Search This Blog
Saturday, June 4, 2016
ఆభేరి రాగము
ఆభేరి రాగము :
మూర్ఛన : సగ2మ1పని2స —– సని2ద2పమ1గ2రి2స.
” నగుమోము గనలేని” అన్న కీర్తన త్యాగరాజ స్వామి వారు ఈ రాగములోనే స్వరపరిచినారు. ఈ రాగం ఆద్రత తెలుపుటకు బాగా ప్రశిస్తమైనది. ఈ కీర్తనని ఎం.ఎస్. సుబ్బు లక్ష్మి గారి గాత్రములో వింటే గజేంద్ర మోక్షములో ‘ నీవే తప్ప ఇహ పరంబెరుగా.. కావవే వరదా.. రక్షింపవే బద్రాత్మకా..”గజేంద్రుడి యొక్క శరణా గతి కళ్ళముందు కదలాడుతుంది.
సంగీతము యొక్క స్వరజతులతో అలవోకగా ఆడుకొన్న బాల మురళీ కృష్ణ గారి నగుమోము…
కొనై కూడి వైద్యనాథన్ గారు ఇదే కీర్తనని తనదైన శైలిలో వాయించారు. ఆ ఆలపన వింటే ఆభేరి రాగంలో ఉన్న సినిమా పాటలన్నీ ఒక్క లిస్ట్ లో మనకే స్ఫురిస్తాయి.
తెలుగు సినిమా లో ఈ రాగములో ఉన్న పాటలు కొన్ని చూద్దాము.
1. ఊరకే కన్నీరు నింప కారణమేమమ్మా… (లవకుశ)
2. నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని… (గులేబకావళి కధ)
3. నా కంటి పాపలో నిలిచి పోరా… (వాగ్దానం)
3. ఆ మబ్బు తెరలలోనా దాగుంది చందామామా(పరువు-ప్రతిష్ట)
4. వెన్నెలలోని వేడిమేలనో వేడిమిలోని హాయి ఏలనో… (పెళ్ళినాటి ప్రమాణాలు)
5. చల్లగ చూడాలి పూలను అందుకుపోవాలి… (పెళ్ళినాటి ప్రమాణాలు)
6. రాగమయి రావే అనురాగమయి రావే… (జయభేరి)
7. చిగురాకులలో చిలకమ్మా… (దొంగ రాముడు)
8. కలవరమాయే మదిలో నా మదిలో… (పాతాళ భైరవి)
9. నీవేనా నను పిలచినది నీవేనా నను తలచినది… (మాయా బజార్)
10. ఓ నెల రాజా వెన్నెల రాజా నీ వన్నెలన్ని చిన్నెలన్ని నాకేనోయ్.. (భట్టి విక్రమార్క)
11. నీ లీల పాడెద దేవా… (మురిపించే మువ్వలు)
12. నీలి మేఘాలలో గాలికెరటాలలో… (బావా మరదళ్ళు)
13. ఆకాశవీధిలో హాయిగా ఎగిరేవు… (మల్లీశ్వరి మొదటి చరణం మాత్రమే)
14. రావోయి చందమామ మావింత గాధ వినుమా… (మిస్సమ్మ)
15. తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజ నీరూపు తెలిసిందిలే… (రాముడుభీముడు)
16. ప్రేమ యాత్రలకు బృందావనము నందన వనమూ ఏలనో… (గుండమ్మ కధ)
17. నిన్న కనిపించింది నన్ను మురిపించింది… (రాణి రత్నప్రభ)
18. సడి సేయకోగాలి సడి చేయబోకే… (రాజ మకుటం)
19. నీవే నీవే నిన్నే నిన్నే… (ఇంటికి దీపం ఇల్లాలు)
20. ఉయ్యాల జంపాలలూగరావయా… (చక్రపాణి)
21. పదిమందిలో పాట పాడినా… (ఆనంద నిలయం)
22. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో… (అప్పుచేసి పప్పుకూడు)
23. కళ్లు మూసుకొని వళ్ళు చూసుకొని కాలం గడపకు… (ప్రైవేటు రికార్డ్)
24. మా తెలుగు తల్లికి
25. హాయమ్మ హాయి మా పాపాయి… (రావు బాల సరస్వతి ప్రైవేటు రికార్డ్ )
26. బంగారు పాపాయి బహుమతులు పొందాలి… (ప్రైవేటు రికార్డ్)
27. కనుల దీపికలుంచి మనసు వాకిలి తెరచి… (ప్రైవేటు రికార్డ్)
28. క్రొంజికురాకు వ్రేళుల కురుల్ తడియార్చుచు… (ప్రైవేటు రికార్డ్ పద్యం)
29. ఓహో మేఘమాలా నీలాల మేఘమాల… (భలే రాముడు)
30. తెలవారదేమో స్వామీ (శ్రుతిలయలు)
31. మల్లెల్లు పూసే వెన్నెల కాసే ఈ రేయి హాయిగా (ఇంటింటి రామయణం)
32. కోవెల ఎరుగనీ దేవుడు కలడని (తిక్క శంకరయ్య)
33. కుశలమా ఎటనుంటివో ప్రియతమా(శ్రీకాకుళపు ఆంధ్ర మహావిష్ణువు కథ)
34.రేపంటి రూపం కంటి (మంచి-చెడు)
35.అనురాగము విరిసేరా ఓ రేరాజా (దొంగ రాముడు)
36.నరవరా ఓ కురువరా (నర్తనశాల)
37. ప్రియా ప్రియతమా రాగాలు (కిల్లర్)
38. ఓ నిండు చందమామా నిగ నిగలా భామా (బంగారు తిమరాజు)
39. సపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ (ఆకలి రాజ్యం)
40. జీవితమే సఫలమూ (అనార్కలి)
41.నన్ను ఎవరో తాకిరి (సత్తెకాలపు సత్తెయ్య)
42.కనులు కనులు కలిసెను (మురళి కృష్ణ)
43.తనువా.. ఉహు హరి చందనమే (కథానాయకురాలు)
44.మనసు గతి ఇంతే (దేవదాసు)
45.పగటి పూట చంద్ర బింబం కనిపించెను ఏదీ ఏదీ…(చిక్కడు-దొరకడు)
46. హాయి హాయిగా ఆమని పాడే ( (మొత్త కాదు)సువర్ణ సుందరి )
47. ముద్దబంతి నవ్వులో మూగబాసలు ( అల్లుడుగారు )
48. నీవుండేది ఆ కొండపై ( భాగ్య రేఖ )
49. కలయా … నిజమా ( కూలీ నెం 1)
50. తనివి తీరలేదే ( గూడు పుఠాని )
51. పయనించే ఓ చిలుకా ( కుల దైవం )
52. అహో ఒక మనసుకి నేడే ( అల్లరి ప్రియుడు )
53. కన్నులతో చూసేది గురువా ( జీన్స్ )
54. ఓహో … ఓహో … ఓహో … బుల్లి పావురమా ( బృందావనం – రాజేంద్ర ప్రసాద్ సినిమా )
55. చెప్పకనే చెబుతున్నది ( అల్లరి ప్రియుడు )
56. ఎక్కడ వున్నా … ఏమైనా… ( మురళీ కృష్ణ )
57. అందమే ఆనందం ( బ్రతుకు తెరువు )
58.నీ మది చల్లగా … స్వామీ నిదురపో ( ధనమా ? దైవమా ? )
59. ఏమని వర్ణించను ( డ్రైవర్ రాముడు )
60. తెలిసిందిలే ( రాముడు … భీముడు )
61. రావోయి బంగారి మామా నీతోటి రాహస్య మొకటున్నదోయి… (ఘంటసాల ప్రైవేటు రికార్డ్)
62. పూసింది పూసింది పున్నాగా ( సీతా రామయ్య గారి మనవరాలు)
63. మంచు కురిసే వేళలో ( అభినందన )
64. ఏలే ఏలే… మరదలా ( అన్నమయ్య )
***************************************
హింది సినిమాలో కొన్ని పాటలు ఆభేరి రాగం లో ( భీం పలాసి లో)
* ఆ నీలె గగన్ తలె ప్యార్ హ కరే ( బద్ షా- 1956)
* ఆజ్ మెరె మన్ సఖి బన్సురి బజాయె కొఇ(ఆన్ – 1952)
*బీనా మధుర్ మధుర్ కచ్హు బోల్(రాం రాజ్య – 1943)
* ఏ అజ్ఞబి తూ భీ కభీ ఆవాజ్ దే కహీ పే ( దిల్ సే – 1998)
*దిల్ కె తుక్డే తుక్డె కర్ కే (దాదా – 1979)
*దిల్ మే తుఝే బిటాకే.. కర్ లూంగీ మై బంధ్ ఆఖే ( ఫకీరా -1976)
* ఖిల్తే హై గుల్ యహా ఖిల్ కే బిచడ్ నే కో (షర్మిలి – 1971)
* కుచ్ దిల్ నే కహా ( అనుపమ – 1966)
* మాసూం చెహర ఖాతిల్ అదా ( దిల్ తేరా దివానా – 1962)
* నగ్మ ఓ షేర్ కి సౌగాత్ కిసే పేష్ కరూ (ఘజల్ – 1964)
* నైనో మే బద్ర ఛాయే ( మేర సాయ – 1966)
*ఓ బెకరార్ దిల్ (ఖొర – 1964)
* ఓ నిర్దయే ప్రీతం ( స్త్రీ – 1961)
* సమయ్ ఓ ధీరే చలో ( 1993)
* తూ హై ఫూల్ మేరే గుల్షన్ కా ( ఫూల్ మేరే గుల్షన్ కా – 1974)
Friday, April 8, 2016
రాగాలు - సరాగాలు
శివుని ఢమరకము నుండి అకార, ఉకార, మకారం యొక్క కలయిక అయిన 'ఓం ' కారము పుట్టినది. ఈ ఓంకారాన్నిఅనుష్ఠించడంలో, అనుసంధానించడంలోనూ నాదము వస్తుంది. ఆ నాదమే సంగీతానికి మూలము. అందుకే శివున్ని 'నాదా తనుమనిశం " అని కొడియాడాడు త్యాగరాజ స్వామి. ప్రకృతిలోని జంతువుల పక్షుల అరుపుల నుండి సప్త స్వరాలు పుట్టించాడు మానవుడు. ఈ సప్త స్వరాలతో సామవేద సారమైన సంగీతము పుట్టింది.
స : షఢ్జం అంటారు అంటే సముద్రము. ఈ షడ్జం నెమలి క్రేంకారం నుండి ఉద్భవించింది. దీనికి అధిష్టాన దేవత బ్రహ్మ.
రి : ఋషభం అంటే ఎద్దు. ఋషబం ఎద్దు రెంకె నుండి ఉద్భవించిన ధ్వని. అధిష్టాన దేవత అగ్ని.
గ : గాంధర్వం అంటే గగనము. మేక అరుపు నుండి ఉద్భవించిన ధ్వని , అధిష్టాన దేవత రుద్రుడు.
మ : మధ్యమం అంటే సమ దూరములో ఉండేది. క్రౌంచపక్షి కూత నుండి వచ్చిన ధ్వని , అధిష్టాన దేవత విష్ణువు.
ప: పంచమం అంటే ఐదవది, కోయిల కూత నుండి ఉద్భవించింది. అధిష్టాన దేవత నారదుడు.
ధ : ధైవతం అంటే భూమి. గుర్రం సకిలింత నుండి పుట్టిన ధ్వని, అధిష్టాన దేవత వినాయకుడు.
ని : నిషాదం అంటే బోయవాడు. ఏనుగు ఘీంకారం నుండి పుట్టిన ధ్వని. అధిష్టాన దేవత సూర్యుడు.
ఆరోహణ : తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి - ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం ఆరోహణ అవుతుంది. అనగా మధ్యమ స్థాయి షడ్జం నుండి తారా స్థాయి షడ్జం వరకు.
ఉదా: స రి గ మ ప ధ ని స.
అవరోహణ : ఎక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం నుంచి ప్రారంభించి, తక్కువ పౌనఃపున్యం ఉన్న స్వరం దాకా పాడడం లేదా వాయించడం అవరోహణ అవుతుంది. అనగా తారా స్థాయి షడ్జం నుండి మధ్యమ స్థాయి షడ్జం వరకు.
ఉదా: స ని ధ ప మ గ రి స.
ఈ ఆరోహణ , అవరోహణలనే మూర్ఛన అంటారు.
యోయంధ్వని విశేషస్తు స్వరవర్ణ విభూషితః |
రంజకోజన చిత్తానాం సరాగః కధితోబుధైః||
స్వరవర్ణములచే అలంకరింబడి, జనుల మనస్సును ఆనందింపచేయునట్టి శబ్ధమును 'రాగము ' అంటారు.
ఈ స్వరాలని చక్కగా అలంకరించినట్టుగా ఒక వరుసలో నిలిపి వీనుల విందు చేసేదే 'రాగము '. రాగాలలో ముఖ్యమైనవి 72 జనక రాగాలు .ఈ రాగాలకు రూప కల్పన చేసిన వారు వేంకటమఖి, పురందర దాసు గారు.
జనక రాగాలనే ‘మేళకర్త ' రాగాలని కూడా అంటారు. వీటికే మాతృక, ఆధార , మూల , ప్రాతిపదిక రాగములని కూడా పేర్లు. మేళకర్త రాగాలకి ముఖ్యంగా రెండు లక్షణాలుండాలి. మొదటిది ఈ రాగ ఆరోహణ, అవరోహణలలో సప్తస్వరాలుండాలి. అంటే అది సంపూర్ణ రాగమైయుండాలి. ఇక రెండవ ముఖ్య లక్షణం, ఆరోహణ, అవరోహణలో సప్తస్వరాలు వరుసక్రమంలో ఉండాలి. జనక రాగాల మరో లక్షణం ఆరోహణావరోహణము లందు ఒకే జాతి స్వరములుండుట.
ఈ 72 జనక రాగాలను రెండు భాగాలుగా విభజించారు. వీటిలో మొదటి 36 రాగాలకు శుద్ధ మధ్యమం ఉన్నందువలన, ఈ పూర్వ మేళ రాగాలను 'శుద్ధ మధ్యమ రాగాలు' అంటారు. తరువాత 36 రాగాలకు ప్రతి మధ్యమం ఉన్నందువలన ఈ ఉత్తర మేళ రాగాలను 'ప్రతి మధ్యమ రాగాలు' అంటారు.
ఎన్నో రాగాలకు మూలము ఈ జనక రాగాలే. ఇలా పుట్టిన కొత్త రాగాలని జన్య రాగాలు (చైల్డ్ రాగాస్) అంటారు. వీటిని స్వరభేదం చేత వివిధ రాగాలుగా విభజించారు. జనక రాగాల నుండి అనంత మైన జన్య రాగాలు పుట్టాయి. ఇలా ఎన్నో జన్య రాగాలను సృష్టించినది త్యాగ రాజ స్వామి వారు. చిన్న చిన్న మార్పులతో ఎంతో చక్కనైనా రాగాలు పుట్టించారు. కొన్ని సార్లు జనక రాగాల కన్న జన్య రాగాలే చాలా ఆహ్లాదంగా ఉంటాయి. తల్లితండ్రుల కన్న పిల్లలు ఎక్కువ అందంగా ఉన్నట్లు. ఒక జనక రాగము నుండి ఎన్నైనా జన్య రాగాలు ఉద్భవించవచ్చు. అటువంటి జన్య రాగాలు అనంతాలు. కనీసం నాలుగు స్వరాలతో ఒక రాగం ఏర్పడుతుందంటారు. కానీ డా. బాలమురళీకృష్ణ " స మ1 ప (మూడే మూడు) " స్వరాలతో ' సర్వశ్రీ ' అనే స్వంత రాగాన్ని సృష్టించి అద్భుతంగా కీర్తన (స్వరకల్పన చేసి మరీ) పాడారు.
కర్ణాటక సంగీతములో 22 వ మేళకర్త రాగము ఖరహర ప్రియ. ఈ రాగంలో అనేకమైన జన్య రాగాలు ఉన్నవి. వాటిలో కొన్ని ఆభేరి, అభోగి, శ్రీ, ఉదయరవిచంద్రిక, మధ్యమావతి, ముఖారి, రీతిగౌళ, బృందావన సారంగ,శివరంజని, కాఫీ, మరియు శ్రీరంజని.
Friday, September 18, 2015
శ్రావణ మాసం
చిన్నప్పుడు శ్రావణ మాసం అనగానే పేరంటాలు, చామంతులతో పూల జడలు, మొగలి పువ్వు వాసనలు, వాయినం శనగలు మరునాడు వేయించుకొని తినడము.. ఇంతే! మా ఊరిలో పేరంటము అంటే మా మామ్మ, చినమామ్మ మధ్యాహ్నం మూడున్నరకే ఇంట్లో వాళ్ళకి ' టి ' ఇచ్చి బయలుదేరేవారు. ఈ మామ్మలది ఒక బాచ్ , ఆ తరవాత అమ్మలది ఇంకో బాచ్ బయలుదేరేది. శ్రావణ భాద్రపదాలంటే వర్షకాలాలే! అందులోనూ మా ఊరు ఎర్ర మట్టి, రోడ్లు కూడా సరిగ్గా ఉండవు గతుకుల రోడ్లు. ఇలా వర్షం పడితే ప్రతీ ఇంటి ముందు ఒక నీళ్ళ బాల్చి పెట్టేవారు కాళ్ళు కడుక్కోడానికి. ఆడవాళ్ళ కాళ్ళకి చక్కగా పసుపు రాసి, మెడకి గంధము పూసి, పన్నీరు (తినేది కాదు) చల్లి, కాటుక ఇచ్చేవారు. పేరంటానికి వచ్చిన ఆడవాళ్ళు ఇలా ప్రతీ ఇంట్లో కాటుకా చక్కగా పెట్టుకొని ఇంటికొచ్చేసరికి కళ్ళకాటుక మొహం అంతా పాకేసేలా చేసుకునేవారు. . "పూట పేరంటానికి మొహం అంతా కాటుక " అంటే ఇదేనేమో! కాళ్ళకి పసుపు రాయించుకొని ఇంటికి ఇంటికి వెళ్తూ ఉన్న పేరంటాల్ల కాళ్ళకి ముందు రోజు పడిన వర్షంతో తడిసిన ఎర్రమట్టితో పారాణి దిద్దేది భూదేవి.
పిల్లలకి చామంతి పూలజడ వేసేవారు.. అదీ గట్టిగా దురద పుట్టినా గోక్కోడానికి లేకుండా. మొగలి రేకు (సీరియల్ కాదు) జడ మీద పెట్టి ఆ పైన ఈ చామంతులతో కుట్టిన జడ, ఆ రెండు పూల వాసనలు, పసుపు పన్నీరు వాసనతో కలిసి, ఆ పైన శనగల వాయినం కలుపుకొని అదో రకమైన సువాసనలొస్తుండేది శ్రావణ మాసం. కొత్త పెళ్ళికూతుర్ల కొత్త కొత్త పట్టుచీరలు, బంగారు నగలు... కొత్త అందాన్ని తెచ్చేవి. ఇంట్లో మండువాలో వర్షం ధార పెద్ద శబ్ధం చేస్తూ పడుతుంటే, పేరంటానికి వచ్చిన ఆడ లేడిసు అంత కన్నా గట్టిగా కబుర్లు చెప్పేసుకునేవారు. ఈ మామ్మ ల వెనకాల ఒక చిన్న బకెట్టు పట్టుకొని నేనూ బయలుదేరేదాన్ని, శనగలు అందులో వేసుకోడానికి. కొందరు ఇల్లు పాడైపోతుందని వచ్చిన ఈ పేరంటాళ్ళలని అరుగు మీదే కూర్చోబెట్టేవారు గోను సంచీ వేసి... కొందరు మొహం చిట్లించుకుంటే, కొందరు గడుసుగా 'చురక ' వేసేవారు.
ఒకసారి మా మామ్మ చుట్టాలావిడ ఆవిడ కోడలికి కొత్త నోమని మా మామ్మ ని పూజకి, తాంబూలానికి, సపరివార సమేతంగా భోజనానికి రమ్మని పిలిచింది. నన్ను తోడు తీసుకొని మా మామ్మ ఆ పూజకు వెళ్ళింది. మా అమ్మ నన్ను పంపిస్తూ " తినడానికి తప్ప నోరు తెరవకు " అని చిన్న వార్నింగ్ ఇచ్చింది. ఆ అత్తగారు పాత సినిమాలలో 'హేమలత ' లా ఉంది. కోడలు కొత్త సినిమాలోని సన్నగా ఉంటుంది 'అల్లుడుగారు వచ్చారు " లో 'కౌసల్య ' లా ఉంది. ఇంతలో పక్కన ఎవరో వాయనానికి రమ్మంటే నన్ను వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది మామ్మ.
ఆ అత్తగారు కోడలి చేత పూజ చేయిస్తున్నారు. " శ్రావణ మాసే శుక్ల పక్షే... 'ధర్మపత్నీ సమేత ' " అని చదవగానే ఆ కోడలు తల పైకెత్తి " అత్తయ్యగారు! ధర్మపత్ని అని అనకూడదండీ.. "
" ఇక్కడ అలానే ఉంది " అని పుస్తకం వైపు చూసింది అత్తగారు
" అక్కడ అలానే ఉంటుంది కానీ మనము చదవకూడదండి " కోడలు
" చదవకూడదన్నప్పుడు ఎందుకు రాస్తాడు? " బ్రుకుటి ముడి వేసి అత్తగారు
లాజిక్కే...
" అది మగవారిని ఉద్దేశించి రాసిందండి , మనకి కాదు " కోడలు
మనమైతే 'ధర్మపతీ సమేత అనుకోవాలేమో " అని అంద్దామనుకున్నా.. ఇంతలో ఒక తెల్లటి డ్రెస్ వేసుకొని ఒక అమ్మాయి నాలో నుండి సినిమాల్లో చూపించినట్టు వచ్చి "విచ్చి నీకు డైలాగులు లేవు, నోరు మూసుకో " అని చెప్పింది.
" ఇవ్వాళ కాదు నిన్న కాదు నేను కాపురానికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతోంది.. ఇలాగే చదువుతున్నాను " అత్తగారు కాస్త రొప్పుతూ
" నా దేవుడు నేను ఎలా చదివినా నా మాట వింటాడు " అని ఇంక మాట్లాడే చాన్స్ కోడలికి ఇవ్వకుండా పుస్తకం వైపు చూస్తూ చదవటం ప్రారంభించింది.
వాదించడం దండగ అనుకుందేమో కోడలు నా వైపు చూసింది, అదే టైం కి అత్తగారు కూడా చూసింది " నాకేమీ తెలియదు.. నాకు తెలుగు రాదు నేను సిటి లో చదువుతున్నానుగా (మా టైమ్ నుండి తెలుగు రాదు అని చెప్పుకోవడం ఫాషనే) " అని ఒక అమాయకపు మొహం పెట్టేశాను. ఏం మాట్లాడినా సపరివార సమేతంగా పిలిచిన ఆవిడ 'మేత ' పెట్టకుండా పంపేస్తుందేమో అని భయం. పులిహోర, కొబ్బరికాయ రోటి పచ్చడి, గారెలు, ఆవళ్ళు ఎదురుగా కనిపించాయి.. నోరూరింది.. నోరు మూసేశా...
పూజ అంతా అయ్యింది. మా మామ్మ సినిమాలో పోలీస్ లాగ చివర్లో వచ్చింది. అక్కడ జరిగింది ఏవీ తెలియదు ఆవిడకి పాపం.
" చూడు కావుడప్పా! ఈ అగ్రహారం లో నేను ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నాను, ఎంత మంచి పేరు తెచ్చుకున్నానో నీకు తెలుసు కదా.. " అని కోడలికి చెప్పాల్సినవన్నీ మా మామ్మని అడ్డుపెట్టుకొని చెప్పేసింది.
ఇవేవి తెలియని మా మామ్మ వాయనము తీసుకొని నన్ను తీసుకొని ఇంటికి చక్కావచ్చింది. ఇంటి కొచ్చాక కొంచం అర్ధయ్యి అర్ధమవ్వనట్టు మా మామ్మకి, అమ్మకి చెప్పాను. మా మామ్మ " ఎవరికీ చెప్పకు బాగోదు " అని ,
మా అమ్మ " ఇంక పేరంటాలు పెత్తనాలు అంటూ అందరిళ్లకి వెళ్ళకు " అని వార్నింగు ఇవ్వబడ్డాయి.
మా మామ్మ చెప్పినట్టే నేను ఎవరికీ చెప్పలేదు... ఇంతవరకు.. !!!
Saturday, August 15, 2015
భారత మాతకు జేజేలు
భారతగణతంత్రదినోత్సవం.. ఈ పేరు చిన్నప్పుడు ఒకరోజంతా వల్లెవెయ్యగా వెయ్యగా తప్పులు లేకుండా 'ణ ' ని ' న ' గా కాకుండా 'ణ " గా పలకడం వచ్చింది. స్కూల్లో ప్రతి సంవత్సరం జండా వందనం, పిల్లల చేత మాచ్ ఫాస్ట్ చేయించేవారు. అదో సంబడంగా ఉండేది. ఒకసారి మా క్లాస్ పిల్లల చేత పాట పాడించాలని టిచర్ అనుకొన్నారు. వెంటనే మా క్లాస్లో ఒక అబ్బాయి " నేను పాడతా " అని తన పేరు ఇచ్చాడు. " ఏం పాట పాడతావు " అని టిచర్ అడగగా, "భారత మాతకు జేజేలు " అని చెప్పాడు.
సాయంత్రం టీచర్ మళ్ళీ మా క్లాస్ కి వచ్చి, ఆ అబ్బాయి పాడితే వెనకాల మేమందరం ( ఓ పదిహేను మంది) అతని పాడిందే మళ్ళీ రిపీట్ చెయ్యాలని(కోరస్ అని అంటారని తరవాత తెలిసింది) చెప్పారు. రోజు చివరి పిరీడ్ మాకు రిహార్సిల్స్ ఉండేది. అలా ఒక నాలుగు రోజులు ప్రాక్టీస్ చేశాము. ప్రాక్టీసు చెయ్యడానికి ఏముంది? ఆ అబ్బాయి పాడిందే పడెయ్యాలి అంతేగా...
గణతంత్రదినోత్సవం రానే వచ్చింది. కొందరు తెల్లటి చుడీదార్లు, కొందరు కాషాయం, కొందరు పచ్చవి వేసుకొని వచ్చాము. అందరికి సొంత ఇంట్లో పండగలా ఉంది ఆ వాతావర్ణము. మాకు పాడే అవకాశం వచ్చింది. స్టేజి ఎక్కి అందరం పేరంటానికి వచిన ముత్తైదువులా బుద్ధిగా పాడేయ్యడం మొదలెట్టాము. పాట మొదలెట్టగానే జనాలు నవ్వులు.. అబ్బే ఇవన్నీ పట్టించుకుంటే కాన్సెంట్రేషన్ దెబ్బ తినేస్తుంది అని కళ్ళు మూసుకొని మరీ నిష్టగా పాడేశాము. ఇంక స్టేజ్ దిగి కిందకి రాగానే టీచర్ మమ్మలందరినీ క్లాస్ రూం లోకి రమ్మన్నారు. "ఇప్పుడా పొగడ్తలెందుకు లెండి " అని మనసులో మొహమాటంగా అనేసుకొని.. ఆ పొగడ్తలని ఊహించుకొంటూ క్లాస్ రూం కి వెళ్ళాము. అంతే... అందర్ని వరసగా నిల్చోబెట్టి తిట్టడం మొదలెట్టారు. ముందు పాడిన అబ్బాయినైతే చెవి మెలేసి మరీ తిట్టారు. "మీ అందరూ గొర్రెలా పాడెయ్యడమే? ఏం పాడుతున్నారో కాస్త ఆలోచన లేదా? " అని మళ్ళీ మా గొర్రెల బ్యాచ్ ని అన్నారు ( ఆ పేరు ఆవిడే పెట్టారు). మాకేం తెలుసు? మీరేగా చెప్పింది " ఈ అబ్బాయి పాడింది మీరూ పాడండి " అని, ఇది అందరం మనసులోనే అనుకొన్నాము.. బయటకు మాట పెగల్లేదు.
ఇంతకీ తప్పేంటి పాడినదాంట్లో? "భారత మాతకు జేజేలు.. బంగరు భూమికి జేజేలు ' బదులుగా "బంజరు భూమికి జేజేలు " అన్నాము అంతే!
Thursday, February 26, 2015
మండా సుధా రాణి
శ్రీమతి మండా సుధా రాణి గారు.. ఇప్పటి సంగీత విదుషీమణులలో అగ్రగణ్యురాలు. పల్లవి పాడటంలో ప్రవీణురాలు. ప్రస్తుతం విశాఖలో ఎందరో సంగీత అభ్యాసకులకు మార్గదర్శిగా ఉంటున్నారు.
ఈవిడ 1964 లో విజయనగరం లో శ్రీమతి కల్యాణి, రమణ మూర్తి గార్ల దంపతులకు ఆ వీణాపాణి సరస్వతీదేవి పుట్టినరోజుగా చెప్పబడుతొన్న వసంత పంచమి నాడు జన్మించారు. విజయనగరం మహరాజా కాలేజి నుండి బి.ఎస్.సి. పట్టభద్రులైనారు. ఆ తరువాత ఆంధ్ర యూనివర్సిటిలో సంగీత డిప్లమా చేసి డీస్టిన్షన్ లో పాస్ అయ్యారు. 1993 లో ఎం.ఏ మ్యూజిక్ లో ఆంధ్ర యూనివర్సిటి ఫస్ట్ వచ్చారు. వీరు ప్రాధమిక స్థాయిలో శ్రీమాన్ కె.రంగాచార్యులు, శ్రీమతి శేషుమణిగార్ల వద్ద సంగీత అభ్యాసము చేశారు. అటు పిమ్మట శ్రీ ఇవటూరి విజయేశ్వర రావు గారి వద్ద శిష్యరికము చేశారు. 1989 లో డాక్టర్. రామ్ ప్రసాద్ గారితో వివాహమైనది. వారికి ఒక అమ్మాయి పేరు ప్రత్యూష శృతి రవళి. వారి అమ్మాయి తల్లికి తగిన తనయ. సంగీతములోనూ ఆవిడనే అనుసరిస్తోంది.
ఒకే సమయములో ఖండగతిలో ఘాతలు వేస్తూ చతురస్ర క్రియలతో తాన వర్ణాన్ని రెండు కాలాలలో పాడటములో ఆవిడ నిపుణురాలు. ఇలాంటి ప్రక్రియలు చేయాలంటే మనసుకు, మెదడుకు మద్య చాలా వతిరేకత ఉంటుంది. దాన్ని అధికమించి ఇటు మనసును, మెదడును ఆధీనములో ఉంచి ఇలాంటి ప్రయోగము చేసిన సవ్యసాచి సుధారాణి గారు.
గతి, తాళాలమీద వీరికి ఈ మహాధికారం ఉండడంవల్లే, పద్దెనిమిదేళ్ళ పినవయసులోనే మద్రాసు సంగీత అకాడమీ నుంచి పల్లవి పాడడంలో అవార్డు పొందారు. పందొమ్మిదేళ్ళ వయసులో చెన్నైలోని శ్రీ కృష్ణ గాన సభవారు వీరి పల్లవి గానానికి అవార్డుని ప్రదానం చేశారు. 1987, 1992లలో కనె్సర్ట్ అవార్డులను మద్రాసు మ్యూజిక్ అకాడమీ నుంచి పొందారు.
అందరికీ తెలిసిన ప్రఖ్యాతి గాంచిన రాగాలలోనే కాకుండా చాలా తక్కువ మందికి తెలిసిన అపురూపమైన రాగాలలో ఎన్నో కృతులు పాడి వీరికి వీరే సాటి అని నిరూపించుకున్నారు. ఇటువంటి ప్రయోగాలతో ఆవిడ కచేరీలకు ఒక ప్రత్యేకత ఏర్పడింది.
కర్ణాటక సంగీతంలో రెండు ముఖ్యభాగాలు. మొదటిది సాహిత్యంతో కూడిన రచనలను గానం చేయడం (అప్లైడ్ మ్యూజిక్), రెండవది సాహిత్యం లేకుండానే చేసే రాగాలస్వరాలు ప్రస్తారం (ప్యూర్ మ్యూజిక్). ఈ రెండింటిలోనూ కళాకారుని మనోధర్మం, వ్యక్తిత్వం ప్రకటిత మౌతుంటాయి. చిన్న చిన్న గమకాలతో, ఆలాపనలతో మేళకర్త రాగాల నుండి మరెన్నో రాగాలు పుట్టించవచ్చు అని వారి అభిప్రాయము. ఇలా కొత్త రాగాలు కనిపెట్టాలంటే మాత్రం ఎల్లప్పుడు సంగీత సాధన చేస్తూ ఉండాలని ఆవిడ స్వయం గా చిన్నారులతో చెప్పారు.
‘మనోధర్మ సంగీతానికి కల్పిత సంగీతం ఆధారం’ అన్న విషయంపై సమగ్రమైన రచన చేసి దాన్ని భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ మరియు సాంస్కృతిక శాఖలకు సమర్పించి దానికి గాను ఫెలోషిప్ని సంపాదించారు.
1980 లో వీరు ఆకాశ వాణి కళాకారిణిగా ఎంపికైనారు. 2009 లో టాప్ ఏ గ్రేడ్ గాయని గా గుర్తించబడ్డారు. ఆల్ ఇండియా రేడియో లో ఎన్నో సార్లు " సంగీత శిక్షణ " కార్యక్రమాలు నిర్వర్తించారు. మరెన్నో సార్లు "భక్తి రంజని" లో పాడారు. టి.టి.డి వారి నాద నీరాజనము లో కూడా శిష్యులతో కలిసి ఆ దేవదేవుడికి స్వరాభిషేకము చేశారు. సుధా రాణి మన దేశములోనే కాక కాక అమెరికాలోని క్లీవ్ల్యాండ్, క్యాలిఫోర్నియా (సిలికాన్ ఆంధ్ర), సియాటిల్, షికాగో, డెట్రాయిట్, ర్యాలీ, కాన్సాస్ సిటీ, కొలంబస్ లలో కచ్చేరీలు చేశారు.
కచేరీలు ఇవ్వడమే కాదు సుధరాణి గారు ఎన్నో సెమినార్ లు కూడా ఇచ్చారు. తెలుగు యూనివర్సిటి వారిచే నిర్వహింప బడిన సెమినార్ లో " షట్ కళా పల్లవి" అనే అంశము పై సెమినార్ ఇచ్చారు.
' శ్యామ శాస్త్రి గారి స్వరజతుల ' మీద ఒక సెమినార్ ఆంధ్రా యూనివర్సిటిలో నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ మూజిక్ లో ఇచ్చారు. త్యాగరాజ ఆరాధనోత్సవాలలో "ముత్తుస్వామి దీక్షితార్, శ్యామ శాస్త్రి సంగీతం ' గురించి గోష్ఠి ఇచ్చారు.
అవార్డులు బిరుదులు :
' గాన కళా భారతి ' --- శ్రీ భారతి గాన సభ ( అమాపురం 2000)
' సునంద సుధా నిధి '--- గాయక సార్వభౌమ సంగీతం పరిషత్ (విజయవాడ 2008)
' సంగీత సుధా నిధి ' --- విజయ త్యాగరాజ సభ (విశాఖ పట్టణం 2009)
' విజయ సంగీత రత్న '--- విజయ నగర్ ఫైన్ ఆర్ట్స్ (హైదరాబాద్ 2006)
సంగీత కల్పవల్లిగా ఉంటూ ఎందరికో సంగీత శిక్షణ ఇస్తూ గొప్ప విద్వాంసులు గా తీర్చి దిద్దుతున్నారు. "మీ అమ్మాయి మీ సంగీత వారసురాలా? " అని అడిగితే " సంగీతం నేర్చుకొంటున్న వారంతా సంగీతానికి వారసులే, నా కూతురే కాదు ఇక్కడ ఉన్న పిల్లలంతా (శిష్యులంతా) నా వారసులే " అని జావాబిచ్చిన గొప్ప వ్యక్తిత్వము గల మహోన్నత వ్యక్తి ఆవిడ.
ఆవిడ చేస్తోన్న కృషి ఎంతో శ్లాఘనీయమైనది. అందుకు భగవంతుడు ఆవిడకు శక్తిని ప్రసాదించాలని కోరుతున్నాము.
మండా సుధారాణి మహిత సంగీతజ్ఞ
షట్కాల పల్లవీ విద్యలో సర్వజ్ఞ
తన వంటి శిష్యులను సంగీత లోకాన
కందించు ఆమె కిదె నిత్యాభివందనము.
Monday, February 16, 2015
ఎందరో మహానుభావులు
నాకు తెలిసిన ఈ చిన్ని ప్రపంచం లో నేను చూసిన మహానుభావులు ఎందరో! వారితో నా అనుభవాలు జ్ఞాపకాలు ఇలా బద్రంగా పొందుపరచుకున్నాను.
Subscribe to:
Posts (Atom)