఈ నొప్పులకు కారణం తనేనని!!! 😞😔
మళ్ళీ కాలింగ్ బెల్ మ్రోగింది... " తుం ఆగయే హో నూర్ ఆగయా హై " . మనసులో ఏదో మూల చిన్న ఆశ, అదే ఆశతో తలుపు తీశా!
"తనే "... నిజమే తను రావడమే నా ఇంటికి నూర్ వచ్చింది. మరే నా ఇంటికి దీపం తనేగా... అబ్బా.. వసంతం వచ్చినంత ఆనందంగా ఉంది! 😍😍😍😍
"రా లక్ష్మి " అంటూ సాదరంగా ఆహ్వానించాను.. మా ఇంటి పనిమనిషిని! (బెట్టు చేసి మాట్లాడకపోతే... మళ్ళీ మానేస్తుందన్న భయంతో)!! 😀
Subscribe to:
Posts (Atom)











