Search This Blog

Sunday, September 11, 2016

జాతీయాలు

1. అక్కన్న మాదన్నలు : ఎన్నటికీ విడని అన్నదమ్ములు, స్నేహితులను అక్కన్న మాదన్నలుగా పేర్కొంటారు. 
అక్కన్న మాదన్నలు రామదాసు మేనమామలు, తానీష దగ్గర పనిచేసే మంత్రులు. ఇలాగే రాహుకేతులు, జంటకవులు, జయవిజయులు, సుందోపసుందులు అని కూడా అంటారు. 


2. అగ్గిమీద గుగ్గిలం : కోపముతో రగిలిపోవడము. 

 దీపావళి నాడు నూనేలో ముంచిన బట్ట ఒక పుల్లకి చుట్టి దానికి మైనాన్ని రాసి వెలిగిస్తారు. అది వెలుగుతూ ఉండగా పైన గుగ్గిలం వేస్తారు. అది చాలా ఎక్కువగా మండుతుంది. 


3. అగ్రతాంబూలం :
ఏవైన యాగాలకు, పూజలు పూర్తి అయ్యాక ఒక యోగ్యత కలిగిన వ్యక్తిని పూజించి  తాంబూలమిచ్చి సత్కరిస్తారు. అలా సభలో ప్రముఖులకు అగ్రతాంబూలమివ్వడమని అంటారు. క్షీరసాగరమధనములో మొదట హాలాహలము పుట్టినప్పుడు దాన్నీ స్వీకరించమని దేవతలు శివుడికి అగ్రతాంబూలమిచ్చినట్టు పోతనగారు చెప్పారు. 
ఆ తరవాత రాజసూయాగములో ధర్మరాజు  శ్రీకృష్ణుడికి అగ్రతాంబూలమిచ్చి సత్కరించినట్లు మహాభారతములో పేర్కొంది. సభలో ప్రముఖలలో ముఖ్యులను గౌరవించడమే అగ్రతాంబూలము. 


4. అధః పాతాళం : తక్కువ స్థాయికి/ నీచ స్థాయికి  చేరడం.

భూమి కింద ఏడులోకాల్లో ఎంతో అడుగున ఉండే పాతాళంలో కూడా ఇంకా అడుగు భాగం.


5. అంధకరదీపిక (న్యాయం) : అశక్తుడు.
గుడ్డివాని చేతికి దీపం ఇస్తే ఎంత ప్రయోజనమో  అశక్తుడికి అవకాశమీయడము కూడా అంతే. 


6. అడవి కాచిన వెన్నెల : వృధా అవ్వడము. 
అడవిలో వెన్నెల కాచినా ఎవరికీ ఉపయోగము ఉండదు.  అలాగే వస్తువు(గుణము) ఉన్నా కూడా ఉపయోగపడకపోవడం. 


7.అగ్గి పగ  : నిప్పులాంటి దహించే కోపంతో కూడిన పగ. ఉద్దం సింఘ్ ఇందుకు చక్కని ఉదాహరణ, జలియన్ వాలాభాఘ్ లో చనిపోయిన తన మిత్రుల, బంధువుల శవాలను చూసి ఆ పగతో ఆ ఘాతకానికి కారకుడైన మైకేల్ ఓ డ్వయెర్ ని 21 సంవత్సరాల తరవాత కాల్చి చంపాడు. 


8.అగ్నిస్నాతుడు : అగ్నితో స్నానమాడిన వాడు అని అర్ధము. అంటే అగ్నిపునీతుడు. నిప్పులాంటి మనిషికి వాడే జాతీయము.  

9.అడుగంటింది : అయ్యిపోయింది, క్షీణించింది అని అర్ధము. 


10.అక్షింతలు వేయు: నిజముగా అక్షితలు వేయడం కాదు ఈ జాతీయము అర్ధము. తిట్టడానికి వ్యగముగా వాడే జాతీయము ఇది.  




11. అగ్నిపిండం(దుడుకుపిండం) : నీతి నిజాయితిలకు, స్వచ్చతకు  మారుపేరుగా నిప్పుని సూచిస్తారు. అలా ముక్కు సూటిగా వెళ్ళే వ్యక్తులకు ఈ జాతీయము ఉపయోగిస్తారు. కొంతమంది దరి చేరిన వారిని తమ ప్రవర్తనతోటి, మాటలతోటి బాధపెట్టే వాళ్ళకి కూడా ఈ జాతియము వాడుతారు. 

జాతీయాలు


జాతీయాలు - సామెతలు: మన నిత్య జీవితములో ఒక విషయాన్ని మరొక విషయముతో పొల్చేటప్పుడు  వాడే పదప్రయోగమే సామెత.. అంటే పోలిక. సామెత ఎక్కువగా ఒక వాక్యముగా ఉంటుంది. ఒక వ్యక్తికైన, ఆయా సందర్భమునికికేనా  పోలికను చెప్తూ ఉంటుంది.
సామాన్యంగా విడివిడిగా పొడిమాటలుగా ఉన్నవే, అపూర్వ సమ్మేళనంతో,  ఆ మాటలకు విడివిడిగా వేనికీ లేని ఏదో ఒక అపూర్వ భావ వ్యక్తీకరణకు మూలములై,  విశిష్ట పదబంధాలుగా భాషలో నిలిచిపోతున్నవి. వానినే పదబంధములనీ,  నుడికారములనీ,  పలుకుబడులనీ, జాతీయములనీ పేర్కొంటూ ఉంటాము. ఇవే కవితాలతాంకుర  ప్రధమాలవాలాలనీ  విజ్ఞులు భావిస్తారు. జాతీయాలు మారవు ఎప్పటినుండో ఉండేవి. సామెతలు మారుతూ ఉంటాయి.


జాతీయలు ఎక్కువగా పదబంధముగా ఉంటాయి. ఒక జాతికి సంబంధించిన విశిష్ట పలుకుబడి "జాతీయం, అందులో కనిపించే అర్ధము ఒకటి, నీగూఢార్ధము ఇంకొకటి. 


ఉదాహరణకు : కడుపులో మంట. ఈ జాతీయాము ఈర్షా అసూయలతో రగిలిపోతొనప్పుడు వాడే పదబంధము. 

Thursday, August 25, 2016

విందు భోజనం

మా చిన్నప్పుడు నేను మా తమ్ముడు అహోబిళ మఠం లో ఒక పెళ్ళికి వెళ్ళాము . అందరూ చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఆ పెళ్ళి గురించి. మాకు అర్ధమయ్యింది ఏమిటంటే అది మనకు మనమే వడ్డించుకొనే పెళ్ళిట! దాని పేరు ' బర్ఫి ' ( మాకు అప్పుడు ఆ పేరు పలకడం రాలేదు మరి) యో అలాంటిదేదో అని చెప్పారు.


నేను మా తమ్ముడు అది ఎలా ఉంటుందో పైకి వెళ్ళి చూద్దామని అనుకొన్నాము! మెట్లు ఎక్కుతూ " నువ్వేం తింటావు " అని అడిగాడు నన్ను. నేను "పూరి, ఐస్ క్రీం, పులావ్ " అని చెప్పాను. వాడిని అడిగితే వాడు "అన్నం తప్ప అక్కడ ఉన్నవన్నీ  తింటాను.. " అని అన్నాడు. తినబోయే రుచులని ఊహించేసుకుంటూ మేడ మీదకి వెళ్ళాము. అక్కడ బోలెడు గిన్నెలు మూతలు పెట్టేసి ఉన్నాయి. ఆ గిన్నెల్లో తినాల్సినవి ఉన్నాయన్న మాటా! చుట్టు పక్కల మా పెద్ద వాళ్ళు ఎవరూ లేరు... ఇంత కన్నా భళే ఛన్స్ ఎప్పుడు దొరుకుతుంది? ఇద్దరం ప్లేట్లు తీసుకొన్నాము. నేను "పూరి " కోసం వెతుకుతున్నాను... ఈ లోపల మాకు తెలిసిన ఒక పే... ద్ద ఆయన మా తమ్ముడి దగ్గరకు వచ్చి " బాబూ ! వచ్చావా? దా దా "అని భుజం మీద చెయ్యి వేసి వాడిని పక్కకు తీసుకెళ్ళాడు. అప్పటికే ఆయన ప్లేట్ లో సిమెంట్ కలిపినట్టు అన్నం మధ్యలో సాంబార్ వేసుకొని ఉన్నాడు. మా తమ్ముడికి ఎంగిలి చెత్తో వాడి ప్లేట్ లో టమాటా పప్పు, అన్నము, వంకాయ కూర, గోంగూర పచ్చడి, కంది పొడి... ఇంకా ఏవేవో వేసేశారు. నేను నా ప్లేట్ పట్టుకొని వాళ్ళకి దూరంగా వెళ్ళిపోయాను. మా తమ్ముడు నా దగ్గరకు ఏడుపు మొహం పెట్టుకొని ఆ ప్లేట్ పట్టుకొని వచ్చాడు. నాకు నవ్వు ఆపుకోవడం కష్టమయ్యింది. నా నవ్వు వాడికి ఇంకొంచం ఉక్రోషం కలిగించింది. " ఇంటికెళ్తే మంచి నీళ్ళు కూడా అడగరు, కానీ వేరే వాళ్ళ పెళ్ళికి దాన కర్ణుడిలా వడ్డించేస్తాడు " అని ఏకవచనం లో తిట్టేశాడు. "ఇప్పుడు అవన్నీ తినేస్తావా? " అని ఆ వీరభద్ర పళ్ళాన్ని చూస్తూ అడిగాను.


"అమ్మో ఇవన్నీ ఎలా తింటాను? " అని ఇటు అటూ చూశాడు. వాడి ప్లేట్ తీసుకెళ్ళి ఒక టేబుల్ కింద పెట్టేసి మళ్ళీ ఫ్రష్ గా వేరే ప్లేట్ లో కావాల్సినవి తెచ్చుకొని తిన్నాడు. బోలెడు తింద్దామనుకున్నాము కానీ, ఆ ప్లేట్ మోయలేక, ఆ వాసనలకి ఒక పూరీకే కడుపు నిండిపోయింది.


అప్పట్లో ఈ బఫ్ఫే చాలా నచ్చేది. కావల్సినవే వడ్డించుకొని తినొచ్చు. బలవంతగా వడ్డించే వారు ఉండరు (ఎప్పుడో దురదృష్టం ఆ పెద్దయన రూపం లో వస్తే తప్పా), ఇష్టం లేనివాటి వైపు కన్నెత్తి కూడా చూడక్కర్లేదు. కబుర్లు చెప్పుకుంటూ నిల్చొని స్టైల్ గా తినొచ్చు.


ఆ తరావత కొన్ని రోజులకి ఈ ప్లేట్ బరువు మోయలేక కూర్చొని తినేవాళ్ళము. ఇప్పుడు ఈ బఫ్ఫే లో కూడా తింటొన్న ఎంగిలి చేత్తోటే కావల్సినవి, అక్కలేనివి అన్నీ వడ్డించేసుకొని, ప్లేట్ ఖాళీ చేయడం అదేదో ప్రేస్టేజీ ఇషూ గా భావించి ప్లేట్ నిండుగా చెత్తబుట్టలో పారేస్తున్నారు. ఆ ప్లేట్ల బరువు మొయ్యడం కూడా చాలా కష్టమౌతోంది. ఇప్పుడు మగపెళ్ళివారు అడిగే పెద్ద కోరికల్లో ఒకటి "బంతి భోజనం " . తిండి పదార్ధాలు వేస్ట్ అయ్యిపోతాయన్న భయం బఫ్ఫే లోనూ, బంతి భోజనాలలోనూ ఉంటుంది. భయం కాదూ.. తిండి రెండిటిలోనూ వేస్ట్ అవుతోంది.


బఫ్ఫే లో అయితే ఇక చిన్నపిల్లలకి "ఆశ లావు.. పీక సన్నము " అన్నీ వడ్డించేసుకుంటారు. తినలేరు.. పారేస్తారు. అలాంటప్పుడు కాస్త పెద్దవాళ్ళు గమనిస్తూ ఉండాలి. పెద్దవాళ్ళు కూడా వడ్డించుకునే ముందు ఒకటికి రెండు సారు తినగలమో లేదో అని ఆలోచించి వడ్డించుకుంటే బాగుంటుంది. రుచి కోసం ఒక చెంచా వడ్డించుకొని బాగుంటేనే మరి కొంచం వేసుకుంటే మంచిది. ముఖ్యంగా మన ఇంట్లో తినేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో అంతే జాగ్రత్తగా ఇలాంటి భోజనాలలో ఉండాలి. వడ్డించే వాళ్ళూ కొద్ది కొద్దిగా వడ్డిస్తే మంచిది.


మా చిన్నప్పుడు సంతర్పణలో " నా పేరు చెప్పి వాడికి నాలుగు బూరెలు వెయ్యరా " అని వడ్డించే వాడికి పురమాయించేవారు. వాడి పేరు చెప్పి, వీడి పేరు చెప్పి వడ్డిస్తే వాళ్ళ పొట్టలు, వీళ్ల పొట్టలు అరువు తెచ్చుకోలేరుగా తినేవాళ్ళు?


తినే వాళ్ళు ఒక్కసారి వంటకాలని పారేసే ముందు "సొమాలియా " పిల్లల్ని దృష్టిలో పెట్టుకొంటే చాలు... ఆ 'ఒక్క ముద్ద ' విలువ తెలుస్తుంది.


Saturday, June 4, 2016

మోహన రాగము

కర్ణాటక శాస్త్రీయ సంగీతములో ఇరవై ఎనిమిదవ మేళకర్త రాగము హరికాంభోజి రాగము. ఈ రాగానికి జన్య రాగము ‘మోహన రాగము ‘ ప్రసిద్ధ శుద్ధ మధ్యమ రాగము. ఈ రాగము ఉపాంగ, వర్జ్య, ఔఢవరాగం. మధ్యమం, నిషాదాలను గ్రహం చేస్తే మేచకళ్యాణి, ధీరశంకరాభరణ రాగాలు కూడా మోహనకు జన్యరాగాలుగా పేర్కోనవచ్చు. ముత్తుస్వామి దీక్షితార్ మనవడు బ్రహ్మశ్రీ సుబ్బరామ దీక్షితార్ రచించిన ‘సంగీత సాంప్రదాయ ప్రదర్శిని’లో మోహన మేచకళ్యాణి జన్యరాగంగా పేర్కొన్నారు. ఔఢవ-ఔఢవ రాగం. అంటే ఈ రాగం ఆరోహణ, అవరోహణలో కూడా కేవలం ఐదు స్వరాలే ఉంటాయి.

 






మోహన రాగము అందమైన నిర్దిష్టమైన రూపము, ఎటువంటు భావాన్నైనా సులభముగా వ్యక్తపరిచే రాగము. ఈ రాగము ‘మధ్యాహ్న రాగ ‘ మైనప్పటికీ ఎల్ల వేళల యందు వినటానికి, ఆలపించడానికి అణువైన రాగము. ఈ రాగము చాలా అవకాశము కలిగిన రాగము. రాగాలాపన, నెరవు, స్వరకల్పన, తానం, పల్లవి పాడుటకు అనువైన రాగం. త్రిస్థాయి రాగం. విళంబ, మధ్య, ధృతలయలుగా గల రాగం. శృంగారమునకు, రక్తికి, భక్తికి, శాంతమునకు, వీర రసమునకు పేరెన్నిక కలిగిన రాగము. శ్రోతలకు సులభంగా అర్ధమగుటయే కాక, పాడుటకు, ఆస్వాధించుటకు సులభమైన రాగం. తక్కువ స్వరాలతో ఎక్కువ రక్తి కల్గించే రాగం. స్వరకల్పనకు కష్టమైన రాగమైనా పద్యాలు, శ్లోకాలు, వర్ణనలు అద్భుతంగా పలికించే రాగం. జానపద, భజన కీర్తనలు ఈ రాగంలో విరివిగా కలవు. వీనులకు ఇంపైన రాగము కాబట్టి చాలా జనాధరణ పొందిన రాగము. పేరుకు తగినట్టుగా ‘మోహనమైన ‘ రాగము.

 

ఈ రాగం స్వరస్థానాలు: షడ్జమం, చతుశృతి రిషభం, పంచమం, అంతర గాంధారం, చతుశృతి దైవతం (స,రి,గ,ప,నద,స / S R2 G3 P D2 S). ఇందు రిషభాన్ని గ్రహం చేస్తే మధ్యమావతి, గాంధారాన్ని గ్రహం చేస్తే హిందోళ, పంచమాన్ని గ్రహంచేస్తే శుద్ధ సావేరి, చివరగా ధైవతాన్ని గ్రహం చేస్తే ‘ ఉదయ రవి చంద్రిక ‘ రాగాలు వస్తాయి.

 

ఆరోహణ :   స రి గ ప ద స ( S R2 G3 P D2 S)

అవరోహణ :  స దప గ రి స (S D2 P G3 R2 S)

 

 

శాస్త్రీయ సంగీతము నేర్చుకొనే ప్రతీవారికి గీతాలలో సరస్వతిని త్రిశక్తిరూపిణిగా కొలిచే ‘వరవీణ మృదుపాణి ‘ మోహన రాగములోనిదే. ఆ తరువాత నేర్చుకొనే ‘వర్ణం ‘ ‘నిను కోరీ వర్ణం ‘ కూడా మోహన రాగమే.

మోహనరాగము.. ప్రేమను, అనురాగాన్ని వ్యక్త పరచడానికి అణువైన రాగము. ఈ రాగంలో ప్రఖ్యాతి చెందిన కీర్తనలు :

1. వరవీణ మృదుపాణి – గీతం

2. నిన్నకోరి- తాన వర్ణం

3. త్యాగరాజ స్వామి వారు స్వరపరచిన మోహన రాగాలు :

భవనుత నా హృదయము, ఎవరురా, ననుపాలింప నడచి వచ్చితివో , రామా నిన్నే నమ్మి, మోహన రామ, రారా రాజీవ లోచన, వేద వాక్యమని

4. మోహనములో నారాయణతీర్ధుల తరంగం : బాలగోపాల

5. అన్నమాచార్య : చేరి యశోదకు శిశువితడు

6. నాగలింగం – దీక్షితార్

7. పాపనాశం శివణ్ : నారాయణ దివ్యనామం

మోహనరాగము భావ వ్యక్తీకరణ కి అన్ని విధాలుగా అణువైన రాగము. కృష్ణుడికి, మురళికి, మోహన రాగానికి ఏ సంబంధమో కానీ.. ఒకటితో ఒకటి ఎప్పుడు ముడిపడే ఉంటాయి. అందమైన మురళీ గానము ఊహించుకోవాలంటే మోహనే దిక్కు. అందుకే మోహన మురళీ అన్నారేమో!! ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జపాన్ వారి సంగీతము 90 % మోహన రాగములోనే ఉంటుందిట. కర్ణాటక సంగీతములో మోహన హిందుస్తానీ లో ‘భూప్ ‘ కి దగ్గరగా ఉంటుంది. ఈ రాగములో ఉన్న సినిమా పాటలు ఒకమారు చూద్దాము.

 

 

1. అయినదేమో అయినది ప్రియ… (జగదేకవీరుని కథ )

2. ఈ నల్లని రాలలో ఏ కన్నులు దాగెనో… (అమరశిల్పి జక్కన్న)

3. ఎచట నుండి వీచెనో… (అప్పుచేసి పప్పుకూడు)

4. ధీర సమీరే యమునా తీరే (భక్త జయదేవ)

5. ఈనాటి ఈ హాయి కల కాదోయి (జయసింహ)

6. మోహన రాగమహా మూర్తిమంత మాయే (మహా మంత్రి తిమ్మరసు)

7. పులకించని మది పులకించు ( పెళ్ళికానుక)

8. పాడవేల రాధికా (ఇద్దరు మిత్రులు)

9. వినిపించని రాగాలే కనిపించని (ఆరాధన)

10. నను పాలింపగ నడచి వచ్చితివా (బుద్ధిమంతుడు)

11. ఘనా ఘన సుందరా ( భక్త తుకారం )

12. సిరిమల్లే నీవే విరిజల్లు కావే (పంతులమ్మ)

13. మదిలో వీణలు మ్రోగె (ఆత్మీయులు)

14. నిన్ను కోరి వర్ణం (ఘర్షణ)

15. మధుర మధురమీ చల్లని రేయీ (విప్రనారాయణ)

16. మదిలోని మధుర భావం (జయసింహ)

17. మనసు పరిమళించెనే (శ్రీ కృష్ణార్జున యుద్ధం)

18. నల్లవాడే వ్రేపల్లె వాడే (చిరంజీవులు)

19. తెల్లవార వచ్చె తెలియక నా స్వామి (చిరంజీవులు)

20. మౌనముగా నీ మనసు పాడినా (గుండమ్మ కథ)

21. తెలుసుకొనవె యువతీ అలా నడచుకొనవె (మిస్సమ్మ)

22. చందన చర్చిత నీల కళేబర (తెనాలి రామకృష్ణ)

23. ఆ మొగల్‌రణధీరులు (ప్రైవేటు రికార్డ్‌పద్యం)

24. భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి (ప్రైవేటు రికార్డ్‌పద్యం)

25. కనులకు వెలుగువు నీవే కాదా (భక్త ప్రహ్లాద)

26. శివ శివ శంకరా (భక్త కన్నప్ప)

27. మాణిక్య వీణాం (శ్యామల దండకం)- (మహాకవి కాళిదాసు)

28. లాహిరి లాహిరి లాహిరిలో (మాయాబజార్‌)

29. వే వేలా గొపెమ్మలా మువ్వా గోపాలుడే (సాగర సంగమం)

30. తిరుమల గిరి వాసా (రహస్యం)

31. మధురమే సుధాగానం (బృందావనం )

32.తూనీగ.. తూనీగా ( మనసంతా నువ్వే)

33. ఆది భిక్షువు వాడినేది కోరేది ( సిరివెన్నల)

34. మాటే రాని చిన్నదాని (ఓ పాపాలాలీ )

35. చెంగు చెంగునా గంతులు వేయండి (నమ్మిన బంటు)

36. చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి ( భార్యభర్తలు)

37. రతి చేతి రాచిలుక రతనాల మొలక (పల్నాటి యుద్ధం)

38. శీలము గల చినవాడా (పల్నాటి యుద్ధం)

39. ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో (నేనున్నాను)

40. ఏరా మన తోటి గెలిచే వీరులెవ్వరురా(పల్లవి మాత్రమే) (సువర్ణ సుందరి)

41. చిట్టిపొట్టి చిన్నారి పుట్టిన రోజు(వెలుగు నీడలు)

42. నే పాడితే లోకమే పాడదా( మిసమ్మ కొత్తది)

43. ఆ మనసేమో ఆ సొగసేమో (రేచుక్క)

44. శకునాలు మంచివాయే (భామా కలాపం (యక్ష గానం) ప్రైవేట్ ఆల్బం)

45. కృష్ణ ముకుందా మురారి (పల్లవి మాత్రమే ) (పాండురంగ మహత్యము)

46. రతి సుఖ సారే గతమాభిసారే (భక్త జయదేవ)

47. ఇంకా తెలవారదేమి (మంచి మిత్రులు)

48. భారత వీర కుమారిని నేనే (సంఘం)

49. తీయని ఊహలు హాయిని గొలిపే వసంత కాలమే హాయి(పాతాళభైరవి)

50. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి (డాడి)

51. కోటి తారలా కాంతి ధారలా నేలకొచ్చావా ( నీ ప్రేమకై)

52. అబ్బ దీని సోకు చూసి వచ్చా వచ్చా(పెద్ద రాయడు)

53. చక్ చక్ ఝణత తకధిమికిటత (భలే అమ్మాయిలు)

54. మోహన రాగం పాడెను మదిలో (ధర్మ పోరాటం)

55. కాంత చేతి లోపల ఏ మంత్రమున్నదో (చెంచు లక్ష్మి)

56. కట్టండి వీర కంకణం ( వీర కంకణం)

57. వయ్యారమొలికే చిన్నది (మంగమ్మ శపధం)

58. ఇది చల్లని వేళైనా ( పూజా ఫలం)

59. నీ రాజు పిలిచెను రేరాజు నిలిచెను ( మంగమ్మ శపధం)

60. ఎవరివో ఎచనుంటివో (చంద్రహారం)

61. చిన్నదానా ఓసి చిన్న దానా (ప్రేమలేఖ)

62. ఒక మనసు పాడితే మోహన రాగం ( మోహన రాగం)

63. ఏ పారిజాతములీయగలనో సఖీ (ఏక వీర)

64. నీవు రావు నిదుర రాదు ( పూలరంగడు)

65. పాడెద నీ నామమే గోపాలా (అమాయకురాలు)

66. గొబ్బిళ్ళమ్మ గొబ్బిళ్ళు (సువర్ణ సుందరి)

67. మనసాయెరా మదన నిను చూడ( విజయ లక్ష్మి శర్మ ప్రైవేట్ రికార్డ్)

68. వీణ ప్రణయ రాగ భరిత వనిత ప్రాణ మున్న వీణ (అమయక చక్రవర్తి)

69. మన దాంపత్యము సత్యము ( ఘంటసాల ప్రైవేట్ రికార్డ్)

70. చల్లగాలిలో యమునా తటి పై శ్యామసుందరుని మురళి(ఎస్. రాజేశ్వర రావు ప్రైవేట్ రికార్డ్)

71. మనసులు కలిసిన (పెళ్ళి పీఠలు)

72. కురులందే మేఘం విరిసి ( బాల నాగమ్మ (1981))

73. ఇదే ఆనందము అహహా (కృష్ణ ప్రేమ)

74. మా ఇంటికి నిను పిలిచి ( అతడే ఒక సైన్యం)

75. ఎప్పటికప్పుడు గుండెల్లో ( ప్రేమకు వేళాయెరా)


మరి హింది లో ఇదే రాగంలో ఉన్న కొన్ని పాటలు చూద్దాము.

 

1. గాతా రహే మేరా దిల్ (గైడ్)
2. ఇత్న హసీన హై ఏ జహా (హమ్ సాయా)
3. దేఖో దేఖో జీ.. కుచ్ సోచోజీ (ఫర్జ్)
4. జిందగి దేనే వాలే సున్(దిల్-ఏ-నాదాన్)
5. హుం తుం సే కుచ్ కహ నా సఖ (జిద్ది)
6. కౌన్ హొ తుం కౌన్(స్త్రీ)
7. దేఖ ఏక్ క్వాబ్ జో తో ఏ సిల్సిలే హూ (సిల్ సిలా)
8. దిల్ పుకారే ఆరే ఆరే (జివెల్ తీఫ్)
9. అంజానే వఫా (అనార్కలి)
10. చాంద్ ఫిర్ నిక్లా (పేయింగ్ గెస్ట్)
11. తేరే ఖయాలోమే హుం( గీత్ గాయా పత్తరోనే)
12. జనని జన్మ భూమిస్చ (సామ్రాట్ ప్రిథ్వి రాజ్ చౌహాన్)
13. పంక్ హోతే తో ఉడ్ ఆతీ రే ( సెహరా)
14. సాయనోరా సయనోరా (లవ్ ఇన్ టోకియో)
15. జీవన్ మే ఏక్ బార్ ఆనా సింగపూర్ ( సింగపూర్)
16. ఓ మేరే సాయే రూబా (లవ్ ఇన్ టొకియో)
17. చందా హై తూ మేరా సూజత్ హై తూ ( ఆరాధన)
18. యే నీలే గగన్ కే తలే (హమ్ రాజ్) 



ఆభేరి రాగము

ఆభేరి రాగము :

 

 


మూర్ఛన :    సగ2మ1పని2స —– సని2ద2పమ1గ2రి2స.


” నగుమోము గనలేని” అన్న కీర్తన త్యాగరాజ స్వామి వారు ఈ రాగములోనే స్వరపరిచినారు. ఈ రాగం ఆద్రత తెలుపుటకు బాగా ప్రశిస్తమైనది. ఈ కీర్తనని ఎం.ఎస్. సుబ్బు లక్ష్మి గారి గాత్రములో వింటే గజేంద్ర మోక్షములో ‘ నీవే తప్ప ఇహ పరంబెరుగా.. కావవే వరదా.. రక్షింపవే బద్రాత్మకా..”గజేంద్రుడి యొక్క శరణా గతి కళ్ళముందు కదలాడుతుంది.







సంగీతము యొక్క స్వరజతులతో అలవోకగా ఆడుకొన్న బాల మురళీ కృష్ణ గారి నగుమోము…





కొనై కూడి వైద్యనాథన్ గారు ఇదే కీర్తనని తనదైన శైలిలో వాయించారు. ఆ ఆలపన వింటే ఆభేరి రాగంలో ఉన్న సినిమా పాటలన్నీ ఒక్క లిస్ట్ లో మనకే స్ఫురిస్తాయి.



తెలుగు సినిమా లో ఈ రాగములో ఉన్న పాటలు కొన్ని చూద్దాము.


1. ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా… (లవకుశ)

2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)

3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)

3. ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందామామా(పరువు-ప్రతిష్ట)

4. వెన్నెలలోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)

5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)

6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)

7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)

8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)

9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్‌)

10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్‌.. (భట్టి విక్రమార్క)

11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)

12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)

13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)

14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)

15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)

16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)

17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)

18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)

19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)

20. ఉయ్యాల జంపాలలూగరావయా… (చక్రపాణి)

21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)

22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)

23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్‌)

24. మా తెలుగు తల్లికి

25. హాయమ్మ హాయి మా పాపాయి… (రావు బాల సరస్వతి ప్రైవేటు రికార్డ్‌ )

26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్‌)

27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్‌)

28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్‌ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్‌ పద్యం)

29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)

30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)

31. మల్లెల్లు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామయణం)

32. కోవెల ఎరుగనీ దేవుడు కలడని (తిక్క శంకరయ్య)

33. కుశలమా ఎటనుంటివో ప్రియతమా(శ్రీకాకుళపు ఆంధ్ర మహావిష్ణువు కథ)

34.రేపంటి రూపం కంటి (మంచి-చెడు)

35.అనురాగము విరిసేరా ఓ రేరాజా (దొంగ రాముడు)

36.నరవరా ఓ కురువరా (నర్తనశాల)

37. ప్రియా ప్రియతమా రాగాలు (కిల్లర్)

38. ఓ నిండు చందమామా నిగ నిగలా భామా (బంగారు తిమరాజు)

39. సపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ (ఆకలి రాజ్యం)

40. జీవితమే సఫలమూ (అనార్కలి)

41.నన్ను ఎవరో తాకిరి (సత్తెకాలపు సత్తెయ్య)

42.కనులు కనులు కలిసెను (మురళి కృష్ణ)

43.తనువా.. ఉహు హరి చందనమే (కథానాయకురాలు)

44.మనసు గతి ఇంతే (దేవదాసు)

45.పగటి పూట చంద్ర బింబం కనిపించెను ఏదీ ఏదీ…(చిక్కడు-దొరకడు)

46. హాయి హాయిగా ఆమని పాడే ( (మొత్త కాదు)సువర్ణ సుందరి )

47. ముద్దబంతి నవ్వులో మూగబాసలు ( అల్లుడుగారు )

48. నీవుండేది ఆ కొండపై ( భాగ్య రేఖ )

49. కలయా … నిజమా ( కూలీ నెం 1)

50. తనివి తీరలేదే ( గూడు పుఠాని )

51. పయనించే ఓ చిలుకా ( కుల దైవం )

52. అహో ఒక మనసుకి నేడే ( అల్లరి ప్రియుడు )

53. కన్నులతో చూసేది గురువా ( జీన్స్ )

54. ఓహో … ఓహో … ఓహో … బుల్లి పావురమా ( బృందావనం – రాజేంద్ర ప్రసాద్ సినిమా )

55. చెప్పకనే చెబుతున్నది ( అల్లరి ప్రియుడు )

56. ఎక్కడ వున్నా … ఏమైనా… ( మురళీ కృష్ణ )

57. అందమే ఆనందం ( బ్రతుకు తెరువు )

58.నీ మది చల్లగా … స్వామీ నిదురపో ( ధనమా ? దైవమా ? )

59. ఏమని వర్ణించను ( డ్రైవర్ రాముడు )

60. తెలిసిందిలే ( రాముడు … భీముడు )

61. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్‌)

62. పూసింది పూసింది పున్నాగా ( సీతా రామయ్య గారి మనవరాలు)

63. మంచు కురిసే వేళలో ( అభినందన )

64. ఏలే ఏలే… మరదలా ( అన్నమయ్య )


***************************************

 

 

హింది సినిమాలో కొన్ని పాటలు ఆభేరి రాగం లో ( భీం పలాసి లో)


* ఆ నీలె గగన్ తలె ప్యార్ హ కరే ( బద్ షా- 1956)

* ఆజ్ మెరె మన్ సఖి బన్సురి బజాయె కొఇ(ఆన్ – 1952)

*బీనా మధుర్ మధుర్ కచ్హు బోల్(రాం రాజ్య – 1943)

* ఏ అజ్ఞబి తూ భీ కభీ ఆవాజ్ దే కహీ పే ( దిల్ సే – 1998)

*దిల్ కె తుక్డే తుక్డె కర్ కే (దాదా – 1979)

*దిల్ మే తుఝే బిటాకే.. కర్ లూంగీ మై బంధ్ ఆఖే ( ఫకీరా -1976)

* ఖిల్తే హై గుల్ యహా ఖిల్ కే బిచడ్ నే కో (షర్మిలి – 1971)

* కుచ్ దిల్ నే కహా ( అనుపమ – 1966)

* మాసూం చెహర ఖాతిల్ అదా ( దిల్ తేరా దివానా – 1962)

* నగ్మ ఓ షేర్ కి సౌగాత్ కిసే పేష్ కరూ (ఘజల్ – 1964)

* నైనో మే బద్ర ఛాయే ( మేర సాయ – 1966)

*ఓ బెకరార్ దిల్ (ఖొర – 1964)

* ఓ నిర్దయే ప్రీతం ( స్త్రీ – 1961)

* సమయ్ ఓ ధీరే చలో ( 1993)

* తూ హై ఫూల్ మేరే గుల్షన్ కా ( ఫూల్ మేరే గుల్షన్ కా – 1974)

 

 

Friday, April 8, 2016

రాగాలు - సరాగాలు

శివుని ఢమరకము నుండి  అకార, ఉకార, మకారం యొక్క కలయిక అయిన 'ఓం ' కారము పుట్టినది. ఈ ఓంకారాన్నిఅనుష్ఠించడంలో, అనుసంధానించడంలోనూ నాదము వస్తుంది. ఆ నాదమే సంగీతానికి మూలము. అందుకే శివున్ని 'నాదా తనుమనిశం " అని కొడియాడాడు త్యాగరాజ స్వామి. ప్రకృతిలోని జంతువుల పక్షుల అరుపుల నుండి సప్త స్వరాలు పుట్టించాడు మానవుడు. ఈ సప్త స్వరాలతో సామవేద సారమైన సంగీతము పుట్టింది.


స : షఢ్జం అంటారు అంటే సముద్రము.  ఈ షడ్జం నెమలి క్రేంకారం నుండి ఉద్భవించింది. దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ.

రి : ఋషభం అంటే ఎద్దు. ఋషబం ఎద్దు రెంకె నుండి ఉద్భవించిన ధ్వని. అధిష్టాన దేవత అగ్ని.


గ : గాంధర్వం అంటే గగనము. మేక అరుపు నుండి ఉద్భవించిన ధ్వని , అధిష్టాన దేవత రుద్రుడు.


మ : మధ్యమం అంటే సమ దూరములో ఉండేది. క్రౌంచపక్షి కూత నుండి వచ్చిన ధ్వని , అధిష్టాన దేవత విష్ణువు.



ప: పంచమం అంటే ఐదవది, కోయిల కూత నుండి ఉద్భవించింది. అధిష్టాన దేవత నారదుడు.


ధ :  ధైవతం  అంటే భూమి. గుర్రం సకిలింత నుండి పుట్టిన ధ్వని, అధిష్టాన దేవత వినాయకుడు.


ని : నిషాదం అంటే బోయవాడు. ఏనుగు ఘీంకారం నుండి పుట్టిన ధ్వని. అధిష్టాన దేవత సూర్యుడు.


ఆరోహణ : తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.

 ఉదా:  స  రి  గ  మ  ప  ధ  ని  స.


అవరోహణ :  ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.


 ఉదా:  స ని ధ ప మ గ రి స.

ఈ ఆరోహణ , అవరోహణలనే మూర్ఛన అంటారు.



యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః |
రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః||



స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల మనస్సును  ఆనందింపచేయునట్టి శబ్ధమును 'రాగము ' అంటారు.
ఈ స్వరాలని చక్కగా అలంకరించినట్టుగా ఒక వరుసలో నిలిపి వీనుల విందు  చేసేదే  'రాగము '. రాగాలలో ముఖ్యమైనవి 72 జనక రాగాలు .ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమఖి, పురందర దాసు గారు.
జనక రాగాలనే ‘మేళకర్త '  రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక, ఆధార , మూల , ప్రాతిపదిక  రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణ రాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట. 



ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.



ఎన్నో రాగాలకు మూలము ఈ జనక రాగాలే. ఇలా పుట్టిన కొత్త రాగాలని జన్య రాగాలు (చైల్డ్ రాగాస్) అంటారు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు. జనక రాగాల నుండి అనంత మైన జన్య రాగాలు పుట్టాయి. ఇలా ఎన్నో జన్య రాగాలను సృష్టించినది త్యాగ రాజ స్వామి వారు. చిన్న చిన్న మార్పులతో ఎంతో చక్కనైనా రాగాలు పుట్టించారు. కొన్ని సార్లు జనక రాగాల కన్న జన్య రాగాలే చాలా ఆహ్లాదంగా ఉంటాయి. తల్లితండ్రుల కన్న పిల్లలు ఎక్కువ అందంగా ఉన్నట్లు.  ఒక జనక రాగము నుండి ఎన్నైనా జన్య రాగాలు ఉద్భవించవచ్చు. అటువంటి జన్య రాగాలు అనంతాలు. కనీసం నాలుగు స్వరాలతో ఒక రాగం ఏర్పడుతుందంటారు. కానీ డా. బాలమురళీకృష్ణ " స మ1 ప (మూడే మూడు) " స్వరాలతో ' సర్వశ్రీ ' అనే స్వంత రాగాన్ని సృష్టించి అద్భుతంగా కీర్తన (స్వరకల్పన చేసి మరీ) పాడారు.


కర్ణాటక సంగీతములో 22 వ మేళకర్త రాగము ఖరహర ప్రియ. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, శ్రీ, ఉదయరవిచంద్రిక, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ,   బృందావన సారంగ,శివరంజని, కాఫీ, మరియు శ్రీరంజని.



Friday, September 18, 2015

శ్రావణ మాసం

చిన్నప్పుడు శ్రావణ మాసం అనగానే పేరంటాలు, చామంతులతో పూల జడలు, మొగలి పువ్వు వాసనలు, వాయినం శనగలు మరునాడు వేయించుకొని తినడము.. ఇంతే! మా ఊరిలో పేరంటము అంటే మా మామ్మ, చినమామ్మ మధ్యాహ్నం మూడున్నరకే ఇంట్లో వాళ్ళకి ' టి ' ఇచ్చి బయలుదేరేవారు. ఈ మామ్మలది ఒక బాచ్ , ఆ తరవాత అమ్మలది ఇంకో బాచ్ బయలుదేరేది. శ్రావణ భాద్రపదాలంటే వర్షకాలాలే! అందులోనూ మా ఊరు ఎర్ర మట్టి, రోడ్లు కూడా సరిగ్గా ఉండవు గతుకుల రోడ్లు. ఇలా వర్షం పడితే ప్రతీ ఇంటి ముందు ఒక నీళ్ళ బాల్చి పెట్టేవారు కాళ్ళు కడుక్కోడానికి. ఆడవాళ్ళ కాళ్ళకి చక్కగా పసుపు రాసి, మెడకి గంధము పూసి, పన్నీరు (తినేది కాదు) చల్లి, కాటుక ఇచ్చేవారు. పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళు ఇలా ప్రతీ ఇంట్లో కాటుకా చక్కగా పెట్టుకొని ఇంటికొచ్చేసరికి కళ్ళకాటుక మొహం అంతా పాకేసేలా చేసుకునేవారు. . "పూట పేరంటానికి మొహం అంతా కాటుక " అంటే ఇదేనేమో! కాళ్ళకి పసుపు రాయించుకొని ఇంటికి ఇంటికి వెళ్తూ ఉన్న పేరంటాల్ల కాళ్ళకి ముందు రోజు పడిన వర్షంతో తడిసిన ఎర్రమట్టితో పారాణి దిద్దేది భూదేవి.

 

పిల్లలకి చామంతి పూలజడ వేసేవారు.. అదీ గట్టిగా దురద పుట్టినా గోక్కోడానికి లేకుండా. మొగలి రేకు (సీరియల్ కాదు) జడ మీద పెట్టి ఆ పైన ఈ చామంతులతో కుట్టిన జడ, ఆ రెండు పూల వాసనలు, పసుపు పన్నీరు వాసనతో కలిసి, ఆ పైన శనగల వాయినం కలుపుకొని అదో రకమైన సువాసనలొస్తుండేది శ్రావణ మాసం. కొత్త పెళ్ళికూతుర్ల కొత్త కొత్త పట్టుచీరలు, బంగారు నగలు... కొత్త అందాన్ని తెచ్చేవి. ఇంట్లో మండువాలో వర్షం ధార పెద్ద శబ్ధం చేస్తూ పడుతుంటే, పేరంటానికి వచ్చిన ఆడ లేడిసు అంత కన్నా గట్టిగా కబుర్లు చెప్పేసుకునేవారు. ఈ మామ్మ ల వెనకాల ఒక చిన్న బకెట్టు పట్టుకొని నేనూ బయలుదేరేదాన్ని, శనగలు అందులో వేసుకోడానికి. కొందరు ఇల్లు పాడైపోతుందని వచ్చిన ఈ పేరంటాళ్ళలని అరుగు మీదే కూర్చోబెట్టేవారు గోను సంచీ వేసి... కొందరు మొహం చిట్లించుకుంటే, కొందరు గడుసుగా 'చురక ' వేసేవారు.

ఒకసారి మా మామ్మ చుట్టాలావిడ ఆవిడ కోడలికి కొత్త నోమని మా మామ్మ ని పూజకి, తాంబూలానికి, సపరివార సమేతంగా భోజనానికి రమ్మని పిలిచింది. నన్ను తోడు తీసుకొని మా మామ్మ ఆ పూజకు వెళ్ళింది. మా అమ్మ నన్ను పంపిస్తూ " తినడానికి తప్ప నోరు తెరవకు " అని చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఆ అత్తగారు పాత సినిమాలలో 'హేమలత ' లా ఉంది. కోడలు కొత్త సినిమాలోని సన్నగా ఉంటుంది 'అల్లుడుగారు వచ్చారు " లో 'కౌసల్య ' లా ఉంది. ఇంతలో పక్కన ఎవరో వాయనానికి రమ్మంటే నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామ్మ.

ఆ అత్తగారు కోడలి చేత పూజ చేయిస్తున్నారు. " శ్రావణ మాసే శుక్ల పక్షే... 'ధర్మపత్నీ సమేత ' " అని చదవగానే ఆ కోడలు తల పైకెత్తి " అత్తయ్యగారు! ధర్మపత్ని అని అనకూడదండీ.. "
" ఇక్కడ అలానే ఉంది " అని పుస్తకం వైపు చూసింది అత్తగారు
" అక్కడ అలానే ఉంటుంది కానీ మనము చదవకూడదండి " కోడలు
" చదవకూడదన్నప్పుడు ఎందుకు రాస్తాడు? " బ్రుకుటి ముడి వేసి అత్తగారు
లాజిక్కే...
" అది మగవారిని ఉద్దేశించి రాసిందండి , మనకి కాదు " కోడలు
మనమైతే 'ధర్మపతీ సమేత అనుకోవాలేమో " అని అంద్దామనుకున్నా.. ఇంతలో ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి నాలో నుండి సినిమాల్లో చూపించినట్టు వచ్చి "విచ్చి నీకు డైలాగులు లేవు, నోరు మూసుకో " అని చెప్పింది.

 
" ఇవ్వాళ కాదు నిన్న కాదు నేను కాపురానికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతోంది.. ఇలాగే చదువుతున్నాను " అత్తగారు కాస్త రొప్పుతూ

 
" నా దేవుడు నేను ఎలా చదివినా నా మాట వింటాడు " అని ఇంక మాట్లాడే చాన్స్ కోడలికి ఇవ్వకుండా పుస్తకం వైపు చూస్తూ చదవటం ప్రారంభించింది.

 
వాదించడం దండగ అనుకుందేమో కోడలు నా వైపు చూసింది, అదే టైం కి అత్తగారు కూడా చూసింది " నాకేమీ తెలియదు.. నాకు తెలుగు రాదు నేను సిటి లో చదువుతున్నానుగా (మా టైమ్ నుండి తెలుగు రాదు అని చెప్పుకోవడం ఫాషనే) " అని ఒక అమాయకపు మొహం పెట్టేశాను. ఏం మాట్లాడినా సపరివార సమేతంగా పిలిచిన ఆవిడ 'మేత ' పెట్టకుండా పంపేస్తుందేమో అని భయం. పులిహోర, కొబ్బరికాయ రోటి పచ్చడి, గారెలు, ఆవళ్ళు ఎదురుగా కనిపించాయి.. నోరూరింది.. నోరు మూసేశా...

 
పూజ అంతా అయ్యింది. మా మామ్మ సినిమాలో పోలీస్ లాగ చివర్లో వచ్చింది. అక్కడ జరిగింది ఏవీ తెలియదు ఆవిడకి పాపం.

 
" చూడు కావుడప్పా! ఈ అగ్రహారం లో నేను ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాను, ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా.. " అని కోడలికి చెప్పాల్సినవన్నీ మా మామ్మని అడ్డుపెట్టుకొని చెప్పేసింది.

 
ఇవేవి తెలియని మా మామ్మ వాయనము తీసుకొని నన్ను తీసుకొని ఇంటికి చక్కావచ్చింది. ఇంటి కొచ్చాక కొంచం అర్ధయ్యి అర్ధమవ్వనట్టు మా మామ్మకి, అమ్మకి చెప్పాను. మా మామ్మ " ఎవరికీ చెప్పకు బాగోదు " అని ,
మా అమ్మ " ఇంక పేరంటాలు పెత్తనాలు అంటూ అందరిళ్లకి వెళ్ళకు " అని వార్నింగు ఇవ్వబడ్డాయి.

 
మా మామ్మ చెప్పినట్టే నేను ఎవరికీ చెప్పలేదు... ఇంతవరకు.. !!!