Search This Blog
Monday, April 23, 2018
Tuesday, April 10, 2018
జ్ఞాపకాలు
"పాతా...బాతా... సీతామ్మా " అంటూ రోజూ మధ్యాహ్నం ఒకతను వీధుల్లో అరచుకుంటూ వెళ్ళేవాడు. సీతకి ఈ " పాత.. బాత "ఎంటో చాలా రోజులు అర్ధం కాలేదు. రోజు మిడసరి లగ్నంలో వచ్చేవాడు. నెత్తిమీద ఒక గంప పెట్టుకొని అందులో ఏవో కొన్ని గిన్నెలు పెట్టుకొని అరుస్తూ వీధి వీధి తిరిగేవాడు. అతను అరుస్తుంటే చిన్నపిల్లలమేమో (అప్పుడు) మేమూ అదే స్టైల్ లో అరవడానికి ప్రయత్నించేవాళ్ళం. ఓసారి మా చిన్నమావయ్య మేము అన్నది విని నవ్వి, ఆ వీధిలో అతను "పాతా బాతా సీతామ్మా " అని అరవడం లేదు.. "పాతా బట్టలకి స్టీల్ బాసాన్లమ్మా " అని అరుస్తున్నాడని గీతాబోధ చేశాడు. 😄
రోజూ పొద్దు పొద్దుటే ఆరు, ఆరున్నర మధ్యలో, మళ్ళీ సాయంత్రం ఐదూ ఐదున్నర మధ్యలో సైకిల్ మీద ఒకతను వచ్చేవాడు.. అతను ప్రతీ వీధి తిరుగుతూ "బుల్లమ్మా " అని అరచుకుంటూ వెళ్ళేవాడు. పాపం ఎవరో బుల్లమ్మ ని వెతుకుంటున్నాడేమో అని అనుకునేదాన్ని నేను. మధ్య మధ్యలో కొందరి ఇంటి లోపలకి వెళ్ళీ ఒక పొట్లం ఇచ్చి బుల్లమ్మని వెతుకునేవాడు..పాపం. తరవాత కాలం లో అర్ధమయ్యింది ఏమిటంటే అతను "బుల్లమ్మ " ని వెతుకోవడం లేదని అతను "పూలమ్మా " అని అరుస్తూ అమ్ముకునేవాడని. 😜
అలాగే వీధిలో "మౌజ్ " అని అరిచేవాడు.. ఎదో ఎలక అమ్మేవాడు అనుకునేవాళ్ళం.. తీరా చూస్తే అది "చీటీ వాలా మౌజ్ (అదేనండి చుక్కల అరటి పళ్ళు).
మా ఊరులో ఇలాగే "ప్పో... " అంటూ మిట్ట మధ్యాహ్నం పూట ఒకడు వచ్చేవాడు. అతను అమ్మేది "ఉప్పు " . ఎప్పుడూ ఉప్పో అని అమ్మేవాడు కాదు, ఆ ఊరిలో ఎవరిదేనా పెళ్ళి కుదిరితే " పెళ్ళివారుప్పో " అనీ, పెళ్ళి అయితే "కొత్త కాపురం ఉప్పో " అని, లేకపోతే "అత్తాకోడలుప్పో " అనో , ఎండా కాలం లో "ఆవకాయుప్పో " అని అరుస్తూ ఉండేవాడు. ఒకసారి మా పక్కూరిలో ఒక ఇంట్లో అత్తాకోడళ్ళు కొట్టుకొని వేరింటి కాపురం పెట్టుకొన్నారు, ఆ ఊరు వెళ్ళి ఈ ఉప్పు అతను " వేరింటి కాపురం ఉప్పో " అని అరిచాడు. పాపం అతన్ని ఎముకళ్ళొకి ఉప్పులేకుండా కొట్టేశారు ఆ అత్తాకోడళ్ళు. 😢😢😢😢😢
ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ఈ రోజు మా వీధిలోకి "ప్పో " అని అరుస్తూ ఒకావిడ వచ్చింది. వెళ్ళి చూస్తే అది "ఉప్పు " కాదు.. "సొప్పు (ఆకుకూరలు). ఇదిగో పైన చెప్పిన వారందరూ గుర్తుకొచ్చేశారు. 😎
Saturday, March 31, 2018
మన్నెం శారద గారు
ఒక చేతితో కలాన్ని, ఇంకో చేతితో కుంచెని అవలీలగా వాడే నిపుణురాలు... పోటీ కథలకు కేరాఫ్ ఎడ్రస్ ఆవిడ. ముప్పై ఏళ్ళుగా వెయ్యకు పైగా కథలు, నలభై నాలుగు నవలలూ, టి.వి సీరియల్స్ కి స్క్రిప్ట్లు, మరెన్నో కాన్వర్స్ బొమ్మలకు సజీవం పోస్తోన్న కళామతల్లి... శ్రీమతి మన్నెం శారద గారు.
వృత్తి రీత్యా ఒక ఇంజినీర్ అయినా... ఆవిడలో ఉన్న భావుకత ఎన్నో కథలకు ప్రాణం పోసింది. ఎన్ని ఉన్నా ఏమాత్రం మిడిసిపడని వినయం ఆవిడ సొంతం. ఈ ఎందరో మహానుభావుల శీర్షిక ద్వారా ఆవిడని కలవడం నా అదృష్టం!! ఆవిడ నడిచే ఒక గ్రంధాలయం... నవ్వుల సాగరం!
ఆవిడ ద్వారా ఆవిడ జీవిత విశేషాలని తెలుసుకుంద్దాము!!
Saturday, March 24, 2018
శ్రీరామ నవమి
చైత్రమాసం ఆరంభం.. అప్పుడప్పుడే ఎండలు కొంచం కొంచం ముదురుతూ ఉంటాయి. తెల్లవారుజామునే "కౌశల్య సుప్రజా రామా " అంటూ అటు రాముణ్ణి ఇటు ఇంట్లో జనాలని నిద్రలేపే సుప్రభాతాలు. బయట మా వీధికొచ్చే ముసలితాత హార్మోనియం పట్టుకొని " జయ జయ శ్రీరామా రఘువరా " అంటూ ఇంకో సుప్రభాతం. సుప్రభాతం అవ్వడమేమిటి... "అదిగో భద్రాద్రి.. గౌతమి ఇదిగో చూడండి " అంటూ అపర రామదాసులాగా మన బాలమురళీ కృష్ణగారు మనల్ని ఉన్న చోట నుంచే భద్రాచలం తీసుకొని ఆ పుణ్య గౌతమితో పాటూ రాములోరి దర్శనం చేయించేసేవారు. ఇంతలో పక్కన ఉన్న ఐసోల రామం గారి ఇంట్లో నుంచి రామ రక్షా స్త్రోత్రంతో శ్రీరామ పట్టాభిషేకం మొదలయ్యేది. ఆ పక్క వీధిలో రామాలయంలో నుంచి మంత్రాలుతో రామ కల్యాణానికి అంకురార్పణ మొదలయ్యేది.
తలంటు పోసుకొని కళ్ళల్లో కుంకుడి రసం పడిన మంట ఒక వైపూ, ఎండలో పట్టు పరికిణీ చిరాకు ఇంకొక వైపూ, చిక్కు జడలో మల్లెపూల బరువు ఒక వైపూ, ఇన్ని చిరాకులలతో ఆ రామ దర్శనానికి వెళ్తూ ఉన్న ఆనందం.. ఉగాది పచ్చడి తిని ఇంకా వారమే అవుతోంది కదా.. ఆ రుచులు ఇలా జీవితంలో అగుపడతాయేమో అని అనిపిస్తూ ఉండేది.
రామాలయంలో రాముడికి ఒక దండం, వస్తూ వస్తూ అమ్మత్త వాళ్ళ రాముడికి ఇంకో దండం, ఆ తరవాత మా పక్కింటి ఐసోల రామం గారి రాముడికి ఇంకో దండం. ఏ మాటకా మాట చెప్పుకోవాలి. రామ పట్టాభిషేకం మా ఐసోల రామం గారి ఇంట్లో చాలా బాగా జరిగేది. మంత్రం పుష్పం చాలా బాగా చదివేవారు ఆయన, ఇంకా సాంభ శివ రావు గారూ! ఆ పూజ చూసి ఇంటికి వచ్చి ఇంట్లో టి.వి. లో లవ కుశ చూసేవాళ్ళం. ఈ లవ కుశ చూడలేని రామ నవమి మా చిన్నప్పుడు లేనే లేదు. ఆ సినిమా అవుతుండగా ఇంతలో రేడియో లో భద్రాద్రి రామయ్య కల్యాణం పెట్టేవారు. వ్యాఖ్యానం ఉషశ్రీ గారూ, మల్లాది వారు! అబ్బా.. ఇంతవరకూ నేను ప్రత్యక్షంగా భద్రాద్రి రామయ్య కల్యాణం చూడలేదు కానీ అలా అని నాకు ఎప్పుడూ అనిపించకపోవడానికి కారణం మల్లాది వారే! "అమ్మా.. సీతమ్మా! కాస్త తల పైకెత్తి రాముల వారిని చూడమ్మా" అంటూ ఆ కల్యాణ వైభోగం అంతా కళ్ళకు కట్టేవారు! ఆ కల్యాణం సరిగ్గా మిడసరి లగ్నం లో అయ్యేది. ఇటు వైపు రేడియోలో భద్రాద్రి రామయ్య కల్యాణం, ఇంకో వైపు నుంచి పక్కన ఐసోల రామం గారి ఇంట్లో నుంచి గట్టి మేళం, ఆ పక్క నుంచి పక్క వీధి రామాలయం నుంచి మంత్రాల మధ్య అంగరంగ వైభవంగా ఆ సీతారామ కల్యాణం జరిగేది. కల్యాణం అయ్యిన వెంటనే "శ్రీ సీతారాముల కల్యాణం చూదము రారండి " పాట! ఈ పాట లేని శ్రీరామ నవమి కానీ పెళ్ళి కానీ ఉండదంటే అతిశయోక్తి కాదేమో!!
ఇవన్నీ అయ్యాక ఇంట్లో నైవేద్యం పెట్టిన పానకం, వడపప్పు ప్రసాదం తినడం. ఆ పానకం కూడా ఒక పక్క తీయగా ఇంకో పక్క మిరియాల ఘాటుతో భలే గొప్ప రుచిగా ఉండేది. "జనన మరణ భయ శోక విదూరం.. సకల శాస్త్ర నిగమాగమ సారం... "
ఆ ముచ్చట్లు దాటి ఈ జీవిత ప్రయాణం లో ఎంతో ముందుకి వచ్చినా... శ్రీరామ నవమి అనగానే మనసు మాత్రం అక్కడ నుంచి రానంటోంది!!
మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు.. శ్రీరామ రక్షా!!
Wednesday, March 21, 2018
నాకు ఇష్టమైన పద్యము - 1
వేదపురాణశాస్త్ర పదవీ నదవీ యసియైన పెద్దము
త్తైదువ కాశికానగర హాటకపీఠి శిఖాదిరూఢ య
య్యాదిమ శక్తి సంయమివరా! యిటు రమ్మని బిల్చె హస్తసం
జ్ఞాదర వీల రత్నఖచితాభరణంబులు ఘల్లు ఘల్లునన్
ఈ పద్యము శ్రీనాధుడు వ్రాసిన "కాశీఖండము " లోనిది. సకల వేదాలకు, సమస్త పురాణాలకు, సకల శాస్త్రాలూ నిర్దేసిస్తున్న మార్గానికి దగ్గరగా వున్న పెద్దముత్తైదువ, కాశీ నగరం అనే బంగారుపీఠం పై అధిరోహించిన ఆ ఆగమశక్తి , చేతితో సంజ్ఞ చేసింది. అప్పుడామె రత్న ఖచితమైన ఆభరణాలు ఘల్లు ఘల్లుమన్నాయి. అలా ఘల్లు ఘల్లుమంటున్న ఆ గాజుల శబ్ధంతో ఆవిడ " ఓ సమ్యమివరా! ఇటు రమ్ము " అని వ్యాసుడిని పిలిచింది.
ఒకసారి వేదవ్యాసుడు తన శిష్యగణముతో కాశీ నగరానికి చేరుకున్నాడు. అతనికి ఆ రోజు ఎక్కడా భోజనము దొరకలేదు. వ్యాసుడు అతని పది వేలమంది శిష్యులు భుజిస్తే కానీ భుజించకూడదన్న నియమము పెట్టుకున్నాడు. అలా ఆ రోజు భిక్ష దొరకలేదు. మరునాడు కూడా ఎవరి ఇంటా భిక్ష దొరకలేదు. ఆ క్షుద్బాధకు తాలలేక వేద వ్యాసుడు భిక్ష పాత్రను వీధి మధ్యలో పగుల గొట్టి " కాశీ వాసులకు మూడు తరాల వరకు విద్య, ధనమూ, మోక్షమూ లేకుండా పోవాలని " శపించాడు .
ఇంతలో ఒక ఇంటిలోనుంచి సామాన్య స్త్రీలాగా పార్వతీదేవి వచ్చి " నీకు గొంతు దాకా తినడానికి మధుర భక్షాలు లేవని ఇలా గంతులు వేస్తున్నావు. ఇక్కడ ఉన్న మునీశ్వరులు, యతులు నీ కన్న తెలివి తక్కువ వారా? ఉన్న ఊరు కన్న తల్లి తో సమానము. ఈ కాశీ మోక్షకాపురి... శివుని భార్యలాంటిది. నీకు తిండి దొరకలేక లేదని కాశీనే శపిస్తావా? నీవు ఆకలితో వున్నావు, మా ఇంటికి భోజనానికి రా " అని ఆహ్వానించింది.
"అమ్మా! నేను నా పది వేలమంది శిష్యులతో వచ్చాను. వారు భుజించనిదే నేను భుజించ కూడదన్న నియమముతో ఉన్నాను " అని అన్నాడు.
"మునీశ్వరా... నీవు నీ శిష్యులను వెంట బెట్టుకొనిరా! ఆ ఈశ్వరుడి దయ వల్ల ఎంత మంది అతిధులు వచ్చినా అందరికీ కోరిన అన్నము పెడతాను " అని అభయమిచ్చింది ఆ అన్నపూర్ణాదేవి.
మొదట కోరిన పదార్ధాలతో క్షుద్బాధ తీర్చి, ఆ తరవాత జ్ఞాన భోధ కూడా చేసింది ఆ విశాలాక్షి.
Tuesday, February 20, 2018
ఋష్యేంద్రమణి
ఈ మధ్య "మాయాబజార్ " సినిమా చూశా.. (మొదటి సారి కాదు.. ఎన్నో సారో గుర్తు లేదు). సుభద్ర,అభిమన్యులును కృష్ణుడు దారకుడికి అప్పగించి "ఘటోత్కజుడి ఆశ్రమం" కి తీసుకెళ్ళమని చెబుతాడు. తీరా వెళ్ళేటప్పుడు మాధవపెద్ది సత్యం పాట.. అదేనండి భళి భళి భళీ దేవా వస్తుంది. ఆ దారకుడు కూడా మాధవ పెద్ది సత్యమే ( ఇది మాకు తెలుసు అనకండి). పాట అయ్యేటప్పటికి రాక్షసులు అభిమన్యుడిని అడ్డగిస్తారు. వారందరినీ చంపేస్తాడు అభిమన్యుడు. ఇంక ఘటోత్కచుడు ఎంటర్ అవుతాడు. కాసేపు ఫైటింగ్ అయ్యాక.. "పేరు చెప్పి శరణు వేడు, వదిలేస్తా " అని వార్నింగ్ ఇస్తాడు ఘటోత్కచుడు. "పిరికివాడిలా పేరు చెప్పడం ఎందుకు " అని భీష్మించుకుంటాడు అభిమన్యుడు. ఇంతలో ఘటోత్కచుడి గద తగిలి అభిమన్యుడు మూర్చపోతాడు.
మన సుభద్ర గారు విల్లు ధరించి....
"అఖిల రాక్షస మంత్రతంత్ర అతిశయమణచు శ్రీకృష్ణుని సోదరినగుదునేమీ
దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనకు అర్జును పత్నినే అగుదునేని "
అంటూ అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల 'ప్రవర ' చెప్పేస్తుంది. ఉత్తి పేరు చెప్పమంటే ఇంత సీన్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఇంత గొప్ప పరిచయమా? అదేదో ముందుగా చెప్పి ఉంటే అభిమన్యుడు మూర్చ పోయేవాడు కాదు కదా!
అదీ కాక " ఈ శరంబు అసురు గూల్చి సిద్ధించు గాక.. పాండవకులైక భూషణ ప్రాణ రక్షా " అని అంటుంది. ఈ పద్యము "ఋషేద్ర మణి గారు " బహు బాగా పాడారు కానీ.. "పాండవ కులైక భూషణుడు " అభిమన్యుడొక్కడే కాదు కదా? ఎదురుగ ఇంకో భూషణుడు అదే ఘటోత్కచుడు ఉన్నాడు. అదీ కాక ఉపపాండవులూ ఇంకా ఉన్నారు ( సినిమాలో పాండవులే లేరు ఈ ఉపపాండవులెక్కడా అని అడగకండి). ఇంత మంది భూషణులు ఉండగా పాపం ఆవిడ ఎకైక భూషణుడని అభిమన్యుడికి కీర్తించేస్తే ఎలా? ఇది అప్పుడు ఎవరూ అడగలేదా? అడిగినా చక్రపాణి గారు , పింగళి గారు "ఎవరూ కల్పించకపోతే కట్టు కథలు ఎలా పుడతాయి ? " అని అనేశారా?
అప్పుడు వాళ్ళు అడగకపోయినా ఇప్పుడు నేను అడుగుతున్నాను. ఏడిచినట్టే ఉంది.. ఎవర్ని అడుగుతావు అని అడగొద్దు. నా ప్రశ్న ఏడ్చినట్టున్నా, ఏడ్చి మొహం కడుకున్నట్టున్నా.. అడిగేస్తాను.. అంతే!
ఈ రోజు ఋష్యేంద్రమణి గారి పుట్టినరోజు... ఆ పద్యం... ఆ ఠీవి చూసేయండి.. ఈ ప్రశ్నలన్నీ మరచిపోవచ్చు.
Thursday, February 1, 2018
రాజన్- నాగేంద్ర
సప్తస్వర.. ఆయన నివాసం
సరిగమలు.. వారి నేస్తం
సరస్వతీదేవికి వారి ఇల్లే ఆవాసం
రెండు దశాబ్ధాలు దక్షిణ సినిమా సంగీతాన్ని ఏలినది ఆ యుగళం...
వారే... రాజన్- నాగేంద్ర.. సంగీత ద్వయం...
ఖైదీ కన్నయ్య చేత ' పూజ ' లెన్నో చేయించి, వారికి "నవగ్రహ పూజా మహిమా " 'కనకదుర్గ పూజా మహిమ ' తెలియచేసి,' సొమ్మొకడిది సోకొకడిదిగా ' జల్సా చేస్తూ, 'అప్పుల అప్పారావు' గా ఉన్న' అల్లరి బావ ' 'నాగమల్లి 'ని చూసిన వెంటనే 'ప్రేమఖైది ' ని చేసి, ఆ 'అమ్మాయి మనసు ' ని అర్ధం చేసుకుని, వారి 'చూపులు కలిసిన శుభవేళ ' వారి చేత 'పణయ గీతం ' పాడించి, వారి ప్రేమని 'మంచు పల్లకి ' ఎక్కించి, వారిని "మూడు ముళ్ళ బంధం' తో కలిపి వారిని "వయ్యరి భామలు - వగలమారి భర్తలు " చేసి, వారి "ఇంటింటి రామాయణాన్ని " ' పంతులమ్మ ' గా మనందరికీ తెలియచేసి ' కోటికొక్కడు ' గా మిగిలిన 'అగ్గి పిడుగు " లు రాజన్ నాగేంద్ర గార్లు.
ఎనుబది పదులలో కూడా సంగీత సేద్యం చేస్తున్న వారు రాజన్ గారు. ఆ మహానుభావుడు నిత్య సంగీత కృషివలుడు . వారు ప్రస్తుతం బెంగుళూరు నగరంలో ఉంటున్నారు.
ఐరావతం రాజప్ప గారు చాలా గొప్ప సంగీతాభిమాని మరియూ గొప్ప సంగీత నిపుణులు. వారు తబలా, హార్మోనియం, వీణా, ఫ్లూట్ వాయించగలిగేవారు. వారి కొడుకులు రాజన్- నాగేంద్ర గార్లు కూడా తండ్రికి తగిన తనయులే!
రాజన్ గారు 1932 లో మైసూర్ లోని శివరామ్ పేట లో జన్మించారు. వీరు తెలుగు వారే కానీ కొన్ని తరాల క్రితమే మైసూర్ లో స్థిరపడిపొవడం వలన ఎక్కువ కన్నడ కలిసిన తెలుగు మాట్లాడుతారు! రాజన్ - నాగేంద్ర కు హార్మోనియం, వేణువులు నేర్పిన మొదటి గురువు వారి తండ్రి అయిన రాజప్ప గారే! ఆ తరవాత బిడారం కిష్టప్ప గారి దగ్గర, దేవేంద్రప్ప గారి దగ్గర కర్ణాటక సంగీతం అభ్యసించారు. ఆ తరవాత బిడారం కిష్టప్ప తో కొన్ని కచేరీలు బెంగుళూరులోనూ, మైసూర్ లోనూ ఇచ్చారు ఈ అన్నదమ్ములు. రాజన్ నాగేంద్ర లో నాగేంద్ర గాయకుడు కూడా! ఒకసారి మైసూర్ ప్యాలస్ లో జరిగిన వీరి కచేరి విని వారికి సంగీత దర్శకులు గా అవకాశం దొరికింది. అలా వారు 'సౌభాగ్య లక్ష్మి " అనే కన్నడ సినిమాకు తొలిసారి సంగీత దర్శకత్వం చేశారు. ఈ సినిమాకి విఠలాచార్య దర్శకులు.
ఆ తరవాత విఠలాచార్య తెలుగులో తీసిన " కనకదుర్గ పూజా మహిమ " సినిమాకి కూడా ఈ జంటనే సంగీత దర్శకులుగా ఎన్నుకున్నారు. ఆ తరవాత వారు తీసిన "నవగ్రహపూజా మహిమ " సినిమాలో చాలా పాటలతో బాటు జానకితో ఘంటసాల ఆలపించిన "ఎవరో.. ఏల పగబూని సాధింతురు " అన్న పాట ప్రేక్షకాధరణ పొందింది. తెలుగులో వీరి మొదటి సినిమా " వద్దంటే పెళ్ళి ". "ఖైదీ కన్నయ్య " లో " తియతీయని తేనెల మాటలతో తీస్తారు సుమా " పాట కూడా ఆ రోజుల్లో చాలా పేరుపొందింది.
ఆ తరవాత "అగ్గిపిడుగు " సినిమాలో "ఏమో ఏమో ఇది " అన్న పాట కూడా ప్రఖ్యాతిగాంచింది. 1976 లో వచ్చిన "పూజ " సినిమా లో వారు సమకూర్చిన అన్ని పాటలు తెలుగునాట ఈ రోజుకి మారుమ్రోగుతున్నాయి.
1978 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నంది అవార్డ్లు సంగీత దర్శకులకు కూడా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఆ తొలి అవార్డు "పంతులమ్మ " సినిమాకు గానూ రాజన్ నాగేంద్రలకు దక్కింది. ఆ సినిమా తరవాత 'నవతా కృష్ణం రాజు " తీసిన ప్రతి సినిమాకు వీరే సంగీత దర్శకులయ్యారు.
సంగీత దర్శకత్వం వహించినకొన్ని తెలుగు సినిమలు :
పంతులమ్మ, ఇంటింటి రామాయణం, పూజ, సొమ్మొకడిది సోకొకడిది, నవగ్రహపూజా మహిమ, నాగమల్లి, తాతయ్య ప్రేమలేఖలు, అల్లరిబావ, అద్దాల మేడ, ప్రణయ గీతం, మంచుపల్లకి, వయ్యారిభామలు వగలమారి భర్తలు, నాలుగు స్థంబాలాట, అమ్మాయి మనసు, మూడు ముళ్ళు, పులి-బెబ్బులి, లంకె బిందెలు, రాజు-రాణి-జాకి, రెండు రెళ్లు ఆరు, ఆడపడుచు, చూపులు కలిసిన శుభ వేళ, ప్రేమ ఖైదీ, అప్పుల అప్పారావు, రాగ లీల, కోటికొక్కడు, దేవుని గెలిచిన మానవుడు, నాగార్జున, ఖైదీ కన్నయ్య, వరలక్ష్మీ వ్రతం, అన్నా చెల్లెలు, శ్రీ కృష్ణ గారడి, సర్దార్ ధర్మన్న, రౌడీ పోలీస్, వియజసింహ, అనురాగ బంధం, సీత పుట్టిన దేశం, అ ఆ ఇ ఈ....
నాగేంద్ర గారు కన్నడాలో చాలా సినిమాలకు పాటలు పాడారు. ఎక్కువగా హాస్య నటులకు వీరు గాత్రం సరిపోతుంది. వారు నవంబర్ 3 2000 సంవత్సరంలో కన్నుమూశారు.
ఎనిమిది పదుల వయసులో కూడా రాజన్ గారు సంగీత సేవ ఇంకా చేస్తూనే ఉన్నారు. వారు సమకూర్చిన కొన్ని పాటలు ఎస్.పి. బాలు గారి చేతా మరి కొందరు గాయకుల చేత పాడించి కొన్ని ఆల్బంస్ గా విడుదల చేశారు. ఇప్పుడు పురంధర దాసు కీర్తనలు స్వరపరుస్తున్నారు. కొంత మంచి యువ గళాలకు "వాయస్ కల్చర్ " మీద టుటోరియల్స్ ఇస్తున్నారు. వారి చేత పురంధర దాసు కీర్తనలు పాడించి ఆల్బంస్ గా విడుదల చేస్తున్నారు. వారి సేవ అద్వితీయం... ఆ సరస్వతీదేవి కటాక్షం వారి మీదా మెండుగా ఉంది. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలని ఇవ్వాలని కోరుకుంటున్నాను.
Subscribe to:
Posts (Atom)















