Search This Blog

Monday, October 9, 2017

గరికిపాటి నరసింహారావు గారు

" కదిలేది కదిలించేది పెనునిద్దర వదిలించేది కావాలోయ్ నవతరానికి " అని మహాకవి శ్రీశ్రీ కోరినట్టుగా ప్రస్తుత యువతరానికి తన మాటలతో ఉత్తేజాన్నిచ్చే వారు ఇన్నాళ్ళకు దొరికారు.  ప్రవచనాలంటే కాటికి కాలు చాపుకొనేవారే వింటారు అనే అపోహ ఈయన ప్రవచనం వింటే తొలగిపోతుంది. ఏ ప్రవచనం విని యువత లో ఒక వివకానందుకు వెలుగుతాడో.. ఆ ప్రవచనం ఆ గరికపాటివారి సొంతం.  ప్రస్తుతం సమాజం లో ఉన్న కుళ్ళును తన మాటలతో ఉతికిపారేసే నైజం వారిది.  ఆయన ఆత్మవిశ్వాసానికి ప్రతీక.  నిద్రాణమైన యువత శక్తిని మేల్కొలిపే నవరసగూళికలు... వారి మాటలు. 



వారిని కలిసే భాగ్యం నాకు కలిగింది. వారి గురించి చెప్పడం ముంజేతి కంకణానికి అద్దం చూపడం లాంటిదే! కానీ వారి గురించి చెప్పడం లో చాలా ఆనందం ఉంది. నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మిత్రులు పెద్దమనసుతో ఆశ్వాదిస్తారనే ఆశిస్తున్నాను.


 ఈ  సాహితీ రంగంలో అపార కృషి చేస్తున్న గరికిపాటి గారు కవి, పండితులు, అవధాని, గ్రంధ రచయిత, ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, ప్రవచనకర్తగా రాణిస్తున్నారు. సమ్రుదఘోష నెపంతో  సాహితీ సముద్రాన్నే  అవపోసన పట్టేసిన అపర
అగస్త్యుడు, ఆ మహాత్ముడు దగ్గరకు   ఒక చిన్న లోటాతో వెళ్ళి అంతే నీరు తెచ్చుకోగలిగాను. 


బాల్యము :


గరికిపాటి నరసింహారావు గారు భాద్రపద శుద్ద పాడ్యమి సెప్టెంబర్ 14వ తేదీ 1958 వ సంవత్సరం, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వేంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎం. ఏ. , ఎం. ఫిల్, పి. హెచ్. డి.  చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలు పనిచేశారు. 


అవధానాలు :


తెలుగు, సంస్కృత  భాషలకే సొంతమైన ఈ అవధాన ప్రక్రియలో చాలా కొత్త కొత్త ప్రయోగాలు చేసిన బహు కొద్ది మందిలో గరికపాటి వారు చెప్పుకోతగినవారు.  వీరు 275 అవధానాలు, ఎనిమిది అర్ధ శత అవధానాలు, ఎనిమిది శతావధానాలు, ఎనిమిది ద్వి శతావధానాలు చేశారు. ఒక మహాసహస్రావధానము చేసి వారి కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. మొదటి అవధానం 1994 సంవత్సరం విజయదశమి రోజు చేశారు. 


2009లో 8 కంప్యూటర్లతో హైటెక్ అవధానం నిర్వహించారు.  2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ( NIIMS ) ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది. ఆ విధంగా మేధా పరీక్షావధానం కూడా తొలిసారి నిర్వహించింది శ్రీ గరికపాటి వారే!  యావదాంధ్ర దేశంలోనే కాక మనదేశంలోని వివిధ నగరాలతోపాటు అమెరికా, సింగపూరు, మలేషియా, లండన్, దుబాయి, బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్ మొదలైన దేశాలలో పర్యటించి అక్కడ అవధానాలు చేశారు.


రచనలు :



 సాగరఘోష - పద్యకావ్యం

 మనభారతం- పద్యకావ్యం

 బాష్పగుఛ్ఛం- పద్య కవితా సంపుటి

 పల్లవి - పాటలు

  సహస్రభారతి

  ద్విశతావధానం

  ధార ధారణ

  కవితా ఖండికా శతావధానం

  మౌఖిక సాహిత్యం- పరిశోధనా కావ్యం

  పిల్లల బొమ్మల తెలుగు నిఘంటువు

  మా అమ్మ- లఘుకావ్యం

  అవధాన శతకం

  శతావధాన భాగ్యం- సంపూర్ణ శతావధానం

  శతావధాన విజయం- 101 పద్యాలు


పురస్కారాలు :


ఎం.ఫిల్ లో యూనివర్సిటీ ఫస్టు సాధించినందుకు అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ ద్వారా 2 స్వర్ణ పతకాల బహూకరణ (1989)

* కనకాభిషేకాలు - భీమవరం (1997), వెదురుపాక విజయదుర్గా పీఠం ( 2004)

* సువర్ణ కంకణాలు- కాకినాడ (1999), విశాఖపట్నం ( 2003, 2004 మరియు2005)

* పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారిచే అవధాన రంగంలో ప్రతిభా పురస్కారం (2000)

* 2002లో సాగరఘోష కావ్యానికి సాధన సాహితీ స్రవంతి, హైదరాబాదు వారి పురస్కారం

* 2003లో తెలుగు విశ్వ విద్యాలయం వారిచే పురస్కారం - సాగరఘోష కావ్యానికి

* 2004 లో నండూరి రామకృష్ణమాచార్య పురస్కారం (గుడివాడ)

* 2005లో ‘సహృదయ’ (వరంగల్లు) వారి సాహిత్య పురస్కారం -సాగరఘోష కావ్యానికి

* భగవాన్ సత్య సాయిబాబా వారిచే 2008 నవంబరులో సువర్ణహారం

* 2008 లో అభ్యుదయ ఫౌండేషన్ (కాకినాడ) వారిచే పురస్కారం

* 2011 సెప్టెంబరులో కొప్పరపు కవుల పురస్కారం

* సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శ్రీరామనవమి ప్రతిభా పురస్కారం (2012)

* తుమ్మల పీఠం పురస్కారం, గుంటూరు, 2012

* 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.


బిరుదులు :


కాకీనాడలో 1994 అక్టోబర్ 9 -10 (విజయదశమి) మొదటి శతావధానము  చేసినప్పుడు ధారణగా 75 పద్యాలు నలభై నిమిషాలలో చెప్పేశారు. అది చూసి ఆశ్చర్యపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మమ గారు వారికి "శతావధాన గీష్పతి "  అన్న బిరుదు ఇచ్చారు.  


ఆ తరవాత రెండో శతావధానం చేసినప్పుడు అంత కంటే తక్కువ వ్యవధిలో ధారణ పద్యాలు చెప్పారు.


కాకినాడలో జరిగిన "ఖండికా శతావధానం " చేసి, ప్రతీ పధ్యం లోనూ కవిత్వం వచ్చేలా చేసి, ఆ తరవాత ఆ 100 పద్యాలు ధారణ చేసినందుకు అబ్బురపడిన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు గరికపాటివారికి " ధారణ లో నిన్ను మించినవారు లేరు  " అని మెచ్చుకున్నారుట.   


ఆ తరవాత సహస్రావధానంలో 750 పద్యాలు ధారణగా చెప్పినందుకు " ఈ విధంగా 750 పద్యాలు సహస్రావధానంలో అప్పజెప్పడం ఇదే ప్రధమం, ఏ బిరుదివ్వాలో తెలియడం లేదు.. ఈ ధారణకి సాటైన బిరుదేవీ లేదు..... అందుకే "ధారణ బ్రహ్మ రాక్షసుడు " అన్న బిరుదు ఇస్తున్నాను " అని అన్నారుట.


భక్తి టి.వి. లో మహాభారతం ప్రవచనం చెప్పినప్పుడు , శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు అభినందన సభలో శ్రీ గరికపాటి వారిని ప్రశంసించి " ప్రవచన కిరీటి " అన్న బిరుదు ఇచ్చారు.


వారికి "అవధాన శారద, అమెరికా అవధాన భారతి " అన్న బిరుదులు కూడా కలవు. ఈ బిరుదులన్నీ ఆయన్ను వరించి తరించాయి.


అష్టావ శతావధానలలో   ఘనాపాటి

నవీన భారత కురుక్షేత్రం లో చెమక్కులతో చురకలేసే ప్రవచన  కిరీటి...

ప్రవచనాలతో సమాజాన్ని జాగృతం చేయడం లో ఆయనకు ఆయనే సాటి

ఆయనే శ్రీ గరికపాటి...


ఆ గరికపాటి వారికి నా ఈ చిన్ని అక్షర గరిక నివేదన!!


కరిముఖునకు హితకారిణి

పరమోతృష్టకణజాల పాపరహితమౌ

'గరిక ' గృహనామధేయులు

సరస సహస్రావధాన శతవందనముల్ !!

 

 

 

 

 వారితో మాట్లాడినప్పుడు తెలుసుకొన్న విషయాలు...

 

 

 

9 comments:



  1. --2006 వ సంవత్సరం బెంగుళూరు లోని ( NIIMS ) ప్రయోగశాలలో అవధానం నిర్వహిస్తూండగా మేధో పరీక్ష చేయబడింది

    ఈ విషయం చాలా సార్లు గరికిపాటి వారు, వారిని పరిచయం చేసిన వారు ఉటంకించడం జరిగింది కాని
    , so far I have not read / heard any where what was the outcome of the so called 'research' :)

    Pl share if you have any info on the outcome ( hopefully its there ?)

    చీర్స్
    జిలేబి

    ReplyDelete
    Replies
    1. నమస్తే జిలేబి గారు! నేను ఆ తరవాత ఆ ప్రయోగానికి వచ్చిన రిజల్ట్ అడగలేదు. ఈరోజే వారిని అడిగాను... "పద్యాలు చెబుతున్నప్పుడు వారి మెదడు రెట్టింపుగా పని చేసిందనే " చెప్పారుట ప్రయోగం చేసిన నిపుణులు. శాస్త్రీయ నిపుణలకు కూడా అందనంతగా ఏదో శక్తి మాత్రం ఆ సమయంలో పని చేసింది అని చెప్పారుట.

      Thanks anDi...

      Delete

    2. థాంక్సండి వివరాలు కనుక్కున్నందుకు!

      Is there any published article on the subject of findings in any research magazine/s ? If so is it possible to post it here or give links of the research paper ?

      జిలేబి

      Delete
  2. మహానుభావుడు గరికపాటి 🙏. నేను కూడా వారి ఫాన్ నే. విడియోలో ఆయన అన్నటువంటి "కృత్రిమత్వం" ఎంతైనా నిజం. అసలు ఈ మాయలో మునిగి తేలుతున్న జనాల్ని చూస్తుంటే నాకైతే .... క్షమించాలి ..... ఏ రకంగా వర్ణించాలో తెలియదు. చాలా హేతుబద్ధంగా మాట్లాడే వ్యక్తి గరికపాటి .... ఆయనకు సాటి ఎవరు? ఆయనలాంటి వారు ఈ సమాజానికి ఎంతో అవసరం.
    మంచి టపా అందించారు. ధన్యవాదాలు.
    అన్నట్లు ఏమనుకోకండి, చిన్న సూచన. "అగత్స్యుడు" కాదు, అగస్త్యుడు సరైనది.

    ReplyDelete
  3. నేను కుదిరినప్పుడు online radio లో గరికపాటి నరసింహారావుగారి ప్రవచనాలు వింటాను. చాలా సమకాలీనంగా అనిపిస్తాయి - నాకు నచ్చుతాయి. మీ పోస్ట్ బావుంది - వారి వివరాలతో.

    ReplyDelete
  4. "మాతృదేవోభవ" అని ప్రవచనం ప్రారంభించే సత్సంప్రదాయం గరికపాటివారిది. ఆయన గురించి నాకు తెలియని విషయాలు చాలా చెప్పారు మీ వ్యాసంలో. థాంక్స్.

    ReplyDelete