Search This Blog

Sunday, January 21, 2018

సంక్రాంతి స్మృతులు

ఒకప్పుడు మా ఊరిలో సంక్రాంతి అంటే పండగ శోభ అంతా ఆ ఊరిలోనే నిత్యవాసం చేసేది. ప్రతీ ఇంటి అరుగు మీద పట్టివర్ధనాలతో, అప్పుడే సంధ్యావందనం ముగించుకొన్న సోమయాజిలాంటి తాతగార్లు, పక్కన వారి మజ్జిగో లేక పాలో ఇవ్వడానికి కచ్చాపోస, కడియాలు, కాలికి నిండా పసుపు, తలలో ఓ మందారపువ్వు, మొహమ్నిండా పసుపు, మధ్యలో రూపాయి కాసంత బొట్టుతో సోమిదేవమ్మ లాంటి మామ్మ గార్ల్తో ఆ ఊరు మొతం కళకళలాడేది. ఆ ముసలి దంపతుల కొడుకుకోడల్లూ, ఆ తరవాత మా తరం వాళ్ళూ ఆ ఊరిలో ఉండేవాళ్ళము.


మా ఇంట్లో మా తాతగారు, మామ్మ, పక్క ఇంట్లో తాతతాతయ్య, గున్నమామ్మ, ఆ పక్క ఇంట్లో ఆవు మామ్మ, మీసాలతాతయ్య, ఆ పక్క శాస్త్రులు తాతగారు, రాజేశ్వరి మామ్మ, ఆ పక్క వీరన్న తాత, కావు మామ్మ.. ఇలా ఊరు ఊరంతా నిండుగా పూసిన మామిడి చెట్టులా చూడముచ్చటగా ఉండేది.


ఊరు మొత్తం తాతగారి పెదనాన్న చిన్నాన సంతానమే అవ్వడంతో ఊరంతా మాకు బాబయ్యలూ, పెదనాన్ననూ, వారి సంతానమే! పండగ వస్తే ఇంటి అడపిల్లలు వచ్చేవారు. పండగ పిండి వంటలు కోడళ్ళు చేస్తే, పిల్లలకు తలస్నానాలు, వారి చేత భోగి మంటల్లో పిడకల దండలు వేయించడం అత్తల వంతు. పొగమంచులో కొబ్బరాకు పొయ్యి పెట్టి పెద్ద డేశాతో వేడినీళ్ళు కాచి ఆ నీళ్ళతో స్నానం. అదేంటో నీళ్ళు కూడా భలే మంచి వాసన వచ్చేవి. కంట్లో కుంకుడు కాయ పులుసు పడితే స్నానమయ్యాక ఒక ఉప్పు కణిక నోట్లో వేసుకొని తలకి పిడప కట్టుకొని భోగి మంటల దగ్గరకు పిడకల దండ వేయడానికి వెళ్ళేవాళ్ళము. ఒక పక్క పుష్యమాసం చలి, ఇంకో పక్క భోగి మంట వెచ్చదనం, ఓ పక్క కంట్లో పులుసు పడిన మంట, మరో పక్క ఆ భోగి మంటకు ఒక ఊరట, నోట్లో ఉప్పుకణిక , కన్నీటి ఉప్పదనం... ఏంటో అన్నీ కలబోతలే.


భోగి మంట అయ్యాక అందరికీ దండాలు... అలా డబ్బులు వసూలూ! అందరి ఇల్లకు వెళ్ళి దండం పెడితే రూపాయో రెండు రూపాయిలో ఇచ్చేవారు. ఆ ఇంటి మామ్మలైతే పండగ కోసం చేసిన జంతికలు, బెల్లం మిఠాయి ఇచ్చేవారు. అవి బ్రేక్ ఫాస్ట్ చేసి కొత్తబట్టలు అందరికీ చూపించి మురిసిపోయేవాళ్ళము. అప్పుడు పండగలకీ, పుట్టిన రోజులకే కొనుకునేవాళ్ళము కొత్త బట్టలు. కానీ ఆ కొత్తబట్టలు చూసుకొని చూసుకొని మురిసిపోయేవాళ్ళము. అదేంటో ఇప్పుడు ఇన్ని కొత్తబట్టలు కొన్నా ఆ ఆనందం లేదేంటో? చిన్నతనం పోయిందా? పెద్దరికం వచ్చిందా?

లేక మనసు మొద్దుబారిపోయిందా?


సాయంత్రం గొబ్బెమ్మల పేరంటాలు, బొమ్మల కొలువు పేరంటాలు. గట్టిగా పాటలు పాడి ఆ పేరంటానికి ఇచ్చిన ప్రసాదం తినేసి మళ్ళీ ఏదో సంబరంతో తిరిగేవాళ్ళము. కనుమ రోజు "ప్రభల తీర్ధం ". దాని వర్ణించడం కష్టమే... రెండు కళ్ళూ చాలవు చూడటానికి. 


అన్నిటి కన్నా సంక్రాంతి అంటే గుర్తొచ్చేది ముగ్గులు. చిన్నతనంలో వీధిలో ముగ్గు వేసే అర్హత రావాలంటే ముందు పెరట్లో వేయాలి. పెరట్లో ముగ్గు వెయ్యాలంటే అస్సలు ఇష్టముండేది కాదు. వీధిలో ముగ్గు వేసే ఛాన్స్ అత్తలు ఇచ్చేవారు కాదు. (అప్పటి ఇంకా చేతబడి ముగ్గులే వచ్చు). మా మామ్మ అనేది "పెరటి గుమ్మము పేద ముత్తైదువా ... అలా చిన్న చూపు చూడకూడదు... అక్కడ కూడా పెద్ద ముగ్గు వేయండి అని" . పెరట్లో జూనియర్స్ కి ముగ్గు వేసే అవకాశం వచ్చేది.


నేను ఇంటర్కి వచ్చాక వీధిలో ముగ్గు వేసే ప్రమోషన్ వచ్చింది. నేను ముగ్గు వేస్తుంటే మా తాతగారు కాపలా కూర్చునేవారు. చుక్కలు వేస్తుంటేనే అనేవారు " మంచు పడుతోంది.. ఇంక చాలమ్మ.. పద లోపలకి " అని. పాపం రాత్రి 9 గంటల కల్లా పడుకొనే వారు నా కోసం మాత్రం నిద్ర ఆపుకొని 11 గంటల వరకూ  మరీ కూర్చునేవారు. ప్రతీ అరగంటకోసారి "ఇక చాలమ్మ... మంచు పడుతోంది, వెళ్ళి పడుక్కో " అని అనేవారు.  దానికి మా మామ్మ అనేది " అది రేపు పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్తే ఏవైపోతారూ? " అని...


అప్పుడు ఆ మాట సరదాగా అనిపించేది. కానీ నిజంగా నేను వెళ్ళిపోతే ఏవైపోతారో అని ఆలోచించలేదు. నేను అత్తారింటికి వెళ్ళిపోతే బెంగపెట్టుకొని ఆ ముసలి ప్రాణి తట్టుకోలేక ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతారని ఆ సమయంలో నాకు తెలియదు. తెలిసేటప్పటికి ఆయన లేరు.


No comments:

Post a Comment