Search This Blog

Wednesday, December 13, 2017

ఆనందం


ఆనందం ఎక్కడ ఉంది? ఖరీదైన వస్తువులలోనా? పెద్ద పెద్ద బంగ్లాలలోనా? కాస్ట్లీ బట్టలలోనా? ఈ ప్రశ్నకి జవాబు కావాలంటే ఎన్ని గ్రంధాలు తిరగెయ్యాలి? ఎంత మంది గురువులని ఆశ్రయించాలి? ఇవన్నీ ఒక ఎత్తు.. ప్రకృతి పార్వతీ దేవి స్వరూపంగా భావించే వారికి ప్రతి అణువు ఒక పాఠమే! ప్రతి జంతువు, ప్రతి పునుగు  మనకు ప్రతి నిత్యం ఏదో ఒకటి భోధిస్తూనే వుంటుంది. 


అసలు విషయానికి వస్తే.. గత నెల్లాళ్ల నుంచి మా ఇంటి కిటికీ దగ్గరకు ఒక పక్షి పొద్దుటే అదేదో డ్యూటికి వచ్చినట్టువస్తోంది. సాయంత్రం చీకటి పడెవరకు ఆ కిటికీ బయట నుంచి దాని మొహం దానికి కనిపిస్తోందేమో,  రోజూ ఆ ప్రతి బింబంతో పోట్లాటే! ఆ కిటికీ దాటాక ఏ లోకం ఉందో అని దాని ఆలోచనో ఏమిటో మరి! దాని ముక్కు ఎక్కడ విరిగిపోతుందో అన్న భయం కూడా వేస్తుంది అది కిటికీని కొట్టే విధానం చూస్తే! ఒకసారి ఆ కిటికీ తలుపు తీసి "అంత అందమైనది కానే కాదు పిచ్చమ్మ " అని చెప్పాలనిపిస్తుంది.



ఇంకో విషయం... మా పనిమనిషి కూతురు. దాని పేరు సత్య. రోజూ రాగానే "ఆంటీ బిస్ కెట్లు  " అంటుంది. బిస్ కెట్టు ఇస్తే కొన్ని సార్లు తింటుంది, మరి కొన్ని సార్లు దాచుకుంటుంది. కానీ ఈ రోజు అది ఆ బిస్కెట్టు పాకెట్టు తీసుకొని అద్దం లో చూసుకొంటూ డాన్స్ చేస్తుకుంటూ పాటలు పాడుకోసాగింది. చాలా సేపు దాని వైపు ముచ్చటగా చూస్తూనే ఉన్నా! తరవాత ఆ బిస్కెట్లతో బ్రిడ్జ్ కట్టింది, ఇంకా ఏవేవో కట్టింది. 


సాయి బాబా జీవిత చరిత్రలో "ఈశావాస్యోపనిషత్ " ఘట్టం గుర్తొచ్చింది. లేదన్న చింతన లేదు, ఉందన్న గర్వం లేదు. ఎప్పటికీ నిలిచే ఆనందమే... నిత్యానందం... బ్రహ్మానందం.!!

No comments:

Post a Comment